ఏపీపీఎస్సీ > భర్తీ విధానం

గ్రూపు ఉద్యోగాల భర్తీ విధానం ఇదీ..

* సవరణలను పేర్కొంటూ ఉత్తర్వులు
ఈనాడు, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా గ్రూపు 1, 2, 3 పోస్టులతో పాటు గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవరించింది. సవరించిన విధానాన్ని ఆరు అనుబంధాల్లో పేర్కొంటూ సోమవారం(ఆగస్టు 1) ఉత్తర్వులిచ్చింది. ఏ పోస్టుకు ఏయే పరీక్షలుంటాయి, వేటికి ఇంటర్వూలుంటాయి. ఏఏ పోస్టులకు కేవలం ఆబ్జెక్టివ్ పరీక్షలు మాత్రమే ఉంటాయనే విషయాలను సిలబస్‌తో సహా పేర్కొంటూ ఉత్తర్వులిచ్చింది. జాతీయ విధానంలో భాగంగా ప్రభుత్వం దిగువ స్థాయి పోస్టులకు వ్యాసరూప పరీక్షలు, ఇంటర్వ్యూల అవసరం ఉందా లేదా అన్న అంశాన్ని తిరిగి సమీక్షించింది. ఆ మేరకు తాజా ఉత్తర్వులిచ్చింది.

అనుబంధం- 1 (గ్రూపు 1(ఎ) సర్వీసుల పరీక్ష విధానం)
స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటాయి. స్క్రీనింగ్ పరీక్ష 150 మార్కులకు బహుళ ఐచ్ఛిక విధానంలో (ఆబ్జెక్టివ్ పద్ధతి) జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ విభాగాల్లో ఉంటుంది.
* ప్రధాన పరీక్షలో 5 పేపర్లు (ప్రశ్నపత్రాలు) ఉంటాయి. దీనికి తోడు జనరల్ ఇంగ్లిష్ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. పదో తరగతి స్థాయిలోనే ఈ పరీక్ష ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణత సాధిస్తేనే ఇంటర్వ్యూకు అర్హులవుతారు.
* పేపర్-1 (150 మార్కులు) సాధారణ వ్యాసం
* పేపర్ 2 - 150 మార్కులు (భారతదేశ చరిత్ర, నాగరికత ప్రధానంగా 20వ శతాబ్దానికి సంబంధించిన సమగ్ర స్వరూపం, ఆంధ్రప్రదేశ్ సాంఘిక చరిత్ర, భారత రాజ్యాంగం)
* పేపర్ 3- 150 మార్కులు (భారతదేశ ప్రణాళిక, ఆర్థికరంగం, స్వాతంత్య్రానంతరం ఆంధ్రప్రదేశ్‌లో భూసంస్కరణలు- సాంఘిక మార్పులు, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, బలాలు-బలహీనతలు)
* పేపర్ -4 (150 మార్కులు)
* భారతదేశ అభివృద్ధిలో శాస్త్ర సాంకేతికత అంశాల పాత్ర
* అభివృద్ధి పర్యావరణ సమస్యలు
* లైఫ్ సైన్సెస్‌కు సంబంధించి ఆధునిక పోకడలపై అవగాహన పేపర్-5 (150 మార్కులు) డేటా అప్రిషియేషన్, ఇంట్రప్రిటేషన్
* టేబుల్ రూపంలో లేదా గ్రాఫిక్ రూపంలో సమాచారం ఇచ్చి దాని ఆధారంగా అభ్యర్థి దాని నుంచి ఏం గ్రహించారో వివరించాలని అడుగుతారు.
* సమస్య పరిష్కారం ఇంటర్వ్యూ (మౌఖిక పరీక్ష) - 75 మార్కులు మొత్తం 825 మార్కులు

