close

ఏపీపీఎస్సీ > స్ట‌డీప్లాన్‌

సగం చదివితే చాలు!

సెప్టెంబర్‌ 6వ తేదీ నుంచి గ్రూప్‌-1 2011 మెయిన్స్‌ పరీక్ష నిర్వహణకు రంగం సిద్ధమైంది. మొత్తం 8760 మంది మెయిన్స్‌కి అర్హత పొందగా అందులో 196 మంది కొత్తగా ఎంపికయ్యారు. రాబోయే 35 రోజుల్లో పరీక్షకు సిద్ధపడగలమా అనే సందేహం అభ్యర్థుల్లో ఉంది. దృఢ సంకల్పంతో మెయిన్స్‌ నుంచి ఇంటర్వ్యూకి అర్హత ఎలా పొందవచ్చో పరిశీలిద్దాం!
సాధారణంగా మెయిన్స్‌ పరీక్షల్లో 60-70% సిలబస్‌ చదివి పట్టు సాధిస్తారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో 50% సిలబస్‌ సన్నద్ధతకు సిద్ధపడితే మంచిది. చదివిన 50%లో ప్రశ్నలు రావేమో అని గతంలో అనుసరించే ‘రక్షక సూత్రం’ ప్రస్తుతం అనుసరిస్తే అసలుకే మోసం రావచ్చు. అయితే 50% సిలబస్‌ ఎంపికకు గత ప్రశ్నపత్రాలు, వర్తమానంలో చాప్టర్ల ప్రాధాన్యం ఆధారంగా నిర్ణయించుకుంటే కచ్చితమైన ఎంపికకు అవకాశముంది.
సాధారణంగా ముఖ్యమైనవీ, ముఖ్యమైనవి కానివీ అని ప్రశ్నలను వర్గీకరించవచ్చు అని సలహా ఇస్తాం. ఇప్పటి పరిస్థితినిబట్టి ‘ముఖ్యమైన (ఇంపార్టెంట్‌)’ ప్రాతిపదికన ఎక్కడ ప్రశ్నలు వచ్చే అవకాశముందో పసిగట్టడం ద్వారా కొంత సౌలభ్యం ఏర్పడుతుంది. సాధారణంగా గత ప్రశ్నపత్రాల్లో అడిగిన ప్రశ్నల్లో పునరావృతమయ్యేవి 20%కి మించి ఉండదు. కాబట్టి గతంలో అడిగిన ప్రశ్నలు కొన్నింటిని పరిహరిస్తే సన్నద్ధత మార్గం సులభమవుతుంది.
స్కోరింగ్‌- నాన్‌ స్కోరింగ్‌
గతంలో అన్ని పేపర్లకూ సమప్రాధాన్యం ఇచ్చి సమయాన్ని వెచ్చించమని సూచించేవాళ్లం. కానీ ఈ 20-20 మ్యాచ్‌లో బాగా స్కోరు వచ్చే అవకాశమున్న పేపర్లపై ఎక్కువ దృష్టి పెట్టడం ద్వారా మెరుగైన ఫలితాలు ఆశించవచ్చు. అభ్యర్థి స్వభావం, సబ్జెక్టు స్వభావం బట్టి సరైన నిర్ణయం తీసుకోవడం సముచితం. అలా అని ఈ 35 రోజుల్లో దృష్టి మొత్తం స్కోరింగ్‌ పేపర్లపై పెడితే అసలుకే మోసం వస్తుందని గుర్తించాలి.
ఇంటర్వ్యూకి ఎంపికైనవారు..
2011 పరీక్షలో ఇంటర్వ్యూ వరకు వెళ్లినవారికి ఆత్మవిశ్వాసం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అతి నమ్మకం కొంప ముంచుతుందేమోనని రెండో ఆలోచన కూడా ఉండాలి. ఎందుకంటే పరీక్షల మూల్యాంకనంలోని అశాస్త్రీయత వల్ల స్థిరమైన ఫలితాలు ఉండడం లేదు. అందువల్ల మొదటిసారి పరీక్ష రాస్తున్న అభ్యర్థుల మాదిరిగానే నేలపై ఉండి చదవడం అవసరం. ‘కుందేలు- తాబేలు’ పరుగు పందెం ఫలితం గుర్తు చేసుకోవాలి.
మెయిన్స్‌ రాసినవారు..
2011 మెయిన్స్‌ రాసి ఇంటర్వ్యూకి ఎంపిక కానివారిలో ‘ఆత్మవిశ్వాసం’ కొద్దిగా బలహీనంగానే ఉంటుంది. నిజానికి వీరి బలహీనత ఏంటంటే- గతంలో చేసిన తప్పులు గుర్తుచేసుకుంటూ వాటిని సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయాలనుకుంటూ ఈసారి పరీక్షలో మరో కొత్త తప్పులు చేసే అవకాశముండటం. గతంలో ఇంటర్వ్యూకి వచ్చినవాళ్లు ఇవి చేశారు.. ఇలా చేశారు.. నేను ఇలా చేశాను.. అనుకుంటూ ఒత్తిడికి గురవుతూ విలువైన కాలాన్ని వృథా చేసుకుంటారు. ఈ కొద్దిరోజుల్లో గతం గురించి బాధపడకుండా ప్రేరణ పొందుతూ సిద్ధపడాలి. గతంలోని తప్పులు సరిచేసుకోవడం సబబే కానీ 35 రోజుల్లో సాధ్యమా అనేది ఆలోచించాలి.
