close

ఏపీపీఎస్సీ > గ్రూప్‌-3 సన్నద్ధత

సమకాలీనత జోడీస్తే పోటీలో ముందుకు

ఏపీపీఎస్‌సీ పంచాయతీ కార్యదర్శి ఎంపిక ప్రధాన పరీక్షకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఆగస్టు 6న జరిగే రాతపరీక్ష రెండు వారాల వ్యవధి పరిధిలోకి వచ్చేసినట్లే. ఇప్పటివరకూ అభ్యర్థుల సన్నద్ధత ఒక ఎత్తైతే ఈ రెండు వారాల్లో చేసే తుది సాధన మరొక ఎత్తు. సమర ఘడియలు సమీపిస్తున్నకొద్దీ అస్త్రశస్త్రాలకు మరింత పదును పెట్టాలి; తుది మెరుగులు దిద్దుకోవాలి. ఈ స్వల్ప సమయంలో సన్నద్ధత తెలివిగా సాగాలి. ఇదే మార్కులు తెచ్చిపెట్టే మంత్రదండం!
పోటీపరీక్షల్లో సన్నద్ధత ఎప్పుడూ సమకాలీనంగా ఉండాలి. అంటే.. సన్నద్ధతలో ఎప్పుడూ తాజాదనం ఉట్టిపడాలి. అంతే తప్ప పాత చింతకాయ పచ్చడి చందంగా, బూజు పట్టిన పంథాలో ఉంటే వెనుకబాటు తప్పదు. పోటీ పరీక్ష సన్నద్ధతలో సమకాలీనతను రెండు భాగాల్లో చూడాల్సి ఉంటుంది.
తాజా ప్రశ్నపత్రాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సన్నద్ధతకు మెరుగులు దిద్దడం ఒక కోణమైతే రెండోది- పరీక్ష సిలబస్‌లోని అంశాల్లో ఏ రోజుకు ఆరోజు చేరే పరిణామాలను ఒడిసి పట్టుకోవడం.
ఈ కోణాల్లో సన్నద్ధత సాగినప్పుడు మార్కుల వర్ష రుతువులోకి ప్రవేశించినట్టే. ఈ మౌలిక సూత్రాన్ని త్వరలో ఎదుర్కోబోయే పంచాయతీ కార్యదర్శి సన్నద్ధతకు జత చేద్దాం.
సిలబస్‌లోని చలన రంగాల (డైనమిక్‌ సబ్జెక్టు)కు తాజా పరిణామాలను జోడించడం ఈ తుది దశలో జరగాలి. పంచాయతీ కార్యదర్శి రాతపరీక్షలోని రెండు పేపర్లకు ఇది వర్తిస్తుంది. పేపర్‌-1 జనరల్‌ స్టడీస్‌లోని జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ, వర్తమానాంశాలు, జనరల్‌ సైన్స్‌, పాలిటీ, ఎకానమీ, విపత్తు నిర్వహణ లాంటి సబ్జెక్టుల్లో కొత్త పరిణామాలను జతచేసి చదవాలి. ఇదే సమయంలో సర్వీస్‌ కమిషన్‌ ఇటీవలి కాలంలో నిర్వహించిన గ్రూప్‌-2 మెయిన్స్‌, హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్స్‌, డిగ్రీ లెక్చరర్ల పరీక్షపత్రాల్లోని నూతన ధోరణులను గుర్తించి ఆ దిశగా సన్నద్ధతను మలచుకోవాలి. ఇదే పంథాను పేపర్‌-2 గ్రామీణాభివృద్ధి విషయంలోనూ అనుసరించాలి.
ప్రస్తుతం సర్వీస్‌ కమిషన్‌ నిర్వహిస్తున్న వివిధ పరీక్షల ప్రశ్నపత్రాల్లో పరీక్ష నాటికి నాలుగైదు రోజుల ముందు పరిణామాలపై ప్రశ్నలు ప్రత్యక్షమవుతున్నాయి. ఇది గుర్తించి, పరీక్ష ముందురోజు వరకు పరిణామాలను గమనిస్తుండటం మంచిది.
గత రెండు నెలల్లో సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే అయిదు ప్రధాన అంశాలు ప్రస్ఫుటమవుతున్నాయి. 1. సబ్జెక్టు మౌలిక అంశాలపై దృష్టి 2. ఆంధ్రప్రదేశ్‌కు అధిక ప్రాధాన్యం 3. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యక్రమాలు- పథకాలు 4. సాంప్రదాయిక సబ్జెక్టుల్లో అనువర్తన కోణం 5. తాజా అంశాలు (పరీక్ష ముందు వరకు).
విస్తృతమైన సిలబస్‌ నుంచి ప్రశ్నల ఎంపికకు ఈ అయిదు అంశాలు ప్రధాన ప్రేరణగా నిలుస్తున్నాయని ఇటీవలి ప్రశ్నపత్రాల స్వరూపం వెల్లడిస్తోంది. దీనిని ఆకళింపు చేసుకుంటే అభ్యర్థి సన్నద్ధత దిశ, దశ మారుతుంది.

