close

కడప జిల్లా సమాచారం


జిల్లా చరిత్ర
విద్య
నదులు - ప్రాజెక్టులు
నీటిపారుదల
పర్యాటకం
పరిశ్రమలు

జిల్లా చరిత్ర

ఎంతో చారిత్రాత్మక.. ప్రాచీనం.. పవిత్రత.. ప్రాశ్యస్త్యం.. కడపజిల్లా సొంతం. రాజకీయ చరిత్ర మౌర్యులతో ప్రారంభమైంది. ఎర్రగుడి, రాజుల మందగిరి శాసనాల ద్వారా ఈ జిల్లా క్రీ.పూ.224-236 మధ్య కాలంలో అశోకుని పాలన ఉండేదని తెలుస్తుంది. శాతవాహనుల కాలంలో 'ములికినాడు'గా నాసిక్ శాసనం ద్వారా తెలుస్తోంది. ఇక్ష్వాకుల కాలంలో ఇది 'హిరణ్యరాష్ట్రం'గా పిలువబడేదని చరిత్ర చెబుతోంది. పల్లవులు, బాదామి, చాళుక్యులు, రేనాటిచోరులు, బాణులు, వైదుంబులు, చోళులు, కాకతీయులు, విజయనగర రాజులు, మట్లిరాజులు, కుతుబ్‌షాయులు, హైదరాలీ, టిప్పుసుల్తాన్, అసఫ్‌జాహీ, మొగలులు, ఆంగ్లేయులు పరిపాలించినట్లు శాసనాలు చెబుతున్నాయి.
* 1807లో మూడు జిల్లా కోర్టులను (బళ్లారి, కడప, కోడికొండల్లో) ఏర్పాటు చేశారు. వీటి అధికార పరిధికి సమానంగా మూడు కలెక్టరేట్‌లను బదిలీ చేశారు. 1808లో కోడికొండ మండలాన్ని రద్దు చేసి కడప, బళ్లారిలో కలిపారు. ఈ రెండు మండలాల్లో 17 తాలుకాలుండేవి. బద్వేలు, జమ్మలమడుగు, దువ్వూరు, చిట్వేలి, సిద్ధవటం, చెన్నూరు, చింతకుంట, కమలాపురం, పులివెందుల, రాయచోటి, ఖమ్మం, గిద్దలూరు, దూపాడు, కోవెలకుంట్ల, నొస్సం, గుర్రంకొండ, పుంగనూరు, సిద్దవటం జిల్లా ప్రధాన కేంద్రం తర్వాత ఉండేవి.
* 1812లో జిల్లా ప్రధాన కేంద్రాన్ని సిద్దవటం నుంచి కడపకు మార్చారు. చరిత్ర పూర్వయుగం నుంచి జిల్లాలో నాగరికత వికాసం ఆరంభమైంది.
* భారతదేశ గొప్ప చక్రవర్తుల్లో అశోకుడు ఒకరు. ఈయన కడపను పరిపాలించారు. అశోకుని క్రీ.పూ.226-236 శాసనాల ద్వారా ఈయన పాలన సాగినట్లు తెలుస్తోంది.

