close

విశాఖపట్నం జిల్లా సమాచారం


జిల్లా చరిత్ర
విద్య
నదులు - ప్రాజెక్టులు
నీటిపారుదల
ప్రధాన పంటలు
పర్యాటకం
పరిశ్రమలు

జిల్లా చరిత్ర

ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖమైన జిల్లాల్లో ఒకటిగా భాసిల్లుతున్న జిల్లా గుంటూరు. 1904 అక్టోబరు 1న ప్రత్యేక జిల్లాగా ఏర్పాటయింది. ప్రస్తుతం 11,391 చదరపు కి.మీ. విస్తీర్ణం కలిగి ఉంది. గుంటూరుకు అత్యంత ప్రాచీనమైన, వైభవోపేతమైన చరిత్ర ఉంది. తరతరాలుగా అనేక ప్రాంతీయ రాజవంశాల పాలనలోను, విదేశీయుల పాలనలోను గుంటూరు జిల్లా ప్రముఖ స్థానాన్ని ఆక్రమించటమేకాక, అనేక ఉద్యమాలకు, సాహిత్య, సాంస్కృతిక కళారంగాల అభివృద్ధికి నిలయంగా ఉంది.

నీగ్రోటిక్ మానవుడి సంచారం
క్రీ.పూ. 10000లో నీగ్రోటిక్ జాతికి చెందిన పాతరాతి యుగపు మానవులు ఈ ప్రాంతంలో జీవించేవారు. అందుకు సంబంధించిన ఆధారాలు జిల్లాలోని కారంపూడి, నాగార్జునకొండ ప్రాంతాలలో లభ్యమయ్యాయి. నవీన శిలాయుగపు పనిముట్లు, పెద్దరాతి సమాధులు(రాక్షస గుళ్ళు) జిల్లాలో పలు ప్రాంతాల్లో బయట పడ్డాయి. ప్రాంతీయంగా రాక్షసగుళ్ళు అని పిలిచే ఈ పెద్ద రాతి సమాధులు క్రీ.పూ.500 సంవత్సరానికి చెందినవి. వీటిని ద్రావిడులు లేక మెడిటరేనియన్ జాతివారు నిర్మించారని చరిత్రకారులు భావిస్తున్నారు. ఆర్యుల దక్షిణాపథ విస్తరణను ప్రతిఘటించిన వారు ద్రావిడులు అందుకే వీరిని రాక్షసులుగా వర్ణించారు. ఆర్య సంస్కృతి దక్షిణా పథానికి విస్తరించటమే రామాయణ ఇతిహాసగాథ. రాముడు ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు. గుంటూరు జిల్లాను పాలించిన తొలిరాజ వంశం కూడా ఇక్ష్వాకు వంశానికి చెందినదే! మహాభారతాన్ని అనుసరించి ఆంధ్ర జాతీయులు అనేక తెగలకు చెందిన వారు. తెలగలు, నాగులు, ములకలు, జక్కులు(యక్షులు), పల్లవులు, ముండారీలు, మొదలగు వారు ఉన్నారు. చారిత్రక కాలంలో గుంటూరు జిల్లా ఆంధ్రా పల్లవ బొగ్గ, ముండ రాష్ట్రం, నాగదేశం అనే పరిపాలనా విభాగాలుగా ఉండేది. జాతుల పేర్లను బట్టి ఆర్యావర్తం, మహారాష్ట్రం, ద్రవిడదేశం అనే పేర్లు వచ్చాయి. గుంటూరు సమీపాన గల మైదవోలులో లభ్యమైన క్రీ.శ.3వ శతాబ్ది నాటి ఒక శాసనంలో ధాన్యకటకం(అమరావతి సమీపాన గల ధరణికోట) ప్రాంతం ఆంధ్రాపథంగా పేర్కొనబడింది. అంతేగాక ధాన్యకటక ప్రాంతాన్ని పరిపాలించిన శాతవాహనులు, విష్ణుకుండినులు కొండవీటి రెడ్డిరాజులు ఆంధ్రజాతీయులని, ఆంధ్రాదీశ్వరులని పేర్కొనానరు. వీటిననుసరించి మైదవోలు శాసనంలో పేర్కొనబడిన ఆంధ్రాపథం మహాభారతంలోను, పురాణాలలోను చెప్పబడిన ఆంధ్రుల ప్రథమ నివాస స్థలంగా నేటి ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర స్థానంగా ఉండేది. క్రీ.పూ. 5వ శతాబ్ది నాటికి ఆంధ్రులు మరింత పుంజుకుని, ఇరుగు పొరుగు తెగల వారిపై ఆధిపత్యాన్ని నెలకొల్పి క్రమేణా తనలో సంలీనం చేసుకొని ఆంధ్రజాతిని నిర్మించారు.

@ శాతవాహనులు
వాజ్మయ ఆధారాల ప్రకారం ప్రతిపాలపుర రాజ్యం( నేటి భట్టిప్రోలు) గుంటూరు జిల్లాలో ఏర్పడిన ప్రథమ రాజ్యం. జైన ధర్మామృత అనుసరించి జైన తీర్థాంకరుడైన వాసుపూజ్య(క్రీ.పూ.5వ శతాబ్ధము) కాలంలో ఇక్ష్వాక వంశస్థుడైన చెంపరాజ్య పాలకుడు యశోధరుడునర దక్షిణాపథానికి వలస వచ్చి ప్రతి పాలపుర రాజ్యాన్ని స్థాపించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. క్రీ.పూ.4వ శతాబ్ధిలో పాటలీపుత్ర ఆస్థానానికి రాయబారిగా వచ్చిన మెగస్తనీస్ ఆంధ్రులకు బలిష్టమైన 30 దుర్గాలున్నాయని పేర్కొన్నాడు. వాటిలో భట్టిప్రోలుతో పాటు అమరావతి, తాంబ్రప్రస్థాన(చేబ్రోలు), చినగంజాంలు కూడా ఉన్నాయి. భట్టిప్రోలులో లభ్యమైన క్రీ.పూ.2వ శతాబ్ధికి చెందిన శాసనాలను బట్టి భట్టిప్రోలు ప్రాంతంలో కుబేరకా అనే రాజు నిగమసభ లేక పెద్దల సభ సహాయంతో పరిపాలన సాగించినట్లు తెలుస్తోంది. కుబేరక రాజు యశోధర రాజవంశానికి చెందినవాడై ఉండాలి. ఆంధ్ర శాతవాహనుల కాలంలో (క్రీ.పూ. 225 - క్రీ.శ.225) గుంటూరు జిల్లా ఉత్తరాన మాళ్వా నుంచి దక్షిణాన మద్రాసు, మైసూరుల వరకు విస్తరించిన మహా సామ్రాజ్యానికి కేంద్రమై శక దండయాత్రల నుంచి కాపాడుకునే నిమిత్తం శాతవాహనులు కొంత కాలం మహారాష్ట్రంలో గల పైఠాన్‌ను రాజధానిగా చేసుకొని క్రీ.శ. నుంచి గుంటూరు జిల్లాలోని ధాన్యకటకం ఆంధ్ర శాతవాహన మహాసామ్రాజ్యానికి రాజధానిగా పరిఢవిల్లింది. శాతవాహన రాజులలో అగ్రగణ్యుడైన గౌతమిపుత్ర శాతకర్ణి ధాన్యకటకం నుంచే తన దిగ్విజయ యాత్రలను ప్రారంభించి తన అశ్వాలకి మూడు సముద్రాలలో దప్పిక తీర్చినాడు. అందుకే ఆయన్ని త్రి సముద్ర తోయ పీత వాహన అనే బిరుదాంకింతుడయ్యాడు.
దీర్ఘకాల శక-శాతవాహన సంఘర్షణ ఫలితంగా ప్రతి పాలపురంలో గల ఇక్ష్వాకులు బలపడి తమ రాజకీయ కేంద్రాన్ని శ్రీ పర్వత- విజయపురి(నాగార్జున కొండ)కి మార్చారు. క్రీ.శ. 225 ప్రాంతంలో ఇక్ష్వాకు రాజు శ్రీచాంతమాలుడు శాతవాహనులను జయించి తన సార్వభౌమాధికారాన్ని నెలకొల్పి విజయానికి గుర్తుగా అశ్వమేధ యాగం చేశాడు. శ్రీచాంతమాలుడు అతని వారసుల కాలంలో శ్రీపర్వత-విజయపురి సకల విద్యలకు, సంస్కృతులకు నిలయమై ప్రపంచ ఖ్యాతి పొందింది. క్రీ.శ.300 ప్రాంతంలో ఇక్ష్వాకులను నిర్మూలించి పల్లవులు కృష్ణాలోయ ప్రాంతాన్ని ఆక్రమించారు. నాగార్జునకొండ, మైదవోలు, ఒంగోలుల్లో లభ్యమైన తొలి పల్లవ శాసనాలను బట్టి పల్లవులు తమ స్వస్థలమైన పల్నాడు లేక పల్లవ బొగ్గ ప్రాంతంలోనే తమ పరిపాలన ప్రారంభించారని చెప్పవచ్చు. కానీ పల్లవులు కాంచీపురాన్ని రాజధానిగా చేసుకొన్న అనంతరం పల్నాడు ప్రాంతానికి వెనుదిరిగి రాలేకపోయారు. పల్లవుల అనంతరం ఆనందగోత్రజులు, విష్ణుకుండినులు గుంటూరు ప్రాంతాన్ని పరిపాలించారు. ఆనందగోత్రజులకు చెందిన నాలుగు తరాల రాజవంశీకులు విజయ కందారపుర రాజధానిగా పాలించినట్లు శాసనాధారాలున్నాయి. ఈ విజయ కందారపురాన్ని గుంటూరుకు పది మైళ్ల సమీపంలో గల కంతేరుగా గుర్తింపు పొందింది.

