
ఏపీపీఎస్సీ > ప్రిపరేషన్ ప్లాన్
ఉద్యోగ వ్యూహం!
వరసగా మూడు నియామక పరీక్షలు; సిలబస్‌లు విభిన్నం. దేనికదే ప్రాముఖ్యమున్నది. ప్రతి పరీక్షకూ తగిన సమయం కేటాయించుకుని సమగ్రంగా సిద్ధమయ్యే వ్యూహం రూపొందించుకోవటం సవాల్ లాంటిదే. ఈ సందర్భంలో అభ్యర్థులకు గరిష్ఠంగా ఉపకరించే సూచనలు ఇవిగో!
ఈ ఏడాది జులై 15, 16 తేదీల్లో గ్రూప్-2 మెయిన్స్, ఆగస్టు 6న పంచాయతీ కార్యదర్శుల మెయిన్స్, ఆగస్టు 17 నుంచి గ్రూప్-1 మెయిన్స్ ప్రారంభమవుతున్నాయి. పరీక్షల తేదీలు వెంటవెంటనే ఉండటం వల్ల అభ్యర్థులు ఒక రకమైన ఒత్తిడికి గురవుతున్నారు. వూరిస్తున్న ఉద్యోగ అవకాశాలూ మానసిక అశాంతికి కారణం అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితిలో గరిష్ఠ ఫలితాలను పొందడానికి ఎలాంటి సమయపాలన వ్యూహాన్ని అనుసరించాలనేది కీలకం.
ఒక నెల వ్యవధిలో విభిన్న సిలబస్‌లలో విభిన్న పంథాల్లో తయారవ్వడం నిజంగా కష్టమైన విషయమే.
ఏ పంథా సరైనది?
మీరు ఏ పంథాకు సరిపోతారనేది నిర్ణయించుకోవడం మొదటి సోపానమని గుర్తించాలి. గ్రూప్-2, గ్రూప్-3 ఆబ్జెక్టివ్ పద్ధతికి సంబంధించినవి. సిలబస్ విషయంలో ఈ రెండు పరీక్షల మధ్య కూడా తేడా ఉంది. అయితే గ్రూప్-2 తర్వాత గ్రూప్-3 జరుగుతుంది. కాబట్టి ఈ రెండు పరీక్షల మధ్య వ్యవధిలో గ్రూప్-3 పరీక్ష రెండో పేపర్‌పై పట్టు సాధించడం కష్టమైన విషయం కాదు. అందువల్ల పూర్తిస్థాయి నిరుద్యోగులు రెండు పరీక్షలను లక్ష్యంగా నిర్దేశించుకోవడం సరైన నిర్ణయం అవుతుంది. గ్రూప్-2 పరీక్ష పూర్తయ్యేవరకు గ్రూప్-3 వైపు చూడకపోవడమే మంచిది. గ్రూప్-2 పరీక్ష తేదీలవరకు పూర్తిస్థాయిలో గ్రూప్-2పై దృష్టి నిలపడం మంచిది.
* ఎంత ప్రయత్నించినా గ్రూప్-2పై పట్టు సాధించలేక వ్యథకి గురవుతున్నవారు ‘తప్పదు’ అనుకుంటే ఇప్పటినుంచే గ్రూప్-3 పేపర్-2పై దృష్టిసారించడం వల్ల కనీసం ఒక్క ఉద్యోగానికి అయినా గట్టి పోటీని ఇవ్వగలుగుతారు. పైగా ఆ పోటీ జిల్లా స్థాయిలోనే కాబట్టి, ఉద్యోగం పొందే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.
