close

ఇంట‌ర్వ్యూ గైడెన్స్‌

మెప్పించి సాధించే మెలకువలు

త్వరలో ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-1 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరగబోతున్నాయి. బోర్డు సభ్యులను మెప్పించేలా జవాబులు చెప్పి ఆశించిన ఉద్యోగం సాధించటానికి ఏమేం తెలుసుకోవాలి? వేటిపై దృష్టి పెట్టాలి? ఇటీవల గ్రూప్‌-1 స్టేట్‌ టాపర్‌గా నిలిచిన ఆకుల వెంకటరమణ తన ఇంటర్వ్యూ అనుభవాల ప్రాతిపదికగా అభ్యర్థులకు ఇస్తున్న సూచనలు!

మన గురించి క్షుణ్ణంగా తెలుసుకుని మనల్ని ప్రభావవంతంగా ఇంటర్వ్యూ బోర్డుకు పరిచయం చేసుకోవడమే ఇంటర్వ్యూ. అభ్యర్థులు గ్రూప్‌-1 క్యాడర్‌లోని అన్ని ఉద్యోగాల విధులూ, బాధ్యతలను తెలుసుకుని ఇంటర్వ్యూకు వెళ్ళటం శ్రేయస్కరం. పబ్లిక్‌ సర్వీసులో ఎందుకు చేరాలనుకుంటున్నారని అడిగితే తడబడకుండా చెప్పేంత స్పష్టతతో ఉండాలి.
మా కుటుంబ వ్యవసాయ నేపథ్యం, నేను వ్యవసాయ రంగంలో పనిచేయటం, అలాగే ఇటీవల వార్తల్లో, బడ్జెట్లో వ్యవసాయ సంబంధిత అంశాలు ఉండటం వల్ల నా ఇంటర్వ్యూలో 50 శాతానికి పైగా వ్యవసాయ సంబంధిత ప్రశ్నలు ఉండొచ్చని భావించాను. కానీ ఒక్క ప్రశ్న కూడా వ్యవసాయంపై అడగలేదు. అందువల్ల ఇంటర్వ్యూ జరిగేటప్పుడు మనం ఆశించిన ప్రశ్నలు రాలేదనేది ఆలోచించకూడదు. వేరే ఆలోచనలు దరిచేరనీయకుండా అడిగిన ప్రశ్నలకు కుదిరినంతగా మంచి సమాధానాలు స్పష్టంగా చెప్పాలి.
ఇంటర్వ్యూలో ఇచ్చే సమాధానాలు సూటిగా, స్పష్టంగా, అడిగిన ప్రశ్నకు సంబంధించినవై ఉండాలి. సానుకూల ధోరణి తప్పనిసరి. విశాల దృష్టితో, సమతూకంగా ఉంటే బోర్డు మెప్పు పొందవచ్చు. పక్షపాతం లేకుండా, లోతైన ఆలోచనలతో, ఆలోచనల్లో స్పష్టతతో మాట్లాడాలి. పక్షపాత ధోరణి ప్రదర్శించకూడదు. ధైర్యంగా చెప్పాలి, కానీ వ్యవస్థ మూలాలను ప్రశ్నించే ధోరణి పనికిరాదు. పొంతన లేకుండా.. వైరుధ్యాలతో మాట్లాడకుండా తార్కికంగా, హేతుబద్ధంగా జవాబులు చెప్పాలి.
పరిధి మరిచి ప్రసంగించకూడదు
అభ్యర్థులు ఇంటర్వ్యూలో ఆవేశంతో రాజకీయ ప్రకటనలు చేయడం గానీ, సభ్యులనుద్దేశించి తన పరిధి మర్చిపోయి, ప్రసంగాలు చేయటం గానీ చేయకూడదు. అది చాలా నష్టదాయకం.
మనం చెప్పే సమాధానాలను మధ్యలోనే ఇంటర్వ్యూయర్‌ అర్థాంతరంగా ఆపేయవచ్చు. దీనికి ఆందోళన పడకూడదు. అభ్యర్థి మంచి జవాబు చెపుతుంటే సాధారణంగా ఇంటర్వ్యూయర్‌ మరో ప్రశ్నకు వెళ్లిపోతారు. అందుకని అలా మధ్యలో మన సమాధానం ఆపేయటం మంచి సూచనే. నా ఇంటర్వ్యూలో కూడా చాలాసార్లు మధ్యలో ఇలా కట్‌ చేశారు.