శాతవాహనులు
గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్ర రాజులు మూలకరాజుగా వర్ణించారు. జిల్లా ములికినాడులో ఉండేది. జమ్మలమడుగు తాలూకా పెద్దముడియంలో ఆనాటి సీసపు నాణేలు లభించాయి. రాజంపేట సమీపంలోని అత్తిరాలలో ఓ మహిళకు రోమన్ నాణేం దొరికింది. ఈ ఆధారాల ద్వారా జిల్లాలో శాతవాహనుల పాలన చేసినట్లు వెల్లడవుతోంది.
* పల్లవ-చాళుక్య యుద్ధాలు ఎక్కువగా సాగాయి. క్రీ.శ. 275లో శాతవాహనుల సామంతరాజులు ఇక్ష్వాకులు అధికారంలోకి వచ్చారు. జిల్లాలో కొన్ని భాగాలున్న హిరణ్య రాష్ట్రంలోని హిరణ్యకులతో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. హిరణ్య రాష్ట్రంలో భాగంగా కడపజిల్లా ఇక్ష్వాక రాజు పురుషదత్తుని శాసనంలో మహాతలవర మహాసేనాపతి వశిష్ఠపుత్ర చలికి రెమ్మన పేరు కన్పిస్తుంది. ఇతను కడప రాజుగా ప్రతీతి.
* కాంచీపుర రాజులైన పల్లవులు కృష్ణాతీరం నుంచి జిల్లాను ఆక్రమించారు. అయిదో శతాబ్ధంలో త్రిలోచన పల్లవుడు రాజంపేట తాలూకాలో పలు గ్రామాలను నిర్మించారని చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. చాళుక్య, పల్లవ యుద్ధాలు సింహాభాగం కడపలో జరిగాయి. పల్లవ రాజు విజయాదిత్యుడు చాళుక్యుల చేతిలో మరణించగా రాణి పెద్దముడియంలో బందీ అయింది.

విద్య

యోగివేమన విశ్వవిద్యాలయం
కడప జిల్లా కేంద్రానికి సుమారు 15 కి.మీ. దూరంలో యోగివేమన విశ్వవిద్యాలయాన్ని 2006 మార్చి 9న ఏర్పాటు చేశారు. కడప నుంచి పులివెందుల వెళ్లే మార్గంలో వేమనపురంలో ఉందిది. తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం పీజీ కేంద్రంగా 1974లో ఏర్పాటైంది. ఏడు కోర్సులతో కొనసాగుతున్న పీజీ కేంద్రం స్థానంలో అప్పటి ముఖ్యమంత్రి జిల్లావాసి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విశ్వవిద్యాలయం ఏర్పాటుచేశారు. 2006 నవంబరు 8న మొట్టమొదటి ఉపకులపతిగా ఆచార్య అర్జుల రామచంద్రారెడ్డి బాధ్యతలు చేపట్టారు. విశ్వవిద్యాలయం 1,100 ఎకరాల స్థలంలో 29 విభాగాలతో అధునాతన భవనాలు, 123 మంది ఆచార్య, సంయుక్త, సహాయఆచార్యులతో బోధన సాగిస్తోంది. 1,800 మంది విద్యార్థులు చదవుతున్నారు. ఇక్కడ పనిచేసే యువ సంయుక్త, సహాయ ఆచార్యులకు 25 ప్రాజెక్టులు డిపార్టుమెంటు ఆఫ్ సైన్సు అండ్ టెక్నాలజీ నుంచి తెచ్చుకోవడం గర్వించదగ్గ విషయం. యోగివేమన అనుబంధంగా ప్రొద్దుటూరులో వైవీయూ ఇంజినీరింగు కళాశాల 2008-09 విద్యాసంవత్సరం ఏర్పాటైంది. సివిల్ ఇంజినీరింగు, కంప్యూటరు సైన్సు ఇంజినీరింగు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషను ఇంజినీరింగు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజినీరింగు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగు కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

సూపర్ కంప్యూటరు: అధునాతన సూపర్ కంప్యూటరు విశ్వవిద్యాలయంలో ఏర్పాటుచేశారు. ఇస్రోతో వైవీయూ ఒప్పందం మేరకు ప్రాజెక్టును పొందింది. ఆ ప్రాజెక్టు వినియోగంకోసం సూపర్ కంప్యూటరును కొనుగోలుచేసి పరిశోధనలు చేస్తున్నారు. బెంగళూరు ఇస్రో రాడార్ సెంటరు, స్పేస్ రీసెర్చి సెంటరు వైవీయూలోని 100 ఎకరాల్లో ఏర్పాటుచేసి అంతరిక్ష పరిశోధనకు ప్రోత్సాహం ఇచ్చేందుకు వైవీయూ ఇస్రో ఒప్పందం చేసుకొంది. వాతవరణలో తేమశాతం, ఉష్ణోగ్రత వర్షం ఎప్పడు వచ్చేది వంటి విషయాలు తెలుసుకొనేందుకు భౌతికశాస్త్ర విభాగం బెలూన్ ప్రయోగాలను పలుమార్లు చేసింది.