కొత్తగా ఎంపికైన 196 మంది..
ఒక రకంగా దాదాపు నెలరోజుల్లో తయారవడమనేది కత్తిమీద సామే. అయితే మొదటి బ్యాట్స్‌మన్‌ అవుట్‌ అయినా టెయిల్‌ ఎండర్‌గా వచ్చి అద్భుతాలు సృష్టించినవారే వీళ్లకి ప్రేరణగా ఉండాలి. మనసా వాచా పూర్తిగా శక్తియుక్తులు వినియోగించాలి. నిరాశకి గురవ్వకుండా అనుభవజ్ఞుల సలహాని తీసుకుని ఎంపిక చేసిన సిలబస్‌, ప్రశ్నలకు మాత్రమే పరిమితమై మంచి ఫలితాన్ని ఆశించే వ్యూహాన్ని అనుసరించడం తప్ప మరో మార్గం లేదు.
గతంలో చదివిందే మేలు
ఈ కొద్దిరోజుల్లో కొత్త పుస్తకాలు, అంశాలు చదవడం మంచిది కాదు. గతంలో తయారుచేసుకున్న నోట్స్‌నే ఒకటికి రెండుసార్లు చదవడం మేలు. గతంలో ఒక పుస్తకం చదవడం వల్ల స్కోరు రాలేదు అనే భావన వదిలేసి మళ్లీ అవే నోట్స్‌ చదవాలి. ఛాయిస్‌ కింద ఎంపిక చేసుకున్న అవే అంశాలను కూడా చదవడం మేలు. అయితే వ్యాసరచన, ఎకానమీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ లాంటి అంశాలు చదివేటపుడు మాత్రం తాజా భావనలు, ఇతివృత్తాలు, గణాంకాలు దృష్టిలో పెట్టుకుని అప్‌డేట్‌ చేసుకుని చదవడం తక్షణ అవసరం. చరిత్ర, పాలిటీ వంటి సబ్జెక్టుల్లో గతంలో చదివిన రచయితల భావనలతో మళ్లీ సరిపెట్టుకోవడం మంచిది.
రాత అభ్యాసం కీలకం
స్వల్ప వ్యవధే ఉంది కాబట్టి చాలామంది అభ్యర్థులు చదవడమే తప్ప రాత అభ్యాసంపై దృష్టిపెట్టరు. గ్రూప్‌-1 అంటేనే అభ్యర్థి ‘భావవ్యక్తీకరణ’, ‘విషయ విశ్లేషణ’ లాంటి గుణాలు ఏయే స్థాయిల్లో ఉన్నాయో పరిశీలించడానికి ఉపయోగపడేది. ఆయా గుణాలు రాసిన సమాధానాన్ని బట్టి మార్కుల కేటాయింపుల రూపంలో కనపడతాయి. ‘సరైన పదాల ప్రయోగం’, ‘వాక్య నిర్మాణం’ వంటివి ఆశించిన స్థాయిలో ఉండాలంటే రాత అభ్యాసం తప్పనిసరి. దీని ద్వారా నిర్దిష్ట సమయంలో అనుకున్న భావాలు, కంటెంట్‌ను రాయగలుగుతున్నారని నిర్ధారించుకునే సదవకాశం ఏర్పడుతుంది. దానితోపాటు రాస్తున్న వాక్యాలు మూల్యాంకనం చేసేవారికి ఎలా ఉంటాయి? అనే విశ్లేషణకు సహకరిస్తుంది. భాషాదోషాలు అర్థమవుతాయి. అందువల్ల సమయం తక్కువే ఉన్నా కనీసం రెండు- మూడు గంటల సమయాన్ని రాత అభ్యాసాన్ని పునశ్చరణ అనుకుని చేయడం అవసరం.
సాధన పరీక్షలు: ప్రతి పేపర్లో కనీసం ఒకటి, రెండు పరీక్షలు రాయడం అవసరం. అదే పరీక్ష తేదీలను 15 రోజుల ముందు రాయడం వల్ల లోపాలు కూడా తెలుస్తాయి. ‘రాత అభ్యాసం’లో అంతర్భాగంగానైనా ఈ తరహా సన్నద్ధత ఉండాలి.
అన్నింటికీ మించి ‘విజయం సాధిస్తాను’ అనే విశ్వాసం ప్రతిక్షణం నరనరానా నింపుకుని సన్నద్ధతా పోరాటం సాగించాలి.
స్వల్ప వ్యవధే ఉంది కాబట్టి చాలామంది అభ్యర్థులు చదవడమే తప్ప రాత అభ్యాసంపై దృష్టిపెట్టరు. ‘సరైన పదాల ప్రయోగం’, ‘వాక్య నిర్మాణం’ వంటివి ఆశించిన స్థాయిలో ఉండాలంటే రాత అభ్యాసం తప్పనిసరి.

Posted on 01-08-2016