రాయల పాలన
ముస్లిం ప్రతిఘటనోద్యమంలో భాగంగానే క్రీశ.1336లో సంగమ వంశీకులైన హరిహర బుక్కలు విజయనగర రాజ్యాన్ని స్థాపించారు. దక్షిణాధికారి ముస్లిం పాలకుల విస్తరణను నిరోధించి, హిందూ ధర్మాన్ని దక్షిణాదిలో పరిరక్షించింది ఈ విజయనగర రాజ్యమే. స్థానిక రికార్డులను అనుసరించి విజయనగర రాజ్యస్థాపకులైన హరిహర బుక్కలు మంగళనిలయ వాసులని తెలుస్తోంది. ఈ మంగళనిలయం గుంటూరుకు 15 మైళ్ల దూరంలో ఉన్న మంగళగిరి అని చరిత్రకారుల అభిప్రాయం.క్రీ.శ. 1424లో కొండవీటిరెడ్డి రాజ్యం పతనం చెందటంతో గుంటూరు ప్రాంతం మరొక పర్యాయం వివిధ రాజ్యపాలకుల అధికార దాహానికి బలి అయింది. ఒరిస్సా పాలకులైన గజపతులు, గుల్బర్గా పాలకులైన బహమనీలు, విజయనగర పాలకులు గుంటూరు ప్రాంతాన్ని పొందటానికి ప్రయత్నించటంతో ఈ ప్రాంతం వీరి మధ్య చేతులు మారింది. చివరిగా క్రీ.శ.1515లో విజయనగర పాలకుడు శ్రీకృష్ణదేవరాయల కొండవీడులోని గజపతుల పాలకుడైన కాశవపుత్రుని ఓడించి గుంటూరు ప్రాంతాన్ని విజయనగర సామ్రాజ్యంలో విలీనం చేశాడు. కానీ క్రీ.శ. 1565లో జరిగిన తళ్లికోట యుద్ధానంతరం గుంటూరు ప్రాంతం గోల్కొండ కుతుబ్‌షాహీల పాలనలోకి వచ్చింది. వీరి పాలనలో కొండవీడు పేరును 'మూర్తుజానగర్'గా మార్చి దానికి సర్కారు స్థాయి కల్పించారు. క్రీ.శ. 1687లో మొగల్ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండను ఆక్రమించటంతో మూర్తుజానగర్ హైదరాబాద్ సుభా(మొగల్ సామ్రాజ్యంలో ఒక రాష్ట్రం)లో అంతర్భాగమైంది. హైదరాబాద్ సుభాకు నవాబుగా ఆసఫ్‌జా నిజాం-ఉల్-ముల్క్ నియమితుడయ్యాడు. క్రీ.శ.1724లో నిజాం-ఉల్-ముల్క్ హైదరాబాద్ సుభాలో స్వాతంత్య్రం ప్రకటించుకోవటంతో ఆంధ్ర దేశంలో ఆసఫ్‌జా పాలన ప్రారంభమై గుంటూరు జిల్లా వారి ఆధీనంలోకి వచ్చింది.

ఆంగ్లేయులు
కర్ణాటకలో అధికార స్థాపన కోసం ఫ్రెంచి వారికి, ఆంగ్లేయులకు జరిగిన మూడు యుద్ధాలు జరిగాయి. మూడో కర్ణాటక యుద్ధంలో (క్రీ.శ. 1757-63) ఫ్రెంచి వారు ఓడిపోవటంతో ఆనాటి నిజాం ఆంగ్లేయులతో మైత్రి వహించి 1758 సంవత్సరంలో గుంటూరు మినహా ఉత్తర సర్కారులు ఆంగ్లేయుల పరం చేశాడు. గుంటూరు జిల్లా తన సోదరుడు బసాలత్‌జంగ్‌కు మనోవర్తి జాగీరుగా ఉండగా, అతని మరణానంతరం దానిని ఇంగ్లీషు వారు పొందే విధంగా అంగీకారం కుదిరింది. ఆర్థికపరమైన ప్రాధాన్యతను గుర్తించిన ఆంగ్లేయులు దాన్ని త్వరగా పొందటానికి ఉత్సుకత చూపారు. మైసూరు పాలకుడైన హైదర్ అలీ గుంటూరును ఆక్రమించే ప్రమాదం ఉందనే మిషతో నాటి మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నరు సర్ థామస్ రాంబోల్ట్ 1779 సంవత్సరములో గుంటూరును ఆక్రమించాడు. ఈ ఆక్రమణ ఫలితంగా నిజాం, ఇంగ్లీషు వారి బంధాలు చెడిపోయాయి. నిజాం అలీఖాన్ మరాఠా నాయకుడైన నానా ఫెడ్నవీస్ నాయకత్వంలో ఏర్పడిన ఆంగ్ల వ్యతిరేక కూటమిలో చేరాడు. ఈ తరుణంలో బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ జోక్యం చేసుకొని గుంటూరు ప్రాంతాన్ని తిరిగి బసాలత్ జంగ్‌కు ఇప్పించాడు. 1782వ సంవత్సరంలో బసాలత్‌జంగ్ మరణించినా నిజాం అలీఖాన్ గుంటూరు ప్రాంతాన్ని ఆంగ్లేయులకు ఇవ్వటానికి వెనుకాడాడు. కాని లార్డ్ కారన్ వాలిన్ బెంగాల్ గవర్నర్ జనరల్‌గా గుంటూరును పొందే విషయంలో ప్రత్యేక ఉత్తర్వులతో భారతదేశానికి రావటంతో నిజాం అలీఖాన్ 1788 సెప్టెంబరు 18వ తేదీన కెప్టెన్ కన్నేవేకు గుంటూరు సర్కారును ఇచ్చి వేశాడు. ఉత్తర సర్కారులు ఆంగ్ల తూర్పు ఇండియా కంపెనీ అధీనంలోకి వచ్చిన తర్వాత వారు ఆ ప్రాంతాల్లో మొగలుల పాలనా విధానాన్నే కొనసాగించి పాత జమిందారులనే వివిధ ప్రాంతాల్లో పాలకులుగా నియమించారు. గుంటూరు జిల్లా పాలన నాలుగు జమీందారీ కుటుంబాలకు ఇచ్చారు. రేపల్లెలో మాణిక్యారావు వంశీకులు, చింతపల్లి - అమరావతిలలో వాసిరెడ్డి వంశీకులు, అట్లూరు(నరసరావుపేట)లో మాల్రాజు వంశీకులు, సత్తెనపల్లి-చిలకలూరిపేటలలో మానూరు వంశీకులు పాలకులుగా నియమితులయ్యారు. 1788-1794 సంవత్సరాల మధ్య కాలంలో గుంటూరు జిల్లా మచిలీపట్నం నుంచి కంపెనీ సలహా సంఘం రద్త్దె కలెక్టర్ పాలన కింద గుంటూరు జిల్లా ప్రత్యేక జిల్లాగా రూపొందింది. దాచేపల్లి, తుమృకోట, ప్రత్తిపాడు, మార్టూరు, మంగళగిరి, బాపట్ల, పొన్నూరు, రేపల్లె, తెనాలి, గుంటూరు, పెదకూరపాడు, కొండవీడు, నరసరావుపేట, వినుకొండ అనే 14 తాలూకాలతో ఈ జిల్లా ఏర్పాటయింది. జమిందారుల అధికారంలో జిల్లా పాలన అస్తవ్యస్తమవడం, ప్రజలపై పన్నుల భారం పెరగట, జమీందారులు దురాశపరులుగా మారటంతో 1802వ సంవత్సరంలో ఆంగ్ల తూర్పు ఇండియా కంపెనీ రైత్వారి విధానం ప్రవేశపెట్టింది. 1849 నాటికి జములన్నిటిని కంపెనీ ప్రభుత్వం సొంతం చేసుకుంది. 1788 సంవత్సరము అనంతపురం, గుంటూరు జిల్లాలో సంభవించిన విషాద ఘటనలలో చెప్పుకోదగినవి మూడు. 1816 లో పిండారీలు గుంటూరు జిల్లాపై దాడి చేసి అమరావతి, గుంటూరులతో సహా అనేక గ్రామాలను కొల్లగొట్టారు. 1823వ సంవత్సరంలో గుంటూరులో సంభవించిన గొప్ప అగ్నిప్రమాదం వల్ల బీభత్సం జరిగింది. 1832 సంవత్సరంలో గుంటూరు జిల్లా భయంకరమైన కరవు కాటకాలకు గురైంది. ఇదే డొక్కల కరవుగా పేరుపొందింది. 1859లో పరిపాలనా సౌలభ్యం నిమిత్తం గుంటూరు జిల్లాను తిరిగి కృష్ణాజిల్లాలో చేర్చారు. కానీ జిల్లా కోర్టు సహా మరికొన్ని కార్యాలయాల్ని గుంటూరులోనే ఉంచారు. తుదిగా 1904 అక్టోబరు 1న పరిపాలనా పటిష్టత నిమిత్తం తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పల్నాడు, బాపట్ల, నరసరావుపేట, వినుకొండ, రేపల్లె, ఒంగోలు తాలూకాలతో ప్రత్యేకంగా గుంటూరు జిల్లా ఏర్పాటైంది. కాని 1970లో ఒంగోలు తాలూకాను పూర్తిగాను, బాపట్ల, నరసరావుపేట, వినుకొండ తాలూకాల్లో కొన్ని భాగాలను కలిపి ప్రకాశం జిల్లా ఏర్పాటయింది.