అనుబంధం -2
గ్రూపు 1బి, గ్రూపు 2 సర్వీసులు, గెజిటెడ్ సర్వీసులకు పరీక్ష విధానం( అనుబంధం 3లో పేర్కొన్న పోస్టులకు మినహాయించి)
* ఇందులో స్క్రీనింగ్ పరీక్ష, ప్రధాన పరీక్ష రెండు విభాగాలుగా ఉంటాయి.
* స్క్రీనింగ్ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది.
ప్రధాన పరీక్షలో 3 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 - 150 మార్కులకు జనరల్ స్టడీస్‌లో ఉంటుంది. రెండో పేపర్ 150 మార్కులకు ఉంటుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ సాంఘిక చరిత్రతో పాటు రాష్ట్రంలో సాంఘిక, సాంస్కృతిక పరిణామాలపైనా ప్రశ్నలుంటాయి. భారత రాజ్యాంగం సమగ్ర స్వరూపంపైనా ప్రశ్నలుంటాయి. పేపర్ 3 - 150 మార్కులకు ఉంటుంది. భారతదేశ ప్రణాళిక, ఆర్థిక వ్యవస్థలతో పాటు గ్రామీణ సమాజంలో ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లపై ఆంధ్రప్రదేశ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 450 మార్కులు.

అనుబంధం -3
గెజిటెడ్ అధికారుల పోస్టుల భర్తీకి సంబంధించి పరీక్ష విధానం పార్టు -ఎ, పార్టు బి గా ఉంటుంది. పార్టు ఎ రాత పరీక్ష కాగా, పార్టు బి లో ఇంటర్వ్యూ ఉంటుంది. (అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్, అసిస్టెంట్ డైరక్టర్ ఆఫ్ మార్కెటింగ్, సీడీపీవో, అసిస్టెంట్ డైరక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్, డీఎస్పీ(కమ్యూనికేషన్స్), అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు, హెడ్ ఆఫ్ సెక్షన్స్ ఇన్ మైనింగ్ ఇంజినీరింగ్ సర్వీసు ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్స్, అసిస్టెంట్ సోషల్ సర్వీసు ఆఫీసర్లు, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్లు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్లు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్లు, డీఈఓలు, రేడియాలజికల్ ఫిజిక్స్‌లో లెక్చరర్ల పోస్టులకు ఈ పరీక్ష విధానం ఉంటుంది) రాత పరీక్షలన్నీ ఆబ్జెక్టివ్ పద్ధతిలోనే ఉంటాయి.
పేపర్- 1 (150 మార్కులు ) జనరల్ స్టడీస్, పేపర్ -2 (300 మార్కులు) పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్దేశించిన ఐచ్ఛికాంశాల నుంచి అభ్యర్థి రెండు సబ్జెక్టులు ఎంచుకోవాల్సి ఉంటుంది. వాటిపై పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ 50 మార్కులకు ఉంటుంది. మొత్తం 500 మార్కులు.

అనుబంధం- 4
నాన్ గెజిట్‌డ్ ఉద్యోగాల ఎంపికకు పరీక్ష విధానం.... (ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, మహిళా శిశుసంక్షేమ విభాగంలో సూపర్‌వైజర్ పోస్టులు, సూపరింటెండెంట్‌లు)
రాత పరీక్షలు ఆబ్జెక్టివ్‌లోనే ఉంటాయి. జనరల్ స్టడీస్‌లో 150 మార్కులకు పేపర్ -1, అభ్యర్థి ఎంచుకున్న ఒక సబ్జెక్టులో 150 మార్కులకు ఆబ్జెక్టివ్ పద్ధతిలోనే రెండో పేపర్ ఉంటుంది. 30 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. మొత్తం 330 మార్కులు.

అనుబంధం -5
అన్ని నాన్ గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి.. అనుబంధం -4లో పేర్కొన్న ఉద్యోగాలు మినహాయించి మిగిలిన అన్ని నాన్ గెజిటెడ్ ఉద్యోగాల ఎంపికకు ఈ పరీక్ష విధానం ఉంటుంది.
ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. రెండూ ఆబ్జెక్టివ్‌లోనే ఉంటాయి. జనరల్ స్టడీస్‌పై ఒక పేపరు 150 మార్కులకు ఉంటుంది. అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టుపై 300 మార్కులకు మరో పేపర్ ఉంటుంది. మొత్తం 450 మార్కులు.

అనుబంధం -6
గ్రామీణాభివృద్ధిశాఖలో పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు గ్రూపు -3 ఉద్యోగాల కింద పరీక్ష విధానం ఇలా.. మొత్తం పరీక్షలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. స్క్రీనింగ్ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. జనరల్ స్టడీస్‌లో ఒక పేపర్ 150 మార్కులకు, గ్రామీణాభివృద్ధిపై ఉంటుంది.

Posted on 05-08-2016