close

గ్రూపు-1 (2016) మౌఖిక పరీక్ష ప్రశ్నలు ఇలా..

* అభ్యర్థుల్లో 70% మంది ఉద్యోగులే
* ప్రస్తుత ఇంటర్వ్యూలకు 2011 గ్రూపు 1 విజేతలు 20 మంది

ఈనాడు-అమరావతి, డిజిటల్‌: గ్రూపు-1 (2016) ప్రాథమిక, ప్రధాన పరీక్షల తర్వాత ఎంపిక చేసిన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రత్యేక బోర్డు ద్వారా ప్రస్తుతం మౌఖిక పరీక్షలు జరుగుతున్నాయి. మొత్తం 78 పోస్టుల భర్తీకి జరుగుతున్న ఈ మౌఖిక పరీక్షలకు హాజరవుతున్న వారిలో 2011 నోటిఫికేషన్‌ ద్వారా గ్రూపు-1 ఉద్యోగాలకు ఎంపికైన వారు (తొలి స్థానంలో ఉన్న ఆవుల వెంకటరమణ సహా) సుమారు 20 మంది ఉన్నారు. ప్రముఖ విద్యా సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సులు పూర్తిచేసిన వారు, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో ఏడాదికి రూ.25 లక్షల వరకు వేతనాలు తీసుకుంటున్నవారు, ఉపాధ్యాయులు, వీఆర్వో, ఎస్సై, ఇతర ఉద్యోగాల్లో ఉన్న వారు కూడా మౌఖిక పరీక్షలకు హాజరవుతున్నారు. మొత్తమ్మీద 70% మంది వరకు ఉద్యోగస్తులు ఉండగా.. సివిల్‌్్స, ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు మరికొందరు ఉన్నారు. అభ్యర్థుల ఉద్యోగం, సొంత జిల్లా, వ్యక్తిగత సమాచారంలో పేర్కొన్న ఇతర వివరాల ఆధారంగా మౌఖిక పరీక్షలు జరుగుతున్నాయి.
ప్రశ్నలు ఇలా..
* ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలను ఎలా పెంచుతారు?
* మీరు ఉపాధ్యాయులు కదా.. ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలను పెంచేందుకు ఎలాంటి చొరవ చూపుతున్నారు?
* శ్రీకాకుళంలో ఫ్లోరైడ్‌ సమస్య- ఉద్దానంలో మూత్రపిండాల వ్యాధుల ప్రభావం ఏమిటి?
* జీఎస్టీ అమలు, రియల్‌ టైం గవర్నెన్స్‌, ఐవోటీ (ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌) ప్రాధాన్యం ఏమిటి?
* సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ఎన్‌జేఏసీ (నేషనల్‌ జ్యుడీషియరీ ఎంప్లాయిమెంట్‌ కమిటీ) ప్రస్తుతం ఉందా? లేదా?
* ఆంగ్ల భాషపై పట్టు తక్కువగా ఉంది? ఆంగ్లం రాకపోతే కష్టం కాదా? ఎలా రాణిస్తారు? రెవెన్యూశాఖలో అవినీతి నివారణ సాధ్యమా?
* వీఆర్వోగా ఉన్నారు? మీ విధులు ఏమిటి? వృత్తిపరంగా ఉన్న సమస్యలు ఏమిటి? వాటిని ఎలా అధిగమిస్తున్నారు?
* ఆధార్‌ అనుసంధానం అవసరమా? లాభ నష్టాలు ఏంటి?
* రెవెన్యూ శాఖలో ఎక్కువ అవినీతి ఉందంటున్నారు? కారణాలు ఏమిటి? నివారణ సాధ్యమవుతుందా? అనుసరించాల్సిన మార్గాలేమిటి?
* మరో వీఆర్వోను భూ సంస్కరణలు అంటే ఏమిటి? అవినీతిపై మీ అభిప్రాయం? అని ప్రశ్నించారు.
* ముస్లిం అభ్యర్థికి తలాక్‌ గురించి ప్రశ్న వచ్చింది. రాష్ట్ర బడ్జెట్‌లో ప్రధాన అంశాలను అడిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏలా ఏర్పడ్డాయి?
* విశాఖ ఉక్కు కర్మాగారంలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. గ్రూపు 1 ఉద్యోగం కంటే అక్కడ ఎక్కువ జీతం వస్తుందిగా.. దీనికి ఎందుకు వస్తున్నారు?
* ప్రజాస్వామ్యం ఏలా ఏర్పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏలా ఏర్పడ్డాయి?
* ప్రభుత్వ శాఖల్లో అవినీతి తగ్గాలంటే ఏమిచేయాలి? రాజ్యాంగానికి.. ఏపీపీఎస్సీకి ఏమైనా సంబంధం ఉందా?
* వేర్వేరు ఉద్యోగాలు చేసిన వ్యక్తికి.. విద్యా సంవత్సరం పూర్తయి 11 ఏళ్లు అవుతుంది. ఇప్పటివరకు ఏమి చేశారు? చేసిన ఉద్యోగాల్లో అడ్మినిస్ట్రేషన్‌ ఎలా ఉంది? రాజ్యాంగానికి.. ఏపీపీఎస్సీకి ఏమైనా సంబంధం ఉందా?
* మహిళలపై దాడుల నియంత్రణకు ఏం చేయాలి?
* సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినికి...సివిల్స్‌కు సిద్ధమవుతున్నారు కదా! ఈ ఉద్యోగం వస్తే చేస్తారా? ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. మంచి జీతం వస్తుంది. దీనిపై ఎందుకు ఆసక్తి. మహిళా సాధికారతకు ఎలాంటి చర్యలు చేపట్టాలి. స్త్రీలకు సమాజంలో ఎలాంటి గౌరవం లభిస్తుంది. వారిపై జరిగే దాడుల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?

Posted on 21-03-2017