* గ్రూప్-1, 2 ఉద్యోగాలు రెండింటికీ సిద్ధపడాలని అనుకునేవారు ప్రస్తుతానికి ఆ ప్రయత్నాన్ని వదిలేసి ఏదో ఒక దానిపై దృష్టిపెడితే మంచిది. అయితే అభ్యర్థి తన స్వభావం రీత్యా పరీక్షను ఎంపిక చేసుకుంటే మంచి ఫలితాన్ని రాబట్టవచ్చు. 982 ఉద్యోగాలు ఉన్నాయని గ్రూప్-2ని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం లేదు. 78 ఉద్యోగాలే ఉన్నాయని గ్రూప్-1ని వదిలేసే ఆలోచన కూడా సరైంది కాదు. ఎన్ని పోస్టులు ఉన్నాయని కాకుండా అభ్యర్థి తన సామర్థ్యాలకు అనుగుణంగా పరీక్షను ఎంపిక చేసుకుంటే మంచి ఫలితం సాధించవచ్చు.
స్క్రీనింగ్ పరీక్షలు నేర్పిందేమిటి?
గ్రూప్-2, పంచాయతీ కార్యదర్శి, గ్రూప్-1 స్క్రీనింగ్ పరీక్షలు జరిగాయి. పరీక్షను బట్టి ప్రశ్నల స్థాయి, రూపం మారిపోతుండటం అభ్యర్థులు గమనించారు. ఏ ఒక్క పరీక్షను మరో పరీక్షతో పోల్చడానికి వీలులేని వైవిధ్యాన్ని ఎగ్జామినర్లు ప్రదర్శించారు.
* గ్రూప్-2 స్క్రీనింగ్‌లో జనరల్ స్టడీస్ విభాగంలో కరెంట్ అఫైర్స్ ఎక్కువ అడిగారు. కరెంట్ అఫైర్స్‌తో కలిపి పాలిటీ, ఎకానమీ ప్రశ్నలను అడిగారు. పాలిటీ అనుకున్నట్లుగా రావడంతో అభ్యర్థులు ఒకింత సంతృప్తికి గురయ్యారు. రుణాత్మక మార్కుల విధానం కూడా లేకపోవడంతో లాటరీ ద్వారా కొన్ని మార్కులు పొందారు.
* పంచాయతీ కార్యదర్శుల స్క్రీనింగ్ పరీక్షను అభ్యర్థులు బాగా కఠినంగా భావించారు. పైగా రుణాత్మక మార్కులు కూడా ఉండటంతో తెలిసిన ప్రశ్నలకే జవాబులు గుర్తించారు. ఫలితంగా ఎక్కువ మార్కులను సాధించలేకపోయామని ఒత్తిడికి గురయ్యారు. అందువల్లనే చిత్తూరు జిల్లాలో కటాఫ్ 32కే పడిపోయింది. ప్రకాశం జిల్లాలో 51గా ఉంది.
పంచాయతీ కార్యదర్శి ఉద్యోగానికి సంబంధించిన పరీక్ష కాబట్టి, ఎక్కువ ప్రశ్నలు పంచాయతీరాజ్ వ్యవస్థ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలపై ధారాళంగా అడిగారు. ఫలితంగా ఇండియన్ ఎకానమీ, భౌగోళిక శాస్త్రం, చరిత్ర లాంటి సంప్రదాయ సబ్జెక్టులపై ఆశలు ఎక్కువ పెట్టుకున్నవారు మరింత అసంతృప్తికి గురయ్యారు. విభజన సమస్యలు, విపత్తు, పర్యావరణం, శాస్త్ర సాంకేతికత, వర్తమానాంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ విభాగాల్లో బలహీనంగా ఉన్నవారు ఇబ్బందిపడ్డారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ లాంటి సైద్ధాంతిక అంశాలకు ప్రాధాన్యం ఇవ్వలేదనే విమర్శలు కూడా వచ్చాయి.
గ్రూప్-1 స్క్రీనింగ్ పరీక్ష కూడా అభ్యర్థుల్లో మరికొన్ని సందేహాలను రేకెత్తించింది. అడిగిన ప్రశ్నల్లో అత్యధికం అభ్యర్థి పూర్తి అవగాహనను పరిశీలించే విధంగానే ఉన్నాయి. ప్రధానంగా ఎప్పటి మాదిరిగానే వర్తమానాంశాలపై పట్టును పరిశీలిస్తూ వివిధ సబ్జెక్టులను అనుసంధానం చేశారు.
