close

కృష్ణా జిల్లా సమాచారం


జిల్లా చరిత్ర
విద్య
నదులు - ప్రాజెక్టులు
నీటిపారుదల
ప్రధాన పంటలు
పర్యాటకం
పరిశ్రమలు

జిల్లా చరిత్ర

స్వతంత్రానికి పూర్వ కృష్ణాజిల్లా రాజమండ్రి నుంచి మాచెర్ల వరకు, మచిలీపట్నం నుంచి మునగాల ప్రాంతం వరకు ఉండేది. 1904లో కృష్ణాజిల్లా నుంచి గుంటూరు జిల్లాను విడదీశారు. 1925లో పశ్చిమగోదావరి జిల్లాను విడదీసే సమయంలో, 1959లో నల్గొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను కలపడం ద్వారా ఈ జిల్లా ఏర్పడింది.

శాతవాహనాలు
శాతవాహనుల గురించి ఐతరేయ బ్రాహ్మణంలో విపులంగా ఉంది. తొలిసారి ఆంధ్రదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చి పరిపాలించిన వారు శాతవాహనులు. వీరి రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు. అశోకుని మరణానంతరం స్వతంత్రులుగా ప్రకటించుకున్నారు. మొదట శ్రీకాకుళం రాజధానిగా చేసుకుని వీరు పరిపాలన సాగించారు. అనంతరం తమ రాజధానిని పైఠాన్(మహారాష్ట్రలోని ప్రతిష్టానపురం)కు మార్చుకున్నారు. ఆంధ్రదేశంలో నాలుగు శతాబ్దాల పాటు వీరి పరిపాలన సాగింది. శాతవాహన రాజుల్లో మొదటిశాతకర్ణి, గౌతమి పుత్రశాతకర్ణి, వాసిష్టీపులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి గొప్పవారు. శాతవాహన రాజుల్లో 23వ రాజైన గౌతమి పుత్రశాతకర్ణి గొప్ప ప్రఖ్యాతలు గడించాడు. ఇతని కాలంలో శాతవాహన రాజ్యం విస్తరించింది. త్రిసముద్ర తోయ పీతవాహన, శకయవ్వనపల్లవ విదూషణ మొదలైనవి ఇతని బిరుదులు. గౌతమీపుత్ర శాతకర్ణి కీర్తి ప్రతిష్ఠల గురించి ఆమె తల్లి గౌతిమి బాలశ్రీ వేయించిన 'నాసిక్' శిలాశాసనం ద్వారా మనకు తెలుస్తోంది.

పల్లవులు
శాతవాహనులు తర్వాత మళ్లీ ఆంధ్రదేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిన పాలించిన వారు పల్లవులు. కృష్ణానది నుంచి తుంగభద్ర వరకు వీరి రాజ్యం విస్తరించింది. పల్లవ రాజ్య స్థాపకుడు శివ స్కంద వర్మ. గుంటూరులోని మైదవోలులో లభ్యమైన ఆధారాలను ద్వారా పల్లవుల గురించిన సమాచారం తెలుస్తోంది. వీరి పరిపాలన కాలంలో వేంగీ (ప్రస్తుత ఏలూరు), పిఠాపురం ముఖ్య పట్టణాలుగా విలసిల్లాయి.

విష్ణుకుండినులు
వేంగీని రాజధానికి చేసుకుని పరిపాలన సాగించిన వారు విష్ణుకుండినులు. వీరు కూడా ఆంధ్రదేశంలో ఎక్కువ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకుని పరిపాలన సాగించారు. విష్ణుకుండినులలో రెండో మాధర వర్మ గొప్పవాడు. ఇతను పదకొండు అశ్వమేధయాగాలు, సహస్ర క్రతువులను ఇంకా అనేక యాగాలను నిర్వహించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఇతనని త్రికూట మలయాధిపతి(త్రికూటం అనగా గుంటూరులోని కోటప్పకొండ) అంటారు. నాలుగో మాధవవర్మ, విజయశీలుడు పరిపాలన కాలంలో బెజవాడ అత్యంత ప్రాభవాన్ని సంతరించుకుందని చరిత్రకారుల అభిప్రాయం. వీరు బౌద్ధమతాన్ని ఆదరించారు. అనేక బౌద్ధవిహారాలు నిర్మించి దానధర్మాలు చేశారు. బెజవాడలోని మొగల్రాజపురం, ఉండవల్లి గుహలు వీరు నిర్మించినవే. ఈ గుహాలయ స్థంబముల మీద పంజా ఎత్తిన సింహ ప్రతిమ ఉండుటచేత వీరు సింహాలాంఛనులని పరిశోధకుల అభిప్రాయం. విష్ణుకుండినులు రాగిమలాము చేసిన ఇనుపు నాణెములు వాడేవారు. నాణెములపై సూర్యగోళపు మధ్య ఏకతల దేవాయతన రూపం ముద్రించారు. భారతదేశంలో ఇలాంటి నాణెములు మొదటిసారి ప్రవేశపెట్టినవారు విష్ణుకుండినులే.

తూర్పు చాళుక్యులు
విష్ణుకుండినులను ఓడించి ఆంధ్రదేశాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్న వారు తూర్పు చాళుక్యులు. రెండవ పులకేశి సోదరుడైన కుబ్జవిష్ణువర్ధనుడు కోస్తా జిల్లాలకు ప్రతినిధిగా నియమించబడ్డాడు. పులకేశి మరణాంతరం ఈ ప్రాంత ప్రాధాన్యం పెరిగి స్వతంత్ర వేంగీ సామ్రాజ్యంగా ఆవిర్భవించింది. వీరికి పటిష్టమైన పరిపాలన యంత్రాంగం ఉండేది. వీరి పాలనకాలంలోనే చైనా యాత్రికుడు హుయాన్‌త్సాంగ్ బెజవాడలో పర్యటించాడు. కొంతకాలం పాటు ఓ బౌద్ధాశ్రమంలో కూడా నివసించినట్లు ఆధారాలు ఉన్నాయి. తూర్పు చాళుక్య రాజులు జైన దేవాలయాలకు నిధులు, విరాళాలు ఇచ్చేవారు. కుబ్జ విష్ణు వర్ధనుడు, మూడో విష్ణువర్ధనుడు, రెండో అమ్మ జైన మతాన్ని ఆదరించారే వారని తెలసుస్తోంది. బెజవాడ, జెనుపాడు, పెనుగొండ, మునుగొండ, ప్రసిద్ధ జైన క్షేత్రాలు. కృష్ణాజిల్లా పరిసర ప్రాంతాల్లో ఎక్కువ శివాలయాలు నిర్మించింది తూర్పు చాళుక్యులే. రెండో విజయాదిత్యుడు మొత్తం 108 శివాలయాలు నిర్మించాడని ప్రతీతి. యుద్ధమల్ల బెజవాడలో కార్తికేయుడు దేవాలయాన్ని నిర్మించాడు.

కాకతీయులు
గణపతి దేవుడు క్రీ.శ.1212-1213 మధ్య కాలంలో తూర్పు తీరంపై దండెత్తి కృష్ణా, గోదావరి, గుంటూరు ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడు. నిడదవోలు పాలకుడైన వేంగీ చాళుక్య వీరభద్రునికి తన కుమార్తె రుద్రమ్మను ఇచ్చి వివాహం చేశాడు. రెండో కుమార్తెను గణపాంబను ధరణికోట రాజు బేతరాజుకు, సోదరి మేలాంబికను మధిర పాలకుడు రుద్రరాజుకు ఇచ్చి పెళ్లి చేశాడు. కృష్ణాజిల్లాలోని మోటుపల్లి, ఘంటసాల, మచిలీపట్నాలు ప్రసిద్ధ వాణిజ్య కేంద్రాలుగా వర్ధిల్లాయి. గణపతిదేవుని తర్వాత అతని కుమార్తె రుద్రమపరిపాలన సాగించింది. ఈమె కాలంలోనే వెనిస్ యాత్రికుడు మోటుపల్లి రేవులో దిగాడు. దేశంలో పాలన కట్టుదిట్టంగా ఉందని పరిశ్రమలు, వాణిజ్యం వర్ధిల్లుతున్నాయనివర్ణించాడు.