గుంటూరు నగర చరిత్ర
గుంటూరు నగరం జిల్లాకు ప్రధాన కేంద్రం. ప్రాచీన కాలం నుంచి ఆంధ్రదేశ రాజకీయ, సాంస్కృతిక రంగాలకు అత్యంత సేవ చేసింది. ప్రాచీన పట్టణాల్లో ఒకటిగా భాసిల్లింది. జనస్తుతిననుసరించి అగస్త్యుడు వింధ్య పర్వతాల గర్వమణచి దక్షిణపథానికి వచ్చి గుంటూరులో కొంతకాలం ఉండి అగస్త్యేశ్వర విగ్రహాన్ని ప్రతిష్టంచాడు. గుండు(పెద్దశిల), గుంట(చెరువు), కుంట(ఎకరంలో 1/3 వంతు) అనే పదాల నుంచి గుంటూరు అనే పేరు వచ్చిందని అంటారు. ప్రాచీన శాసనాలలో గొంటూరు అని ప్రస్తావించారు. తూర్పు చాళుక్యరాజైన మొదటి అమ్మరాజు(క్రీ.శ.922-929) చేసిన ఈడేరు శాసనంలో గొంటూరు తొలిసారిగా పేర్కొన్నారు. విజయవాడలో లభ్యమైన గుంటూరు పల్లవుల శాసనాలలో(క్రీ.శ. 1131, క్రీ.శ.1155, క్రీ.శ.1216) గొంటూరు ప్రసక్తి ఉంది. పాతగుంటూరులోని అగస్త్యేశ్వర ఆలయంలో క్రీ.శ.1158 నాటి శాసనం ఉంది. పరిచ్ఛేది వంశానికి చెందిన పండయరాజు తన దిగ్విజయ యాత్రల సందర్భంలో గుంటూరు వచ్చి ఒంగేరు మార్గంలోని గుంటూరులో అగస్త్యేశ్వర ఆలయం నిర్మించి, దానికి ప్రాకారం, మండపం, పరివారదేవతలకు ఆలయాలు నిర్మించినట్లు ఈ శాసనం పేర్కొంటోంది. 13వ శతాబ్ధి మధ్య కాలంలో గుంటూరును నెల్లూరు పాలించు తెలుగుచోడులు ఆక్రమించి భాస్కరుని, అతని కుమారుడు కొమ్మనుని తమ పాలకులుగా గుంటూరులో నియమించారు. మహాకవి తిక్కన కొమ్మనామాత్యుని కుమారుడు. మహాకవి తిక్కన తన తండ్రి కొమ్మనామాత్యుడు గుంటూరు విభుడుగా ఉన్నట్లు ఆంధ్ర మహాభారతంలో పేర్కొన్నాడు. అలాగే తన తాత భాస్కరామాత్యుడు గుంటూరు విభుడుగు ఉన్నట్లు నిర్వచనోత్తర రామాయణంలో తిక్కన పేర్కొన్నాడు. తిక్కన గుంటూరు నుంచి నెల్లూరుకు తరలివెళ్ళి రెండో మనము సిద్ధికి ఆస్థాన కవిగా, దండనాథునిగా, అమాత్యునిగా ఉన్నాడు. ఈ విధంగా మహాకవి తిక్కన, అతని పూర్వీకులు గుంటూరు వారేనని స్పష్టమవుతోంది. గుంటూరు జిల్లాలో జాతీయతాభావం శక్తివంతంగా రూపొందటానికి, ప్రజలలో జాతీయ చైతన్యం కలిగించటానికి పాశ్చాత్య విద్య ప్రవేశం, గ్రంథాలయోద్యమం, జాతీయ సాహిత్యం, వందేమాతరం ఉద్యమం, హోంరూల్ ఉద్యమం, 1915లో గుంటూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు తదితర అంశాలు ప్రముఖంగా ప్రభావాన్ని చూపాయి. 1921-22 లో ప్రారంభమైన సహాయ నిరాకరణ ఉద్యమం నాటికి గుంటూరు జిల్లా చీరాల ఉద్యమం ద్వారా బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల స్థాయికి చేరుకొని తన శక్తి నిరూపించుకొంది. శాసనోల్లంఘన ఉద్యమంలోను, క్విట్ఇండియా ఉద్యమంలోను గుంటూరు జిల్లా వాసుల పోరాటాలు జాతీయస్థాయిలో జరిగిన ఉద్యమాలకు ఏ మాత్రం తీసిపోనివి. ఆంధ్రోద్యమానికి కూడా గుంటూరు జిల్లా ఎనలేని సేవ చేసింది. మద్రాసు ప్రెసిడెన్సీలో గల తెలుగుభాష మాట్లాడే తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పరచాలనే భావన 1911 నుంచి ప్రచారమైంది. కొండా వెంకటప్పయ్య, వింజమూరి భావనాచర్యులు, ఉన్నవ లక్ష్మీనారాయణ, సి.శేషగిరిరావు, జొన్నవిత్తుల గురునాథంతో చర్చలు జరిపి ఆంధ్రుల జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిశ్చయించారు. కొండా వెంకటప్పయ్య కార్యదర్శిగా ఒక సంఘాన్ని నియమించారు. తత్ఫలితంగా ఆంధ్ర మహాసభ ఏర్పడి దాని ప్రథమ సమావేశం 1913 సంవత్సరంలో బాపట్లలో జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావాలను, విశాలాంధ్ర ఆవిర్భావంలోనూ గుంటూరు జిల్లా నాయకులు ప్రశంసనీయమైన పాత్ర నిర్వహించి ఆంధ్రుల చిరకాల కోరికను సఫలీకృతం చేశారు.

నైసర్గిక స్వరూపం
జిల్లా ఆగ్నేయ దిక్కు డెల్టా భూములతోనూ, పశ్చిమ, ఉత్తర దిక్కులు పర్వతాలు, మెట్టభూములతోనూ, తూర్పుదిక్కున నల్లరేగడి నేలలతోనూ నిండి ఉంటుంది. జిల్లాలో నల్లమల, వెంకటాయపాలెం, కొండవీడు పర్వత శ్రేణులు పేర్కొనదగ్గవి.

నియోజకవర్గాలు
2008కు ముందు జిల్లాలో 19 నియోజకవర్గాలు, నాలుగు పార్లమెంటు స్థానాలుండేవి. 2008లో పునర్విభజనలో భాగంగా జిల్లాలోని శాసనసభ స్థానాలను 17కు కుదించారు. బాపట్ల నియోజకవర్గాన్ని మినహాయించి మూడు పార్లమెంటు స్థానాలను సుస్థిరం చేశారు. గుంటూరు పశ్చిమం, గుంటూరు తూర్పు, పత్తిపాడు, తాడికొండ, తెనాలి, పొన్నూరు, బాపట్ల, చిలకలూరిపేట, పెదకూరపాడు, వేమూరు, నరసరావుపేట, రేపల్లె, వినుకొండ, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గాలు. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంటు స్థానాలు.

విద్య

ఆంధ్రా క్రైస్తవ కళాశాల
అమెరికన్ క్రైస్తవ మిషనరీల ఆధ్వర్యంలో 1885లో ఆంధ్రా క్రైస్తవ (ఎ.సి.) కళాశాల ఏర్పాటైంది. అంతకుముందు 1842లోనే ఇది పాఠశాలగా ఏర్పాటైంది. అమెరికాకు చెందిన ఫాదర్ హయ్యర్ ఎ.సి.కళాశాలను నెలకొల్పారు. 1885లో సెకండరీ గ్రేడ్ కళాశాలగా మారిన తరువాత తమిళనాడులోని మద్రాసు విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా ఇంటర్‌స్థాయి పీయూసీ కోర్సులు ఇక్కడ ప్రారంభమయ్యాయి. తొలినాళ్లలో దీన్ని అమెరికన్ ఇవాంజిలికల్ లూథరన్ మిషనరీ కళాశాలగా పిలిచేవారు. 1928లో కళాశాల పాలకమండలి సమావేశంలో దీన్ని ఎ.సి.కళాశాలగా పేరు మార్చారు. మొదటి ప్రిన్సిపల్‌గా వుల్ఫ్ బాధ్యతల్ని నిర్వర్తించారు. కళాశాలకు ఎక్కువ మొత్తంలో విరాళమిచ్చిన అర్ధర్‌వాట్ పేరిట ఇక్కడ టవర్‌ను ఏర్పాటు చేశారు. 1926లో ఆర్ట్స్, సైన్స్ గ్రూపులతో డిగ్రీ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. తొలి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌గా హెచ్.హెచ్.స్పైస్ వ్యవహరించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1950లో తొలి భారతీయ ప్రిన్సిపల్‌గా డాక్టర్ టి.ఎస్.పాలస్ బాధ్యతలు చేపట్టారు. 1971లో పొలిటికల్‌సైన్స్, చరిత్ర సబ్జెక్టులతో పి.జి.కోర్సులు అందుబాటులోకి రావడంతో రాష్ట్రంలోనే తొలి పి.జి. కేంద్రంగా గుర్తింపు పొందింది. ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులుగా రాణించిన భవనం వెంకట్రామ్, కాసు బ్రహ్మానందరెడ్డి, నందమూరి తారక రామారావు ఇక్కడే విద్యాభ్యాసం చేశారు. వీరితోపాటు సినీ నటులు జగ్గయ్య, శోభన్‌బాబు, దర్శకులు కె.విశ్వనాథ్, వాసంతి, హస్యనటుడు సుధాకర్, జయప్రకాశ్‌రెడ్డి తదితరులు ఇక్కడ చదివినవారే కావడం విశేషం.

