close

తాజా స‌మాచారం

నెలాఖరులోగా 14 ఉద్యోగ ప్రకటనలు


* ఆయా శాఖల నుంచి వివరాలు రాకనే జాప్యం
* ఇప్పటివరకు 21 ప్రకటనలు ఇచ్చాం
* ప్రకటించిన తేదీల్లోనే పరీక్షలు నిర్వహిస్తాం
* వయోపరిమితి పెంపు ప్రభుత్వ పరిధిలోనిది
* వెల్లడించిన ఏపీపీఎస్సీ

ఈనాడు, అమరావతి: జనవరి నెలాఖరులోగా మరో 14 ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఉదయ్‌భాస్కర్‌ వెల్లడించారు. గత సెప్టెంబరులో ఆర్థికశాఖ జారీచేసిన ఉత్తర్వులు అనుసరించి డిసెంబరు చివరి వరకు 3,255 ఉద్యోగాల భర్తీకి 21 ప్రకటనలు జారీచేసినట్లు తెలిపారు. రెవెన్యూశాఖ నుంచి వివరాలు రానందున 670 జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు, అటవీ శాఖకు చెందిన అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ 330, ఇతర శాఖల ఉద్యోగాల భర్తీ ప్రకటనలు కలిపి 14 వరకు ఇవ్వలేకపోయినట్లు చెప్పారు. ఆయా శాఖల నుంచి వివరాలు అందిన వెంటనే వీటిని కూడా జారీ చేస్తామని తెలిపారు. ఇందుకు జనవరి నెలాఖరు వరకు సమయం పట్టే అవకాశం ఉందన్నారు.
త్వరితగతిన ప్రకటనలు ఇచ్చేందుకు సంప్రదింపులు
విజయవాడలోని కమిషన్‌ కార్యాలయంలో సహచర సభ్యులు జింకా రంగజనార్ధన, కె.విజయకుమార్, జి.సుజాత, కె.పద్మరాజు, సేవారూప, కార్యదర్శి మౌర్యలతో కలిసి ఉదయ్‌భాస్కర్‌ జనవరి 4వ తేదీన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. త్వరితగతిన ఈ ప్రకటనలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయా శాఖల అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. ప్రకటనల్లో పేర్కొన్న తేదీల్లోనే రాత పరీక్షలు నిర్వహిస్తామని, అనివార్య పరిస్థితులు తలెత్తితే తప్ప వాయిదాలు ఉండవని వెల్లడించారు. ప్రకటించాల్సిన రాత పరీక్ష నిర్వహణ తేదీలను తగిన సమయంలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. గ్రూపు-1 ప్రాథమిక పరీక్ష రాసేందుకు తక్కువ వ్యవధి ఉన్నట్లు అభ్యర్థులు పేర్కొంటున్న విషయాన్ని ప్రస్తావించగా సెప్టెంబరు నుంచి ఉద్యోగ ప్రకటనల జారీ గురించి అభ్యర్థులకు తెలుసునని వ్యాఖ్యానించారు.
ప్రధాన పరీక్షకు అభ్యర్థుల ఎంపిక ఇలా
ప్రాథమిక పరీక్ష నుంచి ప్రధాన పరీక్షకు అభ్యర్థులను పరిమితం చేయడంపై ఉదయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ ‘‘యూపీఎస్సీలో అనుసరిస్తున్న విధానంపై కమిషన్‌ అధ్యయనం చేసింది. అనంతరం కమిషన్‌ సమావేశంలో చర్చించి తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలియచేశాం. ప్రభుత్వం పరిశీలన జరిపి ఉత్తర్వులు