నదులు - ప్రాజెక్టులు

జిల్లాలో ముఖ్యంగా పెన్నా, చిత్రావతి, కుందూ, చెయ్యేరు, గుంజనేరు, సగిలేరు, పాపఘ్ని, పింఛ, బహుదా, మాండవ్య, గంగనేరు వంటి నదులు సుమారు 500 కిలోమీటర్లు పైబడి విస్తరించాయి. వీటిలో చాలావరకు నదులు పెన్నాలో కలిసే ఉప నదులుగానే ఉన్నాయి. పెన్నా నుంచి వచ్చే నీరు సిద్దవటం తర్వాత నెల్లూరు జిల్లా సరిహద్దులోని సోమశిల ప్రాజెక్టుకు చేరుతుంది.

* పెన్నా: ఈ నది కర్ణాటకలోని మైసూర్ కొండల్లో పుట్టి జిల్లాలోని జమ్మలమడుగు గండికోట కొండలను తాకుతుంది. అక్కడినుంచి జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం, చెన్నూరు, సిద్దవటం మీదుగా ప్రవహిస్తూ నెల్లూరు జిల్లాను చేరుతుంది. ఈ నది సుమారు 150 కిలోమీటర్లు పైబడి విస్తరించింది.
* చిత్రావతి: ఈ నది కూడా కర్ణాటక రాష్ట్ర పరిధిలోని కొండల్లోనే పుట్టి జిల్లాలోని 100 కిలోమీటర్లు వరకు విస్తరించి పులివెందుల ప్రాంతం పార్నపల్లి వద్ద లోయనుంచి ప్రవహిస్తూ జమ్మలమడుగు ప్రాంతంలో గుండ్లూరు దిగువన పెన్నేరులో కలుస్తుంది.
* పాపఘ్ని: ఈ నది కర్ణాటక ప్రాంతంలోని స్కంధగిరి కొండల్లో పుట్టి చిత్తూరు జిల్లా మదనపల్లి ప్రాంతం నుంచి కడప, అనంతపురం జిల్లాల్లోని కదిరి, గాలివీడు కొండల మధ్య జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఈ నది గాలివీడు, చక్రాయపేట, గండి, వేంపల్లి, నందిమండలం, కమలాపురం మీదుగా 150 కిలోమీటర్లు ప్రవహించి చెన్నూరు వద్ద పెన్నానదిలో కలుస్తుంది.
* చెయ్యేరు: ఈ నది కర్ణాటకలోని కోలార్ జిల్లా రాయపాడు కొండల్లో పుట్టి చిత్తూరు జిల్లా మదనపల్లి ప్రాంతం నుంచి కడప జిల్లాసరిపల్లె సమీపంలో కడప జిల్లాను తాకుతుంది. జిల్లాలో సుమారో 150 కిలోమీటర్లు మేర ఈ నది విస్తరించింది. సుండుపల్లి మండలంలోని రాయవరం వద్ద బహుదా, పింఛ నదులు అనుసంధానం చేసుకుని బాలరాచపల్లి మీదుగా అన్నమయ్య ప్రాజెక్టు ముందుభాగాన మాండవ్య, గంగనేరులను కలుపుకుని సిద్దవటం మీదుగా నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది.
* పింఛ: చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రాంతంలోని ఆవులపల్లి గుట్టల్లో నుంచి తలకోన పిల్లవంక, పాపనాశనం జలపాతాల నీటిని కలుపుకుని సుండుపల్లి మండలం పింఛ వద్ద పారుతుంది. దీనినే పింఛ నది అంటారు. ఈ నది పింఛనుంచి మరో 50 కిలోమీటర్లు ప్రవహించి బహుదానదిని అనుంధానం చేసుకుని శేషాచల కొండల మధ్య రోళ్లమడుగు ఎగువ భాగాన ప్రవహించే చెయ్యేరులో కలుస్తుంది.
* బాహుదా: ఈ నది చిత్తూరు జిల్లా పీలేరు ప్రాంతం నుంచి కె.వి.పల్లి, ఝరిదిన్నె వద్ద జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అక్కడ నుంచి మడితాడు, సుండుపల్లి, రాయవరం మీదుగా శేషాచల కొండల మధ్య ప్రవహించిచెయ్యేరులో కలుస్తుంది. ఈ నది జిల్లాలో 80 కిలోమీటర్ల మేర విస్తరించింది.
* మాండవ్య: ఈ నది చిత్తూరు జిల్లాలోని మదనపల్లి సమీపంలోని రెక్కల కొండ వద్ద పుట్టి కడప జిల్లా చిన్నమండెం, రాయచోటి, వీరబల్లి ప్రాంతాల్లో సుమారు 100 కిలోమీటర్లు ప్రవహించి గడికోట గ్రామంలోని జాండ్రపెంట వద్ద చెయ్యేరు సంగమంలో అనుసంధానం అవుతుంది.
* గుంజనేరు: ఇది శేషాచల కొండల్లోని మొగిలికుప్ప దగ్గర జన్మిస్తుంది. అక్కడ నుంచి శెట్టిగుంట, రైల్వేకోడూరు, చిట్వేలి, పెనగలూరు మండలాల్లో 120 కిలోమీటర్ల మేర విస్తరించి సిద్దవటం పైభాగాన పెన్నా నదిలో కలుస్తుంది.
* సగిలేరు: ఈ నది నల్లమల కొండల్లో జన్మించి గంగాయపల్లి మీదుగా బద్వేల్ ప్రాంతంలో జిల్లాలోకి ప్రవేశిస్తుంది. తర్వాత తడుగు వాగును కలుపుకుని 50 కిలోమీటర్ల మేర ప్రవహించి పెన్నాలో కలుస్తుంది.

గాలేరు-నగిరి సుజల స్రవంతి
* శ్రీశైలం జలాశయంలో(కృష్ణానది) మిగులు(వరద) జలాలను 38 టీఎంసీలను తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో ఒక టీఎంసీ జలాలను సుమారు 15 వేల ఎకరాలకు ఇవ్వాలనేది ప్రణాళిక. ఇక జీఎన్ఎస్ఎస్ ప్రధాన కాల్వకు అటు, ఇటు, సమీపంలోని గ్రామాలు, పట్టణ వాసులకు సుమారు అయిదు లక్షలమందికి 3.670 టీఎంసీలు నీరు ఇందులో నుంచే ఇవ్వాల్సి ఉంటుంది. కర్నూలు జిల్లా అవుకు జలాశయం నుంచి సుమారు 52 కి.మీ పొడవు జీఎన్ఎస్ఎస్ వరదకాల్వను తవ్వుతున్నారు. 47, 48/ఎ, 49/ఎ ప్యాకేజీలుగా విభజించి పనులను చేపడుతున్నారు. తొలుత 10 వేల క్యూస్కెక్కుల ప్రవాహవేగం ఉండేలా 18 మీటర్లు వెడల్పు, సుమారు 8.5-9 మీటర్లు లోతు ఉండేలా కాల్వను తవ్వాలని నిర్ణయించారు. భవిష్యత్తులో సాగునీటి అవశ్యకత అవసరం ఉంటుందని భావించి 20 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండేలా కాల్వ వెడల్పును 18 నుంచి 36 మీటర్లు వెడల్పునకు విస్తరించారు. ఈ పనులు సాగుతున్నాయి. వరదకాల్వ పనులను రూ.311.31 కోట్లతో చేపడుతున్నారు. ఇప్పటివరకు (2011 మార్చి) రూ.273.17 కోట్లు ఖర్చు చేశారు.

అన్నమయ్య ప్రాజెక్టు
రాజంపేట మండలం బాదనగడ్డపై 1976లో సుమారు రూ.8.23 కోట్లతో అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు అంచనా క్యయం రూ.103.53 కోట్లకు చేరుకొంది. ఈ ప్రాజెక్టు కింద 22,500 ఎకరాల ఆయకట్టును నిర్దేశించారు. 18 డిస్ట్రిబ్యూటరీ కాలువలు, ఆరు చెరువులు దీని కింద ఉన్నాయి.

సోమశిల
నెల్లూరు జిల్లా సోమశిలపై సోమశిల ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వలన కడప జిల్లా ప్రాంతానికి ఎలాంటి ఉపయోగం లేకపోయినా పోమశిల వెనుక జలాల తీర ప్రాంతాల్లోని భూముల్లోని బోర్లల్లో నీటి మట్టం పెరుగుతుంది. సోమశిల మునక ప్రాంతాల్లోని దాదాపు ఐదారు వేల ఎకరాల ముంపు భూముల్లో పంటలు సాగులో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం వలన దాదాపు 105 గ్రామాలు మునకకు గురయైనాయి.

వెలిగల్లు
అంచనా వ్యయం రూ. 210కోట్లు, గాలివీడు, రామాపురం, లక్కిరెడ్డిపల్లె మండలాల్లో 24వేల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్మించారు. వెలిగల్లు ప్రాజెక్టునుంచి రాయచోటికి తాగునీరు అందించేందుకు రూ. 42కోట్ల వ్యయంతో నీటి పథకం పూర్తి చేశారు. గాలివీడుకు రూ. 5కోట్లతో తాగునీరు అందించనున్నారు.

ఝరికోన
జిల్లా సరిహద్దులో నిర్మించిన ఝరికోన ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 110కోట్లు, 2,500 ఎకరాలకు సాగునీరు అందించాలనేది లక్ష్యం. సంబేపల్లెకు తాగునీరు అందించాలని ప్రతిపాదించారు. ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కలికిరి మండలంలో మూడు గ్రామాలకు తాగునీరు అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

నీటిపారుదల

కడప జిల్లాలో... 100 ఎకరాల ఆయకట్టు ఉన్న కుంటలు, చిన్న చెరువులు రమారమి 1,542 ఉన్నాయి. వీటి పరిధిలో 33,194 ఎకరాలు ఉన్నట్లు చిన్న నీటి పారుదలశాఖగణాంకాలు చెబుతున్నాయి. 100 ఎకరాల కంటే ఎక్కువ ఆయకట్టు ఉన్న చెరువులు సుమారు 303 ఉండగా అందులో 75,856 ఎకరాలున్నట్లు అంచనా. కడప జిల్లాలో బద్వేలు, పోరుమామిళ్ల, పోలి (రాజంపేట మండలం), వెల్లమరాజుపల్లె (చిట్వేలి మండలం), ఒంటిమిట్ట చెరువులు పెద్దవని అధికారులు చెబుతున్నారు.

* వర్షాలొచ్చినప్పుడు కొండప్రాంతాల్లో పడిన వర్షపు చినుకులు వంకలు, వాగుల్లో ప్రవహించి చెరువుల్లో, కుంటల్లోకి చేరుతాయి. వీటిల్లో నీరు పుష్కలంగా ఉంటే సమీప గ్రామాల్లోని బావులు, బోర్లలో భూగర్భజలాల లభ్యత ఆశాజనకంగా పెరుగుతోంది. గత కొన్నేళ్లుగా పరిశీలిస్తే ఎక్కువగా సెప్టెంబరు-నవంబరులో కురిసిన వానలకే చెరువులు నిండినట్లు నివేదికలు చెబుతున్నాయి. వీటి ఆధారంగా వరి, పొద్దుతిరుగుడు, వేరుసెనగ, నువ్వుల పంటలను రైతులు సాగుచేశారు.

కాలువలు:
కడప-కర్నూలు కాల్వ బ్రిటిష్‌కాలంలో నిర్మించారు. పదేళ్లనుంచి ఈకాల్వను ఆధునికీకరణ పనులను అంచెలంచెలుగా చేపడుతున్నారు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం,కడప నియోజవర్గాల్లో సుమారు 92వేల ఎకరాలకు కేసీకాల్వ ద్వారా సాగునీరందుతోంది. కర్నూలు జిల్లా వెలిగోడు నుంచి బ్రహ్మంసాగర్ వరకు తెలుగుగంగ కాల్వను నిర్మించారు. ఈకాల్వ నీటి ప్రవాహపు సామర్థ్యం సుమారు 5000 క్యూసెక్కులు. జిల్లాలో ప్రధానంగా పెన్నానది ప్రవహిస్తుంది. ఈ నదికి ఉపనదులుగా కుందూ, చిత్రావతి, బహుదా (చెయ్యేరు), సగిలేరు, పాపాఘ్ని, గుంజన, మాండవ్య నదులు ప్రవహిస్తున్నాయి.

పర్యాటకం

గండికోట
విజయనగర రాజుల ఆయువుపట్టు గండికోట. కడప నుంచి 77 కి.మి. దూరంలో ఉంది. కోటలో మాధవరాయస్వామి ఆలయం, రఘునాధ దేవాలయం, మసీదు, ధాన్యాగారం, కారాగారం, కావలి మండపం, చెక్కుచెదరని గండికోట గోడ, నీటి కొలను గత చరిత్రకు సాక్ష్యాలుగా ఉన్నాయి. రఘునాథ, మాధవరాయ ఆలయంలో ఉన్న శిల్ప వైభవం పేర్కొనదగింది. కోటకు చేరుకునేందుకు కడప, జమ్మలమడుగుల నుంచి బస్సు సౌకర్యం ఉంది.

సీమలో తొలి బౌద్ధారామాలు
1972లో నందలూరు వద్ద పురావస్తుశాఖ జరిపిన తవ్వకాల్లో ఎన్నో చారిత్రక లభించాయి. బౌద్ధమతానికి సంబంధించిన అనేక ఆనవాళ్లు దొరికాయి. క్రీ.శ.3వ శతాబ్దంలో రాయలసీమ ప్రాంతంలో బౌద్ధంమత ప్రచారం జరిగిందనడానికి ఇక్కడ లభించిన చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది.

విలువైన తెల్ల బంగారం
విలువైన ఎర్ర చందనం పరిరక్షణలో భాగంగా అటవీశాఖ రైల్వేకోడూరు పట్టణంలో పార్కును ఏర్పాటు చేసింది. సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో వందల కొద్దీ ఎర్ర చందనం చెట్లు ఈ పార్కులో ఉన్నాయి. పార్కులో విహరించేందుకు పిల్లలకు, పెద్దలకు బోటింగ్‌ను ఏర్పాటుచేశారు. సేద తీరడానికి హోటళ్లు, చెక్కలతో నిర్మించిన గుడిసెలు ఉన్నాయి.

తుమ్మలబైలు అటవీ అందాలు
పర్యాటలకును విశేషంగా ఆకర్షిస్తున్న వాటిలో తుమ్మలుబైలు ఒకటి. రాజంపేట అటవీ డివిజన్‌లో ఉన్న తుమ్మల బైలులతో బ్రిటీష్‌కాలం కాలం నాటి భవనాలు ఉన్నాయి. ప్రభుత్వం వాటికి మరమ్మతులు చేయించి పర్యాటకానికి అనువుగా చేసింది. అక్కడక్కడా మచాన్‌లు(చెట్లపై నుంచి అటవీ అందాలను చూడటానికి అనువుగా ఏర్పాటుచేసినవి), పగోడాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో పర్యటించడానికి వీలుగా అటవీశాఖ ప్రత్యేకంగా వాహన సౌకర్యం కల్పించింది. తుమ్మలబైలులో బస చేయటానికికూడా ప్రత్యేక సూట్లున్నాయి. జిల్లాకేంద్రంలో దేవునికడప ఆలయం, పెద్ద దర్గా(అమీన్‌పీర్ దర్గా) ఉంది. వీటికి కడప రైల్వేస్టేషన్ నుంచి మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆర్టీసీ బస్టాండు నుంచి 2.5కిలోమీటర్లు ఉంటుంది. ఆటోలుసౌకర్యంగా లభిస్తాయి.

పుష్పగిరి శైవక్షేత్రం
జిల్లాకేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో కమలాపురం నియోజకవర్గంలోని వల్లూరు మండలంలో పుష్పగిరి శైవక్షేత్రం ఉంది. ఇక్కడికి వెళ్లాలంటే.. కడప ప్రొద్దుటూరు మార్గంలో చెన్నూరు సమీపంలో రెండు దారులున్నాయి. ఆటోల్లోనే వెళ్లాల్సిఉంటుంది. ప్రత్యేకంగా ఆటోలైతే రూ. 200 వరకు తీసుకుంటారు. ఇక వల్లూరుకి(పాత ఊర్లోకి)వెళ్లే ఆటోలకు రూ.15 వరకు తీసుకుంటారు. కానీ మధ్యలో నది ఉండడం వల్ల ఒక్క ఎండాకాలంలోనే అట్నుంచి ఆలయానికి వెళ్లగలం.

ఒంటిమిట్ట ఆలయం
కడప నుంచి రాజంపేట రహదారిలో ఉన్న ఒంటిమిట్ట ఆలయం చారిత్రక ప్రాశస్త్యం కలిగింది. ఇది జిల్లాకేంద్రం నుంచి సుమారు 20 కి.మీ. ఉంటుంది. తిరుపతివైపు వెళ్లే ఏ బస్సయినా.. ఎక్కి ఆలయానికి చేరుకోవచ్చు. చార్జీ రూ. 15వరకు ఉంటుంది. బ్రహ్మంగారి మఠం, ఆ పక్కనే బ్రహ్మంసాగర్ ప్రాజెక్టు ఆనకట్ట.. దర్శించగిన.. చూడదగినవి. కడప నుంచి 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. 24 కిలోమీటర్లదూరంలోని మైదుకూరు వెళ్లి అక్కడ్నుంచి మరో బస్సులో వెళ్లాల్సిఉంటుంది. ఛార్జీ రూ. 35 నుంచి 45 వరకు అవుతుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ సమాధి, ఎకో పార్కు, నెమళ్లపార్కు ట్రిపుల్ఐటీ ఉన్న ఇడుపులపాయకు వెళ్లాలంటే కడప నుంచి సుమారు 50కి.మీ. వెళ్లాలి. అందుకు పులివెందుల వెళ్లే బస్సులు ఎక్కి వేపల్లెలో దిగి అక్కడ్నుంచి జీపులు, ఆటోల్లో వెళ్లవచ్చు. దీనికి సుమారు రూ. 40 నుంచి 50 వరకు ఖర్చవుతుంది.

ఒంటిమిట్ట కోదండ రామాలయం
కడప నుంచి చెన్నై వెళ్లే మార్గంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడి గర్భగుడిలో ఒకేరాతిపై సీతారామలక్ష్మణ రూపాలుండడం విశేషం. రంగమంటపం అద్భుతశిల్పకళాకృతుల నిలయం. కోదండరామస్వామి ఆలయంలో సీతారామలక్ష్మణులు ఏకశిలపై ఉండటంతో ఈ ప్రాంతాన్ని ఏకశిలా నగరంగా పిలిచేవారు. బమ్మెర పోతన రామాయణ భాగవతాన్ని రచించి శ్రీరామునికి ఇక్కడే అంకితం ఇచ్చారని చరిత్ర చెబుతోంది. ప్రతియేటా నవమి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి.

పరిశ్రమలు

జిల్లాలో సిమెంటు పరిశ్రమం విశేష పాత్ర పోషిస్తోంది. జిల్లాలో అనేక సిమెంట్‌పరిశ్రమలువెలిశాయి. జమ్మలమడుగు పరిధి ఎర్రగుంట్లలోని ఐసీఎల్ సిమెంటు కర్మాగారంలో సుమారు 180మంది శాశ్వత ఉద్యోగులుండగా, తాత్కాలిక ఉద్యోగులు 400 మంది ఉన్నారు. ఈ పరిశ్రమలో రోజుకి సుమారు 1,500-1,800 టన్నుల సిమెంటు ఉత్పత్తి జరుగుతోంది.
* చిలంకూరు కర్మాగారంలో సుమారు 5 వేలటన్నుల ఉత్పతి జరుగుతోంది. 1982లో ఏర్పాటు చేసిన జువారీ కర్మాగారం 11 వేల టన్నుల సిమెంటు చేస్తోంది. ఎర్రగుంట్ల మండలంలో ఉన్న మరో మూడు సిమెంటు పరిశ్రమల్లో సుమారు 18 వేల టన్నుల సిమెంటు ఉత్పత్తి జరుగుతోంది.
* జువారి సిమెంటు కర్మాగారంలో శాశ్వత ఉద్యోగులు 300 మంది, తాత్కాలిక ఉద్యోగులు 2వేల మంది ఉన్నారు. ఈ పరిశ్రమ రోజుకి 11వేల టన్నుల సిమెంటు ఉత్పత్తి జరుగుతుంది. పులివెందులలోని ఎన్ఎస్ఎల్ టెక్స్‌టైల్స్‌ను సుమారు 130కోట్లతో నిర్మించారు. ఇందులో 150మందికి ఉపాధి పొందుతున్నారు. పులివెందులలోని పాలిమర్స్ ఫ్యాక్టరీ రూ. 100కోట్లతో నిర్మించారు. దీనిలో 300 మందికి ఉపాధి పొందుతున్నారు.
* పులివెందుల జేఎన్‌టీయూ కళాశాల సమీపాన గోవింద్‌రాజ్ టెక్స్‌టైల్స్ కంపెనీని సుమారు రూ. 150కోట్లతో నిర్మించారు. ఇందులో సుమారు 750మంది పనిచేస్తున్నారు. స్థానికంగా నివాసం ఉన్నవారికే ఉపాధి కల్పించారు.
* పులివెందులలోని కడప రోడ్డులో సంచుల ఫ్యాక్టరీ నిర్మించారు. ఇందులో 150మంది ఉపాధి పొందారు. స్థానికంగా ఉన్నవారికే ఉపాధి కల్పించారు.
* పులివెందుల పరిధిలోని రచ్చుమర్రిపల్లె పొలాల్లో గాజు ఫ్యాక్టరీ నిర్మించారు. ఇందులో సుమారు 250మంది ఉపాధి పొందారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలవారికే ఉపాధి కల్పించారు.
* కమలాపురం పరిధిలోని భారతి సిమెంటు పరిశ్రమలో సుమారు 10 వేల టన్నులపైనే ఉత్పత్తి జరుగుతోంది. 200 మంది దీనిపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారు.
* చిలంకూరులోని సిమెంటు కార్మాగారంలో శాశ్వత ఉద్యోగులు సుమారు 275 మంది ఉండగా, తాత్కాలిక ఉద్యోగులు(కాంట్రాక్టు కార్మికులు) 700మంది ఉన్నారు. ఇక్కడ రోజుకి సుమారు 4వేల టన్నుల సిమెంటు ఉత్పత్తి జరుగుతుంది.
* జమ్మలమడుగు మండలంలోని దాల్మియా సిమెంటు కర్మాగారం చిన్నకొమెర్ల వద్ద ఉంది. ఈ పరిశ్రమ నుంచి రోజుకు 6వేల టన్నుల సిమెంటు ఉత్పత్తి అవుతుంది. ఇందులో తాత్కాలిక పద్ధతిన సుమారు 2వేల మంది పనిచేస్తున్నారు.
* 150 నాపరాయి పరిశ్రలున్నాయి. ఒక్కోదాంట్లో 10 నుంచి 15 మంది పనిచేస్తున్నారు. ప్రత్యక్షం, పరోక్షంగా 15వేల మంది ఈ పరిశ్రమపై ఆధారపడి ఉన్నారు. ఇక్కడ తయారైన పాలీష్ నాపరాళ్లు తమిళనాడు, కేరళ తదితర ప్రాంతాలకు రవాణా అవుతాయి.