నదులు - ప్రాజెక్టులు

ద్వీపకల్పం పడమర నుంచి తూర్పు చివరి వరకు సాగే ప్రస్థానంలో 29 ఉపనదులను తనలో కలుపుకుంటోంది కృష్ణమ్మ. మహేబలేశ్వరంలో పుట్టిన నదీమ తల్లి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలను సస్యశ్యామలం చేసి మహబూబ్‌నగర్ జిల్లా తంగడి వద్ద ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేస్తోంది. జగ్గయ్యపేట మండలంలోని ముక్త్యాల గ్రామానికి మూడు కిలోమీటర్ల ఎగువన కృష్ణాజిల్లాలోకి అడుగిడుతోంది. మొత్తం 125 కి.మీ. మేర ప్రవహించి దివిసీమలోని హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ ఆనకట్ట ద్వారా సుమారు 14లక్షల ఎకరాల ఆయకట్టును సస్యశ్యామలమవుతోంది. జిల్లాకు తాగు, సాగు నీటి వనరు కృష్ణానదే. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణాడెల్టాను రెండుగా విభజించారు. గూంటూరు ప్రకాశం జిల్లాలకు పశ్చిమ ప్రధాన కాల్వను తాడేపల్లి సీతానగరం వద్ద నిర్మించగా, ఎడమ వైపు విజయవాడను ఆనుకుని కృష్ణా తూర్పు ప్రధాన కాల్వను నిర్మించారు. వీటిద్వారా కృష్ణ, గుంటూరు జిల్లాలే కాకుండా, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొంతమేర లబ్ధిపొందుతున్నాయి. కృష్ణా-గుంటూరు జిల్లాలకు మధ్య హద్దుగా ప్రవహించే కృష్ణా ఇరు జిల్లాల మధ్య రవాణా మాధ్యమంగా కూడా ఎంతగానో ఉపయోగపడుతోంది. జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ, కంచికచర్ల, ఇబ్రహీంపట్నం, పెనమలూరు, తోట్లవల్లూరు, ఘంటసాల, మోపిదేవి, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాలను తాకతూ కృష్ణానది ప్రవహిస్తుంది. విజయవాడ వద్ద, గుంటూరు జిల్లాలోని అమరావతి క్షేత్రం వద్ద కిలోమీటర్ల వెడల్పున అత్యంత విశాలంగా ప్రవహిస్తుంది. జిల్లాలోని వివిధ పరిశ్రమలకు ముఖ్యంగా థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఈ కృష్ణానది నీరే ఆధారం. కృష్ణా, గుంటూరులను కలిపే మూడు ప్రధాన వంతెనలు నదిపై ఉన్నాయి. అవి ప్రకాశం బ్యారేజీ, కనకదుర్గ వారధి, పులిగడ్డ-పెనుమూడి వారధి. ప్రకాశం బ్యారేజీ తర్వాత కృష్ణా నీటిని నిల్వ చేసే సౌలభ్యం లేకపోవడం ఎక్కువ నీరు సముద్రం పాలవుతోంది.

జీవనదిలా నాగులేరు
కారంపూడి యుద్ధంలో రక్తపుటేరు పారించిన నాగులేరు గురజాల, దాచేపల్లి మండలాల మీదుగా భట్రుపాలెం వద్ద కృష్ణానదిలో ప్రవహిస్తుంది. మండుటెండల్లోనూ ఇందులో నీరు ప్రవహిస్తుంటుంది. ఈ నీటి ఆధారంగా సుమారు 8 వేల ఎకరాలు భూమి సాగు చేస్తున్నారు. గురజాల, దాచేపల్లి, మాచవరం నదీ పరివాహక మండలాలు. కృష్ణానది నుంచి మోటార్ల ద్వారా పిడుగురాళ్ల పట్టణంతో పాటు పలుగ్రామాల్లో తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఓగేరు, నక్కవాగు, కుప్పగంజి వాగులు చిలకలూరిపేట, యడ్లపాడు నాదెండ్ల మండలాల పరిధిలో ప్రవహిస్తాయి. ఈ వాగుల పరిధిలో మొత్తం 169 ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేశారు. ఈ పథకాల ద్వారా మొత్తం 50 వేల ఎకరాలు సాగవుతుంది. పత్తి, మిరప, వరి, సుబాబుల్‌తోపాటుకూరగాయలు సాగుచేస్తారు.

ప్రాజెక్టులు
మానవ నిర్మిత మహా'సాగరం'
ఎంతో మంది ఉద్యమాల ఫలితమే నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం. ఎందరో మహానుభావుల త్యాగఫలితం కారణంగా నాగార్జునసాగర్ రూపకల్పన చేసుకుంది. ప్రాజెక్టు శంకుస్థాపన 1955, డిసెంబరు 10న జరిగింది. ఈ ప్రాజెక్టు కోసం ముక్త్యాల రాజా చేసిన కృషి అమోఘం. ముక్త్యాల రాజాను ప్రాజెక్టుల ప్రసాద్‌గా గౌరవభావంతో ప్రశంసించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రారంభించినప్పుడే ఎడమ కాలువకు 11 వేల క్యూసెక్కులు, కుడి కాలువకు 21 వేల క్యూసెక్కుల పరిమాణం ఉండే విధంగా ఏర్పాటు చేశారు. గత 40 సంవత్సరాలుగా 10 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. 21 వేల సామర్థ్యం ఉన్న కుడి కాలువకు ఆ స్థాయిలో నీటిని వదిలిన దాఖలాలు ఇంతవరకు లేదు. 14 వేల క్యూసెక్కులకు మించి కాలువకు నీటిని విడుదల జరగలేదు. ఆగస్టు 4, 1967లో నాగార్జునసాగర్ కాలువకు నీటిని విడుదల చేశారు. 11వ పంచవర్ష ప్రణాళికలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు రెండో దశ పనులను పూర్తిచేసి 21 వేల క్యూసెక్కుల నీటిపరిమాణాన్ని కాలువకు విడుదల చేయాలన్న కల ఇప్పటికీ నెరవేరలేదు. కుడి కాలువ కింద 11 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. అనధికారికంగా మరో 5 లక్షల ఎకరాలకు నీరు ప్రవహిస్తున్నట్లు అంచనా. కుడి కాలువ పరిధిలో గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని 65 మండలాలకు సాగు, తాగునీరు అందుతుంది.
డ్యాం పూర్తి వివరాలు
1955లో శంకుస్థాపన జరిగిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు పనులను 1967 ఆగస్టు 4న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారు. ఎడమ వైపునున్న లాల్‌బహదూర్‌కాలువ, కుడి వైపునున్న జవహర్‌కాలువకు సాగునీటిని ఆమె విడుదల చేశారు. నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణం మొత్తం పూర్తిగా ఎత్త్తెన రాతికట్టడం. మానవ ప్రయత్నానికి అపరూపమైన ప్రతీకగా అది నిలుస్తుంది. నదీగర్భంపై 400 అడుగుల ఎత్తుకు ఎటువంటి యంత్రసాయాలు లేకుండా రాళ్లను, సిమెంటు మోటార్లను ఇతర నిర్మాణ సామగ్రిని మానవ శక్తితో చేర్చారు. స్థానికంగా లభించే సర్వేబాదులను, బోల్టునట్టులతో బిగించి పరంజా తయారు చేసి వాటి ఆధారంగా పనులు చేశారు. 300 అడుగుల ఎత్తు వరకు మానవ శక్తితోనే పరంజాల మీదుగా నిర్మాణ సామగ్రి ఎత్తారు. రెండో దశలో మోనోటవర్ క్రేన్‌ను ఉపయోగించి రాళ్లను, సిమెంటు మోటారు, కాంక్రీటు బక్కెట్లను ఎత్తారు. నిర్మాణ సమయంలో ప్రతిరోజూ 15 వేల టన్నుల వరకు నిర్మాణ పదార్థాలు ఉపయోగించారు. మొదట్లో ప్రాజెక్టు అంచనా మౌలికంగా 1960 సెప్టెంబరులో కేంద్ర ప్రభుత్వం రూ. 91.12 కోట్లు వ్యయానికి మంజూరు చేసింది. 1969లో ప్లానింగ్ కమిషన్ ప్రాజెక్టును సవరించిన అంచనాలను రూ. 163.54 కోట్లు మంజూరు చేసింది. అనంతరం ప్రాజెక్టు పరిధిలో ఎన్నో మార్పులు జరిపి విస్తరించారు. 2005 నవంబరు చివరకు ప్రాజెక్టుపై వెచ్చించిన మొత్తం వ్యయం రూ.1300 కోట్లకు మించలేదు. ఎడమ కాలువకు కింద నల్గొండ, ఖమ్మ, కృష్ణా జిల్లాల్లో మొత్తం 9.76 లక్షల ఎకరాలు కుడి కాలువ కింద 11.18 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. నిర్మాణ వ్యయం పరిశీలిస్తే ఎకరాకు రూ. 6,200 మించలేదు. ప్రస్తుతం భారీ ప్రాజెక్టులు నిర్మించాలన్నా దాని వ్యయం ఎకరాలకు రూ. 80 వేల వరకు అవుతుందని అంచనా. గత 20 ఏళ్ల నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిశీలిస్తే ఆయకట్టు కింద రూ. 1500 కోట్ల విలువైన పంట రైతుల చేతికొస్తుంది. అదేవిధంగా విద్యుదుత్పాదన ద్వారా ఏడాదికి రూ. 400 కోట్ల ఆదాయం లభిస్తుంది. ప్రస్తుతం రూ. 4,444 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో నాగార్జునసాగర్ ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టుతోపాటు కుడి, ఎడమ కాలువల పూర్తిస్థాయి ఆధునికీకరణ చేయనున్నారు. కట్టల పటిష్టతతోపాటు నీరు ఇంకిపోకుండా సిమెంటు కాంక్రీటు అడుగు భాగంలో వేస్తున్నారు.
ముఖ్య వివరాలు
నీరు పొర్లే రాతికట్టడం విభాగం పొడవు (స్పిల్‌వే): 1.545 అడుగులు
డ్యాం ఎత్తు: 409 అడుగులు
ఎడమ వైపు మట్టి డ్యాం పొడవు: 8,400 అడుగులు
కుడి వైపు మట్టి డ్యాం పొడవు: 2,800 అడుగులు
స్పిల్‌వే అలుగు మట్టం: 546 అడుగులు
స్పిల్‌వే క్రస్టుగేట్లపై మట్టం: 590 అడుగులు
క్రస్టుగేట్ల సంఖ్య: 26
క్రస్టుగేట్ల పరిమాణం: 45X44 అడుగులు
డ్యాంపై రోడ్డు వెడల్పు: 30.75 అడుగులు
కుడి కాలువ పొడవు: 203 కి.మీ.
ఎడమ కాలువ పొడవు: 179 కి.మీ.
జలాశయం
డ్యాం వద్ద పరివాహక విస్తీర్ణం: 2,15,185 చదరపు కి.మీ.
పూర్తి జలాశయ మట్టం: 590 అడుగులు
నీటిని విడుదల చేయగా కనీస మట్టం: 510 అడుగులు
జలాశయ విస్తీర్ణం: 285 చ.కి.మీ. (110 చ.మైళ్లు)
విద్యుదుత్పాదన
పైపుల మధ్య మట్టం: 405 అడుగులు
పవర్ యూనిట్లు 7 (రివర్స్‌బుల్) : 100 మెగావాట్లు (ఒక్కొక్కటి)
విద్యుదుత్పాదనకు అవసరమైన కనీస జలాశయ మట్టం: 506 అడుగులు
రివర్స్‌బుల్ యూనిట్‌కి: 495 అడుగులు

