close

ఇంట‌ర్వ్యూలు

మౌఖికపరీక్షకు ధీమాగా

ఏపీపీఎస్సీ గ్రూప్-1 (2011 నోటిఫికేషన్) మెయిన్స్ రాత పరీక్ష ఫలితాలను ఇటీవల కమిషన్ ప్రకటించింది. ఈ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు 2017 ఫిబ్రవరి 13 నుంచి మార్చి 15 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూల ను ఎలా ఎదుర్కోవాలో, సన్నద్ధం కావాలో వివరిస్తున్నారు సి. నారాయణరెడ్డి. ఈయన గ్రూప్‌-1 (2009 నోటిఫికేషన్) లో రాష్ట్రస్థాయిలో 2వ ర్యాంకు సాధించారు.

అభ్యర్థుల ప్రవర్తన, భావోద్వేగాలు, సమయస్ఫూర్తి, విషయ పరిజ్ఞానాలకు సంబంధించిన నైపుణ్యాలను పరీక్షించడం ఇంటర్వ్యూ ముఖ్యోద్దేశం. దీంతో పాటు ప్రజాసమస్యలపై మమైకమై ప్రభుత్వ కార్యకలాపాలను ప్రజాసమూహంలో ఏవిధంగా నిర్వర్తిస్తారో పరిశీలిస్తారు. సమాధానాలు ఇచ్చే క్రమంలో అభ్యర్థి హావభావాలు, చేతి కదలికలు అన్నింటినీ నిశితంగా గమనిస్తుంటారు.

సమాధానాలు ఇచ్చేటపుడు మరీ ఎక్కువ (అతి)గా స్పందించడం కానీ, బిగుసుకుపోయి ఉండడం కానీ చేయకుండా సూటిగా స్పష్టంగా చెప్పాలి. ఇవన్నీ బాగా చేయాలంటే అభ్యర్థులు వీలైనన్ని నమూనా ఇంటర్వ్యూల్లో పాల్గొనాలి.

ప్రవర్తన, భావోద్వేగాల నైపుణ్యాలు: బోర్డు సభ్యులు అభ్యర్థి భావోద్వేగాలను ఎంతవరకు సమతుల్యతతో కలిగి ఉన్నాడనేది గమనిస్తారు.

సున్నిత అంశాలు: ప్రాంతీయ, మతపరమైన అంశాలపై ప్రశ్నలు అడిగినపుడు వ్యక్తిగత భావోద్వేగాలను నియంత్రించుకుని వీలైనంతవరకు సామరస్యంగా సమాధానమివ్వాలి.

తెలియని అంశాలు: వీటి గురించి ప్రశ్నలు వేసినపుడు వాటికి సమాధానం తెలిసినట్లు నటిస్తూ అడ్డదిడ్డమైన సమాధానాలు చెప్పకుండా 'క్షమించండి సర్‌, నాకు తెలియదు' అని నిజాయతీగా చెప్పాలి.

ప్రశ్నలు సంధించే క్రమంలో ఒక్కోసారి ఇద్దరు, ముగ్గురు బోర్డు సభ్యులు కూడా ఒకేసారి ప్రశ్నలు అడుగుతారు. అలాంటి సమయంలో సమన్వయంతో ముందుగా అడిగిన సభ్యుని ప్రశ్నకు సమాధానమిస్తూ తరువాత అడిగిన వారి ప్రశ్నకు తడబడకుండా సమాధానమివ్వాలి.

బోర్డు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చే సందర్భంలో వాటికి తగ్గ హావభావాలు, భావోద్వేగాలను ముఖంలో పలికిస్తూ చెప్పాలి. అతిగానో, బిగుసుకుపోయి భయంతోనో చెప్పరాదు.

సమయస్ఫూర్తి: బోర్డు సభ్యులు అభ్యర్థుల సమయస్ఫూర్తిని పరీక్షించేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా వివాదాస్పద అంశాల గురించి సమాధానాలు చెప్పేటపుడు సమయస్ఫూర్తితో చెప్పాలి.

ఒక్కోసారి ఒక సమస్యను ఇచ్చి ఈ సమస్యలో మీరే ఉంటే ఎలా పరిష్కారం చూపుతావంటూ అడుగుతారు. అలాంటి వాటికి అక్కడిక్కడే సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి వీటిపై కూడ ముందస్తుగా కసరత్తు చేయాలి.

విషయ పరిజ్ఞానం: బోర్డు సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటే సమగ్ర విషయ పరిజ్ఞానం కలిగి ఉండాలి. వాటిని ఈ విధంగా విభజించవచ్చు.

1) అభ్యర్థి బయోడేటా. 2) అభ్యర్థి విద్యకు సంబంధించిన విషయ పరిజ్ఞానం.3) సొంత గ్రామం, జిల్లా సమాచారం.4) సమకాలీన అంశాలు (కరెంట్‌ అఫైర్స్‌)

రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అంశాల్లో ఆర్థిక, రాజకీయ, సాంస్క్రతిక, క్రీడలపై ప్రధానంగా ప్రశ్నలుంటాయి. ముఖ్యంగా గడచిన ఏడాది నుంచి చదవాలి. వీటిపై ఎక్కువ వచ్చే అవకాశాలున్న ప్రశ్నలకు జవాబులు తయారుచేసుకుని వాటిపై కసరత్తు చేయాలి.

విషయ పరిజ్ఞానం ఎంత ఎక్కువ ఉంటే ఇంటర్వ్యూను అంత బాగా చేయగలుతారు.

గుర్తుంచుకోవాల్సిన ముఖ్యాంశాలు

ఇంటర్వ్యూలో అభ్యర్థి ధరించిన దుస్తులు (డ్రస్‌కోడ్‌) చాలా ముఖ్యం. ఎక్కువగా రంగుల్లో ఉన్న దుస్తులను కాకుండా లేత రంగువి వేసుకోవాలి. వాటిని ఇంటర్య్వూకు ముందుగానే వేసుకుని అలవాటు చేసుకోవడం మంచిది.
* మహిళలైతే సంప్రదాయ చీరలు ధరిస్తే బాగుంటుంది.
* పురుషులు ఫార్మల్‌ డ్రస్‌, టక్‌ చేసుకుని, వీలైతే టై, షూ వేసుకోవాలి. చక్కటి హెయిర్‌క్రాప్‌తో వెళ్లాలి.
* ఏదైనా అంశాలకు సంబంధించి సమాధానాలు చెబుతూ వాటి లాభ, నష్టాలపై విశ్లేషిస్తూనే చివరకు పాజిటివ్‌గా సమాధానమివ్వాలి.
* ఇంటర్వ్యూల్లో తమ కంటే ముందు వెళ్లే అభ్యర్థులను ఎలాంటి తరహాలో ప్రశ్నలు అడుగుతున్నారో గ్రహించి, తగ్గట్టుగా సమాచారాన్ని అప్‌డేట్‌ చేసుకోవాలి.
* ఇంటర్వ్యూ సమయానికి రెండు గంటల ముందే అక్కడకు చేరుకుని కంగారు పడకుండా అక్కడి వాతావరణానికి అలవాటు పడేలా ప్రయత్నించాలి.
* సమాధానాలు చెప్పే క్రమంలో బోర్డు సభ్యుల కళ్లల్లోకి సూటిగా చూస్తూ సమాధానాలు చెబుతూనే ఎదురుగా కూర్చున్న మిగతా సభ్యులను కూడా చూస్తుండాలి.
* ఇంటర్వ్యూ అంటేనే అందరూ ఒత్తిడికి గురవుతారు. దీన్ని అధిగమించాలంటే మెడిటేషన్‌, వాకింగు ఉపకరిస్తాయి. వీలైనంతవరకు ఈ సమయంలో అనవసర విషయాల జోలికి వెళ్లకుండా ఇంకా చెప్పాలంటే సొంత పనులన్నీ వాయిదా వేసుకుని కేవలం దీనిపైనే దృష్టి సారించాలి.

Posted on 18-1-2017