సబ్జెక్టు మౌలిక అంశాలపై దృష్టి
సాధారణంగా పోటీ పరీక్షార్థులు సన్నద్ధత పర్వంలో ముందుకెళ్తున్న కొద్దీ సబ్జెక్టు కీకారణ్యంలో కొట్టుమిట్టాడుతూ క్రమేపీ ప్రాథమికాంశాలపై దృష్టిని విడనాడతారు. తాజా అంశాలను క్రోడీకరించే ఆతృతలో సబ్జెక్టు మౌలిక అంశాలను నెమరువేసుకోవడం విస్మరిస్తారు. అయితే ఏ సబ్జెక్టులోనైనా అభ్యర్థికి ప్రాథమిక విషయాలు తెలిసి ఉండాలని నియామక సంస్థ కోరుకుంటుంది. ఇందుకు ఏపీపీఎస్‌సీ మినహాయింపు కాదు. సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే దాదాపు ప్రతి పరీక్షలో ప్రాథమికాంశాలకు సముచిత స్థానం ఉంటోంది. ఇటీవల గ్రూప్‌-2 మెయిన్స్‌, డిగ్రీ లెక్చరర్స్‌ వంటి పరీక్ష పత్రాలు దీనిని మరోసారి తేటతెల్లం చేశాయి. ముఖ్యంగా స్థిరమైన సబ్జెక్టుల్లో మౌలిక విషయాలపైనే ఎక్కువగా ప్రశ్నలు ఉంటున్నాయి.
ఉదాహరణకు- గ్రూప్‌-2 మెయిన్స్‌లో..
1. జీవులన్నింటిలో ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం ఏది?
జ: కణం
2. వైరస్‌ ద్వారా వచ్చే వ్యాధి ఏది?
జ: హెర్పెస్‌
ఇదే ప్రాతిపదికపై ఆధారపడి డిగ్రీ లెక్చరర్‌ పరీక్షలో వచ్చిన ప్రశ్నలు
1. ఏ భాగాన్ని కణపు శక్త్యాగారం అంటారు?
జ: మైటోకాండ్రియా
2. ఏది ప్రాథమిక రంగు కాదు?
జ: పసుపు