డెల్టా జీవనాధారం ప్రకాశం బ్యారేజీ
ఒకప్పుడు బీడుభూములను తలపించిన డెల్టా ప్రాంతం ఇప్పుడు పచ్చని పంటలతో సస్యశ్యామలమయింది. దీనికి కారణం... సర్ ఆర్ధర్ కాటన్ 150 ఏళ్ల క్రితం కృష్ణా నదిపై విజయవాడ దగ్గర నిర్మించిన ఆనకట్టే. తర్వాత అది బ్యారేజిగా మారింది. వీటి నిర్మాణాలతోనే తెనాలి డివిజన్‌లోని కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాంత ప్రజల జీవన విధానమే మారిపోయంది. ఎందరో బ్రిటిష్ సాంకేతిక నిపుణులతో డెల్టా కాల్వలు రూపుదిద్దుకున్నాయి. మొదట 5.8 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు రూపుదిద్దుకున్న కృష్ణా ఆనకట్ట క్రమంగా పెరిగిన సాగు విస్తీర్ణానికి అనుగుణంగా మారిపోయింది. 1894లో ఆనకట్ట ఎత్తును మరో 3 అడుగులకు, 1925లో ఆరడుగులకు పెంచి, నీటి నిల్వకు గేట్లు కూడా నిర్మించారు. దీంతో సాగు విస్తీర్ణం 13.2 లక్షల ఎకరాలకు పెరిగింది. ఈ బ్యారేజి నుంచి ప్రధానంగా ఏడు కాల్వలను గుంటూరు జిల్లాలో సాగుకోసం రూపొందించారు. ఈ కాల్వల ద్వారా ప్రస్తుతం మాగాణి ప్రాంతమే 5.71 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. దీనిలో 4.99 లక్షల ఎకరాలు గుంటూరు జిల్లాలో ఉంటే, మిగిలిన ప్రాంతం ప్రకాశం జిల్లాలో ఉంది.

పులిచింతల
పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోని బెల్లంకొండ మండల పరిధిలోని పులిచింతల గ్రామం వద్ద కొత్తగా ప్రాజెక్టుని నిర్మిస్తున్నారు. తొలుత దీనిని పులిచింతల ప్రాజెక్టుగా వ్యవహరించినా తదనంతరం కానూరి లక్ష్మణరావు ప్రాజెక్టుగా నామకరణం చేశారు. ప్రకాశం బ్యారేజీకి 85 కిలోమీటర్ల ఎగువన, నాగార్జున సాగర్‌కు 115 కిలోమీటర్ల దిగువన దీనిని నిర్మిస్తున్నారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 13.8 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యం. ప్రాజెక్టు వల్ల 24,082 ఎకరాల నివాస ప్రాంతం, 2,859 ఎకరాల అటవీభూమి ముంపునకు గురవుతుంది. దీని నిర్మాణానికి ప్రభుత్వం రూ. 1249 కోట్లు కేటాయించింది. డెల్టాలో రెండోపంటకు సాగునీరు ఇవ్వడానికి నీటి నిల్వ కోసం దీనిని నిర్మిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి 2004 అక్టోబరు 15న అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. వై.ఎస్. హయాంలో చేపట్టిన జలయజ్ఞంలో తొలిగా పునాది వేసింది ఈ ప్రాజెక్టుకే. ప్రాజెక్టు నిర్మాణ పనులు దాదాపు 45 శాతం పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే జిల్లాలోని బెల్లంకొండ, మాచవరం, దాచేపల్లి మండలాల్లోని 15 గ్రామాలు ముంపునకు గురవుతాయి.
డ్యాం నిర్మాణ వివరాలు
డ్యాం పొడవు 1289 మీటర్లు
స్పిల్ వే పొడవు 754.90 మీటర్లు
నాన్ ఓవర్ ఫ్లో డ్యాం ఎడమవైపు 442.60 మీటర్లు, కుడివైపు 91.50మీటర్లు.
మొత్తం 24 గేట్లు పెడతారు.
పూర్ణ జలాశయ సామర్థ్యం 53.340 మీటర్లు 45.770 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. నీటివిడుదల కనీసమట్టం 42.670 క్రస్ట్‌లెవల్ 36.540 గరిష్ఠ వరద నీటి పరిమాణం 57,700 క్యూసెక్కులు.
120 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయవచ్చు.
వరదనీటి 20 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకునే రీతిలో దీనిని నిర్మిస్తున్నారు.
ప్రాజెక్టుపై గుంటూరు, నల్గొండ జిల్లాలను కలుపుతూ రోడ్డు నిర్మిస్తున్నారు.

నీటిపారుదల

గుంటూరు జిల్లాకు ప్రధాన నీటి వనరు కృష్ణానది. జిల్లాలోని రెండు ప్రధాన పాంతాలకూ కృష్ణమ్మ నీరే ఆధారం. డెల్టా ప్రాంతంలో బ్రిటిష్ హయాంలో రూపుదిద్దుకున్న కాల్వలు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశాయి. స్వాతంత్య్రం వచ్చాక నిర్మించిన మానవ నిర్మిత మహాసాగరం నాగార్జున సాగర్ డ్యాం పల్నాడు ప్రాంతంలోని లక్షలాది ఎకరాలను తడుపుతూ రైతు లోగిళ్లలో కాంతిని నింపుతోంది. ఆయకట్టు చివరి ప్రాంతాలు, నీటివసతి అంతగా లేని భూములకు చిన్నాచితక ఎత్తిపోతల పథకాలు నీరందిస్తున్నాయి.

పచ్చని పంటల పశ్చిమ డెల్టా
ఒకప్పుడు బీడుభూములను తలపించిన డెల్టా ప్రాంతం ఇప్పుడు పచ్చని పంటలతో సస్యశ్యామలమయింది. దీనికి కారణం... సర్ ఆర్ధర్ కాటన్ 150 ఏళ్ల క్రితం కృష్ణా నదిపై విజయవాడ దగ్గర నిర్మించిన ఆనకట్టే. తర్వాత అది బ్యారేజిగా మారింది. వీటి నిర్మాణాలతోనే తెనాలి డివిజన్‌లోని కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాంత ప్రజల జీవన వాధానమే మారిపోయంది. ఎందరో బ్రిటిష్ సాంకేతిక నిపుణులతో డెల్టా కాల్వలు రూపుదిద్దుకున్నాయి. మొదట 5.8 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు రూపుదిద్దుకున్న కృష్ణా ఆనకట్ట క్రమంగా పెరిగిన సాగు విస్తీర్ణానికి అనుగుణంగా మారిపోయింది. 1894లో ఆనకట్ట ఎత్తును మరో 3 అడుగులకు, 1925లో ఆరడుగులకు పెంచి, నీటి నిల్వకు గేట్లు కూడా నిర్మించారు. దీంతో సాగు విస్తీర్ణం 13.2 లక్షల ఎకరాలకు పెరిగింది. ఈ బ్యారేజి నుంచి ప్రధానంగా ఏడు కాల్వలను గుంటూరు జిల్లాలో సాగుకోసం రూపొందించారు. ఈ కాల్వల ద్వారా ప్రస్తుతం మాగాణి ప్రాంతమే 5.71 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. దీనిలో 4.99 లక్షల ఎకరాలు గుంటూరు జిల్లాలో ఉంటే, మిగిలిన ప్రాంతం ప్రకాశం జిల్లాలో ఉంది.

సాగునీరందిస్తున్న కాల్వలు
ప్రకాశం బ్యారేజి నుంచి మొదలయ్యే ప్రధాన కాల్వ దుగ్గిరాల వరకు వస్తుంది. అక్కడినుంచి ఆరు కాల్వలు చీలి, పశ్చిమ డెల్టాలో సాగునీటిని అందిస్తున్నాయి. వీటిలో ప్రధానంగా హైలెవల్ ఛానల్, తూర్పుకాల్వ, నిజాంట్నం కాల్వ, పశ్చిమ కాల్వ, కృష్ణా పశ్చిమ బ్యాంకు కెనాల్, కొమ్మమూరు కాల్వలు సాగునీటిని అందిస్తున్నాయి. అయితే వీటిలో కొమ్మమూరు కాల్వకు సాగునీటిని అందించటంతోపాటు ఒక ప్రత్యేకత కూడా ఉంది. దీని నుంచి ప్రకాశం జిల్లాకు పడవల ద్వారా జల రవాణా కూడా ఉండేది.

