close

ఏపీపీఎస్సీ > ఇంట‌ర్వ్యూలు

'గ్రూప్‌-2'కూ ప్రిలిమ్స్‌!

* 50వేల కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే రెండు పరీక్షలు
* కొత్త సిలబస్‌కు తుదిమెరుగులు
* ఓటీపీఆర్‌ తప్పనిసరి
* 'ఈనాడు'తో ఏపీపీఎస్సీ అధ్యక్షుడు ఉదయ్‌భాస్కర్‌

ఈనాడు, హైదరాబాద్: ఉద్యోగాల కోసం 50వేల మంది అభ్యర్థుల కంటే ఎక్కువ మంది దరఖాస్తుచేసే పరీక్షలకు ప్రిలిమ్స్, మెయిన్స్ తరహాలో పరీక్షలు నిర్వహించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఏపీపీఎస్సీ అధ్యక్షుడు ఆచార్య ఉదయ్‌భాస్కర్ తెలిపారు. అర్హత పరీక్షగా ప్రాథమిక పరీక్ష (ప్రిలిమ్స్) ఉంటుందని, ఉద్యోగాల సంఖ్యను అనుసరించి అభ్యర్థుల్ని 1:50 నిష్పత్తిలో మెయిన్స్ రాసేందుకు అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. ఈ విధానం ఇప్పటికే గ్రూప్-1లో ఉందని వెల్లడించారు. ప్రిలిమ్స్, మెయిన్స్ విధానంలో పర్యవేక్షణ, పారదర్శకత పెరుగుతుందని ప్రకటించారు. ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఉదయ్‌భాస్కర్ 'ఈనాడుతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లో...!
2 నెలల్లోగా ఉద్యోగ ప్రకటనలు
ఉద్యోగ ఖాళీల వివరాలు అందిన నెల నుంచి రెండునెలల్లోగా ప్రకటనలు జారీచేస్తాం. ఖాళీల వివరాలతోపాటు సామాజిక వర్గాల వారీగా ఆయా శాఖల నుంచి సమాచారం అందాల్సి ఉంది. దీనిపై ఆయా శాఖల అధికారులను సంప్రదిస్తున్నాం. గ్రూప్-1లో మాదిరిగా గ్రూప్-2 పరీక్షకూ ప్రిలిమ్స్, మెయిన్స్ నిర్వహించాలని యోచిస్తున్నాం. ఈ ఉద్యోగాలకే కాకుండా పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాల భర్తీకి కూడా లక్షలాది దరఖాస్తులు వస్తాయి. దీనివల్ల 50వేల మంది కంటే ఎక్కువ దరఖాస్తుచేసే ఏ ఉద్యోగాలకైనా ప్రిలిమ్స్, మెయిన్స్ నిర్వహించాలన్నది మా ఆలోచన. మెయిన్స్ కూడా బహుళైచ్ఛిక (అబ్జెక్టివ్) ప్రశ్నల తరహాలోనే ఉంటుంది. త్వరలోనే దీనిపై అధికారిక నిర్ణయాన్ని తీసుకుంటాం. ఈ పరీక్షలనూ ఆన్‌లైన్‌లో నిర్వహించాలన్నది మా ఆలోచన. ఇప్పటికే శాఖాపరమైన పరీక్షలను ఆన్‌లైన్‌లోనే నిర్వహించాం.
దాదాపుగా సిలబస్ ఖరారు!
గ్రూపు-1, గ్రూపు-2, గ్రూపు-4 ఉద్యోగాల కోసం కొత్త సిలబస్ దాదాపుగా ఖరారైంది. నమూనా సిలబస్‌ను అందుబాటులో ఉంచగా అన్ని వర్గాల వారి నుంచి 1200 వరకు అభ్యంతరాలు, సలహాలు, సూచనలు వచ్చాయి. వీటిని నమూనా సిలబస్‌ను తయారుచేసిన వారు కాకుండా కేంద్రీయ, ఇతర విశ్వవిద్యాలయాలకు చెందిన నిష్ణాతులచే పరిశీలన చేయించాం. వీరు అదనపు అంశాలతోపాటు కొన్ని అంశాల్ని తొలగిస్తూ సబ్జెక్టుల వారీగా నివేదికలు సమర్పించారు. వీటికి తుది మెరుగులు దిద్దుతున్నాము. నిష్ణాతులు సమర్పించి నివేదికల్లో 95%కుపైగా మార్పులు ఉండకపోవచ్చు. త్వరలో కొత్త సిలబస్‌ను అభ్యర్థులకు అందుబాటులోకి తెస్తాం.
గ్రూప్-1 ప్రకటన జారీకి కాస్త సమయం!
