close

ఏపీపీఎస్సీ > ప్రిప‌రేష‌న్ ప్లాన్‌

అనుసంధానం.. గెలుపు ఇంధ‌నం!

నియామక ప్రక్రియ సంస్కరణల్లో భాగంగా వడపోత (స్క్రీనింగ్‌), ప్రధాన (మెయిన్స్‌) పరీక్షల విధానాల్ని ఏపీపీఎస్‌సీ ప్రవేశపెట్టింది. ఏపీపీఎస్‌సీ ఇక ఎక్కువగా ఈ పద్ధతినే అనుసరించే అవకాశం కనిపిస్తోంది. కొత్త పరిణామాల నేపథ్యంలో గ్రూప్‌-2 వ్యూహం ఎలా ఉండాలి?
తాజాగా గ్రూప్‌-2 పరీక్ష ‘స్క్రీనింగ్‌’ సిలబస్‌ విడుదలయింది. అందులో అర్హులైన అభ్యర్థులను 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు.
గతంలో పరీక్షకు దరఖాస్తు చేసిన అందరూ 3 పేపర్ల పరీక్ష రాసేవారు. ప్రస్తుతం అభ్యర్థులందరూ స్క్రీనింగ్‌ పరీక్ష రాయాలి. ‘మెయిన్స్‌’ను పరిమిత సంఖ్యలోని అభ్యర్థులు రాయడానికి అనుమతిస్తారు. ప్రస్తుతం గ్రూప్‌-2లో 750 ఖాళీలు ఉన్నందున 37,500 మంది మాత్రమే మెయిన్స్‌ రాసే అవకాశముంది.
మెయిన్స్‌ ఆబ్జెక్టివ్‌ పరీక్ష. గతంలో గ్రూప్‌-2లో ఉన్నటువంటి 3 పేపర్లు ‘మెయిన్స్‌’లో కొనసాగుతాయి. అయితే ఈసారి ఆన్‌లైన్‌ విధానంలో మెయిన్స్‌ను నిర్వహిస్తారు.
అనుసరించాల్సిన వ్యూహం
స్క్రీనింగ్‌, మెయిన్స్‌ విధానం వల్ల చాలామంది అనుభవం లేని అభ్యర్థులు... ‘ముందుగా స్క్రీనింగ్‌ పరీక్షకు తయారై, అందులో అర్హత పొందితే- అప్పుడు మెయిన్స్‌కు సన్నద్ధత ప్రారంభించవచ్చు’ అని భావిస్తున్నారు. ఇది సరైన నిర్ణయం కాదు.. ఎందుకంటే-
* స్క్రీనింగ్‌, మెయిన్స్‌ పరీక్షలకు కాలవ్యవధి తక్కువగా ఉండే అవకాశముంది. ఆ తక్కువ సమయంలో మెయిన్స్‌ 3 పేపర్లకు సిద్ధమవడం కష్టమైన విషయం.
* స్క్రీనింగ్‌ 3 విభాగాల సిలబస్‌ను పరిశీలిస్తే, మొదటి రెండు విభాగాల్లో సిలబస్‌ అంతా మెయిన్స్‌ 1, 2 పేపర్లకు సంబంధించినవే.
* స్క్రీనింగ్‌ మూడో విభాగంలోని ఎకానమీ అంశాలు కూడా కొంతవరకూ ఎకానమీ (మూడో పేపర్‌)తో సంబంధం కలిగి ఉన్నాయి. కొత్త అంశాలు పరిమితమైనవి.
అందువల్ల స్క్రీనింగ్‌, మెయిన్స్‌ను అనుసంధానించి (ఇంటిగ్రేటెడ్‌) చదవడం వల్ల మెయిన్స్‌ను కూడా విజయవంతంగా ఎదుర్కోవచ్చు. స్క్రీనింగ్‌, మెయిన్స్‌లకు మధ్య ఉండే సమయాన్ని ఆన్‌లైన్‌ పరీక్ష కోసం వినియోగించుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు.
స్క్రీనింగ్‌ సిలబస్‌ విశ్లేషణ
మధ్య భారత ఆర్థికవ్యవస్థ, స్వాతంత్య్ర పూర్వ ఆర్థిక వ్యవస్థలను సిలబస్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. కార్మిక విధానాలు, చట్టాలు, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఏ విధంగా అమలు చేస్తున్నాయన్నది మరో కొత్త కోణం.
మెయిన్స్‌ సిలబస్‌ పేపర్‌-1లోని జాతీయ, అంతర్జాతీయ వర్తమానాంశాలను విభాగం-ఎలో చేర్చారు. రాజకీయ, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, కళలు, క్రీడలు, సంస్కృతి, గవర్నెన్స్‌ విభాగాలు జాతీయ, అంతర్జాతీయ అంశాలను చదవాలనే మార్గదర్శకం కూడా ఇచ్చారు. అందువల్ల అభ్యర్థులు 2016 జులై నుంచి జరిగిన, జరుగుతున్న సంఘటనలను అధ్యయనం చేయడం అవసరం.
జాతీయ, అంతర్జాతీయ అంశాలను బిట్ల మాదిరిగా చదవకూడదు. వీటిని విషయ అవగాహనతో చదివితే ఈ విభాగం నుంచి వచ్చే 50 ప్రశ్నలకుగానూ కనీసం 40-45 మధ్య సాధించవచ్చు. ఆ గరిష్ఠ మార్కులు సాధించే స్థాయిలో ఉంటేనే వడపోతను తేలిగ్గా దాటడానికి అవకాశం ఉంటుంది.