ఆంధ్రప్రదేశ్‌కు అధిక ప్రాముఖ్యం
ఏపీపీఎస్‌సీ నిర్వహించే పరీక్షల్లో గతంలో కంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంశాలకు ఎనలేని ప్రాధాన్యం కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో ఈ ఒరవడి పెరిగింది. గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలో ఈ ధోరణి ప్రస్ఫుటంగా కనిపించింది. ఇదే పంథాలో పంచాయతీ కార్యదర్శుల ప్రధాన పరీక్షలో ఆంధ్రప్రదేశ్‌ అంశాలకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుందని అంచనా వేయవచ్చు. గ్రూప్‌-2, పంచాయతీ కార్యదర్శుల పోస్టులు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది. సామాన్య ప్రజానీకానికి నేరుగా సేవలు అందించే పోస్టులు కావడం వల్ల రాష్ట్రానికి సంబంధించిన విషయాలపై అభ్యర్థి అవగాహనను పరీక్షించాలనుకుంటున్నారని భావించవచ్చు.
గ్రూప్‌-2 మెయిన్స్‌ పేపర్‌-1లో కరెంట్‌ అఫైర్స్‌ విభాగంలో మినహాయించి మరో విభాగంలో ఎక్కడా ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తావన ప్రధానంగా లేదు. అయినప్పటికీ పేపర్‌-1 జనరల్‌స్టడీస్‌ పేపర్‌లో ఇటీవల జరిగిన పరీక్షల్లో 20 శాతానికిపైగా ప్రశ్నలు ఉండటం గమనార్హం.
ఉదాహరణకు- గ్రూప్‌-2 మెయిన్స్‌లో..
1. ఏ ఉత్పత్తికి భౌగోళిక సూచికగా గుర్తింపు లేదు?
జ: తాపేశ్వరం కాజా (మిగతా ఐచ్ఛికాలు భౌగోళిక గుర్తింపు ఉన్నవి)
2. కృష్ణా జల ట్రిబ్యునల్‌ నిర్ణయించిన ప్రకారం, కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వాటా ఎంత?
జ: 512 టీఎంసీ
డిగ్రీ లెక్చరర్స్‌ పరీక్షలో..
1. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ 10వ బెటాలియన్‌ ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ ఉంది?
జ: గుంటూరు
2. ఏ ప్రదేశంలో ఐసీఏఆర్‌ స్థాపించిన భారతీయ ఆయిల్‌ ఫామ్‌ పరిశోధన సంస్థ ఉంది?
జ: పెదవేగి

పంచాయతీ సెక్రటరీ పేపర్‌-1 జనరల్‌స్టడీస్‌లో వర్తమానాంశాలతో ప్రాంతీయ విషయాలపై ప్రశ్నలు, పేపర్‌-2 పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణాభివృద్ధిపైనే దృష్టి కేంద్రీకరించడం వల్ల 150 మార్కుల ఈ పేపర్‌లో సింహభాగం ప్రశ్నలు రాష్ట్ర అంశాలపైనే ఉంటాయి. అందుకే ఆంధ్రప్రదేశ్‌ విభజనానంతరం భౌగోళికాంశాలు, జనాభా లెక్కలు 2011 ప్రకారం ప్రస్తుత నవ్యాంధ్రప్రదేశ్‌ గణాంకాలు, వ్యవసాయ రంగం, పంటలు, దిగుబడి, జిల్లాలవారీగా ప్రాధాన్యాంశాలపై ఏ ఒక్క విషయాన్నీ వదిలిపెట్టకుండా చదవాలి. ఆంధ్రప్రదేశ్‌ సామాజిక, ఆర్థిక సర్వే 2016-17 ఆధారంగా వివరాలను గమనిస్తే మేలు. వ్యవసాయ అనుబంధ రంగాలు, నీటిపారుదల, పోర్టులు, పర్యటక రంగం, అటవీ సమాచారం, మానవాభివృద్ధి వివరాలు, భూకమతాలు, భూవినియోగం వంటి ప్రాథమికాంశాలపై అవగాహన అవసరం.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ కార్యక్రమాలు- పథకాలు
ప్రభుత్వ సర్వీసులోకి ప్రవేశించాలని అభిలషిస్తున్న ఉద్యోగార్థికి అనివార్యంగా ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై స్పష్టమైన అవగాహన ఉండాలి. పదుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చేపడుతున్న నూతన కార్యక్రమాల గురించి పోటీ పరీక్షార్థికి తెలిసి ఉండాలని నియామక సంస్థ ఆశిస్తుంది. అందునా ముఖ్యంగా గ్రామసీమల్లో ప్రభుత్వ ప్రతినిధిగా ప్రత్యక్షంగా కనిపించే పంచాయతీ కార్యదర్శిపై ప్రభుత్వ ప్రతిష్ఠ ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ పోస్టుకు ఎంపికయ్యే అభ్యర్థికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కేంద్ర గ్రామీణాభివృద్ధి, రాష్ట్ర, పంచాయతీరాజ్‌ శాఖ అమలు చేస్తున్న పథకాలపై అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ అంశాలను నేరుగా సిలబస్‌లోనే జతపరిచారు. మామూలుగానే ఇటీవల జరిగిన గ్రూప్‌-2, డిగ్రీ లెక్చరర్స్‌ పరీక్షల్లోనే రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రశ్నలు అడిగారు.
డిగ్రీ లెక్చరర్‌ పరీక్షలో..
1. గర్భిణులు, బాలింతలకు ప్రతిరోజూ ఒకసారి కడుపు నిండా భోజనం అందించడానికి ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పథకం పేరు ఏమిటి?
జ: అన్న అమృతహస్తం
అసిస్టెంట్‌ బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పరీక్షలో..
1. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆరోగ్య రక్ష పథకం ఎవరికి ఉద్దేశించింది?
జ: దారిద్య్రరేఖకు ఎగువన ఉన్నవారికి
గ్రూప్‌-2 పరీక్షలో..
1. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణమాఫీ పథకంలో ఒక రైతుకు గరిష్ఠంగా ఎంత మొత్తం వరకు మాఫీ చేస్తుంది?
జ: రూ.1,50,000
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2014 నుంచి చేపట్టిన కార్యక్రమాలతోపాటు తాజా పథకాలు- అన్న అమృతహస్తం, వన మహోత్సవం, మనం-వనం తదితర కార్యక్రమాల సమగ్ర వివరాలను చూసుకోవాలి.