అభ్యర్థులు తమకు సౌకర్యమున్న భాషలో సమాధానాలు చెప్పవచ్చు. ఇంగ్లిష్‌, తెలుగు.. రెండు భాషల్లో కూడా కుదిరినంతగా చెప్పవచ్చు. ఒకవేళ ఆంగ్లంలోనే మాట్లాడాలని నిర్దేశిస్తే... కంగారుపడకూడదు. సింపుల్‌ ఇంగ్లిష్‌లో మాట్లాడటానికి ప్రయత్నించండి. మాట్లాడే ఇబ్బంది ఉన్నట్లయితే నేర్చుకుంటాననే సంసిద్ధత వ్యక్తం చేయాలి. అలాగే ఇప్పటివరకూ తగినంతగా నేర్చుకోని లోపాన్ని ఒప్పుకోవాలి. ఎందుకంటే గ్రూప్‌-1 స్థాయి ఉద్యోగులకు భవిష్యత్తులో ఆలిండియా సర్వీసులైన ఐఏఎస్‌, ఐపీఎస్‌లుగా పదోన్నతి లభిస్తుంది. ప్రభుత్వ వ్యవహారాలు ఇంగ్లిష్‌లో జరుగుతాయి కదా?
అనూహ్యమైన ప్రశ్నలు సంధిస్తే?
ఒక్కోసారి కావాలనే ఇంటర్వ్యూలో ఒత్తిడి కలగజేసే, వ్యతిరేక ప్రశ్నలను అడగవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఎలా స్పందించాలో తెలుసుకోవాలి.
ఇబ్బంది పెట్టే ప్రశ్నలకు ‘తెలియదు’ అనో, ‘లేదు/ కాదు’ అనో చెప్పవచ్చు. కానీ ఎప్పుడూ నటన పనికిరాదు. ఇబ్బందికర ప్రశ్నలు వేసినపుడు ‘నాకు తెలిసినంతవరకూ’ అంటూ పాక్షిక సమాధానాలు ఇవ్వవచ్చు.
‘రోడ్డు విభాగం వారి ప్రణాళికలో భాగం కాని రహదారి నిర్మాణాన్ని అనుమతించమని ఓ ఎమ్మెల్యే మిమ్మల్ని అడిగారు. ఆయన ఒత్తిడికి మీరు లొంగుతారా?’ అని గతంలో గ్రూప్‌-1లో అడిగారు.
ఆ రోడ్డు నిర్మాణం చట్ట వ్యతిరేకం అయితే ‘సాధ్యం కాదు’ అని కచ్చితంగా చెప్పవచ్చు. కానీ అలాంటి పరిస్థితి లేనపుడు ఈ ప్రశ్నకు ‘ఔను’ అని గానీ ‘లేదు’ అని గానీ చెప్పటం సరికాదు. ప్రజా ప్రతినిధికి నిర్మొహమాటంగా ‘లేద’ని కటువుగా జవాబు చెప్పటం ఆచరణీయం కాదు. అలా చేయకూడదు. ఆయన ప్రజల ఆకాంక్షను ప్రతిఫలిస్తున్నారని గమనించాలి. ఆయన ప్రతిపాదనకు తగిన గౌరవాన్నిచ్చి, చట్టాన్నీ, నిబంధనలనూ ఉల్లంఘించకుండా ఆయన వినతిని మన్నించడానికి ప్రయత్నించాలి.
గ్రూప్‌-1 ఇంటర్వ్యూలో నాలుగుసార్లు విఫలమైన అభ్యర్థిని ‘కెరియర్లో, జీవితంలో మీరు ఫెయిలైనట్టు కాదా?’ అని అడిగారు. ఇలాంటి ప్రశ్న మిమ్మల్ని అడిగితే ఆందోళన పడకూడదు. ‘వివిధ కారణాల వల్ల ఎంపికవ్వటంలో జాప్యం జరగవచ్చు. ఇంతటి పోటీలో కూడా నేను వరసగా ఇంటర్వ్యూలకు సెలక్టవుతున్నానంటే నిలకడతో కూడిన నా మెరుగుదలను సూచిస్తుంది’ అని చెప్పటం సముచితంగా ఉంటుంది. ఆ ప్రశ్నకు ఏ జవాబు చెప్పినా అది ఆశావహంగా ఉండాలి. అంతేకానీ, గత ఎంపికల తీరు గురించి వ్యతిరేకంగా మాట్లాడటం కానీ, మీపై మీరు సానుభూతిని ప్రదర్శించటం కానీ చేయకూడదు.
