close

ఏపీపీఎస్సీ > ప్రిప‌రేష‌న్ ప్లాన్‌

కొత్త చేర్పులపై నేర్పుగా పట్టు!

గ్రూప్స్‌ సిలబస్‌ జనరల్‌స్టడీస్‌లో తాజాగా ‘ఆంధ్రప్రదేశ్‌ విభజన ఫలితంగా తలెత్తిన పరిపాలన, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, న్యాయపరమైన అవరోధాలు/చిక్కులు’కు సంబంధించి తొమ్మిది అంశాలను చేర్చారు. వీటిపై అవగాహనకు ఉపకరించే విశ్లేషణ ఇదిగో...!
కొత్తగా ఏపీపీఎస్‌సీ సిలబస్‌లో చేర్చిన అంశాల నుంచి గ్రూప్‌-1, 3, 4 పరీక్షల్లో 15-20 మార్కుల వరకూ వచ్చే అవకాశముంది. వీటిని గ్రూప్‌-2 రెండో పేపర్‌, సెక్షన్‌-1లోనూ జోడించారు. అందుకే గ్రూప్‌-2లో రెట్టింపు మార్కుల వెయిటేజికి అవకాశముంది.
1. రాజధాని నగరం కోల్పోవడం, నూతన రాజధాని నిర్మాణంలో ఉన్న సవాళ్ళు, ఆర్థిక అవరోధాలు: విభజన- రాజధాని లేకుండాపోవడానికి దారితీసిన పరిణామాలపై, ఉమ్మడి రాజధానిపై అవగాహన ఉండాలి. నూతన రాజధాని ఏర్పాటుకు శివరామ కృష్ణన్‌ కమిటీ చేసిన సిఫార్సులు తెలుసుకోవాలి. నూతన రాజధాని నిర్మాణానికి ప్రభుత్వ చర్యలు, కేపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (సీఆర్‌డీఏ) ఏర్పాటు, పరిధి, భూసమీకరణ విధానం గ్రహించాలి.
2. ఉమ్మడి సంస్థల విభజన, పునర్నిర్మాణం: ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం 2014లో పేర్కొన్న తొమ్మిది, పదో షెడ్యూళ్ళలో ఏ సంస్థలున్నాయి, ఇవి ఎవరికి చెందుతాయి, వాటి కేటాయింపుల తీరుపై పట్టు పెంచుకోవాలి. ఉమ్మడి హైకోర్టు నిర్వహణ వంటి అంశాలపై, తెలంగాణ ప్రాంతంలోని ఉమ్మడి సంస్థల పరిస్థితి, విభజన చట్టంలోని అంశాలపై అవగాహన ఉంటే మార్కులు సాధించడం సులువే.
3. ఉద్యోగుల విభజన, పునః కేటాయింపు, స్థానికత అంశాలు: ఉద్యోగుల విభజన కోసం భారతప్రభుత్వం ఏర్పాటు చేసిన కమలనాథన్‌ కమిటీ, నిర్ణయాలు, కమిటీ గడువు అంశాలు ముఖ్యం. స్థానికతకు సంబంధించి సవరణలు చేసి వెలువడిన నూతన ఉత్తర్వుల ప్రకారం స్థానికత ఎవరికి వర్తిస్తుంది తదితర అంశాలపై అవగాహన అవసరం.
4. వాణిజ్యం, పారిశ్రామికవేత్తలపై విభజన ప్రభావం: విభజన పర్యవసానంగా ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార ప్రతికూల వాతావరణం, మౌలిక సదుపాయాల లేమి వంటి అంశాలతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో ఒకే ప్రాంతంలో పారిశ్రామిక కేంద్రీకరణ జరగటం అనే కోణంలో అధ్యయనం చేయాలి.
5. రాష్ట్రప్రభుత్వ ఆర్థిక వనరులకు ఉన్న అవరోధాలు: 14వ ఆర్థికసంఘం ఆంధ్రప్రదేశ్‌కి ఏ విధంగా కేటాయింపులు చేసింది, దానిపై విభజన ప్రభావం, దీనికి అనుగుణంగా ప్రణాళికాసంఘం (నీతి అయోగ్‌) కేటాయింపులపై ప్రభావం వంటి అంశాలపై విశ్లేషణాత్మక అధ్యయనం అవసరం.
ఆదాయ వనరులు, వ్యయాల మధ్య అంతరం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏ విధంగా ఉంది, అవశేష ఆంధ్రప్రదేశ్‌లో ఏ విధంగా ఉంది, తెలంగాణలో ఏ విధంగా ఉంది, రాష్ట్రపన్నుల ఆదాయంపై విభజన ప్రభావం వంటి అంశాల్లో అవగాహన పెంచుకోవాలి.
6. విభజన అనంతరం రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, పెట్టుబడుల అవకాశాలను అందుకోవడం కోసం ప్రభుత్వ ప్రయత్నం: రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రభుత్వ విధానాల గురించి... ముఖ్యంగా విద్యుత్‌ రంగం, రవాణా రంగం, నీటిపారుదల రంగం ప్రగతి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై లోతైన అధ్యయనం చేయాల్సివుంటుంది.పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రభుత్వ నిర్ణయాలు, ముఖ్యంగా.. పారిశ్రామిక అనుమతులు వేగవంతం, సరళీకరణ కోసం ప్రభుత్వ విధానం, ఈ-గవర్నెన్స్‌, పారిశ్రామిక ప్రోత్సాహకాలు వంటివాటిని తెలుసుకోవాలి. దీనిలో భాగంగా జనవరిలో కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సు వివరాలు, ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలు, ఒప్పందాల వివరాలు ప్రధానం.