ఇండియన్ జాగ్రఫీ, చరిత్ర లాంటి సంప్రదాయ సబ్జెక్టులపై ప్రశ్నలు అడగడం విశేషం. ప్రశ్న-సమాధానం గుర్తించే విధంగా కాకుండా ఇచ్చిన సమాధానాలన్నీ చదివి, ఎలిమినేషన్ పద్ధతిలో పరిశోధిస్తే తప్ప సమాధానాలను గుర్తించలేని పరిస్థితిని ఏర్పరిచారు. అసలే రుణాత్మక మార్కులు, దానికితోడు సమగ్ర అవగాహన ఉంటే తప్ప గుర్తించలేని పరిస్థితిలో మెజారిటీ అభ్యర్థులు తక్కువ మార్కుల దగ్గర ఆగిపోయారు.
* కిందివాటిలో ఏది లక్నో ఒప్పంద ముఖ్యాంశాల్లో ఒకటి?
* మార్కాపుర్లో పలకల పరిశ్రమ క్షీణించడానికి ముఖ్య కారణం ఏమిటి?
* బహుళ పన్నురేటు పద్ధతి వల్ల వచ్చే ప్రతికూలత ఏది?
* 1991 తర్వాత సంస్కరణల వల్ల ఎక్కువగా ప్రభావితం కాని రంగం ఏది?
* గవర్నర్ వ్యవస్థకు సంబంధించి ఎం.ఎం. పుంచీ కమిషన్ చేసిన సిఫారసు ఏది?
ఇలాంటి ప్రశ్నలు పెద్ద సంఖ్యలో వచ్చాయి. వీటిని ఎదుర్కోవాలంటే సంబంధిత విషయంపై సమగ్ర అవగాహన ఉండాల్సిందే.
గతంలో ఎప్పుడూ స్పృశించని విభాగాలను గుర్తించి, ప్రశ్నలను అడగడం కూడా గమనించవచ్చు.
* పౌరసత్వాన్ని పొందడానికి వర్తించనిది ఏది?
* ప్రభుత్వ నివేదికలపై ప్రశ్నలు
* పర్యావరణ సంబంధిత ప్రశ్నలు
* 1991 ఆర్థిక సంస్కృతుల నేపథ్యం, తదనంతర పరిణామాలు
982 ఉద్యోగాలు ఉన్నాయని గ్రూప్-2ని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం లేదు. 78 ఉద్యోగాలే ఉన్నాయని గ్రూప్-1ని వదిలేసే ఆలోచన కూడా సరైంది కాదు. ఎన్ని పోస్టులు ఉన్నాయని కాకుండా అభ్యర్థి తన సామర్థ్యాలకు అనుగుణంగా పరీక్షను ఎంపిక చేసుకుంటే మంచి ఫలితం సాధించవచ్చు!
మొత్తంగా చెప్పాలంటే ...
* అభ్యర్థుల్లో సత్తాను గమనించడానికి ఒక్కో పరీక్షలో కొన్ని విభాగాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అందువల్ల జనరల్ స్టడీస్‌లో అన్ని విభాగాలపై పట్టు ఉండాల్సిందే.
* ఏదో ఒక పుస్తకానికి పరిమితమైతే సరిపోదు.
* కరెంట్ అఫైర్స్‌ను కూడా బిట్స్ మాదిరిగా మాత్రమే కాకుండా విశ్లేషణాత్మకంగా చదవాలి.
ఉదా: విశాఖపట్నంలోని ఐఐపీఈకి మెంటార్ ఎవరు? సాధారణంగా ఐఐపీఈ ఎక్కడ ఏర్పరుస్తున్నారు లాంటి ప్రశ్నలు అడిగేవారు. కానీ దానివెనుక ఉన్న నేపథ్యం, కారణ- ఫలిత సంబంధ ప్రశ్నలపై ఎక్కువగా ఉన్నాయి.
