close

తాజా స‌మాచారం

2016 నియామకాలు ముందు చేపట్టాలి

* 2011 గ్రూప్‌-1 అభ్యర్థుల వినతి
* పోస్టులు ఖాళీగా ఉండిపోయే అవకాశం ఉండదు
* జాబితాలో తరువాత ఉన్నవారికీ దక్కనున్న పోస్టులు

ఈనాడు, అమరావతి: ఉద్యోగ నియామకాల జాప్యంతో గ్రూప్‌-1 పోస్టులు ఖాళీగా ఉండిపోయే అవకాశం కనిపిస్తోంది. 2011, 2016 గ్రూప్‌-1 నోటిఫికేషన్‌లకు సంబంధించిన నియామకాలు స్వల్ప వ్యవధిలో జరగనున్నాయి. 2011 నియామకాల తుది జాబితాలో ఉన్నవారు.. 2016 నోటిఫికేషన్‌ ద్వారా కూడా ఉన్నత ఉద్యోగాలకు చేరువయ్యారు. ఒకవేళ 2011 ప్రకటనలో ఉద్యోగ నియామక పత్రాలు పొందిన తరువాత 2016 ప్రకటనలో దీనికన్నా ఉన్నత ఉద్యోగం లభిస్తే.. తొలి ఉద్యోగాన్ని వదులుకునే అవకాశం ఉంది. దీనివల్ల 2011 నోటిఫికేషన్‌లో ఉద్యోగాలు ఖాళీగా ఉండిపోతాయి. అందువల్ల 2016 నియామకాలను ముందుగా చేపట్టాలని అభ్యర్థులు కోరుతున్నారు. 2011 నోటిఫికేషన్‌లో ఉద్యోగాలకు ఎంపికై.. 2016 గ్రూపు-1 మౌఖిక పరీక్షలకు హాజరైన అభ్యర్థులు 20 మంది వరకు ఉన్నట్లు అంచనా. వీరు ఉద్యోగ స్థాయిని అనుసరించి పోస్టులను ఎన్నుకునే అవకాశం ఉంది. అందువల్ల తొలుత 2016 నోటిఫికేషన్‌ అనుసరించి ప్రకటించిన ఉద్యోగాలను భర్తీచేయాలి. దీనివల్ల 2011 నోటిఫికేషన్‌లో ఏర్పడే ఖాళీలను జాబితాలో తరువాత ఉన్నవారితో భర్తీ చేసే అవకాశం ఉంటుంది. దీంతో తమకు న్యాయం జరుగుతుందని, ఏపీపీఎస్సీ సానుకూల నిర్ణయాన్ని తీసుకోవాలని 2011 నోటిఫికేషన్‌ అభ్యర్థులు అభ్యర్థిస్తున్నారు. వయోపరిమితి అంశాన్నీ పరిగణనలోనికి తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు... 2011లో ఎంపికైన వారిలో అత్యధికులు 2016 ద్వారా వచ్చే ఉద్యోగాలను వద్దని చెప్పేందుకు సంశయిస్తున్నారు. ఎందుకంటే...2016 మౌఖిక పరీక్షలకు అనర్హులు హాజరుకావడంతో 9 మంది పేర్లను తొలగించారు. వీరి స్థానంలో కొత్త వారికి త్వరలో మౌఖిక పరీక్షలు నిర్వహించబోతున్నారు. నియామకాలు జరిగే వరకు ఎటువంటి సమస్యలు వస్తాయోనన్న ఆందోళనతో 2011 ద్వారా వచ్చిన ఉద్యోగాలను వదులుకునేందుకు సిద్ధంగా లేరు. అనర్హుల వ్యవహారంవల్ల అభ్యర్థుల్లో ఈ గందరగోళం నెలకొంది. దీనివల్ల 2016 నియామకాలను ముందుగా జరిపితే మంచిదని సంబంధిత వర్గాలు సూచిస్తున్నాయి. 2011 నోటిఫికేషన్‌ అనుసరించి ఏర్పడే ఖాళీలను కేవలం , ఒకట్రెండు మార్కుల తేడాతో ఉద్యోగాలకు దూరమైన వారితో భర్తీచేసే అవకాశం లభిస్తుంది. ఇప్పటికే ఇతర నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు చేస్తున్న వారిలో ఆరుగురు 2011 నోటిఫికేషన్‌ ద్వారా వచ్చిన ఉద్యోగాలు వద్దని ఏపీపీఎస్సీకి తెలియబరిచారు. దీనివల్ల వీరి స్థానంలో వరుస క్రమంలో ఉన్న ఆరుగురు అభ్యర్థులకు అవకాశాన్ని కల్పించారు. కోర్టు వివాదాల కారణంగా 2011 గ్రూపు-1 నోటిఫికేషన్‌ నియామకాలు ఇప్పుడు జరుగుతున్నాయి. సకాలంలో జరిగినట్లయితే ఈ కొత్త సమస్య ఉత్పన్నమయ్యేదికాదు.


Posted on 01-04-2018