విభాగం- బిలో పేపర్‌-2లోని పాలిటీ అంశాలు ఇచ్చారు. అందువల్ల పేపర్‌-2ని ఈ దశలో చదవడం ద్వారా స్క్రీనింగ్‌ కోసం ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదు. ఇండియన్‌ పాలిటీని చదవడం ద్వారా స్క్రీనింగ్‌లో 50 మార్కులతోపాటు మెయిన్స్‌లో 75 మార్కులు సాధించడానికి ఉపయోగకరం.
ఎప్పటిలాగానే సమాఖ్య ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, స్థానిక ప్రభుత్వాలు, ఎస్‌సీ, ఎస్‌టీ సంక్షేమం, పాలన, న్యాయవ్యవస్థ- దాని సమీక్ష అధికారం, కేంద్ర, రాష్ట్ర శాసనవ్యవస్థలు, కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు వంటి అంశాలు ప్రాధాన్యాన్ని పొందుతాయి. వీటిలో కొన్ని అంశాలను వర్తమాన అంశాలతో అనుసంధానం చేసుకోవడం ద్వారా సన్నద్ధత తేలికవుతుంది.
ఈ విభాగం నుంచి కూడా 45 మార్కుల వరకు సాధించవచ్చు. ఎకానమీ లాంటి విభాగంలో బలహీనంగా ఉన్న ఈ విభాగం ద్వారా సాధించే స్కోరులో బాలెన్స్‌ చేసుకునే వ్యూహాన్ని అనుసరించాలి.
సమాచార కచ్చితత్వమనేది నిర్ణయించుకోవడానికి తెలుగు అకాడమీ, విశ్వవిద్యాలయాల పుస్తకాలపై ఆధారపడడం మంచిది. మార్కెట్లో దొరికే అనేక పుస్తకాలు సమాచార కచ్చితత్వ లోపాల్ని కలిగి ఉన్నాయని గమనించి సిద్ధపడితే మంచిది.
విభాగం-సిని భారతదేశ ఆర్థిక అభివృద్ధి అనే పేరుతో ఇచ్చారు. పేపర్‌-3లోని ఎకానమీ అంశాలతో అనుసంధానించుకుని చదవవచ్చు. అయితే స్థూల అవగాహనకు సంబంధించి వివిధ అంశాలపై ప్రశ్నలు అడిగే అవకాశమెక్కువ.
మధ్య భారత ఆర్థికవ్యవస్థ, స్వాతంత్య్ర పూర్వ ఆర్థిక వ్యవస్థలను సిలబస్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. కార్మిక విధానాలు, చట్టాలు, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఏ విధంగా అమలు చేస్తున్నాయన్నది మరో కొత్త కోణం.
ఎప్పటి మాదిరిగానే పంచవర్ష ప్రణాళికలు, ఆర్థిక సంస్కరణలకు ముందు, తరువాత వ్యవస్థ అంశాలపై అదనంగా ప్రశ్నలు అడిగే అవకాశం కనిపిస్తుంది. స్వేచ్ఛీకరణం, ప్రైవేటీకరణం, ప్రపంచీకరణ విధానాలపై స్థూల అవగాహన పరీక్షించే అవకాశముంది.
పారిశ్రామిక విధానాలు, నూతన ఆర్థిక విధానాలపై వివిధ కోణాలపై ప్రశ్నలు సంధించవచ్చు. అందువల్ల పేపర్‌-3ను అనుసంధానం చేసుకుని స్క్రీనింగ్‌కు సిద్ధమవుతూనే కొత్త అంశాలపై కూడా దృష్టి నిలపడం అవసరం.
ఈ విభాగాన్ని కూడా వర్తమానంలో అనుసంధానించుకుని చదువుతూనే తెలుగు అకాడమీ పుస్తకాలపై ఆధారపడాలి. మొత్తం మీద స్క్రీనింగ్‌లో అర్హత పొందడమనేది ప్రధానాంశమే కాబట్టి, నోటిఫికేషన్‌ వచ్చేంతవరకూ/ స్క్రీనింగ్‌ పరీక్ష రెండు నెలల ముందువరకూ స్క్రీనింగ్‌, మెయిన్స్‌ అనుసంధానించి చదవడం మంచిది. స్క్రీనింగ్‌ పరీక్షకు రెండు నెలల ముందు నుంచి దీని సిలబస్‌నే దృష్టిలో పెట్టుకుని చదవడం మంచిది.
గత గ్రూప్‌-1 ప్రిలిమినరీ అనుభవాలను బట్టి 85-95 మార్కుల మధ్య కటాఫ్‌ మార్కు ఉండేది. ఇపుడు గ్రూప్‌-2 స్క్రీనింగ్‌లో కూడా 95 మార్కులకు దగ్గరగా సగటు స్థాయిలో పేపర్‌ ఉంటే, కటాఫ్‌ ఉండవచ్చు. అందువల్ల 95 మార్కుల సాధన దిశగా సన్నద్ధత ఉంటే సౌకర్యవంతంగా ఉంటుంది.

Posted on 06-09-2016