(‘వారాంతాల్లో ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు పాఠాలు చెప్పేవాణ్ని’ అని నేను చెబితే... దానిపై అడిగిన ప్రశ్న.) ‘ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ట్యూషన్లు చెప్పి ఆ డబ్బుతో స్కూలు పిల్లలకు ట్యూటర్లను పెట్టవచ్చు కదా... మీ చదువుకు సార్థకత వచ్చేది. అలాగే స్కూలు పిల్లలకు ఉపయోగపడేది కదా? మీరు తప్పు చేయలేదా?’
‘మీరు చెప్పింది నిజమే సర్‌. కానీ ఇంజినీరింగ్‌ విద్యార్థులు నిజంగా నేర్చుకోవాలంటే ఎన్నో అవకాశాలు ఉచితంగా లభిస్తున్నాయి. నేను బీటెక్‌ చదివేటప్పుడూ, ఇంజినీరింగ్‌ ఉద్యోగం చేసేటప్పుడూ యూట్యూబ్‌లో ఎంఐటీ, కాలిఫోర్నియా లాంటి యూనివర్సిటీల ప్రొఫెసర్ల లెక్చర్లను ఉచితంగా వినేవాడిని. నేను వారికంటే గొప్పగా చెప్పగలను అనుకోవటం లేదు. ఇంజినీరింగ్‌ విద్యార్థులకు కావలసింది ఆసక్తి మాత్రమే. అందుకే ప్రభుత్వ స్కూలులో వెనకబడిన విద్యార్థుల విషయంలో వారికి అందుబాటులో లేని నాణ్యమైన విద్యను నాదైన పద్ధతిలో అంటే.. ప్రశ్నించే తరహాలో అందజేశాను’.
‘మీరు ప్రభుత్వోద్యోగంలో చేరితే లంచం తీసుకోరు, ప్రజాసేవ చేస్తారు అని ఎలా నమ్మాలి?’
‘భవిష్యత్తులో నేను అవినీతికి పాల్పడతానో లేదో అన్నది నేనిప్పుడు వర్తమానంలో నిరూపించలేను. కానీ నేను ఇంతవరకూ నడిచిన నా దారిని మాత్రం చెప్పగలను. దాన్నిబట్టి నా గురించి ఒక అంచనాకు రావచ్చును..’ అంటూ వాస్తవంగా చేసిన సేవాకార్యక్రమాల వివరాలు చెప్పవచ్చు.
‘మీ గౌరవనీయమైన వృత్తిని మీరెందుకు వదలాలనుకుంటున్నారు?’ (టీచర్లనూ, డాక్టర్లనూ అడిగిన ప్రశ్న..)
‘ఒక వ్యక్తి స్థాయిలో లేదా ఒక సంస్థ స్థాయిలో పనిచేసి సమాజంపై చూపించే ప్రభావం కన్నా గ్రూప్‌-1 స్థాయిలో మరింతమంది టీచర్లనూ, ప్రభుత్వ వైద్యులనూ మెరుగైన ప్రజాసేవకు ప్రోత్సహించవచ్చు. సమాజంలో తద్వారా గుణాత్మక మార్పులను తీసుకురావొచ్చు’.
పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అభ్యర్థుల నుంచి ఆశించే లక్షణాలు
* నాయకత్వ లక్షణాలు
* రాజ్యాంగ స్ఫూర్తి
* ప్రజానుకూల ధోరణి (సమానత్వం, భావ స్వేచ్ఛ, సామాజిక న్యాయం, వ్యక్తి గౌరవం, ప్రజాస్వామిక వైఖరి, జాతీయ సమైక్యత..దీనిలో భాగం)
* సంక్షేమం, సాధికారత రెండిటిపై అవగాహన
* స్వభావంలో నమ్రత.

Posted on 13-3-2018