close

ఏపీపీఎస్సీ > గ్రూప్‌-3 సన్నద్ధత

పునశ్చరణే ప్రధానం!

ఈ నెల 23న జరగనున్న పంచాయతీ కార్యదర్శి స్క్రీనింగ్‌ (ప్రాథమిక) పరీక్షకు ఇప్పటివరకూ అభ్యర్థులంతా సంసిద్ధులై ఉంటారు. ఇప్పటివరకూ చదివింది ఒక ఎత్తైతే ఈ 5 రోజుల కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం మరో ఎత్తు. ఈ స్వల్పకాలంలో అన్ని సబ్జెక్టుల్లోని ముఖ్యాంశాలను ప్రాధాన్యక్రమంలో ఎలా పునశ్చరణ చేసుకోవాలో పరిశీలిద్దాం!
ఏపీపీఎస్‌సీ రుణాత్మక మార్కులతో నిర్వహించే మొదటి భారీ పోటీ పరీక్ష ఇది. అభ్యర్థులందరూ ఈ దిశలో మానసికంగా సంసిద్ధులు కావాలి. గతంలోలా వూహించి సమాధానాలను గుర్తించే ప్రక్రియకు స్వస్తి చెప్పవలసి ఉంటుంది.
మొత్తం 1055 పంచాయతీ సెక్రటరీ పోస్టులకు గానూ 1:50 నిష్పత్తిలో 52,750 మంది అభ్యర్థులు ప్రధాన పరీక్షకు అర్హత సాధిస్తారు. స్క్రీనింగ్‌ టెస్టు సిలబస్‌పై సాధారణ అవగాహనతో మొత్తం 150 ప్రశ్నల్లో కనీసం సగం ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలను గుర్తించి, తెలియని ప్రశ్నలను వదిలివేసినా చాలు. సునాయాసంగా విజయం సాధించగలుగుతారు. ఇంతకుముందు చదివిన వాటిలో ముఖ్యాంశాలను పునశ్చరణ చేసుకుంటే చాలు.
రుణాత్మక మార్కులు ఉన్నందువల్ల ఏమాత్రం అవగాహన లేని ప్రశ్నలకు సమాధానాన్ని వూహించి, గుర్తించకూడదు. పూర్తిగా తెలిసిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలను గుర్తించాలి. ఉదాహరణకు- 150 ప్రశ్నల్లో 40 ప్రశ్నలకు సమాధానాలను గుర్తించకుండా వదిలేసి, 110 ప్రశ్నలకే గుర్తించారనుకుందాం. వాటిలో 24 ప్రశ్నలకు సమాధానాలు తప్పైతే నికరంగా సమాధానాలను గుర్తించిన ప్రశ్నలు 86 మాత్రమే. అయితే ఈ 86 మార్కుల్లో 24 తప్పు ప్రశ్నలకు 1/3 (మూడో వంతు) మార్కులను తగ్గిస్తే.. 24ది 3 = 8. అంటే 8 మార్కులుపోగా మిగిలిన స్కోరు 78. 75 మార్కులకే అర్హత సాధించవచ్చు అనుకుంటే 78 మార్కులతో సునాయాసంగా పరీక్షలో విజయం సాధించవచ్చు. కాబట్టి, నిశ్చింతగా ఈ కొంత సమయాన్ని పునశ్చరణకు కేటాయించాలి.
సిలబస్‌ ప్రకారం ముందుగా ఏయే అంశాలకు ప్రాధాన్యముందో గమనించాలి. అంతేకాకుండా పరిమిత సిలబస్‌ను కలిగి ఉండి, ఎక్కువ ప్రశ్నలు రాగల అంశాలనూ ముందుగా పరిశీలించాలి.