సాంప్రదాయిక సబ్జెక్టుల అనువర్తన కోణం
గత ఏడెనిమిది నెలల నుంచి వరుసగా వివిధ కేటగిరీలకు జనరల్‌ స్టడీస్‌ పేపర్లతో పరీక్షలు నిర్వహిస్తున్న ఏపీపీఎస్‌సీ ప్రశ్నపత్రాలు రానురానూ పదునెక్కుతున్నాయి. తొలిదశలో వడపోత పరీక్షలకు వివిధ జనరల్‌స్టడీస్‌ సబ్జెక్టులకు మౌలిక అంశాలపై దృష్టిసారించగా ఇప్పుడు రెండోదశ మెయిన్‌ పరీక్షలకు అనువర్తన విషయాలపై దృష్టిపెడుతున్నారు. ఇటీవలి గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలో సాంప్రదాయిక భౌతిక, రసాయన శాస్త్రాల్లో ఎటువంటి ప్రశ్నలు ఇచ్చారో పరిశీలిస్తే రాబోయే పంచాయతీ సెక్రటరీ ప్రధాన పరీక్షకు ఇవే సబ్జెక్టులను ఏ పంథాలో చదవాలో నిర్ణయించుకోవచ్చు.
గ్రూప్‌-2 ప్రశ్నలు
1. భారతదేశపు కోడిమెడ అని దేన్ని అంటారు?
జ: పశ్చిమ్‌ బంగ, ఈశాన్య ప్రాంతాన్ని కలిపే సన్నని భూభాగం.
2. ఎక్కువ ఓల్జేజీ గల విద్యుత్‌ తీగపై నిల్చున్న పక్షికి కరెంట్‌ షాక్‌ ఎందుకు తగలదు?
జ: పక్షి కాళ్ల మధ్య పొటెన్షియల్‌ (ఓల్టేజ్‌) భేదం లేదు.
ఇదే పంథాలో భౌతిక-రసాయన శాస్త్రాల్లో అనువర్తన అంశాలు చూసుకోవాలి.