రెడ్డిరాజులు
కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు యుద్ధాలతో తలమునకలై ఉండగా, ఇదే అదనుగా తీసుకున్న ప్రోలాయవేమారెడ్డి స్వతంత్రుడిగా ప్రకటించుకున్నాడు. కొండవీడు కోటను వేదికగా చేసుకుని పరిపాలన సాగించాడు. అనంతరం బెల్లంకొండ, వినుకొండ, నాగార్జుకొండలను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇతని కాలంలో తెలుగు సాహిత్యం దశదిశల వెలుగొందింది. శ్రీనాథ కవి సార్వభౌముడు, బమ్మెరపోతన వేమారెడ్డి ఆస్థానంలో కవులుగా ఉండేవారు. కొండపల్లిలోని కోట ఈయన కాలంలోనే నిర్మించబడింది.

గజపతులు
రెడ్డిరాజుల తర్వాత కృష్ణాజిల్లా ప్రాంతం గజపతుల చేతులోకి వెళ్లిపోయింది. నేటి పమిడిముక్కల మండలంలోని కపిలేశ్వరపురాన్ని గజపతుల రాజు కపిలేశ్వర గజపతి ఆక్రమించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. బెజవాడలోని విద్యాధరపురాన్ని నిర్మించి విద్యాధర గజపతిగా పేరుగడించాడు. కొండపల్లి వద్ద ఓ రిజర్వాయర్‌ను కూడా ఇతని కాలంలోనే నిర్మించారు.

విజయనగర సామ్రాజ్యం
ముస్లిం ప్రతిఘటనోద్యమంలో భాగంగానే క్రీ.శ.1336లో సంగమ వంశపాలకుడైన హరిహర బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ముస్లింల పాలనను దక్షిణాపథానికి విస్తరించకుండా నిరోధించి, హిందూ ధర్మాన్ని పరిరక్షించింది విజయనగర రాజ్యమే. విజయనగర రాజులలోనే కాక భారతదేశం గర్వించదగ్గ చక్రవర్తులలో శ్రీకృష్ణదేవరాయలు ఒకరు. ఈయనకు ఆంధ్రభోజుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడని బిరుదులు కలవు. కళింగదేశాన్ని దండెత్తడానికి ముందుగా రాయలు శ్రీకాకుళంలోని ఆంధ్ర మహావిష్ణువుని పూజించినట్లు వల్లభ్యుదయ గ్రంథం ద్వారా తెలుస్తోంది. ఆలయ ప్రాంగణంలో బసచేసిన శ్రీకృష్ణదేవరాయలకు ఆంధ్రమహావిష్ణు కలలో సాక్షాత్కరించి ఆంధ్రకావ్యం రచించమని ఆదేశించాడట. అప్పుడు రాయలు అక్కడే ఉన్న 16 స్థంభాల మండపంలో కూర్చుని 'ఆముక్తమాల్యద'ను రచించాడు. దీనికే 'విష్ణు చిత్తీయం' అని మరో పేరు కలదు. తెలుగు సాహిత్య పంచ కావ్యాలలో ఒకటిగా ప్రసిద్ధికెక్కింది. రాయలు కూర్చుని రాసిన ఆ మండపానికి ఆముక్తమాల్యద మండపమని పేరొచ్చింది.

కుతుబ్‌షాహీలు
కుతుబ్‌షాహీల వంశస్థాపకుడు సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్.. విజయనగర రాజుల అనంతరం కృష్ణాజిల్లా పరిసర ప్రాంతాలు కుతుబ్ షాహీల పాలనలోకి వెళ్లిపోయాయి. ఈ వంశంలో చివరి పాలకుడు తానీషాగా పేరొందిన అబ్దుల్ హసన్ కుతుబ్ షా. అక్కన, మాదన్నలు ఇతని పాలనా కాలంలోని వారే. వీరిద్దరూ విజయవాడ కేంద్రంగా పాలన బాధ్యతలు చూసుకునే వారు. అక్కన్న, మాదన్నలు బెజవాడ కనకదుర్గ ఆలయ ప్రాభవానికి ఎంతో కృషి చేశారు.

నిజాం పరిపాలన
మొగల్ చక్రవర్తి ఔరంగజేబు దక్షిణ దిగ్విజయయాత్రల్లో భాగంగా గోల్కొండ ప్రాంతాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. తన ప్రతినిధిగా నిజాం ఉల్ ముల్క్‌ను నియమించడంతో ఈ ప్రాంతంలో నిజాం పరిపాలన ఆరంభమైంది. ఆంగ్లేయులు వచ్చే వరకు కృష్ణాజిల్లా వీరి పరిపాలన కిందే ఉంది.

అలనాటి వాణిజ్య కేంద్రం బందరు
2000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన మచిలీపట్నం గత కాలపు ప్రపంచ చరిత్ర పటంలో ప్రముఖ స్థానాన్ని పొందింది. ప్రముఖ రేవు పట్టణంగా ప్రసిద్ధి పొందిన మచిలీపట్నం చారిత్రక, సాంస్కృతిక, సాహిత్య, కళారంగాల్లో ప్రముఖపాత్ర పోషించింది. 1605లో డచ్‌వారు మచిలీపట్నాన్ని వ్యాపార కేంద్రంగా చేసుకున్నారు. 17వ శతాబ్ధం వరకు అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా పేరొందిన మచిలీపట్నంలో డచ్‌వారితో పాటు పోర్చుగీసు, ఫ్రెంచి వారు వ్యాపారాలు నిర్వహించారు. 1757లో ప్రారంభమైన బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణలో భాగంగా 1890 నాటికి మచిలీపట్నం పూర్తిగా ఆంగ్లేయుల వశమైంది. 1611లో మొట్టమొదటిసారి ఈస్ట్ఇండియా కంపెనీ నౌక మచిలీపట్నం రేవుకు చేరింది. అనంతరం 1759లో ఈస్ట్ ఇండియా కంపెనీ బందరు కోటను స్థావరంగా చేసుకుని వ్యాపారాలు ప్రారంభించింది.

విద్య

కృష్టా యూనివర్సిటీ సమాచారం
జిల్లాకో విశ్వవిద్యాలయం ఉండాలన్న ప్రభుత్వ, నాలెజ్డ్ కమిషన్ సిఫారసుల మేరకు కృష్ణా యూనివర్సిటీ ఏర్పాటైంది. ఏప్రిల్23, 2008న అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మచిలీపట్నంలోని రాజుపేట ప్రాంతంలో ఆంధ్ర జాతీయ కళాశాల ప్రాంగణంలో(పిన్‌కోడ్- 521001) కృష్ణా యూనివర్సిటీ భవనం తాత్కాలిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పటి వరకు నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఉండే కళాశాలలు ఈ యూనివర్సిటీ పరిధిలోకి వచ్చాయి. జిల్లాలో ఉన్న 131 కళాశాలలు ప్రస్తుతం కృష్ణా యూనివర్సిటీకి అనుంబంధంగా పనిచేస్తున్నాయి. వీటితో పాటు నూజివీడులోని పీజీ సెంటర్‌ను కూడా ఇటీవల కృష్ణా యూనివర్సిటీ పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రా జాతీయ కళాశాల
చారిత్రక ప్రాధాన్యం సంతరించుకున్న కళాశాల మచిలీపట్నం ఆంధ్రా జాతీయ కళాశాల. స్వాతంత్రోద్యమ పోరాట సమయంలో దేశ నాయకుల స్ఫూర్తితో 1910లో కళాశాల ప్రారంభించారు. 1907లో బిపిన్‌చంద్రపాల్ మచిలీపట్నంలో చేసిన ఉద్వేగభరితమైన ప్రసంగంతో ఉత్తేజితులైన కోపల్లె హనుమంతరావు, డా. పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు పంతులు తదితరులు ఆంధ్ర జాతీయ విద్యాపరిషత్తును స్థాపించి తద్వారా ఆంధ్రా జాతీయ కళాశాల స్థాపించాలనే ఆలోచనకు బీజం వేశారు.

నోబుల్ కళాశాల
దేశంలోని పురాతన కళాశాలలో మచిలీపట్నం నోబుల్ కళాశాల ప్రధానమైంది. 1843లో క్రిష్టియన్ మిషనరీస్ ఆధ్వర్యంలో రాబర్ట్ టుర్లింగ్‌టన్ నోబుల్ నేతృత్వంలో పాఠశాలగా ప్రారంభమై 1864లో మద్రాసు యూనివర్శిటీకి అనుబంధంగా కళాశాల హోదాను సంతరించుకుంది. 1938 వరకు దక్షిణభారతదేశంలో ప్రసిద్ధిగాంచిన నోబుల్ కళాశాలను గుంటూరు ఏసీ (ఆంధ్ర క్రిస్టియన్‌కళాశాల) కళాశాలను కలిపి విజయవాడలో కొత్తకళాశాల ఏర్పాటుచేయాలని లిండ్సే కమిషన్ సూచనలతో 1938 ఏజే కళాశాల మూతపడింది. తర్వాత కృష్ణా, గోదావరి డయాస్ బిషప్, స్థానిక ప్రముఖుల చొరవతో 1966లో కళాశాలను అప్పటి ముఖ్యమంత్రి, ఒకనాటి కళాశాల విద్యార్థి కాసు బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా పునఃప్రారంభమైంది. అనంతరం 1985 వరకు విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీకి, తర్వాత నాగార్జున యూనివర్సిటీ, ప్రస్తుతం కృష్ణా యూనివర్సిటీ అనుబంధ కళాశాలగా పనిచేస్తోంది.