విభజనానంతరం రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవల రంగాలకు సంబంధించిన ప్రభుత్వ విధానాలపై కనీస అవగాహన అవసరం. రాష్ట్రప్రభుత్వ విజన్‌ అయిన ఏడు మిషన్లు, ఐదు క్యాంపెయిన్లు, ఐదు గ్రిడ్లపై పూర్తి అవగాహన అవసరం.
7. సామాజిక ఆర్థిక సాంస్కృతిక, జనాభాపై విభజన ప్రభావం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెవిన్యూలోటు, ఆర్థిక లోటు ఏవిధంగా ఉండేది, అవశేష ఆంధ్రప్రదేశ్‌లో ఇవి ఏవిధంగా ఉన్నాయి అనే అంశాలపై విశ్లేషణాత్మక అధ్యయనం అవసరం. ఆర్థికవ్యవస్థలోని వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవలరంగాలపై విభజన ప్రభావాలపై అధ్యయనం చేయాలి.జనాభా, అక్షరాస్యత, లింగ నిష్పత్తి, జనసాంద్రత, ఎస్‌సీ, ఎస్‌టీ జనాభా వివరాలు, గ్రామీణ పట్టణ శ్రామిక జనాభా వివరాలపై అవగాహన ఉండాలి.
రాష్ట్రంలో ఆస్తులు, అప్పుల పంపిణీ, రెండు రాష్ట్రాల మధ్య జనాభా నిష్పత్తికి సంబంధించి అంశాలు తెలుసుకోవాల్సివుంది. విభజనానంతరం రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి, తలసరి ఆదాయం, పన్నుల ఆదాయంపై అవగాహన ఉంటే ఈ విభాగంలో జవాబులను గుర్తించడం సులభమే. మానవ వనరుల అభివృద్ధిలో భాగంగా ప్రధానమైన ఉన్నతవిద్యాసంస్థలన్నీ ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోనే ఉండటం వల్ల విభజన ప్రభావం ఉన్నతవిద్యకు సంబంధించి ఎలా ఉంది, కేంద్రప్రభుత్వం వీటి ఏర్పాటుకు తీసుకున్న చర్యలు వంటివాటిపై అవగాహన అవసరం.
8. నదీజలాల పంపిణీ, సంబంధిత అంశాలపై విభజన ప్రభావం: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో సేవలను అందిస్తున్న కృష్ణా గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టుల అమలు, క్రమబద్ధీకరణ, నిర్వహణ కోసం ఏర్పాటుచేసిన నియంత్రణ వ్యవస్థ, రాష్ట్ర అంశంగా ఉన్న నీటి విషయాన్ని దేశంలో తొలిసారిగా కేంద్రప్రభుత్వం తన అధీనంలోకి తీసుకోవడం వంటివి, గోదావరి, కృష్ణా నదీజల యాజమాన్య మండలి-సభ్యులు, విధులు మొదలైనవి ముఖ్యం. ఇంకా గోదావరి నదీ యాజమాన్య బోర్డు, కృష్ణానదీ యాజమాన్య బోర్డుల యంత్రాంగం, విధులు గ్రహించాలి. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఖమ్మంజిల్లాలోని ఏడు ముంపు మండలాలను అవశేష ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారు. దీనికి సంబంధించిన సమాచారం ప్రధానం. రెండు రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న జలవివాదాలకు సంబంధించి అవగాహన పెంచుకుంటే దీనిలో జవాబులు గ్రహించడం కష్టమేమీ కాదు.
9. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం, 2014లోని కొన్ని నిబంధనల్లో ఉన్న ఏకపక్ష ధోరణి: దీనిలో పూర్తి మార్కులు సాధించాలంటే... ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014లోని నిబంధనలపై సమగ్ర అవగాహన ఉండాలి. ఉమ్మడి రాజధాని (సెక్షన్‌-5), ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలు, అంతర్గత భద్రత మొదలైన అంశాలపై గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యతలు (సెక్షన్‌-8), రాబడి, వ్యయం, ఆస్తులు, అప్పుల పంపకం (పార్ట్‌-5), ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర సంస్థలు, ఉద్యోగుల అంశాలు, ఉన్నతవిద్య మొదలైన అంశాలను అధ్యయనం చేయాలి. పునర్‌వ్యవస్థీరణ చట్టానికి ఇప్పటివరకూ చేసిన సవరణలకు సంబంధించిన అంశాలు పరీక్ష కోణంలో అధ్యయనం చేయాలి.
వ్యవసాయ రంగ కీలక అభివృద్ధి, పరిశోధన సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయటానికి ఆర్థిక, మానవ వనరుల రూపంలో ప్రధాన సమస్య ఉంటుంది. దీన్ని అధిగమించడం కోసం కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు తీసుకునే చర్యలు గమనిస్తుండాలి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌పై పడిన ప్రభావాలను అవగాహన చేసుకుంటూ సన్నద్ధత కొనసాగించాలి. అలాగే పునర్‌వ్యవస్థీకరణ చట్టం, 2014 పరిణామ క్రమం, అపాయింట్‌ డే వంటివాటిపై అవగాహన పెంచుకుంటే సిలబస్‌లో కొత్తగా చేర్చిన అంశాలపై పట్టు సాధ్యమవుతుంది.

Posted on 25-07-2016