తాజా అంశాలు
కరెంట్‌ అఫైర్స్‌ విషయంలో ఏపీపీఎస్‌సీ పోటీపరీక్షార్థులకు గట్టి సవాలునే విసురుతోంది. గతంలో పరీక్ష జరిగే రోజుకు కరెంట్‌ అఫైర్స్‌ ప్రశ్నల కవరేజీకి మధ్య వ్యవధి 15 నుంచి నెల రోజుల వరకు వెనక్కి ఉండేది. దీంతో అభ్యర్థులు పరిమిత కాలం వరకు వర్తమానాంశాలను చదువుకుంటే సరిపోయేది.
అయితే ప్రస్తుతం సర్వీస్‌ కమిషన్‌ నిర్వహిస్తున్న వివిధ పరీక్షల ప్రశ్నపత్రాల్లో పరీక్ష నాటికి నాలుగైదు రోజుల ముందు పరిణామాలపై ప్రశ్నలు ప్రత్యక్షమవుతున్నాయి. జులై 15న జరిగిన గ్రూప్‌-2 మెయిన్స్‌ జనరల్‌ స్టడీస్‌ పేపర్‌లో 6, 7 తేదీల్లో ప్రధాని ఇజ్రాయెల్‌ పర్యటనపైన ప్రశ్న అడగటం అభ్యర్థులను ఆశ్చర్యపరిచింది. అంతకుముందు జరిగిన డిగ్రీ లెక్చరర్స్‌ పరీక్షలోనూ పరీక్ష రోజుకు మూడు, నాలుగు రోజుల ముందు జరిగిన పరిణామాలపై ప్రశ్నలు వచ్చాయి. రెండో దశ మెయిన్స్‌ పరీక్షలు, తక్కువమంది అభ్యర్థులు గల కేటగిరీ పరీక్షలను ఏపీపీఎస్‌సీ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నందువల్ల సర్వీస్‌ కమిషన్‌కు అందివచ్చిన ఈ సౌలభ్యాన్ని అభ్యర్థులు గుర్తించి, పరీక్ష ముందురోజు వరకు పరిణామాలను గమనిస్తుండటం మంచిది.
ఈ పంథాలో వచ్చిన కొన్ని కరెంట్‌ అఫైర్స్‌ ప్రశ్నలను గమనిస్తే..
గ్రూప్‌-2 మెయిన్‌ పరీక్షలో..
1. ఇజ్రాయెల్‌ దేశాన్ని సందర్శించిన మొదటి భారత ప్రధానమంత్రి ఎవరు?
జ: నరేంద్ర మోదీ
2. ప్రధానమంత్రి మోదీ ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ఎవరిని అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించింది?
జ: మహమ్మద్‌ యూసుఫ్‌ షా
డిగ్రీ లెక్చరర్స్‌ పరీక్షలో..
1. ఇటీవల చైనా నిర్వహించిన ‘ఒక బెల్ట్‌ ఒక రోడ్డు’ సమావేశాలను ఏ దేశం బహిష్కరించింది?
జ: భారత్‌
2. ఇటీవల అనేక దేశాల్లో కంప్యూటర్లు, నెట్‌వర్క్‌లను నిర్వీర్యం చేసిన వైరస్‌ పేరేమిటి?
జ: వాన్నాక్రై
ఈ కోణం నుంచి చూస్తే జులైలో జర్మనీలో హంబర్గ్‌లో జరిగిన జీ-20 శిఖరాగ్ర సదస్సు, ఐరాసలో అణ్వస్త్ర నిషేధ ఒప్పందంపై ఓటింగ్‌, భారత్‌లో మలేరియా వ్యాధి నిర్మూలనకు జాతీయ వ్యూహాత్మక ప్రణాళిక, సహకార సంస్థల ఎన్నికల్లో రాజస్థాన్‌ ప్రభుత్వం అభ్యర్థులకు కనీస విద్యార్హత నిర్దేశించడం, రాష్ట్రపతి ఎన్నికలు, 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ తదితర అంశాలపై అవగాహన పెంచుకోవడం మంచిది.

పరీక్షా విధానం సిలబస్‌ను అనుసరిస్తూ విజయమే లక్ష్యంగా చదవడం ఒక ఎత్తైతే ఎప్పటికప్పుడు నియామక సంస్థ నిర్వహించే ఇతర పరీక్షల ప్రశ్నపత్రాలను నిశితంగా పరిశీలిస్తూ సన్నద్ధతలో మార్పులూ, చేర్పులూ చేసుకోవడం మరో ఎత్తు. గాఢాంధకారంలో ఏ ఆసరా లేకుండా నడవడం కంటే చేతిలో కాగడాతో వెళితేనే ఆత్మస్థైర్యం సొంతమవుతుంది; విజయప్రస్థానం కొనసాగుతుంది!

Posted on 24-07-2017