close

తాజా స‌మాచారం

ప్రమాదంలో 12 మంది ఉద్యోగాలు

* 38 మందికి హోదాలో మార్పులు
* 1999 గ్రూప్‌-2 జాబితా సవరణ ఫలితం

ఈనాడు, హైదరాబాద్‌: ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 18 ఏళ్ల క్రితం జరిగిన గ్రూప్‌-2 ఎంపిక జాబితా సవరణతో తెలంగాణకు చెందిన 12 మంది అధికారుల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. పలువురి ఉద్యోగుల హోదాలు, కేడర్‌, విభాగాలు మారనున్నాయి. ఆర్డీవోలు పంచాయతీ సూపరింటెండెంట్‌గా, మరికొందరు సహాయ కార్యదర్శి నుంచి సహాయ సెక్షన్‌ అధికారిగా మారనున్నారు. దీంతో 13 ఏళ్లపాటు సర్వీసు చేసి, పదోన్నతులు పొందిన వారిలో ఆందోళన మొదలైంది. సుప్రీం మార్గదర్శకాలను యథావిధిగా అమలు చేయకపోవడం, ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయకుండా ఉన్న జాబితా సవరించడంతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. ఎంపిక జాబితా సవరణతో 15 ఏళ్ల క్రితం పరిష్కారమైన సమస్య అపరిష్కృతంగా మారి పలువురు ఉద్యోగులపై ప్రభావం పడుతుందని తెలంగాణ న్యాయనిపుణులు ప్రభుత్వానికి తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగుల నుంచి ఆప్షన్‌ తీసుకుని, వారి కోరిక మేరకు తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్లాలని 1999 గ్రూప్‌-2కు ఎంపికైన తెలంగాణ అభ్యర్థులు కోరుతున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో 104 ఎగ్జిక్యూటివ్‌, 141 నాన్‌ఎగ్జిక్యూటివ్‌ పోస్టులతో 1999లో గ్రూప్‌-2 ప్రకటన వెలువడింది. మరుసటి ఏడాది పరీక్ష జరిగింది. వెంటనే నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను అప్పటి సర్కారు రద్దు చేయడంతో అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆదేశాల మేరకు రద్దు చేసిన నాన్‌ఎగ్జిక్యూటివ్‌ పోస్టులతో పాటు 2004లో అదనంగా 973 ఎగ్జిక్యూటివ్‌, 199 నాన్‌ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీ చేశారు. దీనిలో అన్యాయం జరిగిందని మెరిట్‌ అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో మరిన్ని పోస్టులు చేరాయి. ప్రకటన జారీ చేసిన నాటికి ఖాళీగా ఉన్న పోస్టులను కలుపుతూ మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-3, ఏసీటీవో, సహాయ కార్మిక అధికారులు, ఏఎస్‌వో పోస్టులను కూడా భర్తీ చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు నియామకాలు చేపట్టాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ 2016లో ఆరుమార్లు సవరణ ఎంపిక జాబితాను ప్రకటించింది. చివరి జాబితా ప్రకటన సమయంలోనూ మరిన్ని పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది.
ఉద్యోగులు ఏమంటున్నారు?
సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేసే సమయానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌.. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలుగా విడిపోయిందని ఉద్యోగులు చెబుతున్నారు. ఏపీపీఎస్సీ జాబితా రూపొందించే సమయంలో ఖాళీ పోస్టులు, తెలంగాణ ప్రభుత్వం, ఇక్కడి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. సవరణ జాబితాతో దాదాపు 12 మంది ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తోందని, వారికి సూపర్‌న్యూమరరీ పోస్టులు సృష్టించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరో 38 మంది ప్రస్తుత కేడర్‌ పోస్టులు తగ్గిపోయి ఇతర విభాగాలు, ఇతర జోన్లకు వెళ్లాల్సి వస్తోందన్నారు. కేడర్‌, జోన్‌ మార్పులపై ఆప్షన్లు తీసుకుని తెలంగాణ కమిటీ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


Posted on 03-04-2018