పల్నాడు వరప్రదాయిని సాగర్
జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో నాగార్జునసాగర్ కుడి ప్రధాన కాల్వ కింద పంటలు సాగు చేస్తారు. ప్రధానంగా వరి పంట సాగవుతుంది. కుడికాల్వ పొడవు 126 మైళ్లు. 0వ మైలు నుంచి 83వ మైలు వరకూ మాచర్ల, గురజాల, నరసరావుపేట, వినుకొండ, చిలకలూరిపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు, నియోజకవర్గాల రైతులు సాగర్ జలాలతో పంటలు సాగుచేస్తారు. జిల్లాలోని నరసరావుపేట, మాచర్ల, గురజాల, చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు నియెజకవర్గాల్లో ప్రధాన కుడి కాల్వ (నాగార్జున సాగర్ జవహర్‌లాల్ నెహ్రూ రైట్ కెనాల్) కింద గుంటూరు బ్రాంచి కెనాల్, బెల్లంకొండ బ్రాంచి కెనాల్, అద్దంకి బ్రాంచి కెనాల్, పెదనందిపాడు బ్రాంచి కెనాల్, పమిడిపాడు బ్రాంచి కెనాల్స్ ద్వారా మేజరు కాలువలకు, వాటి నుంచి మైనరు కాలువల ద్వారా సాగర్ జలాలు పంట భూములకు చేరుతున్నాయి.

అతి పెద్ద చెరువు దొండపాడు
వినుకొండ నియోజకవర్గంలో చెరువులు కొన్ని గ్రామాల్లో సాగుకు ఉపకరిస్తున్నాయి. ఇందులో ప్రధానమైన వాటిలో దొండపాడు ఒకటి. జిల్లాలో అతిపెద్ద చెరువు. కొండల మధ్య సహజ నీటితోపాటు సాగర్ కాల్వల సీపేజీ నీరు అందులో చేరుతోంది. ఏడాది పొడవునా నీరు ఉంటుంది. సుమారు వెయ్యి ఎకరాలకు ఆయకట్టు సాగవుతుంది. ఆ తరువాత పెదకంచర్ల చెరువు ముఖ్యమైన వాటిలో ఒకటి. సుమారు 1500 ఎకరాలకు సాగునీరు సరఫరా అవుతోంది. కొంకేరు వాగునీరు చేరుతోంది. రెండేళ్ల క్రితం సుమారు కోటిన్నర రూపాయల ఖర్చుతో అభివృద్ధి పనులు చేశారు. ఈపూరు చెరువు కొండల అంచున ఉంది. దీని ద్వారా 500 ఎకరాలు సాగు చేస్తున్నారు. ఏడాది పొడవునా నీరు నిల్వ ఉంటుంది. కెనాల్స్ సీపేజీ నీరు చెరువుకు చేరుతోంది. ఇవి కాకుండా నియోజకవర్గంలో మరో 50 చెరువులు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో 16 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వాటి ద్వారా 10వేల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. గుండ్లకమ్మ, కొంకేరు వాగుపైన ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. మళ్లింపు పథకాలు సేద్యానికి ఉపకరిస్తున్నాయి.

ప్రధాన పంటలు

కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని ఆయకట్టులో మాగాణి, మెట్ట భూములున్నాయి. మాగాణిలో 4.99 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ వరి ఏటా సాగవుతోంది. ఈ విస్తీర్ణంలోనే రబీలో 2.5 లక్షల ఎకరాల వరకు మొక్కజొన్న, మినుము, వేరుశనగ పంటలు పండుతున్నాయి. మినుము పంట అమృతలూరు, చుండూరు, రేపల్లె, నగరం మండలాల్లో సాగులో ఉంటే, చెరుకుపల్లి, బాపట్ల, పిట్టలవానిపాలెం, కర్లపాలెం మండలాల్లో వేరుశనగ సాగవుతోంది. ఇదికాక ప్రధానంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో తాడేపల్లి మొదలుకుని దుగ్గిరాల, కొల్లిపర, మంగళగిరి, కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల్లో సుమారు లక్ష ఎకరాల వరకు వాణిజ్య పంటలు పండే మెట్ట భూములున్నాయి. ఈ ప్రాంతంలో అరటి 28వేల ఎకరాల్లో, మరో 21వేల ఎకరాల్లో పసుపు, కంద 12వేల ఎకరాల్లో, తమలపాకు 600 ఎకరాల్లో సాగువుతోంది. నిమ్మ తోటలు మరో 2500 ఎకరాల్లో, కూరగాయలు 5600 ఎకరాల్లో, మిగిలిన పంటలు మరో 30వేల ఎకరాల్లో సాగవుతున్నాయి. వీటిలో అరటి, కంద, పసుపు పంటలు అన్ని మండలాల్లో పండిస్తుంటే, తమలపాకు కొల్లూరు, భట్టిప్రోలు, పొన్నూరు మండలాల్లోనే ఎక్కువగా సాగు చేస్తున్నారు. మాగాణి ప్రాంతం ఎక్కువ శాతం కాల్వల ఆధారంగానే సాగవుతుంటే, సుమారు 80వేల ఎకరాల్లో వరి బోర్ల కిందకూడా సాగు చేస్తున్నారు. మెట్ట పంటలు మాత్రం పూర్తిగా భూగర్భ జలాలపై ఆధారపడే పండిస్తుంటారు. నాగార్జున సాగర్ కుడి కాల్వ కింద గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో 11,17,760 ఎకరాల్లో వరి, పత్తి, మిర్చి, పసుపు, మొక్కజొన్న తదితర పంటలు పండిస్తున్నారు. నరసరావుపేట డివిజనులో వెల్దుర్తి, మాచర్ల, నకరికల్లు, బొల్లాపల్లి మండలాల్లో బోర్ల కింద వరి, పత్తి, మిర్చి పంటలు సాగు చేస్తారు. కుడికాల్వ పరిధిలో మాచర్ల, వినుకొండ, గురజాల, సత్తెనపల్లి, పెదకూరపాడు, నరసరావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో 4,21,313 ఎకరాల్లో వరి సాగవుతుంది. 2,50,967 ఎకరాల్లో మిర్చి, పత్తి, కంది తదితర వాణిజ్య పంటలు పండిస్తున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో నాదెండ్ల, యడ్లపాడు, చిలకలూరిపేట మండలాల్లో కుప్పగంజి, ఓగేరు, పసుపులేరు వాగులపై ఎత్తిపోతల పథకాల ద్వారా అత్యధిక శాతం వాణిజ్య పంటల్ని సాగు చేస్తున్నారు.

గుంటూరు మిర్చియార్డు
గుంటూరు పేరు చెప్పగానే గుర్తొచ్చేది మిర్చి. ఆ మిర్చియే గుంటూరు పేరును విశ్వవ్యాప్తం చేసింది. ఆసియా ఖండంలోనే పెద్ద మిర్చి మార్కెట్‌గా గుర్తింపు పొందిన ఈ యార్డు ఏడాది సుమారు రూ.600 కోట్ల లావాదేవీలు జరుపుతోంది. సుమారు 12 వేల మంది శ్రామికులు ప్రత్యక్షంగా, మరో 12 వేల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. అయిదో నెంబర్ జాతీయ రహదారి, నరసరావుపేట ప్రధాన రహదారుల మధ్య 50 ఎకరాల స్థలంలో మార్కెట్‌యార్డు ఉంది. మిర్చి క్రయవిక్రయాల ద్వారా యార్డుకు రూ.40 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. 1950లో మార్కెట్ సెంటర్ సమీపంలోని ఏలూరు బజారులో మిర్చి మార్కెట్ మొదలైంది. అనంతరం వ్యాపారస్థాయి పెరగడంతో ఏటుకూరు రోడ్డులో సహకార సంఘాల గోదాములకు మార్కెట్ తరలింది. తర్వాత చుట్టుగుంట సెంటర్‌లో మార్కెట్ కమిటీ ఆవిర్భవించి విక్రయాలు జరిగాయి. మలేసియా, సింగపూర్, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్ దేశాలకు గుంటూరు నుంచి మిర్చి ఎగుమతులు జరుగుతున్నాయి. 49 ఏళ్ల కిందట రాష్ట్రంలోని భద్రాచలం, ఖమ్మం, నల్గొండ, జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో రెంటచింతల, గురజాల తదితర ప్రాంతాల్లో మిర్చి సాగయ్యేది. మిర్చి యార్డులో లావాదేవీలు పెరిగిన తర్వాత సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది.

పొగాకుబోర్డు
గుంటూరులో పొగాకు బోర్డును 1976లో స్థాపించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా దీనిని నెలకొల్పారు. మొదట్లో కేవలం రైతుల రిజిస్ట్రేషన్ మాత్రమే జరిగేది. అప్పట్లో పొగాకును ప్రవేటు సంస్థలు కొనుగోలు చేసేవి. సరిగ్గా డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడేవారు. రెండు, మూడు సంవత్సరాల వరకు చెల్లింపులు సరిగ్గా జరిగేవి కాదు. రఘురామయ్య మంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర కార్యాలయం ద్వారా ఆక్షన్ ప్లాట్‌ఫారాలు ఏర్పాటు చేయించారు. వాటి ద్వారా పొగాకు కొనుగోలు చేయించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. రైతులు నష్టపోకుండా కొనుగోలు జరిగిన 40 రోజుల్లోగానే సొమ్ము ఇప్పించారు. 1985లో పూర్తిస్థాయిలో ఆక్షన్ ప్లాట్‌ఫారాలు ఏర్పాటు చేశారు. మొదట్లో కేవలం 15 మిలియన్ కిలోల పంట పండేది. ప్రస్తుతం దానిని 170 మిలియన్ కిలోలకు పెంచారు. ప్రస్తుతం 30 ఆక్షన్ ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. నందిగామ, భద్రాచలం, గోదావరి జిల్లాలు, పొదిలి, కలిగిరి, కందుకూరు, వెల్లంపల్లి ప్రాంతాల్లో ఆక్షన్ ప్లాట్‌ఫారాలు ఏర్పాటు చేశారు. బోర్డు ఏర్పాటు సమయంలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారో ఇప్పటికీ అంతే మంది ఉన్నారు. ఉద్యోగుల సంఖ్య 750 మంది.