* చెందినవి, చెందనివి, కారణం కానిది ఏది, ఫలితం కానిది ఏది? లాంటి ప్రశ్నలకు సమాధానం గుర్తించాలంటే విషయ అవగాహన కీలకపాత్ర పోషిస్తుంది.
* యోజన, ఆంధ్రప్రదేశ్, దినపత్రికలు ఒక సంవత్సర కాలపరిధిలో చదివితే 60% మార్కులు తెచ్చుకోవచ్చు.
ఈ మెలకువలు పాటించండి
గ్రూప్-2
జనరల్‌స్టడీస్ పరిధి ఎక్కువగా ఉండటంతో స్క్రీనింగ్‌లో మాదిరిగానే మెయిన్స్‌లో కూడా మార్కులను నమోదు చేసే పరిస్థితి ఉంటుంది. అందువల్ల ర్యాంకు సాధించే నేపథ్యంలో ఏపీ చరిత్ర, పాలిటీ, ఏపీ ఎకానమీపై బాగా ఆధారపడటం మంచిది. ఈ మూడు విభాగాల్లో 80 శాతానికి పైగా మార్కులు తెచ్చుకుంటే ఇండియన్ ఎకానమీ, జనరల్ స్టడీస్‌ల్లో అటూ ఇటుగా మార్కులు వచ్చినా లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉంది.
నోటిఫికేషన్ పేరా-12 ప్రకారం జనరల్ ఓసీ అభ్యర్థులు 40%, బీసీ- 35%, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు 30% కనీస మార్కులను సాధిస్తేనే తుది ఎంపికకు పరిగణిస్తారు. అందువల్ల ప్రతి పేపర్లోనూ గరిష్ఠ మార్కులను సాధించేరీతిలో శ్రమపడాల్సి ఉంటుంది.
పంచాయతీ కార్యదర్శులు
చర్చించిన కారణాల వల్ల జనరల్ స్టడీస్‌లో కంటే పేపర్-2లో ఎక్కువ మార్కులను సాధించవచ్చు. కానీ పుట్టగొడుగుల్లా ప్రింటింగ్ బుక్స్ ఈ పేపర్‌కు లభ్యమవుతున్నాయి. ఏ పుస్తకంలో ఎంత శాస్త్రీయత, ప్రామాణికత ఉందో పరిశీలించుకోవాలి. లేదంటే పూడ్చలేని నష్టం ఏర్పడుతుంది.
ఆంధ్రప్రదేశ్ మాస పత్రిక, ప్రభుత్వ పథకాలు, ఎకనామిక్ సర్వే లాంటి అంశాలతోపాటు పంచాయతీరాజ్ వ్యవస్థపై పట్టు సాధించినప్పుడే విజయం సొంతమవుతుంది. పంచాయతీ ఖాతాల పద్ధతిపై కనీసం 10-15 ప్రశ్నలను అడిగే అవకాశం ఉంది.
గ్రూప్-1
90 రోజుల సమయం ఉంది. గ్రూప్-1 స్థాయి ఉద్యోగం పొందడానికి కావాల్సిన సామర్థ్యాలు అలవడాలంటే ఈ సమయం తక్కువనే చెప్పాలి.
* కచ్చితంగా ప్రశ్నల రూపంలో అడిగే అవకాశం ఉన్న అంశాలను గుర్తించి సిలబస్ మొత్తంలో 50-60% సన్నద్ధతకు సిద్ధపడాలి.
* రాయడం సాధన చేయడం తప్పనిసరి. ప్రతిరోజూ 40% సమయాన్ని ఇందుకు కేటాయించాలి.
* ప్రతి విషయంపై సమగ్ర అవగాహనతోపాటు సూక్ష్మ విశ్లేషణ కూడా నేర్చుకోవాలి.
* వ్యాసరూప ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలను రాయాలంటే విషయం (కంటెంట్) మాత్రమే చాలదు. సమర్పణ (ప్రెజెంటేషన్) కూడా చాలా ముఖ్యమని గమనించి ఆ దిశగా సాధన చేయాలి.