దేశంలోనే మొదటి ఆరోగ్య విశ్వవిద్యాలయం.... ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ
బెజవాడ నగరంలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య వర్శిటీ దేశంలోనేమొట్టమొదటి ఆరోగ్య విశ్వవిద్యాలయం. దీనిని 1986లో ఏర్పాటు చేశారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన వైద్య కోర్సులకు ప్రత్యేక విశ్వవిద్యాలయం అవసరమని గుర్తించిన అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు దీనిని ప్రారంభించారు. మొదట్లో దంతవైద్య కళాశాలలకు సంబంధించి మాత్రమే ఇక్కడ అడ్మిషన్లు నిర్విహించేవారు. ఆ తరువాత కొత్త కోర్సులకు వేదికగా మారుతూ విశ్వవిద్యాలయం స్థాయికి అభివృద్ధి చెందింది. హోమియోపతి, నర్సింగ్, ఆయుర్వేదం, యునాని కళాశాలలు కూడా ఈ వర్శిటీ పరిధిలోకి వచ్చాయి. దీనిలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ), డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డీసీఐ), ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ (ఐఎన్‌సీ), సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ నిబంధనల మేరకు ఆయా పోస్ట్‌గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్ కోర్సులకు అడ్మిషన్లను నిర్వహించి పట్టాలను ప్రదానం చేస్తున్నారు. యేటా ఎంసెట్‌లో ర్యాంకులు పొందిన విద్యార్థులకు ఇక్కడ కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లను కేటాయిస్తారు. విశ్వవిద్యాలయం పరిధిలో మొత్తం 303 కళాశాలలు ఉన్నాయి. వీటిలో వైద్య కళాశాలలు-31, దంత వైద్య కళాశాలలు-19, ఆయుర్వేద వైద్య కళాశాలలు-5, హోమియో వైద్య కళాశాలలు-4, యునానీ వైద్య కళాశాలలు-2తో పాటు న్యాచురోపతి, యోగా కళాశాలలు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.

ఆంధ్రా లయోల కళాశాల
బెంజిసర్కిల్ సమీపంలోని జాతీయ రహదారి నుంచి గుణదల కొండ వరకు సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో 1953లో ఆంధ్రా లయోల కళాశాలను ప్రారంభించారు. ఇంటర్మీడియెట్ నుంచి పీజీ స్థాయి వరకు ఆర్ట్స్, సైన్స్, కంప్యూటర్, విజువల్ కమ్యూనికేషన్, ఎంబీఎ/ఎంసీఎ కోర్సులు ఇక్కడ ఉన్నాయి. కళాశాలలో సుమారు 3 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థినీ విద్యార్థులకు అన్ని సదుపాయాలతో కూడిన హాస్టల్ వసతి కూడా ఉంది. కళాశాలకు నాక్ 'ఏ' గ్రేడు గుర్తింపు లభించింది. విశాలమైన గ్రంథాలయం, ల్యాబొరేటరీతో పాటు పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉంటుంది. ఉత్తమ గ్రంథాలయం, ప్రయోగశాల, పర్యావరణమిత్ర అవార్డులతో పాటు క్రీడలు, కళల్లో అంతర విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు లభించాయి. విద్యార్థులకు చదువుతో పాటు విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడంతో పేద, మధ్య తరగతి వర్గాల వారి ఆదరణ పొందింది. క్రమశిక్షణకు మారుపేరుగా నిలవడంతో ఇక్కడ చదివిన ఎంతో మంది విద్యార్థులు పలు రంగాలలో ప్రముఖులుగా పేరుతెచ్చుకున్నారు. వీరిలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి, లోక్‌సత్తా అధ్యక్షులు జయప్రకాష్‌నారాయణ్, రాష్ట్రమంత్రులు కాసు వెంకట కృష్ణారెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ఎంపీ లగడపాటి రాజశేఖర్ తదితరులున్నారు. నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు కళాశాలలో పలు సదస్సులు నిర్వహిస్తున్నారు. ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్‌లో కూడా విద్యార్థినులు రాణిస్తున్నారు. 2004లో కళాశాల స్వర్ణోత్సవాలను జరుపుకొంది. 2007లో ఇంజినీరింగ్ కళాశాలను కూడా స్థాపించి నాలుగు విభాగాల్లో కోర్సులను అందిస్తున్నారు. ఇదే ఆవరణలో కళాదర్శిని పేరిట ఏటా సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహిస్తూ ఎంతో మంది చిన్నారులను కళా రంగంలో ప్రావీణ్యం పొందేలా ప్రోత్సహిస్తున్నారు.

నదులు - ప్రాజెక్టులు

ద్వీపకల్పం పడమర నుంచి తూర్పు చివరి వరకు సాగే ప్రస్థానంలో 29 ఉపనదులను తనలో కలుపుకుంటోంది కృష్ణమ్మ. మహేబలేశ్వరంలో పుట్టిన నదీమ తల్లి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలను సస్యశ్యామలం చేసి మహబూబ్‌నగర్ జిల్లా తంగడి వద్ద ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేస్తోంది. జగ్గయ్యపేట మండలంలోని ముక్త్యాల గ్రామానికి మూడు కిలోమీటర్ల ఎగువన కృష్ణాజిల్లాలోకి అడుగిడుతోంది. మొత్తం 125 కి.మీ. మేర ప్రవహించి దివిసీమలోని హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ ఆనకట్ట ద్వారా సుమారు 14లక్షల ఎకరాల ఆయకట్టును సస్యశ్యామలమవుతోంది. జిల్లాకు తాగు, సాగు నీటి వనరు కృష్ణానదే. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణాడెల్టాను రెండుగా విభజించారు. గూంటూరు ప్రకాశం జిల్లాలకు పశ్చిమ ప్రధాన కాల్వను తాడేపల్లి సీతానగరం వద్ద నిర్మించగా, ఎడమ వైపు విజయవాడను ఆనుకుని కృష్ణా తూర్పు ప్రధాన కాల్వను నిర్మించారు. వీటిద్వారా కృష్ణ, గుంటూరు జిల్లాలే కాకుండా, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొంతమేర లబ్ధిపొందుతున్నాయి. కృష్ణా-గుంటూరు జిల్లాలకు మధ్య హద్దుగా ప్రవహించే కృష్ణా ఇరు జిల్లాల మధ్య రవాణా మాధ్యమంగా కూడా ఎంతగానో ఉపయోగపడుతోంది. జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ, కంచికచర్ల, ఇబ్రహీంపట్నం, పెనమలూరు, తోట్లవల్లూరు, ఘంటసాల, మోపిదేవి, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాలను తాకతూ కృష్ణానది ప్రవహిస్తుంది. విజయవాడ వద్ద, గుంటూరు జిల్లాలోని అమరావతి క్షేత్రం వద్ద కిలోమీటర్ల వెడల్పున అత్యంత విశాలంగా ప్రవహిస్తుంది. జిల్లాలోని వివిధ పరిశ్రమలకు ముఖ్యంగా థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఈ కృష్ణానది నీరే ఆధారం. కృష్ణా, గుంటూరులను కలిపే మూడు ప్రధాన వంతెనలు నదిపై ఉన్నాయి. అవి ప్రకాశం బ్యారేజీ, కనకదుర్గ వారధి, పులిగడ్డ-పెనుమూడి వారధి. ప్రకాశం బ్యారేజీ తర్వాత కృష్ణా నీటిని నిల్వ చేసే సౌలభ్యం లేకపోవడం ఎక్కువ నీరు సముద్రం పాలవుతోంది. పశ్చిమ కృష్ణాలోని ముల్లేరు, పాలేరు, మునేరు, వైరా ఏరుతో పాటు పలు చిన్నచిన్న వాగులు కృష్ణా నదికి ఉపనదులుగా ఉన్నాయి. ఖమ్మం జిల్లా న్టుంచి వచ్చే పాలేరు, వైరా ఏరు, మునేరుతోపాటు జగ్గయ్యపేట ప్రాంతంలో షేర్‌మహ్మద్‌పేట గిన్నెచెరువు వచ్చే ముల్లేరుతో పాటు తాళ్లవాగు, చంద్రమ్మకయ్య, చీకటి వాగు వంటి పలువాగులు కలుస్తాయి.