ప్రభుత్వం నుంచి గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ వివరాలు అందినా ప్రకటన జారీచేసేందుకు కొంత సమయం పడుతుంది. ఎందుకంటే 2011 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ ప్రకటన ద్వారా ఉద్యోగాల భర్తీ ఇప్పటివరకు పూర్తికాలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జారీచేసిన ఈ ప్రకటనను అనుసరించి నిర్వహించిన ప్రిలిమ్స్ ప్రశ్నపత్రంలో తప్పులు దొర్లాయి. దీనిపై సుప్రీంకోర్టు మళ్లీ మెయిన్స్ నిర్వహించాలని.. జరిగిన ఇంటర్వూలను రద్దుచేయాలని ఆదేశించింది. రాష్ట్ర విభజన జరిగినందున తదుపరి చర్యలు ఎలా తీసుకోవాలన్న దానిపై సుప్రీంకోర్టును వివరణ కోరాం. సుప్రీంకోర్టు ఆదేశాలను ఏపీపీఎస్సీ అమలుచేయడంలేదని, కోర్టు ధిక్కరణ జరుగుతోందని పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీటి అన్నింటీపై ఒకేసారి విచారణ జరుగుతుందని భావిస్తున్నాం. అక్కడి నుంచి స్పష్టత వస్తే గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ ప్రకటన జారీ, తదుపరి చర్యలు ఉంటాయి. 95 పోస్టుల్ని గ్రూప్-1 కింద భర్తీచేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
పదో తరగతిలోపు నాలుగేళ్లు చదివితే అక్కడ స్థానికత!
తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే వారికి స్థానికత కల్పించే విషయమై రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేశారు. మేం ఉద్యోగ ప్రకటనలు జారీచేసి, ఎంపిక జాబితా ప్రకటించే ముందు అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తాం. ఆ సమయానికి ప్రభుత్వం జారీచేసే మార్గదర్శకాలను అనుసరించి అభ్యర్థులు అందచేసే స్థానికత ఆధారంగా నియామకాలు ఉంటాయి. పదో తరగతి నుంచి నాలుగో తరగతిలోపు గరిష్ఠంగా నాలుగు సంవత్సరాలు ఏపీలో చదివిన వారిని స్థానికులుగా గుర్తిస్తున్నాం. ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రకటనకు అనుగుణంగా వయోపరిమితిని పెంచే అంశం ప్రభుత్వ పరిధిలో ఉంది. వయోపరిమితి పెంచాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులూ వస్తున్నాయి.
ఓటీపీఆర్ తప్పనిసరి
ఒకేసారి వివరాల నమోదు ప్రక్రియ (వన్‌టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్-ఓటీపీఆర్) పూర్తిచేసుకోవాలని అభ్యర్థుల్ని కోరుతున్నాం. ఇది తప్పనిసరి. ఇప్పటివరకు ఏడువేల మంది అభ్యర్థులు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఉద్యోగ ఖాళీల ప్రకటనలు జారీ కానందున అభ్యర్థుల నుంచి స్పందన తక్కువగా ఉందని భావిస్తున్నాం. అప్పటివరకు వేచి ఉండకుండా వెంటనే అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మంచిది. పేర్లను నమోదుచేయించుకున్న వారికి ఉద్యోగ ప్రకటనల జారీ సమయంలో సెల్‌ఫోన్ నెంబర్లకు సంక్షిప్త సమాచారం పంపిస్తాం. దానికి అనుగుణంగా వివరాల్ని వెబ్‌సైట్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.
క్రమశిక్షణ తప్పిన వారిపై చర్యలకు సిఫార్సులు
ఆన్‌లైన్‌లో శాఖాపరమైన పరీక్షల నిర్వహణ సంతృప్తికరంగానే జరిగింది. ఎంతచెప్పినా కొందరు ఉద్యోగులు నిర్ణీత సమయం దాటిన అనంతరం పరీక్ష కేంద్రాల్లోకి వచ్చారు. విజయనగరంలాంటిచోట్ల పలువురు ఉద్యోగులు క్రమశిక్షణ తప్పినట్లు మా దృష్టికొచ్చింది. వీరిని గుర్తించి తదుపరి చర్యలు తీసుకోవల్సిందిగా ఆయా శాఖలకు లేఖలు రాస్తాం.

Posted on 18-06-2016