కోస్తాలో ఏకైక పసుపు యార్డు
దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ యార్డు కోస్తా జిల్లాల్లోనే ఉన్న ఏకైక పసుపు మార్కెట్ యార్డు. 1979 వరకూ తెనాలి యార్డులో కలిసి ఉండి 1980లో వేరుపడింది. దేశంలో ఎక్కడా లేని విధంగా కొన్ని ప్రత్యేకతలు దుగ్గిరాల యార్డుకు ఉన్నాయి. రైతులు పసుపు తెచ్చిన తర్వాత ఇక్కడ అమ్మకానికి పోస్తారు. వాటిని రైతు సమక్షంలో వేలం వేస్తారు. వ్యాపారులు వేలంలో సరకు కొన్న తర్వాత కూడా ఆ ధర నచ్చకపోతే అమ్ముకోకుండా అట్టిపెట్టుకుని, మంచి ధర వచ్చాక అమ్ముకునే అవకాశం రైతుకు ఉంది. దీనికి తోడు ఏ రోజు కొన్న సరకుకు అదే రోజు ఇక్కడే నగదు చెల్లించేస్తారు. ఏడాది పొడవునా యార్డులో క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. సాలీనా 2.50 లక్షల బస్తాల పసుపు ఇక్కడకు వస్తుంది. కడపలో మార్కెట్ యార్డు ఉన్నా కూడా ఎక్కువ మంది రైతులు ఇక్కడకే సరకు తెస్తారు. అక్కడ కమీషన్ వ్యాపారం, నగదు కూడా 15 రోజులు తర్వాత ఇచ్చే పరిస్థితులు అక్కడ ఉండటంతో కడప, కర్నూలు నుంచి కూడా సరకు తెస్తారు. కడప, టేకూరుపేట, దుగ్గిరాల, సాంగ్లీ రకాలు ఇక్కడకు వస్తూంటాయి. యార్డుకు సరకు తెచ్చే రైతులకు ఉచిత భోజన వసతి ఇక్కడ ఉంది. సరుకు అమ్ముకున్న వారికే ఈ పథకం వర్తిస్తుంది.

పర్యాటకం

సంప్రదాయానికి హారతి.. 'గుంటూరు తిరుపతి'
బృందావన గార్డెన్స్ ఐదో లైనులోని శ్రీకంచికామకోటి పీఠ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం పన్నెండు సంవత్సరాల కిందట స్థాపితమైంది. పాలకమండలి ఎన్నో వ్యయప్రయాసల కోర్చి గుంటూరుకే గర్వకారణంగా నిలిచేలా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దింది. ఆలయం తరఫున మాధవసేవతో పాటు మానవసేవ కూడా చేయడం విశేషం.
తిరుమలలోలాగే...
ఈ ఆలయంలో జరిగే పూజాదికాలు, ఉత్సవాలు అన్నీ దాదాపు తిరుమలలో జరిగే ఉత్సవాలను పోలి ఉండటంతో ఈ ఆలయానికి గుంటూరు తిరుపతి అనే పేరును భక్తులు నిర్థరించారు. సంవత్సరం పొడవునా జరిగే ఉత్సవాల తీరు తిరుమల ఉత్సవాలను పోలి ఉండేలా ఆలయ పాలకమండలి తగిన పథక రచన చేసింది. నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. స్వామివారికి కావాల్సిన ఆభరణాలు, అలంకారాలన్నీ భక్తులు సమకూర్చారు. శ్రీకంచికామకోటి పీఠానికి దత్తత ఇచ్చారు. కంచి పీఠాధిపతి జయేంద్రసరస్వతి ఆశీస్సులతో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుంటాయి.

మంగళాద్రి క్షేత్రం
గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీలక్ష్మీనృసింహ స్వామి దివ్య క్షేత్రానికి 550 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ క్షేత్రంలో కొలువై ఉన్న మంగళగిరి శ్రీపానకాల శ్రీలక్ష్మీనృసింహస్వామి వార్లను అత్యంత మహిమాన్వితునిగా భక్తులు విశ్వసిస్తారు. అనేక చారిత్రక ఆధారాలు ఇక్కడ ఉన్నాయి. శ్రీకృష్ణ దేవరాయ కాలంనాటి శాసనాలు మంగళగిరిలో కనిపిస్తాయి. విజయనగర సామ్రాజ్యం పతనమైన తర్వాత మంగళగిరి ముస్లిముల పాలనలోకి వచ్చింది. 1568లో వీరి పాలనలో అధిక పన్నులు భరించలేక ప్రజలు మంగళగిరి వదిలి మచిలీపట్నం, నిజాంపట్నాలకు వలస వెళ్ళారు. నల్గొండ సుల్తాను ఈ పరిస్థితి గమనించి తన సేనాపతి ఆలీని పంపి ఎలాంటి పన్నులు విధించబోమని హామీ ఇచ్చి వలసపోయిన ప్రజల్ని తిరిగి మంగళగిరికి రప్పించినట్టు పట్టణం మధ్యలో ఉన్న శాసన స్తంభం మీద పారశీక భాషలో లిఖించి ఉంది. 1780లో హైదర్ఆలీ సైన్యంతో పట్టణాన్ని కొల్లగొట్టారని, 1816లో దారి దోపిడీ దొంగలు మరోసారి మంగళగిరి పట్టణాన్ని దోచుకున్నారని చరిత్ర ఆధారాలతో శాసనాలు ఉన్నాయి. 1892లో డొక్కల కరవు వచ్చి ప్రజలు అష్టకష్టాలకు గురయ్యారు. విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు కొండవీడును జయించిన విజయగాథ పానకాల స్వామి మెట్లదారిలో శాసనంగా దర్శనమిస్తోంది. ఒరిస్సా దేశపు రాజు సిదరాజు రాజయ్యదేవర శ్రీపానకాల శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవస్థానాలకు 28 గ్రామాల్లో 394 ఎకరాల భూమి విరాళం ఇచ్చినట్లు గరుడాళ్వారు ఆలయానికి ఉత్తరాన శాసనంలో రాసిఉంది.

200 ఏళ్ళనాటి రాజగోపురం, దివ్యరథం
ఆలయానికి తూర్పున శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు 1807లో నిర్మించిన తూర్పు రాజగోపురం 152 అడుగుల ఎత్తున ఉండి 11 అంతస్తులుంటుంది. పునాది వద్ద వెడల్పు తక్కువ, ఎత్తయిన గాలిగోపురాన్ని ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్‌తో చరిత్రకారులు పోల్చారు. కల్యాణ మూర్తుల గ్రామోత్సవం కోసం రెండు వందల ఏళ్ళనాటి దివ్యరథం ఇక్కడ ఉంది. సుమారు 30 అడుగుల ఎత్తు కలిగిన రథం చుట్టూ భారత, భాగవత గాథలు తెలిపే చిత్రాలు చెక్కి ఉన్నాయి.
శ్రీలక్ష్మీ కల్యాణ పుష్కరిణి
శ్రీలక్ష్మీనృసింహస్వామికి తెప్పోత్సవం నిర్వహించటానికి ఆలయం పక్కనే శ్రీలక్ష్మీ కల్యాణ పుష్కరిణి (పెద్దకోనేరు) ఉంది.

ప్రముఖ శైవక్షేత్రం అమరారామం
అమరావతిలో పంచారామాల్లో మొదటిదైన అమరేశ్వర ఆలయం ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం గుంటూరుకు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆలయంలో సోమవారం మహరుధ్రాభిషేకం, నిత్య అభిషేకాలు, సాయంత్రం మంత్రపుష్ప పూజలు జరుగుతాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇక్కడ గదులు అద్దెకు ఇస్తారు. ఇదే గ్రామంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ధ్యానబుద్ధ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. పురావస్తు శాఖ మ్యూజియం ఉంది. రాజావాసిరెడ్డి వెంకటాద్రినాయుడు కట్టించిన అనేక పురాతన ఆలయాలు ఉన్నాయి.

శైవక్షేత్రం కోటప్పకొండ
నరసరావుపేట నియోజకవర్గంలో ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ. రాష్ట్ర ప్రభుత్వం ఏటా మహాశివరాత్రికి ప్రభుత్వ పండుగగా గుర్తింపు ఇచ్చింది. నరసరావుపేటకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ కొలువుదీరిన శివుడుని దక్షణామూర్తిగా భావిస్తారు. అభిషేకం రూ. 250, దర్శనం రూ. 5, అర్చన టిక్కెట్ రూ. 5 ఉంటుంది.