ప్రకాశం బ్యారేజీ
కృష్ణా నదిపై నాగార్జునసాగర్ దిగువున 180 కి.మీ వద్ద విజయవాడ నగరాన్ని ఆనుకుని 1854లో నిర్మితమైన ఆనకట్ట స్థానే ప్రకాశం బ్యారేజీ నిర్మితమైంది. 1952లో పురాతన ఆనకట్ట కూలిపోగా 1954-57 మధ్య ప్రకాశం బ్యారేజీని నిర్మించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా డెల్టా రెండుగా విభజించారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు పశ్చిమ ప్రధాన కాల్వను తాడేపల్లి సీతానగరం వైపు నిర్మించారు. ఈ కాల్వతో గుంటూరులో 2.30 లక్షల హెక్టార్లు, ప్రకాశం జిల్లాలో 29 వేల హెకార్లకు సాగునీరందుతుంది. ప్రకాశం బ్యారేజీ ఎడమ వైపు విజయవాడను ఆనుకుని కృష్ణా తూర్పు ప్రధాన కాల్వ నిర్మితమైంది. కృష్ణాలో 2.42 లక్షల హెక్టార్లు పశ్చిమ గోదావరి జిల్లాలో మరో 23వేల హెక్టార్లకు ఈ కాల్వ నీరందిస్తుంది.

మునేరు ఆనకట్ట
బ్రిటిషు ప్రభుత్వ హయాంలో 1860 ప్రాంతంలో పోలంపల్లి వద్ద మునేటిపై ఆనకట్ట నిర్మాణం జరిగింది. వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ మండలాకు చెందిన 16.5 వేల ఎకరాలు దీని ఆయకట్టులో ఉన్నాయి. అప్పట్నించి దాదాపు వందేళ్ళపాటు ఎటువంటి మరమ్మతులు లేకుండా ఆయకట్టుకు పుష్కలంగా నీరు అందించింది. 2004లో ముఖ్యమంత్రిగా వై.ఎస్. రాజశేఖరరెడ్డి తొలిసారిగా పల్లెబాట పేరుతో ఈ జిల్లా పర్యటనకు వచ్చి ఇక్కడ రాజీవ్ ప్రాజెక్టు పేరున కొత్త ఆనకట్టకు శంకుస్థాపన చేశారు. ఈ జిల్లాలో జలయజ్ఞం కింద మంజూరైన తొలి ఆనకట్ట ఇది. ఇది పూర్తయితే 5-6వేల ఎకరాలకు కొరత లేకుండా నీరు అందుతుంది. ఈ ప్రాంతం నుంచి ఖమ్మం జిల్లాకు రవాణా మార్గం ఏర్పడుతుంది.

నీటిపారుదల

కృష్ణాజిల్లాలో నీటవనరులకు కొదవ లేదు. కృష్ణానదిలో జిల్లా ప్రవహిస్తుండటంతో దాదాపు ఏడాది అంతా (ఏప్రిల్, మే, జూన్ మాసాలు మినహా) కాలువలు, చెరువులు నీటితో కళకళలాడుతుంటాయి. జిల్లా వ్యవసాయానికి ప్రధాన నీటి వనరులు కాలువలు. కృష్ణానది తూర్పు ప్రధాన కాలువ కింద ఏలూరు, రైవన్, బందర్, కృష్ణా తూర్పు బ్రాంచి(కరవు) కాల్వల ద్వారా ఖరీఫ్, రీబీలకు నీరందతోంది. దీనితో పాటు భూగర్భ నీటి వనరులు కొదవలేదు. ఎక్కువ మంది రైతులు విద్యుత్ పంపు సెట్లను వినియోగిస్తున్నారు. విజయవాడలో కృష్ణా జిల్లా ఇంద్రకీలాద్రి, గుంటూరు జిల్లా తాడేపల్లి కొండల నడుమ 1852లో సర్ ఆర్థర్ కాటన్ నేతృత్వంలో, కెప్టెన్ ఓర్ పర్యవేక్షణలో నిర్మించిన ఆనకట్ట ద్వారా డెల్టా నీటిపారుదల వ్యవస్థకు రూపకల్పన జరిగింది. 1856లో పూర్తయిన ఆనకట్ట ద్వారా 5.8 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు నిర్దేశించారు. తదుపరి 1923లో 8 లక్షల ఎకరాలకు, 1952 నాటికి 11 లక్షల ఎకరాలకు ఆయకట్టు పెరిగింది. ప్రస్తుతం 13.08 లక్షల ఎకరాల ఆయకట్టుకు విస్తరించింది. 1952లో ఆనకట్టకు గండిపడగా, 1954లో కొత్త ఆనకట్ట ప్రారంభించి 1957కి పూర్తి చేశారు. ఇదే ఇప్పటి ప్రకాశం బ్యారేజీ. దీని వల్ల కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భూములు సస్యశ్యామలమై వర్థిల్లుతున్నాయి. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా జోన్ 2, జోన్ 3 కింద పశ్చిమ కృష్ణాలో మరో 2.30 లక్షల హెక్టార్లు ఆరుతడి పంటల కింద సాగవుతున్నాయి. మునేరు, తమ్మిలేరు, కట్టలేరు, పాలేరు వాగుల ద్వారా మరికొంత భూమి సాగులో ఉంది.

సాగునీటి వనరులు
కృష్ణా తూర్పు ప్రధాన కాల్వ కింద ఏలూరు, రైవస్, బందరు, కృష్ణా తూర్పు బ్రాంచి (కరవు) కాల్వల కింద నీరందుతుంది.
కృష్ణా ఎడమ ప్రధాన కాల్వ కింద జోన్ 2లో జగ్గయ్యపేట, నందిగామ, జోన్ 3లో నూజివీడు, మైలవరం కాల్వలు ఉన్నాయి.
చిన్న నీటిపారుదల చెరువులు :696
ఎత్తిపోతల పథకాలు: 74
చిన్న తరహా నీటిపారుదల పథకాలు: 664
మధ్యతరహా నీటిపారుదల పథకాలు: 3

ప్రధాన పంటలు

రాష్ట్రంలో ప్రధాన ఆహార ధాన్యాగారాల్లో ఒకటిగా కృష్ణా జిల్లా పేరొందింది. ఈ జిల్లాల్లో దాదాపు 70 శాతం ప్రజలు వ్యవసాయాధారంగానే జీవనం సాగిస్తున్నారు. జీవనది కృష్ణా వల్ల సాగునీటి సమస్యలేనందున పంటలు పుష్కలంగా పండుతాయి. ప్రకాశం బ్యారేజీ దిగువన 30 మండలాలను డెల్టా మండలాలుగా, ఎగువన పశ్చిమకృష్ణాలో ఉన్న మిగిలినవి మెట్ట ప్రాంతానికి చిహ్నంగా నీటి సమస్యతో కనిపిస్తాయి. డెల్టాలో వరి, చెరకు ప్రధాన పంటలు. పసుపు, అరటి, తమలపాకు, కూరగాయల సాగు కూడా జరుగుతోంది. ఎగువ మండలాల్లో ప్రధానంగా పత్తి, మిరప, పొగాకు వంటి వాణిజ్య పంటలు సాగవుతుంటాయి.
కృష్ణా జిల్లాలో మొత్తం 5.24 లక్షల మంది వ్యవసాయదారులు ఉన్నారు. ఇందులో సన్న, చిన్న కారు రైతులు 4.51 లక్షల మంది.
వ్యవసాయం మీద ఆధారపడి 6.73 లక్షలమంది కూలీలు జీవనం సాగిస్తున్నారు.
కృష్ణా జిల్లాలో సాగు యోగ్యమైన నికర భూమి 4.49 లక్షల హెక్టార్లు.
ఒకసారి కంటే ఎక్కువ సార్లు పండించే భూమి: 2.47 లక్షల హెక్టార్లు
జిల్లాలో 1.50 లక్షల హెక్టార్లలో పంటలు వర్షాధారంగా పండుతాయి.

జిల్లాలో ప్రధాన పంటల సాగు వివరాలు(హెక్టార్లలో)
పంట ఖరీఫ్ రబీ
వరి 45,480 1,10,000
జొన్న 2162 1370
మొక్కజొన్న 6934 8895
కంది 8244 484
మినుము 5591 1,23,165
పెసర 15352 20560
శనగ ..... 2,000
వేరు శనగ 2059 7917
మిరప. 10,000 1.000
చెరకు. .... 16759.
పొగాకు ... 4,550
పత్తి 47,000 ......

లక్ష ఎకరాల్లో ఆక్వా!
జిల్లాలో 1980-90 మధ్య తీరప్రాంతంలో నీలి విప్లవం ప్రారంభమైంది. బందరు, బంటుమిల్లి, కైకలూరు, కృత్తివెన్ను, నాగాయలంక మండలాల్లో రొయ్యలసాగుతో రైతులు లాభాలు గడించారు. దాదాపు 12వేల హెక్టార్లలో టైగర్ రొయ్యలు, ఉప్పునీటి రొయ్యల సాగు చేపట్టారు. అనతికాలంలోనే తెల్ల మచ్చల వ్యాధితో పరిశ్రమ దెబ్బతింది. నీలి విప్లవం చతికిలపడింది. తదుపరి మంచినీటి చేపల చెరువులు ప్రారంభమయ్యాయి. డెల్టాలో ఈ చెరువులు క్రమేపీ విస్తరిస్తున్నాయి. కొల్లేరు సరస్సును కూడా వదలకుండా విస్తరించిన చేపల చెరువులు సుమారు లక్ష ఎకరాలకు మించి ఉన్నాయి. జిల్లాలో వ్యవసాయం తరువాత గ్రామాల్లో పాడి పరిశ్రమ ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. కోళ్ల పరిశ్రమ కూడా విస్తరించింది.

నూజివీడు మామిడి
వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల్లో ప్రధానంగా చెప్పుకోదగినది నూజివీడు మామిడి(చిన్న రసాలు). సుమారు 62,793 హెక్టార్లలో మామిడిని సాగుచేస్తున్నారు. నూజివీడు మామిడికి దేశవాప్తంగానే కాకుండా విదేశాల్లో సైతం విపరీతమైన డిమాండ్ ఉంది.

చక్కెర
చక్కెర ఎగుమతికి కూడా కృష్ణాజిల్లా పేరుగాంచింది. డెల్టా, కేసీపీ చక్కెర కర్మాగారాల ద్వారా పెద్ద ఎత్తున దేశ విదేశాలకు చక్కెరను ఎగుమతి చేస్తున్నారు. సుమారు 17,000 హెక్టార్లలో చెరకు పంట పండుతోంది.

పర్యాటకం

ఇంద్రకీలాద్రి
బెజవాడ కనకదుర్గమ్మ కొలువైన (ఇంద్రకీలాద్రి) శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకి.. అమ్మలగన్న అమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ.. ఇక్కడ శ్రీచక్ర అధిష్టాన దేవత దుర్గమ్మగా వెలసింది! కోరినవారికి వరాలిచ్చే కొంగు బంగారంగా ‘బెజవాడ కనకదుర్గ’గా వాసికెక్కింది. ఈ దుర్గ గుడి క్షేత్ర పాలకుడు.. ఆంజనేయస్వామి. అందుకే ఇక్కడికొచ్చే భక్తులు ముందుగా హనుమను దర్శించుకొని.. ఆపై అమ్మవారిని.. మల్లేశ్వరస్వామివారిని దర్శించుకుని.. ఆశీస్సులు పొందుతుంటారు.
ఇంద్రకీలాద్రి స్థలపురాణం
త్రైలోక్యమాత.. దుర్గాదేవి లోకకంటకుడైన మహిషాసురుడిని సంహరించిన అనంతరం.. ఇంద్రాది దేవతల కోరికపై పరమ పవిత్రమైన ఇంద్రకీలాద్రి మీద మహామహిమాన్వితమైన మహిషాసుర మర్దిని రూపంలోనే స్వయంభువుగా వెలిసింది. ఇక్కడే 12వ శతాబ్దంలో విష్ణువర్దన మహారాజు అమ్మవారిని కొలిచినట్లు శాసనాలు చెబుతున్నాయి. విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణ దేవరాయలు అమ్మవారిని దర్శించుకున్నట్లు చరిత్రలో ఉంది. ఉగ్ర స్వరూపిణిగా ఉన్న అమ్మవారిని శంకరాచార్యులు దర్శించుకుని శ్రీచక్రం వేసి శాంతి స్వరూపిణిగా మార్చారని స్థలపురాణంలో ఉంది.
పరిసరాల్లోని ఉపాలయాలు: ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంతో పాటు మల్లేశ్వరాలయం, క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వరాలయం, నటరాజస్వామి ఆలయం ఉన్నాయి. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఈ ఆలయాలను సందర్శించి భక్తితో పూజలు చేస్తారు.
దర్శన సమయాలు
* వేకువజామున 4 గంటల నుంచి 9 గంటల వరకు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. మధ్యాహ్నం భోగం సమయంలో కాసేపు దర్శనాన్ని నిలిపివేస్తారు.
* ఆలయంలో చేసే ప్రధాన పూజలు: ఇంద్రకీలాద్రిపై ఖడ్గమాల, లక్ష కుంకుమార్చన, స్వర్ణపుష్పాలతో అర్చన, శ్రీ చక్రార్చన, చండీహోమం, శాంతి కల్యాణం ప్రధానపూజలు.
* ఖడ్గమాల పూజ తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సేవలో పాల్గొనే భక్తులు రూ. 516 చెల్లించి వేకువజామున 4 గంటలకు ఆలయానికి చేరుకోవాలి. రెండుగంటల పాటు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ పూజ జరుగుతుంది. ఒక టిక్కెట్టుపై దంపతులను అనుమతిస్తారు.
* మిగతా పూజలకూ రుసుం.. రూ. 516 మాత్రమే. ఈ పూజలు ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు జరుగుతాయి. ఒక టిక్కెట్టుపై దంపతులు పాల్గొనవచ్చు. ఈ పూజల కోసం ఉదయం 8 గంటలకే ఆలయానికి చేరుకోవాలి. ప్రధానమైన పూజల్లో స్వర్ణపుష్ప పూజ ఒకటి. ప్రతి గురువారం సాయంత్రం 5.15 గంటల నుంచి 6.30 గంటల వరకు అమ్మవారి అంతరాలయంలో 108 స్వర్ణపుష్పాలతో జరిగే ఈ పూజలో భక్తులు రూ. 2,500 చెల్లించి పాల్గొనవచ్చు. కేవలం ఏడు టిక్కెట్లు మాత్రమే ఇస్తారు.
* రోజూ సాయంత్రం 6 గంటల నుంచి 6.30 గంటల వరకు హారతుల సమయం. ఈ సమయంలో అమ్మవారి హారతులు తిలకించేందుకు రూ. 200 టిక్కెట్టు తీసుకుంటే.. ఒక టిక్కెట్టుపై ఇద్దరు చొప్పున అనుమతిస్తారు. స్థలాభావం కారణంగా కేవలం 20 టిక్కెట్లు మాత్రమే రోజూ సాయంత్రం 4 గంటల నుంచి దేవస్థానం అధికారులు కౌంటరులో విక్రయిస్తారు. దసరా ఉత్సవాలు, భవానీదీక్షలు, బ్రహ్మోత్సవాల సమయంలో కాకుండా ఈ పూజలు నిర్వహించుకోవచ్చు. పూజలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి శేషవస్త్రం, రవిక, లడ్డూప్రసాదం అందజేస్తారు.
దేవస్థానంలో నిర్వహించే పూజలు: ఇంద్రకీలాద్రిపై దేవస్థానంలో పరిమిత దినాల్లో నిర్వహించే ప్రత్యేక పూజల్లో భక్తులు ఉచితంగా పాల్గొనవచ్చు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్బారు సేవ, ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు ప్రత్యేక సేవలు జరుగుతాయి. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కృష్ణానదీ తీరాన దుర్గాఘాట్‌లో కృష్ణమ్మకు పంచహారతులు ఇస్తారు. ఈ హారతులను భక్తులంతా తిలకించవచ్చు. దసరా రోజుల్లో భవానీలకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేస్తారు.
అన్నప్రసాద వితరణ: 1991 నుంచి ఇంద్రకీలాద్రిని దర్శించుకునే భక్తులకు శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ నిర్వహిస్తోన్నారు. భక్తులు అందించిన విరాళాలను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసి వాటిపై వచ్చే ఆదాయంతో రోజూ 5 వేల మందికి ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ అన్నప్రసాద వితరణ చేస్తున్నారు.
రవాణా సౌకర్యాలు: విజయవాడ.. రైలు.. రోడ్డు.. విమాన మార్గాల్లో అనుసంధానమై వుంది. కోల్‌కతా- చెన్నై జాతీయరహదారిపై ఉన్న నేపథ్యంలో విజయవాడకు దేశం నలుమూలల నుంచి రోడ్డుమార్గంలో చేరడం చాలా సులభం. ఆపై ఇక్కడి పండిట్‌ నెహ్రూ సెంట్రల్‌ బస్‌స్టేషన్‌ నుంచి ఇంద్రకీలాద్రిపైకి ప్రతి 10 నిమిషాలకో సిటీ/ మెట్రో బస్సు చొప్పున ఉన్నాయి. అలాగే ప్రైవేటు ఆటోలు.. క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి. సొంత వాహనాల ద్వారా అమ్మవారి సన్నిధికి చేరుకోవచ్చు. అలాగే విజయవాడ రైల్వేస్టేషన్‌ నుంచి ఆర్టీసీ మెట్రో బస్సులతో పాటు ప్రైవేటు ఆటోలు.. క్యాబ్‌లు విస్తృతంగా లభిస్తాయి. గన్నవరం విమానాశ్రయం ద్వారా కూడా సుదూర ప్రాంతాల వారు సులభంగా విజయవాడ-ఇంద్రకీలాద్రిని చేరవచ్చు.
వసతి సౌకర్యం: ఇంద్రకీలాద్రిపై మేడపాటి గెస్ట్‌హౌస్‌.. ఇంద్రకీలాద్రి గెస్ట్‌హౌస్‌ల్లో కలిపి మొత్తం (ఏసీ.. నాన్‌ ఏసీ) 55 గదులు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. వీటిని రోజుకు కనిష్ఠంగా రూ. 500 నుంచి గరిష్ఠంగా రూ. 1200 చొప్పున రుసుంతో కేటాయిస్తారు. ఇవి కాకుండా విజయవాడ నగరంలో పలు ప్రభుత్వ.. ప్రైవేటు వసతిగృహాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో వసతి గురించి భక్తులు ఇబ్బంది పడాల్సిన పనిలేదు. మరిన్ని వివరాలకు శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం వెబ్‌సైట్‌ను చూడవచ్చు.

విహార యాత్రా స్థలంగా 'ఖిల్లా'
జిల్లాలో ప్రసిద్ధి గల ప్రాంతాల్లో కొండపల్లి ఖిల్లా ఒకటి. సముద్ర మట్టానికి 1200 అడుగుల ఎత్తులో ఉన్న కొండపల్లి ఖిల్లాలో చెప్పకోదగినది దీని నిర్మాణం. ఓ అద్భుతమైన శత్రు దుర్బేధ్యమైన కోటగా దీనిని అభివర్ణించేవారు. దీనిని 1350లో అనవేమారెడ్డి అనే రాజు ఓ కొండకాపరి సూచనల మేరకు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. శత్రు రాజుల సైన్యాలు దండెత్త్తిన సమయాల్లో వారిని అడ్డుకోవడానికి 18 బురుజుల నుంచి కోట సైన్యం వారిని అడ్డుకోవడానికి ఏర్పర్చుకున్న ప్రత్యేక ఏర్పాట్లు, శత్రువులపైకి రాళ్లు విసిరేందుకు మానవ శక్తి అవసరం లేని ఓ యంత్రం, రాజుగారి విహార మందిరం, నర్తన శాల, రాణిమహల్, రధాలు నడవడానికి గల రహదారి మార్గం, గుర్రాలు, సైనికులు రావడానికి కాలిబాట మార్గం... తదితరాలన్నీ చూసి తీరవలసిందే. కోటపై నుంచి విజయవాడ తదితర ప్రాంతాలు చూడటానికి వీక్షణా కేంద్రాలున్నాయి. ఇవి కాక 400 ఏళ్ల చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మలు ఈ ప్రాంతంలో తయారవుతాయి.

ప్రకాశం బ్యారేజీ
కృష్ణా, గుంటూరు జిల్లాలను కలపుతూ కృష్ణానదిపై నిర్మించిన ప్రకాశం బ్యారేజీ నగరానికి ప్రధాన ఆకర్షణ. కనకదుర్గమ్మ కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి దిగువన బ్యారేజీ నిర్మాణం జరిగింది. దీన్ని 1957 సంవత్సరంలో నిర్మించారు. 1954వ సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1957 డిసెంబరు 24వ తేదీ నాటికి నిర్మాణం పూర్తయ్యింది. దీనికి ప్రకాశం బ్యారేజీ అంటూ నామకరణం చేసి అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ప్రారంభోత్సవం చేశారు.

విక్టోరియా మ్యూజియం
నగరంలోని విక్టోరియా మ్యూజియంకు వందేళ్ల చరిత్ర ఉంది. విక్టోరియా మహారాణి పాలన కాలంలో 1887 సంవత్సరంలో మ్యూజియంను ప్రారంభించారు. మ్యూజియంలో పురాతన, ఆదిమానవులు ఉపయోగించిన ఎన్నో రకాల వస్తువులు కొలువుదీరాయి. మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోను బయటపడిన అనేక వస్తువులు ఆశ్చర్యచకితులను చేస్తాయి. వీటితో పాటు మట్టిపాత్రలు, దంతపు ముక్కలు, కళాఖండాలు, శాసన లిపి పలకలు, రాతప్రతులు, కత్తులు, శూలాలు, అంబులు, తుపాకులు, తాళపత్ర గ్రంథాలు, పురాతన నాణాలు కనిపిస్తాయి.

రీజనల్ సైన్స్ సెంటర్
విద్యార్థుల్లో విజ్ఞాన జిజ్ఞాస, ఆసక్తి పెంపొందిస్తూ వినోదం కలిగించాలన్న ఉద్దేశంతో విజయవాడ భవానీపురంలోని కృష్ణానదీ తీరాన ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రాంతీయ విజ్ఞాన కేంద్రాన్ని (రీజినల్ సైన్స్ సెంటర్, ఆర్‌సీఎస్) ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో సైన్స్ అభివృద్ధికి, శాస్త్ర సాంకేతిక రంగాలలో కార్యక్రమాలను నిర్వహిస్తున్న రాష్ట్ర, సాంకేతిక మండలి (అప్‌కాస్ట్) దీన్ని ఏర్పాటు చేసింది. 2005 జూన్ 5న అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. ఎడ్యుశాట్ ద్వారా ఏ రంగంలోని వారైనా ఈ విజ్ఞాన కేంద్రం నుంచి దేశంలోని 32 కేంద్రాల వారితో సంభాషించడానికి వీలుంది. ఈ టెర్మినల్ ద్వారా సుదూర ప్రాంతాల్లోని శాస్త్రవేత్తలతో నేరుగా మాట్లాడి సందేహాలను తీర్చుకునే అవకాశం ఉంది. ఇలాంటి సౌకర్యం సైన్స్ సెంటర్ రాష్ట్రంలోనే ప్రప్రథమం.

భవానీద్వీపం
కృష్ణానది మధ్యలో సహజసిద్ధంగా ఏర్పడింది భవానీద్వీపం. సుమారు 134 ఎకరాల విస్తీర్ణంలో ద్వీపం విస్తరించి ఉంది. పర్యాటక శాఖ 12 ఎకరాల మేర అభివృద్ధి చేసింది. సందర్శకులకు మానసిక ప్రశాంతతను అందించేందుకు వీలుగా పచ్చని చెట్లు, పిల్లలు ఆడుకోవటానికి ఆట పరికరాలున్నాయి. కృష్ణానది మధ్యలో ప్రశాంత వాతావరణంలో ఈ ద్వీపం ఉండటంతో నగరప్రజలతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా పర్యటకులు తరలివస్తున్నారు. ద్వీపంలో ప్రత్యేకంగా 24 కాటేజీలు, 4 ట్రీ టాప్ కాటేజీలు, ఒక కాన్ఫరెన్స్ హాలు, రెండు రెస్టారెంట్లున్నాయి. దుర్గగుడి దిగువన ఉన్న దుర్గాఘాట్, పున్నమిఘాట్, లోటస్ హోటల్ వద్ద నుంచి బోటింగ్ పాయింట్లు ఉన్నాయి. వీటి వద్ద నుంచి బోటులో ద్వీపానికి తీసుకువెళతారు.

ఆకట్టుకునే గాంధీపర్వతం
నగరవాసులతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చే పర్యాటకులను గాంధీకొండ ఆకర్షిస్తోంది. నేషనల్ గాంధీ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో గాంధీజీ స్మారక చిహ్నం ఉన్న స్థూపాన్ని నెలకొల్పారు. 1965లో స్థూపం నిర్మాణాన్ని ప్రారంభించగా, నిర్మాణం పూర్తయ్యేనాటికి మూడేళ్లు పట్టింది. 1968 అక్టోబరు 6న అప్పటి ప్రధాని లాల్ బహదూర్‌శాస్త్రి ప్రారంభోత్సవం చేశారు. కొండ పైభాగంలో 52 అడుగుల ఎత్తులో గాంధీజీ స్మారక స్థూపాన్ని నిర్మించారు. గాంధీపర్వతంపై గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇందులో గాంధీజీ జీవిత చరిత్ర, స్వాతంత్య్ర సమరయోధులకు సంబంధించిన అనేక పుస్తకాలున్నాయి. పర్యాటకులను ఆకట్టుకునే విధంగా, నగరం మొత్తాన్ని వీక్షించేలా కొండపై రైలును ఏర్పాటు చేశారు. కొండ దిగువన ఉన్న నక్షత్రశాల సందర్శకులను ఆకట్టుకుంటుంది.

కొల్లేరు సరస్సు
ప్రపంచ ప్రసిద్ధి చెందిన మంచి నీటి సరస్సు కొల్లేరు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 77,138 ఎకరాల్లో ఈ సరస్సు విస్తరించి ఉంది. కృష్ణా జిల్లా కైకలూరు, మండవల్లి మండలాల్లో 12 వేల ఎకరాల్లో ఉంది. ఈ సరస్సులోకి రామిలేరు, తమ్మిలేరు, బుడమేరు, ఎర్రకాలువ వంటి నదులు, 18 రకాల డ్రెయిన్‌ల ద్వారా వర్షాకాలంలో నీరు వచ్చి చేరుతుంది. ప్రతి ఏటా శీతాకాలం తొలివారంలో ఆస్ట్రేలియా, నైజీరియా, ఫిజి, దక్షిణ ప్రాంతం నుంచి పలు రకాల పక్షులుకొల్లేరుకు వలస వచ్చి సంతానోత్పత్తి చేసుకుని మరలా వాటి దేశాలకు వెళ్లిపోతాయి. కొల్లేరు సరస్సులో 183 రకాల పక్షిజాతులు ఉన్నట్లు పక్షుల అధ్యయన నిపుణుల అంచనా. కొల్లేరు వలస వచ్చే పక్షుల్లో గూడబాతు (ఫెలికాన్)దే అగ్రస్థానం.

పరిశ్రమలు

వెలుగు దివ్వె ఎన్టీటీపీఎస్
డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్) రాష్ట్ర విద్యుత్తు అవసరాలలో సగానికి పైగా తీరుస్తూ, తన వైశిష్ట్యాన్ని చాటుకుంటోంది. విజయవాడకు 15 కిలో మీటర్ల దూరంలో కొండపల్లి, ఇబ్రహీంపట్నం గ్రామాల సరిహద్దుల మధ్య 1973లో దీనిని ఏర్పాటు చేశారు. ఆనాటి కేంద్ర మంత్రి డాక్టర్ కె.ఎల్.రావు, విద్యుత్తు బోర్డు ఛైర్మన్ నార్ల తాతారావులు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రారంభంలో 210 మోగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ తరువాత రెండు, మూడు దశల్లో 210 మెగా వాట్ల సామర్థ్యం గల 4 యూనిట్లను నెలకొల్పారు. 2009లో నాలుగో దశగా 500మెగావాట్ల 7వ యూనిట్‌ను ప్రారంభించారు. 2010 నాటికి పూర్తి స్థాయిలో 1760 మెగావాట్ల విద్యుత్తు స్టేషన్‌గా ఇది రూపొందింది. బొగ్గు ఆధారితమైన ఈ కేంద్రానికి మన రాష్ట్రంలోని సింగరేణి, ఒడిషాలోని పాల్చేరుల నుంచి బొగ్గు సరఫరా అవుతుంది. రోజుకు 190టన్నుల బొగ్గు ఈ కేంద్రంలో వినియోగమవుతుంది. కృష్ణా నది నుంచి ఓపెన్ ఛానల్ ద్వారా నీటిని తీసుకుని వినియోగిస్తున్నారు. బాయిలర్‌లలో కాల్చిన బొగ్గు ఉపయోగానంతరం బూడిదగా మారుతుంది. దీనిని నీటిలో కలిపి జూపూడి, ఇబ్రహీంపట్నం గ్రామాల కొండల మధ్యనున్న చెరువుకు మళ్లిస్తారు. నీటిలోని బూడిదను సాంకేతిక పద్ధతుల ద్వారా వేరుచేసి, నీటిని రైతులకు సాగు అవసరాలకు విడుదలచేస్తారు. వేరుచేసిన బొగ్గును సిమెంటు ఫ్యాక్టరీలకు, ఇటుకల తయారీ బట్టీలకు తరలిస్తున్నారు.

ఆటోనగర్ అదుర్స్!
ఆసియాలోనే అతి పెద్ద ఆటోనగర్‌గా విజయవాడ జవహర్ ఆటోనగర్ పేరుగాంచింది. ఆటోమొబైల్, వాహనాల విడిభాగాల తయారీ, అమ్మకాలకు ఇది నిలయం. బెజవాడ నగర శివారులో పారిశ్రామిక ఎస్టేట్ పక్కన సుమారు 275ఎకరాల స్థలంలో జవహర్ ఆటోనగర్‌ను స్థాపించారు. నగర నడిబొడ్డున ఉన్న మెకానిక్ షెడ్డు, ఫౌండరీల వల్ల ట్రాఫిక్, కాలుష్యం సమస్యలు ఉత్పన్నమవుతున్న విషయాన్ని ఇక్కడి ఆటోనగర్ పెద్దలు అప్పటి పరిశ్రమలశాఖ మంత్రి మర్రిచెన్నారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. పరిశ్రమలశాఖ ద్వారా స్థల సేకరణ చేయించి, ఆటోనగర్ ఏర్పాటుకు అంకురార్పణ చేశారు. 1966లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆటోనగర్‌కు శంకుస్థాపన జరిపారు. ఆటోమొబైల్‌కు సంబంధించిన అన్ని విడిభాగాలు, లారీ బాడీబిల్డింగ్‌కు సంబంధించిన యూనిట్లన్నీ ఒకే చోట ఏర్పాటవడంతో దీనికి 'ఆటోనగర్' అని నామకరణం చేశారు. రాష్ట్రంలో ఆటోనగర్ అనే పేరువాడుకలోకి వచ్చింది విజయవాడ ఆటోనగర్ నుంచే! ఆటోమొబైల్‌కు సంబంధించిన కార్పెంటర్, టింకరింగ్, వెల్డింగ్, టైర్ రీత్రెడ్డింగ్, పెయింటర్స్, ఇంజిన్ రీబోరింగ్, ఫ్యూయల్ ఇంజక్షన్, మెకానిక్ తదితరపనులతో వివిధ వృత్తుల వారు ఆటోనగర్‌పై ఆధారపడి జీవనం తమ సాగిస్తున్నారు. ఆటోనగర్‌లో అధికంగా ఆటోమొబైల్ సర్వీస్ యూనిట్లు ఉన్నాయి. వీటితో పాటు స్టీల్, అల్యూమినియం, క్యాస్టింగ్, కార్టన్స్, బేకరీ, ట్రాన్స్‌ఫార్మర్లు, చెప్పులు, రబ్బరు, రేడియేటర్లు, ఆటోమొబైల్ సిలిండర్లు, లైనర్లు తయారీ యూనిట్లు ఉన్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆటోనగర్ మీద ఆధారపడి సుమారు 80వేల మంది ఉపాధి పొందుతున్నారు. లారీల బాడీల తయారీలో విజయవాడ ఆటోనగర్ ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లారీ యజమానులు ఇక్కడకు వచ్చి లారీ ఛాసిస్‌లకు బాడీలు కట్టించుకొని వెళ్తుంటారు. యేటా జనవరిలో కొత్త మోడళ్లు మార్కెట్‌లోకి వచ్చినప్పుడు ఆటోనగర్‌లో కొత్త ఛాసిస్‌లు బాడీబిల్డింగ్ తయారీ వాహనాలతో కళకళలాడుతుంటాయి. మార్కెట్‌ను బట్టి వెయ్యి నుంచి రెండువేల లారీలను ఇక్కడ తయారు చేస్తుంటారు.

పడిలేచిన కెరటం అప్మెల్
రైతాంగం, ఆర్థిక సంస్థల చేయూతతో నిర్మించిన ఆంధ్రప్రదేశ్ హెవీ మిషనరీ ఇంజినీరింగ్ లిమిటెడ్(అప్మెల్) సంస్థ గత 35 సంవత్సరాల కాలంలో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని భారీ యంత్ర పరికరాల రూపకల్పనలో మేటిగా నిలుస్తోంది. 1976లో ప్రారంభమైన సంస్థ ప్రస్థానం లాభాలను అందిపుచ్చుకుంటూ టర్బైన్ కేసింగ్స్, మైనింగ్ ఛైల్డ్ కన్‌వేయర్స్ విభాగాలను సమర్థంగా పని చేస్తూ తన కంటూ ఒక గుర్తింపును సంతరించుకుంది. రూ.17.27 కోట్ల మూల ధనం, 200 ఎకరాల విస్తీర్ణంలో కొండపల్లికి ఉత్తరాన దీనిని ఏర్పాటు చేశారు. 522 మంది కార్మికులు, ఉద్యోగులు, సిబ్బంది సంస్థ నిర్వహణలో పాలుపంచుకుంటున్నారు. గతంలో కోట్ల రూపాయల నష్టాల వూబిలో కూరుకుపొయి సంస్థను ఒక దశలో మూసి వేయాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. దీనికి బి.ఐ.ఎఫ్.ఆర్ కూడా తన అంగీకారాన్ని తెలిపింది. అనంతరం జిల్లా ప్రజాప్రతినిధులు, అప్మెల్ కార్మిక సంస్థలు సహకారంతో 9 మంది డైరెక్టర్లతో 1997-1998నుండి సింగరేణి సంస్థకు అనుబంధంగా దీనిని అనుసంధానం చేశారు. అప్పటి నుండి బి.హెచ్.ఇ.ఎల్, సింగరేణి, మరికొన్ని మైనింగ్ సంస్థలకు మ్యాన్‌వల్ ఇండింగ్ సిస్టంలను, సైల్‌లను థర్మల్ స్టేషన్ పరిధిలోని టర్బైన్‌లను పూర్తి స్థాయిలో మరమ్మత్తులు నిర్వహించగల స్ధామర్థ్యాన్ని సంస్థ సంపాదించుకుంది. అప్పటి నుండి ప్రతి ఆర్థిక సంవత్సరానికి రూ.2 నుండి రూ.3 కోట్ల లాభాలను తన ఖాతాలో జమ చేసుకుటోంది. సంస్థను మరో మూడేళ్లలో విస్తృత పరచి మరింత అభివృద్ధి చేయాలని కంపెనీ వర్గాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ దిశగా ఇప్పటికే కొన్ని చర్యలను తీసుకున్నారు.

డెల్టా చక్కెర కర్మాగారం
1982-83సంవత్సరంలో బాపులపాడు మండలం శేరీనరసన్నపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో జాతీయ రహదారి వెంబడి వందెకరాల విస్తీర్ణంలో ప్రభుత్వం హనుమాన్ కో-ఆపరేటివ్ షుగర్స్ పేరిట ఈ కర్మాగారాన్ని నెలకొల్పింది. 2002-03లో దీన్ని ప్రైవేటు పరం చేయడంతో ఇది డెల్టా షుగర్స్‌గా రూపాంతరం చెందింది. ఆరంభంలో సీజన్‌కు లక్షా యాభై వేల బస్తాలు పంచదార ఉత్పత్తవ్వగా, ప్రస్తుతం ఉత్పత్తి 2.5 లక్షల బస్తాలకు చేరింది. గన్నవరం, నూజివీడు, గుడివాడ, దెందులూరు నియోజకవర్గాల పరిధిలోని రైతులకు కేంద్రంగా ఉన్న ఈ కర్మాగారం గానుగ (క్రషింగ్) సామర్థ్యం రోజుకు 3,500 టన్నులు. 250 మంది శాశ్వత, 300 మంది సీజనల్ ఉద్యోగులు ఇందులో పని చేస్తుంటారు.

రుచి ఆయిల్‌పామ్ కర్మాగారం
కృష్ణా జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు విస్తరించడంతో ప్రైవేటు సెక్టార్‌లో బాపులపాడు మండలం అంపాపురం గ్రామ పంచాయతీ పరిధిలో 1995లో 50 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌పామ్ నూనె ఉత్పత్తుల కర్మాగారం ఏర్పాటు చేశారు. 'సికాల్' ఆయిల్‌పామ్ పేరుతో ఏర్పాటైన ఈ కర్మాగారం ఆ తర్వాత 'మాక్' ఆయిల్‌పామ్‌గాను, ప్రస్తుతం 'రుచి' ఆయిల్‌పామ్ గానూ నిర్వహణలో ఉంది. ప్రారంభ సామర్థ్యం రోజుకు5 టన్నులుండగా, ఇప్పుడు 40 టన్నులకు చేరింది. ఈ కర్మాగారం పరిధిలో 9,347 హెక్టార్లు ఆయిల్‌పామ్ సాగులో ఉంది. ప్రతి సంవత్సరం 55 వేల టన్నులు ముడి పామాయిల్ ఇక్కడ ఉత్పత్తి చేస్తారు.

చిలకలపూడి బంగారం
బంగారం పూతతో గిల్టు ఆభరణాలు తయారు చేయడంలో మచిలీపట్నం ప్రసిద్ధి. మచిలీపట్నంలోని చిలకలపూడి ప్రాంతం పేరు చెప్పగానే రోల్డ్‌గోల్డ్ పరిశ్రమ గుర్తొస్తుంది. కాపర్, లెడ్ వంటి లోహాలతో తయారు చేసిన ఆభరణాలపై బంగారు పూతవేసి వివిధ రకాల మోడళ్ల ఆభరణాలు తయారుచేసే పరిశ్రమ 125 ఏళ్ల క్రితమే చిలకలపూడిలో ప్రారంభమైంది. ఈ పరిశ్రమపై 50వేల మందికిపైగా ఆధారపడి బతుకుతున్నారు. ముంబయి, కోయంబత్తూర్‌ల్లో మాత్రమే ఇలాంటి పరిశ్రమలున్నాయి. దేశ వ్యాప్తంగా విక్రయాలు జరిగే రోల్డ్‌గోల్డ్ ఆభరణాల్లో 75 శాతం పైగా మచిలీపట్నంలో తయారయ్యేవే. మచిలీపట్నంలోని పోతేపల్లిలో జ్యుయెలరీ పార్కు ఏర్పాటు చేశారు.

కలంకారీ పరిశ్రమ
'వన్నె'చిన్నెల కలంకారీ వన్నె తగ్గని సంస్కృతిగా దేశంలో మచిలీపట్నం కలంకారీకి పేరు. 15వ శతాబ్ధంలో మొదలైన రంగుల అద్దకం ఆంగ్లేయుల పాలనా కాలంలో అంతర్జాతీయ స్థాయి మార్కెట్‌ను ప్రభావితం చేసింది. ఇప్పటికీ లండన్‌లోని విక్టోరియా మ్యూజియంలో అలనాటి కలంకారీ వస్త్రాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయంటే అది ఈ అద్దకం విధానంలో గొప్పతనంతోపాటు వినియోగిస్తున్న సహజ రంగులూ కారణమే.

బందరు పోర్టు
పోర్చుగీసు వారు తూర్పు తీరంలో తొలిసారి ఇక్కడే మకాం వేశారు.15వ శతాబ్ధానికి ముందే ఇక్కడి నుంచి నౌకారవాణా జరిగేది. బ్రిటిషు వారు చాలా కాలంపాటు ఇక్కడి నుంచి రాకపోకలు నిర్వహించారు. బందరు శివారులోని గిలకలదిన్నె ప్రాంతంలో ఉన్న ఈ పోర్టు ప్రస్తుతం యాంకరేజీ పోర్టుగా మిగిలింది. తాజాగా చినకరగ్రహారం పంచాయతీ పల్లెపాలెం పరిధిలో కొత్త పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం ముందుకొచ్చింది.