ప్రాధాన్యతా క్రమం తీరు
* పంచాయతీరాజ్‌ వ్యవస్థ: పరీక్ష మొత్తం ఈ అంశానికి సంబంధించినవే. మొత్తం సిలబస్‌లో దాదాపు నాలుగోవంతు అంటే- 35 నుంచి 40 ప్రశ్నల వరకు ఈ విభాగం నుంచే వచ్చే అవకాశం ఉంది. ముందుగా భారతదేశంలో పంచాయతీరాజ్‌ వ్యవస్థ పరిణామక్రమానికి సంబంధించిన ముఖ్యాంశాలపై దృష్టి కేంద్రీకరించాలి. ముఖ్యంగా సమాజ అభివృద్ధి పథకం, బల్వంతరాయ్‌ మోహతా, అశోక్‌మెహతా, ఎల్‌.ఎం. సింఘ్వి కమిటీల సూచనలను మరోసారి చూసుకోవాలి.
* 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992, దానిలోని ముఖ్యాంశాలైన 243(ఎ), 243(బి), 243(సి), 243(డి)లతోపాటు 243(జి), 243(ఐ), 243(కె)లను ప్రత్యేకించి అధ్యయనం చేయాలి. రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌కు సంబంధించిన అధికారాలు, విధులపై సమగ్ర అవగాహన ఉండాలి. ఒకటి, రెండు ప్రశ్నలు పంచాయతీరాజ్‌ సంస్థల అధికారాలు, విధులపైనా ఉంటాయి. ఇలా మొత్తం మీద ఈ విభాగం నుంచి 10-15 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
* ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ వ్యవస్థ పరిణామక్రమం: ఇది కేవలం ఆంధ్ర రాష్ట్రంలో పంచాయతీరాజ్‌ పరిణామ క్రమాన్నే పేర్కొంటుంది. అంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రూపొందిన చట్టాల నుంచి ప్రస్తుతం అమల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం 1994 వరకు 10-15 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్‌ వ్యవస్థ పనితీరును సమీక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వివిధ కమిటీలు.. వెంగళరావు, నరసింహం, బీపీఆర్‌ విట్టల్‌ కమిటీలు, సమరసింహారెడ్డి క్యాబినెట్‌ ఉప కమిటీ మొదలైనవాటిపై ప్రశ్నలుంటాయి.
* ప్రాధాన్య క్రమంలో తర్వాతి అంశం- ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ అమలు చేసే పథకాలు. ఇవి ప్రారంభమైన తేదీలు, సంవత్సరాలపై కూడా ప్రశ్నలు ఉంటాయి. ఈ పథకాల లక్ష్యాలను కూడా గమనించాలి.
* ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ ఆర్థికవ్యవస్థ: వ్యవసాయం, చిన్నతరహా పరిశ్రమలు, గ్రామీణ చేతివృత్తుల పనివారు, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోని సహకార సంఘాల సూక్ష్మ రుణాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానికి పరపతి సౌకర్యాలను కల్పించే జాతీయ బ్యాంకుల పాత్రలపైనా ప్రశ్నలు ఉంటాయి.
* ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన- సమస్యలు: ఏపీపీఎస్‌సీ నిర్వహించే ప్రతి పోటీ పరీక్షలో ఇది అత్యంత ప్రధానమైన అంశం. దీనిపై అభ్యర్థులు తప్పనిసరిగా దృష్టిపెట్టాలి. ఎందుకంటే దీని నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే వీలుంది. రాష్ట్ర పునర్విభజన చట్టం 2014లోని ముఖ్యాంశాలను మననం చేసుకోవాలి. రాజధాని నిర్మాణానికి సంబంధించిన పూర్తి సమాచారంపై అవగాహన పెంచుకోవాలి. రాష్ట్ర విభజన వల్ల కలిగిన పరిపాలన, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి.
* భారత రాజ్యాంగం: దీని నుంచి సాధారణంగా పీఠిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
* భారత ఆర్థికవ్యవస్థ: దీని కోసం పంచవర్ష ప్రణాళికలు.. ముఖ్యంగా 12వ పంచవర్ష ప్రణాళికలో ఇటీవల స్థాపించిన నీతి ఆయోగ్‌, కేంద్ర ప్రభుత్వం రూపొందించి, అమలు చేస్తున్న వివిధ పథకాల లక్ష్యాలను క్లుప్తంగా అధ్యయనం చేయాలి. ఎక్కువ ప్రశ్నలు 2016-17 సామాజిక ఆర్థిక సర్వే నుంచి 2017-18 బడ్జెట్‌ నుంచి వస్తాయని గ్రహించి, ఆ కోణంలో ముఖ్యమైన అంశాలపై దృష్టిసారించాలి.
* ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి ఎక్కువ ప్రశ్నలు భారతదేశ స్వాతంత్రోద్యమం నుంచే ఉంటాయి. కాబట్టి 1857 తిరుగుబాటు నుంచి 1947 వరకు జరిగిన ప్రధాన ఘట్టాలపై ప్రశ్నలు ఉంటాయి. ఆధునిక భారతదేశ చరిత్ర, భారతదేశ జాతీయోద్యమ ప్రధాన ఘట్టాలూ, స్వాతంత్య్ర సమరయోధులపైనా దృష్టిసారించాలి.
శాస్త్రసాంకేతిక రంగాల్లోని ప్రాథమిక భావనలూ, నిత్యజీవితంలో వాటి అనువర్తనాలపై అవగాహన ఉండాలి. జనరల్‌ సైన్స్‌కు సంబంధించి సిలబస్‌ చాలా విస్తృతంగా ఉండటంతో ఇప్పటివరకూ చదివిన దాంతోనే సరిపెట్టుకోవాలి. అయితే భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముఖ్యంగా అంతరిక్ష పరిశోధన రంగంలో సాధించిన తాజా ప్రగతి, ఇటీవల ప్రయోగించిన ఉపగ్రహాలపై పూర్తి పట్టు సాధించాలి. అదేవిధంగా రక్షణ విభాగానికి సంబంధించి క్షిపణి ప్రయోగాలను కూడా చూసుకోవాలి. జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ విషయాలకు సంబంధించిన ముఖ్యాంశాలను మరోసారి చదవాలి.

పరీక్ష ముందురోజు..
* అభ్యర్థులు ముందుగా వీలుంటే ఈరోజే తమ హాల్‌టికెట్‌ను ఏపీపీఎస్‌సీ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని తమ పరీక్షహాలు వివరాలను ముందుగానే చూసుకోవాలి.
* పరీక్ష సమయానికి కనీసం ఒక గంట ముందుగా పరీక్షహాలుకు చేరుకోవాలి. వేసవి కాబట్టి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
* ఓఎంఆర్‌ షీటులో ఇచ్చిన సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు చదువుకోవాలి.
* పరీక్ష సమయంలో తోటి అభ్యర్థులతో ప్రశ్నలు, సమాధానాల గురించి సంప్రదించకూడదు.
* ఇన్విజిలేటర్‌తో వాదనకు దిగడం లాంటివి చేయకూడదు. ఏకాగ్రత దెబ్బతినే అంశాలను ఆలోచించకూడదు.

Posted on 17-04-2017