విజ్ఞానం.. వినోదం కలబోత హాయ్‌ల్యాండ్
విజ్ఞానంతోపాటు వినోదం కూడా అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన బుద్ధిజం థీమ్ పార్కు హాయ్‌ల్యాండ్. విజయవాడ, గుంటూరు నగరాల నడుమ మంగళగిరి మండలం చినకాకాని గ్రామపరిధిలో సువిశాల 40 ఎకరాల విస్తీర్ణంలో హాయ్‌ల్యాండ్‌ను ఏర్పాటు చేశారు. 2010 మే 9న అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.రోశయ్య హాయ్‌ల్యాండ్‌ను ప్రారంభించారు. సన్‌ప్లాజా, చైనా, కాంబోడియా, థాయ్‌ల్యాండ్, టిబెట్, బర్మా, ఇండోనేసియా, జపాన్ జోన్లుగా నామకరణం చేశారు. ఆయా దేశాల సంస్కృతి ప్రతిబింబించేలా కట్టడాలను తీర్చిదిద్దారు. స్త్రీ, పురుషులు, పిల్లలకు ప్రత్యేకంగా జలక్రీడలు (వాటర్‌గేమ్స్) ఉన్నాయి. వేవ్‌పూల్, లేజీరివర్, రెయిన్ డ్యాన్స్ వంటివి సరదా కలిగిస్తాయి. రైల్‌ఛేజ్, గోస్ట్ హంటర్, మ్యాజిక్ డ్యాన్సర్, బఫింగ్‌కార్స్, ఫ్త్లెయింగ్ ఎలిఫెంట్, ప్రైవేట్‌షిప్, క్రేజీజంప్ స్వింగ్ ఏరియంట్, ఫ్యామిలీ ట్రైన్, గోకార్టింగ్, వీడియోగేమ్స్ వినోదాన్ని పంచుతాయి. అన్ని విభాగాలకు మధ్యలో ఫుడ్‌కోర్టు ఉంది. వివిధ రకాల భారతీయ వంటకాలు ఘుమఘుమలాడతాయి. చైనాబజార్ తరహాలో షాపింగ్ మాల్స్ ఉన్నాయి. రిసార్ట్స్ విభాగంలో మొత్తం 61 అధునాతన కాటేజీలు పర్యాటకుల కోసం ఏర్పాటు చేశారు. హాయ్‌ల్యాండ్‌లో ఆయుర్‌సుఖ్ ఆరోగ్యగ్రామాన్ని 2011 ఏప్రిల్ 9న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి సుభోద్ కాంత్ సహాయ్ ప్రారంభించారు. పంచకోశ, పంచకర్మ, త్రికాయ చికిత్సలతో పాటు, యోగా, ఫిజియోథెరపీ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. 20 లగ్జరీ కాటేజీలు చికిత్సలు పొందే వారికోసం సిద్ధం చేశారు.

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉండవల్లి గుహలు
ఏనాడు ఏ శిల్పీ కన్నాడో ఈ కలనూ.. ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఆ కళనూ.. అంటూ ఓ సినీ గేయరచయిత రాసిన మాటలు ఉండవల్లి గుహాలయాలను చూస్తే నిజమేననిపిస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఉండవల్లి గుహలు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో ఓ కొండలో ఏకశిలపై చెక్కి ఉన్నాయి. అజంతా, ఎల్లోరా శిల్పాలను తలదన్నే కళా నైపుణ్యం ఉండవల్లి గుహల్లో నిక్షిప్తమై ఉంది. దక్షిణ భారతదేశంలోని అత్యంత చారిత్రాత్మకమైన ఈ గుహలు క్రీ.శ. 2, 3 శతాబ్దంలో బౌద్ధమత ప్రచారం జరుగుతున్న రోజుల్లో వీటిని నిర్మించారు. ఆనంద గోత్రికులు పరిపాలన కాలంలో, విష్ణుకుండిన రాజు గోవిందరాజవర్మ బౌద్ధ బిక్షువుల కోసం ఈ గుహలను నిర్మించారని ప్రతీతి. నాలుగు అంతస్తులుగా చెక్కిన గుహల్లో 64 స్తంభాలతో ఖానాలుగా మలిచారు. మొదటి అంతస్తులో 14 గుహలున్నాయి. త్రిమూర్తుల విగ్రహాలు చెక్కి ఉన్నాయి. రెండో అంతస్తులో అనంతశయన శ్రీమహా విష్ణువు ఆలయముంది. ఇందులో ఐదడుగుల వెడల్పు, 19 అడుగుల పొడవుగల అనంత పద్మనాభస్వామి ఏకశిలా విగ్రహం శయనించినట్లు ఉంటుంది. మూడో అంతస్తులో త్రికూటాలయం ఉంది. వీటిపై శిల్పకళలు చాళుక్యుల కాలం నాటివిగా చెబుతారు. ఉండవల్లి నుంచి మంగళగిరిలోని పానకాల లక్ష్మీనృసింహస్వామి కొండవరకు తొమ్మిది కిలోమీటర్లు సొరంగ మార్గం ఉందని చరిత్ర ద్వారా తెలుస్తోంది.. మునీశ్వరులు, బౌద్ధ భిక్షువులు కృష్ణానదిలో స్నానాలు చేసి ఉండవల్లి గుహల్లో నుంచి ఉన్న సొరంగమార్గం ద్వారా మంగళగిరిలోని కొండపైన పానకాలస్వామిని దర్శించుకునేవారని చరిత్ర స్పష్టం చేస్తోంది. 6, 7 శతాబ్దాల కాలం వరకు ఈ గుహలు రాజపోషణలో ఉన్నాయి. 1529లో (16వ శతాబ్దం) శ్రీకృష్ణ దేవరాయల పాలనలోకి వచ్చాయి. ఈ గుహాలయాలు వివిధ రాజుల కాలంలో అనేక మార్పులకు లోనైనట్లు పురావస్తుశాఖ దస్త్రాల్లో ఉంది. ఈ గుహలకు ఉన్న స్తంభాలపై పూర్ణకుంభం చిత్రించి ఉంటుంది. దీనినే అనంతర కాలంలో రాష్ట్ర ప్రభుత్వ చిహ్నంగా గుర్తించినట్లు చెబుతారు. 1959లో గుహాలయాలు పురావస్తు శాఖ ఆధీనంలోకి వచ్చాయి.

భవానీ ఐలాండ్
గుంటూరు, కృష్ణా జిల్లాలకు సరిహద్దు ప్రాంతమైన కృష్ణానది పరవళ్ళ మధ్యలో భవానీ ద్వీపం విస్తరించి ఉంది. ఈ ద్వీపాన్ని సందర్శించాలంటే మూడు కిలోమీటర్లు కృష్ణానది నీటిలో మెకనైజ్డ్ బోట్ల ద్వారా ప్రయాణించాలి. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరంలో పర్యాటక సంస్థ బోటులను ఏర్పాటు చేసింది. ఐలాండ్‌లో ఏసీ కాటేజీలు నిర్మించారు. 26 కాటేజీల్లో 24 ఏసీ, మిగిలినవి ట్రీకాటేజీ (ఒంటి స్తంభం గది)లు నిర్మించారు. యాత్రికులు బస చేసేందుకు అనువుగా వీటిని నిర్మించారు. ఏసీ కాటేజీ అద్దె రూ.2100, ట్రీ కాటేజీ రూ.1560, చిన్నారుల ఆటపాటల కోసం అడ్వంచర్ గేమ్స్ సదుపాయముంది. పర్యటకులను ఆకర్షించే విధంగా ఐలాండ్‌లో 40 అడుగుల ఆకర్షణీయమైన ద్వీపస్తంభాన్ని (టవర్) నిర్మించారు. దీనిపై జీవకళ ఉట్టిపడే పలురకాల బొమ్మలున్నాయి.

నాగార్జునసాగర్
మాచర్ల నుంచి 25 కి.మీ. దూరంలోని నాగార్జునసాగర్‌కు ప్రతి అరగంటకు బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది. హైదరాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్, భద్రాచలం బస్సులు మాచర్ల నుంచి సాగర్ మీదుగా వెళ్తుంటాయి. గుంటూరు నుంచి మాచర్లకు బస్సుకైతే రూ. 70, రైలుకైతే రూ. 20 ఛార్జి చెల్లించాలి. మాచర్ల చేరుకున్న తరువాత ఆర్టీసీ బస్సులో రూ. 15 ఛార్జి చెల్లించి సాగర్ చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి 150 కి.మీ దూరంలో నాగార్జునసాగర్ ఉంది. బస్సుకు రూ. 110 ఛార్జి. ఎత్తిపోతల, అనుపు, నాగార్జునకొండ మ్యూజియానికి మాచర్ల నుంచి వెళ్లేందుకు ఆర్టీసీతోపాటు ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి.

పరిశ్రమలు

జిల్లాలో పరిశ్రమల్లో ప్రధానమైనది సిమెంటు పరిశ్రమ. పల్నాడులో సిమెంటు తయారీకి అవసరమైన ఖనిజ సంపద నిక్షిప్తమై ఉంది. మాచర్ల పట్టణంలో కేసీపీ, ఎల్‌సీకే, కారంపూడి శ్రీచక్ర, సత్రశాల పరాశక్తి సిమెంటు కర్మాగారాలు చెప్పుకోదగినవి. గురజాల నియోజకవర్గంలో 12 వేల హెక్టార్లలో సిమెంటు తయారీకి ఉపయోగించే ఖనిజ సంపద ఉంది. గతంలో ఇక్కడ ఆంధ్రా సిమెంట్స్ కర్మాగారం ఉండేది. ప్రస్తుతం అది మూతపడింది. కొత్తగా సిమెంటు కర్మాగారాల స్థాపనం కోసం పలు సంస్థలు ఆరువేల ఎకరాలు కొనుగోలు చేశాయి. మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో సుమారు 20 వేలమందికి పైగానే కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా సిమెంటు పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు.

ఇతర పరిశ్రమలు
నరసరావుపేట ప్రాంతంలో రైస్‌మిల్లులు, దాల్‌మిల్లులు ఎక్కువగా ఉన్నాయి. పశుదాణాకు సంబంధించి ఒక పరిశ్రమ ఉంది. నాపరాయి రంగంపై మరో 10 వేల మంది బతుకుతున్నారు. చెరుకుపల్లి మండలంలో ఇటీవల కాలంలో ఎన్.ఎస్.ఎల్. టెక్స్‌టైల్స్ ప్రారంభించారు. డెల్టా ప్రాంతంలో ఇది చాలా పెద్ద పరిశ్రమ. ఇది పూర్తిస్థాయిలో దుస్తులు తయారు చేయగలిగిన పరిశ్రమ కావడం విశేషం. దాచేపల్లి, పిడుగురాళ్లలో కోళ్లదాణా తయారు చేసే పల్వరైజింగ్ మిల్లులు 42 వరకు ఉన్నాయి. సున్నం పరిశ్రమ, పల్వరైజింగ్ పరిశ్రమల్లో 10 వేల మంది కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు.