close

ఏపీపీఎస్సీ > గ్రూప్‌-3 సన్నద్ధత

గ్రూప్‌-3 సిలబస్‌ సన్నద్ధత

గ్రూప్‌-1, 2, 3, 4 సర్వీసులకు చెందిన తుది సిలబస్‌ను ఏపీపీఎస్‌సీ విడుదల చేసింది. వీటిలో ఐదు లక్షలమందికి పైగా అభ్యర్థులు పోటీపడే గ్రూప్‌-3 సర్వీసుల పరిధిలోని పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్‌-4) పోస్టులకు ప్రాధాన్యం ఉంది. ఈ నియామక రాతపరీక్ష సిలబస్‌ను కొత్తగా ప్రకటించారు. దీనిపై సమగ్ర అవగాహనకు తోడ్పడే విశ్లేషణ... ఇదిగో!
అన్ని పోటీ పరీక్షల మాదిరిగానే పంచాయతీ కార్యదర్శి పేపర్‌-1లో జనరల్‌స్టడీస్‌, పేపర్‌-2లో ‘ఉద్యోగ సంబంధిత’ అంశాలను సిలబస్‌గా చేర్చారు.

జనరల్‌ స్టడీస్‌
గ్రూప్‌-1 ప్రిలిమినరీ, గ్రూప్‌-2 (పేపర్‌-1)కి అనుసంధానంగానే పంచాయతీ కార్యదర్శుల పేపర్‌-1 సిలబస్‌ రూపకల్పన జరిగింది. కాబట్టి ఆ రెండు పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ విభాగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం పంచాయతీ కార్యదర్శులకు తయారవుతున్న అభ్యర్థులు మాత్రం ఈ సిలబస్‌ పట్ల అవగాహన కల్పించుకోవాలి. గతంలో జరిగిన పంచాయతీ కార్యదర్శుల పరీక్షకు సిద్ధపడినవారు కూడా కొత్త మార్పులను దృష్టిలో పెట్టుకుని తయారవ్వాలి. మొత్తం పది విభాగాలుగా ఇచ్చిన సిలబస్‌లో ఒక్కొక్క విభాగం నుంచి సగటును 15 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నందున ఆ ‘స్థాయి’లోనే అన్ని ప్రశ్నలకూ సిద్ధపడాలి.
* మొదటి విభాగంలో పేర్కొన్న జాతీయ అంతర్జాతీయ సంఘటనలు, రెండో విభాగంలోని జాతీయ అంతర్జాతీయ వర్తమాన అంశాల మధ్య తేడాను గుర్తించాలి. ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధ అనంతరం జరిగిన జాతీయ అంతర్జాతీయ సంఘటనల్లో కొన్ని వర్తమాన అంశాలకు పునాదిగా ఉన్న అనుసంధానం గుర్తిస్తే... చదవాల్సిన విధానం స్పష్టమవుతుంది. కొన్ని సంఘటనలకూ, వర్తమాన అంశాలకూ మధ్య సంబంధం లేనప్పుడు ఆయా అంశాలను ‘గతం’ కోణంలోనే చదవటం ద్వారా ప్రాధాన్యస్థాయిని నిర్ణయించుకోవచ్చు. ఈ విధంగా నిర్దిష్టంగా స్పష్టత లేకపోతే ఏది వర్తమానాంశం, ఏది సంఘటన అనేదానిలో, ముఖ్యంగా గత ఏడాది కాలంలో జరిగిన అంశాల విషయంలో సందిగ్ధత ఏర్పడుతుంది.
పంచాయతీ కార్యదర్శుల పరీక్ష ప్రాథమిక స్థాయి పరిజ్ఞానానికి సంబంధించినది. కాబట్టి లోతైన అధ్యయనాలకు వెళ్ళకుండా మౌలిక అంశాలను విశాల పరిధిలో చదవటం ఈ రెండు సిలబస్‌ అంశాలకూ వర్తిస్తుంది.
* జనరల్‌ సైన్స్‌, శాస్త్ర సాంకేతికత సిలబస్‌ విషయంలో స్పష్టత వచ్చింది. మానవుని దైనందిన జీవితంలో ఉపయోగపడే జనరల్‌ సైన్స్‌ అనువర్తన అంశాలను పేర్కొన్నారు. భౌతిక, రసాయన, జీవ శాస్త్రాల్లోని వివిధ ఆచరణాత్మక విషయాలకు పరిమితమై అధ్యయనం చేయాలి. శుద్ధ శాస్త్ర అంశాలకూ, అనువర్తన అంశాలకూ మధ్యవుండే ‘గీత’ను గుర్తిస్తే ప్రిపరేషన్‌ చిక్కులు కూడా తొలగుతాయి.
‘శాస్త్ర సాంకేతికత’ విషయంలో కూడా వర్తమాన అంశాలే సిలబస్‌గా పేర్కొనడం వల్ల కొంత క్లిష్టత తగ్గిందనే చెప్పవచ్చు. గతంలో జరిగిన శాస్త్ర సాంకేతిక అభివృద్ధిపై పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది. వర్తమానంతో ముడిపడిన అంశాలకు అధిక ప్రాధాన్యం ఉంటుందని అర్థమవుతుంది. ముఖ్యంగా సమాచార సాంకేతికత (ఐటీ), రోదసి, ఆరోగ్య సాంకేతికతలు ప్రాధాన్యం పొందే అవకాశం ఉంది. గ్రామీణ జీవనంపై ప్రభావం చూపించే వివిధ సాంకేతిక అంశాలపై ఈ పరీక్ష కోణంలో సిద్ధపడాల్సివుంటుంది.
* చరిత్ర... గతంలో మాదిరిగానే ‘ఆధునిక చరిత్ర’గా కొనసాగింది. చరిత్రకు కేటాయించిన ప్రశ్నల్లో సగానికి పైగా ‘స్వాతంత్య్రోద్యమం’ నుంచే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా సన్నద్ధత సాగాలి. ఏపీ చరిత్ర గురించి నామమాత్రంగా కూడా పేర్కొనలేదు. అయితే రాష్ట్ర విభజనానంతర పరిణామాలకు ప్రాధాన్యం పెంచుతామని ఏపీపీఎస్‌సీ చైర్మన్‌ తాజాగా ప్రకటించారు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి.
* ఆర్థిక అంశాల విభాగంలో ‘స్వాతంత్య్రానంతరం ఆర్థికాభివృద్ధి’ అనే కోణంలో ప్రాధాన్యం ఇచ్చారు. కాబట్టి ప్రణాళికలు, వ్యవసాయ పారిశ్రామిక విధానాలు, గ్రామీణ పట్టణ అభివృద్ధి అంశాలను కేంద్రంగా తీసుకుని పరీక్ష ‘స్థాయి’ని గుర్తించి అధ్యయనం చేస్తే సరిపోతుంది. సాంఘిక ఆర్థిక సమస్యలు కేంద్రంగా ప్రశ్నలు రావొచ్చు.
* అంక గణిత సామర్థ్యాల్ని పక్కనపెట్టారు. విశ్లేషణ సామర్థ్యం, తార్కిక విశ్లేషణ, డాటా ఇంటర్‌ప్రెటేషన్‌లకు ప్రాధాన్యం ఇచ్చారు.
* ‘విపత్తు నిర్వహణ’ను కేంద్రక అంశంగా గుర్తించవచ్చు. ప్రాథమిక పరిజ్ఞానంపై సూటిగా ప్రశ్నలు వచ్చే అవకాశముంది. ఈ పరీక్షకు ఆ స్థాయిలో తయారైతే సరిపోతుంది.
* ప్రపంచ భౌగోళిక శాస్త్ర అంశాలను సిలబస్‌లో పేర్కొనలేదు. భారత భౌగోళిక అంశాలను భౌతిక, సాంస్కృతిక, జనాభా, ఆర్థిక కోణాలుగా స్పష్టంగా అధ్యయనం చేయాలి. మౌలిక వనరుల కోణాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. సగానికి పైగా ప్రశ్నలు ఏపీ భౌగోళిక అంశాల నుంచి వచ్చే అవకాశం ఉంది.
* భారత రాజ్యాంగ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థల నుంచి 15 ప్రశ్నల వరకు ఆశించవచ్చు. అందువల్ల ఆ స్థాయిలో వచ్చే ప్రశ్నల కోసం పాఠశాల పుస్తకాలతో పాటు తెలుగు అకాడమీ సమాచారం అధ్యయనం చేస్తే సరిపోతుంది. ముఖ్యంగా 73, 74 రాజ్యాంగ సవరణలు, అందులోని నిబంధనలపై పట్టు సాధించాలి.
* సంతులిత అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణలను జనరల్‌ స్టడీస్‌ స్థాయిలో ఇచ్చారు. ఈ రెండు విభాగాలూ కొంతవరకూ సాధారణ పరిజ్ఞానంతో చదవాల్సివుంటుంది. అభివృద్ధి సమస్యలూ, పర్యావరణ విషయాల్లోని బహుముఖాలను అధ్యయనం చేయాలి. విపత్తు నిర్వహణను అనుసంధానం చేసుకుని చదవటం వల్ల రెండు విభాగాలపై సమగ్ర అవగాహన ఏర్పడుతుంది.

పేపర్‌-2
అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చగలిగే పేపర్‌గా దీన్ని గుర్తించవచ్చు. సివిల్స్‌, గ్రూప్‌-1, 2 అభ్యర్థులకు సైతం ఈ విభాగంలో ఇచ్చిన సిలబస్‌ విభిన్నమైనదీ, స్థానిక పరిజ్ఞానానికి సంబంధించినదీ. అందువల్ల ఈ పరీక్షకు హాజరయ్యే ప్రతి అభ్యర్థీ ఈ విభాగంపై సాధించే పట్టుని బట్టే అంతిమ ఫలితం ఉంటుందని స్పష్టంగా చెప్పవచ్చు. 11 అధ్యాయాలుగా సిలబస్‌ ఇచ్చినప్పటికీ ప్రతి చాప్టర్‌ మరో చాప్టర్‌ సిలబస్‌లో అనుసంధానమైవుండటం వల్ల సమగ్రంగా పరిశీలిస్తే సమాచార పరిధి తక్కువే.
* 1956 తర్వాత ‘పంచాయతీరాజ్‌’ పరిణామం మొదటి అంశం. 1956 తర్వాత అంశాలకు ప్రాధాన్యం ఇచ్చినా ఆంధ్ర భూభాగంలో 1880ల నుంచే ప్రభావం చూపిన బ్రిటిష్‌ కాలంనాటి స్థానిక పరిపాలన చట్టాల్ని కూడా తెలుసుకోవాలి. ఉమ్మడి రాష్ట్ర చట్టాలు, 1986లో ఎన్టీ రామారావు కాలంలో పంచాయతీరాజ్‌ వ్యవస్థలో వచ్చిన మార్పులు, 1994 పంచాయతీరాజ్‌ చట్టం లాంటి అంశాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. పంచాయతీరాజ్‌ చట్టానికి 1994 తర్వాత వచ్చిన మార్పులు అనే కోణంలో చదవాలి.
* పంచాయతీ కార్యదర్శి విధులు, బాధ్యతలు అనే విభాగం కింద పంచాయతీ పరిధిలోని కరణీయ విధులు- అకరణీయ విధులు, రాజ్యాంగ షెడ్యూల్‌-11లో పేర్కొన్న అధికారాల అధ్యయనం ద్వారానే సమగ్రంగా తయారవవచ్చు.
* ‘గ్రామీణాభివృద్ధి’ కోసం చేపట్టిన వివిధ పథకాల ఆధారంగా 3,4,5, 8,9 చాప్టర్లను అనుసంధానించి చదవవచ్చు. అయితే ‘గ్రామీణ పేదరిక నిర్మూలన పథకాలు’, ‘వర్గ ఆధారిత సంక్షేమ పథకాలు’, ‘మహిళా కేంద్రిత పథకాలు’, ‘అభివృద్ధి పథకాలు’ అని విభజించుకుని చదవాలి. అవే పథకాలను కేంద్ర ప్రాయోజిత, రాష్ట్ర ప్రాయోజిత కోణంలో చదవాలి. దీనికితోడు విభిన్న పథకాల ప్రాధాన్యాలను అర్థం చేసుకునేందుకు కేంద్ర- రాష్ట్ర బడ్జెట్‌ కేటాయింపులను అనుసంధానం చేసుకోవాలి. వివిధ శాఖల భాగస్వామ్యాన్ని గ్రామీణాభివృద్ధిలో అర్థం చేసుకుంటూనే పంచాయతీరాజ్‌ శాఖ పోషిస్తున్న కీలక పాత్రను అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా పంచాయతీరాజ్‌ శాఖ నిర్మాణంతో పాటు కీలక పథకాలు ప్రశ్నలుగా మారే అవకాశం ఉంది.
* ఏపీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, చిన్నతరహా కుటీర పరిశ్రమలు, పర్యాటక రంగ భాగస్వామ్యాలను సమగ్రంగా చదవాలి. ముఖ్యంగా రాష్ట్ర విభజన అనంతరం మారిన పరిస్థితుల్లో ప్రస్తుత ప్రభుత్వ వ్యూహాలను గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కోణంలో చదవాలి.
* ఏపీ గ్రామీణ రుణ వితరణ గ్రామీణాభివృద్ధిలో మరో కీలక అంశం. సూక్ష్మ రుణ ఆర్థిక సంస్థలు, స్వయం సహాయక బృందాలు, సహకార సంఘాలు, బ్యాంకులు రుణ వితరణలో పోషిస్తున్న పాత్రను అధ్యయనం చేయాలి. విభజన అనంతరం వీటి పాత్రనూ, గణాంకాలనూ ప్రశ్నలుగా ఆశించవచ్చు. రుణవిముక్తి పథకం నిర్మాణాంశాలు, ప్రభావం కూడా ప్రాధాన్యం కలవే.
* స్థానిక సంస్థల ‘ఆదాయ వ్యయ నిర్వహణ’, ‘ఖాతాల తయారీ’, వివిధ పథకాల కింద వస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు సిలబస్‌ అంశాలుగా చేర్చారు. పంచాయతీ కార్యదర్శిగా చేయబోయే విధులపై ఇప్పుడే దృష్టి సారించి, అవగాహన పెంచుకోవాలి.
పంచాయతీ కార్యదర్శుల పరీక్ష ప్రాథమిక స్థాయి పరిజ్ఞానానికి సంబంధించినది. కాబట్టి లోతైన అధ్యయనాలకు వెళ్ళకుండా మౌలిక అంశాలను విశాల పరిధిలో చదవ టం మేలు.

గ్రూప్‌-1, 2లకు ఉపయుక్తం
పంచాయతీ కార్యదర్శుల పరీక్ష కోసం తయారవటం వల్ల గ్రూప్‌-1, 2 పరీక్షలకు కూడా ఉపయోగపడే పరిస్థితి ఉంది. గ్రూప్‌-1 ప్రిలిమినరీ, గ్రూప్‌-2 పేపర్‌-1కి మళ్ళీ కొత్తగా సన్నద్ధత అక్కర్లేదు. గ్రూప్‌-1 మెయిన్స్‌లో పాలిటీ, ఎకానమీ విభాగాల్లో ప్రశ్నలకు కావాల్సిన ప్రాథమిక సమాచారం ఈ సిలబస్‌ అధ్యయనం ద్వారా సరిపోతుంది. విపత్తు నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ లాంటి అంశాలు మూడు పరీక్షలకూ ఉపయోగపడుతుంది.
గ్రూప్‌-2లో వికేంద్రీకృత పరిపాలన/పంచాయతీరాజ్‌ కింద వచ్చే 10-15 ప్రశ్నలకు ఈ ప్రిపరేషన్‌ ద్వారా సిద్ధపడిపోవచ్చు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సమాచారాన్ని లోతుగా చదవటం ద్వారా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌తో పాటు మెయిన్స్‌ సన్నద్ధతలో కనీసం 30 మార్కులకు సిద్ధపడే అవకాశం ఉంది.
‘డేటా ఇంటర్‌ప్రెటేషన్‌’ ద్వారా గ్రూప్‌-1 మెయిన్స్‌లో ఒక విభాగం తయారీకి కావాల్సిన సమాచారం అందినట్లే!

Posted on 12-07-2016