జారీచేసింది. వీటిని అనుసరించి అభ్యర్థులు ప్రాథమిక పరీక్షల్లో సాధించిన మార్కులను అనుసరించి కటాఫ్‌ నిర్ణయిస్తాం. దీనికి అనుగుణంగా ప్రకటిత పోస్టులకు 1:12 లేదా 1:15 నిష్పత్తిలో అభ్యర్థులను ప్రధాన పరీక్షకు ఎంపిక చేయాలా? వద్దా? అన్న దానిపై అభ్యర్థులు సాధించిన మార్కులు, ఇతర అంశాలు పరిగణనలోనికి తీసుకుని కమిషన్‌ నిర్ణయాన్ని తీసుకుంటుంది. ఈ ప్రక్రియలో సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులకు అవకాశం రాకుంటేనే కటాఫ్‌Æ తగ్గిస్తాం. కటాఫ్‌ మార్కు తగ్గించిన తరువాత అర్హత పొందినవారు ప్రధాన పరీక్షలు రాసి ఎక్కువ మార్కులు సాధించినప్పటికీ జనరల్‌ కోటాలో రారు. సామాజిక వర్గం ఆధారంగా కేటాయించిన పోస్టులకు మాత్రమే వీరు పోటీపడతారు. జనరల్‌ కోటాలో వీరిని తీసుకునేందుకు న్యాయపరమైన సమస్యలు వస్తాయి. గతంలో ఇలాగే జరిగింది. పోస్టులు మిగలకూడదన్న ప్రధాన ఉద్దేశంతో ఇచ్చిన వెసులుబాటువల్ల వీరు ప్రధాన పరీక్ష రాసేందుకు అవకాశం లభిస్తుందని’’ వివరించారు. వయో పరిమితి పెంపు అంశం ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని వెల్లడించారు. గ్రూపు-2 1999 నోటిఫికేషన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు వేసిన సబ్‌ కమిటీ తన నివేదికను న్యాయస్థానానికి అప్పగించినట్లు కమిషన్‌ అధ్యక్షుడు ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు. తదుపరి ఆదేశాలు ఇప్పటివరకు సుప్రీంకోర్టు నుంచి రాలేదన్నారు.
ఎన్నికలకు సంబంధంలేదు
ఎన్నికల నిర్వహణకు, ఉద్యోగాల నియామకాల ప్రక్రియకు ఎటువంటి సంబంధంలేదని కమిషన్‌ సభ్యులు పద్మరాజు, సుజాత వెల్లడించారు. కమిషన్‌ రాజ్యాంగ ప్రతిపత్తి సంస్థ అయినందున ఎన్నికలతో నిమిత్తం లేకుండా ఉద్యోగ నియామకాల రాత పరీక్షల నిర్వహణ, అవసరమైనందున ఇతర చర్యలు యథావిధిగా తీసుకుంటామని పేర్కొన్నారు. ఎక్కువమంది అభ్యర్థులు తమ మొబైల్‌ నంబర్లను మార్చుకోవడంవల్ల ఓటీపీఆర్‌ పంపడంలో సమస్యలు వస్తున్నాయని కమిషన్‌ సభ్యులు తెలిపారు. మొయిల్‌ ఐడీ, మొబైల్‌ నంబరు ఉంటేనే ఓటీపీఆర్‌ కమిషన్‌ పంపుతుందన్నారు. అలాగే దరఖాస్తుల స్వీకరణ తేదీ వచ్చిన వెంటనే అభ్యర్థులు పంపుకోవడం మంచిదని కమిషన్‌ సూచించారు. స్వీకరణ ముగింపు సమయంలో అభ్యర్థులు దరఖాస్తులు పంపుతున్నందున సర్వరుపరంగా సమస్యలు వస్తున్నాయని తెలిపింది. ఓటీపీఆర్‌ హెల్ప్‌లైన్‌ - ఫోన్‌ నెంబర్‌ 0866-2527819, నియామకాల ప్రక్రియ సందేహాలను 0866-2527820, 2527821 నెంబర్ల ద్వారా నివృత్తి చేసుకోవచ్చునని తెలిపింది.
ఇటీవల ఉద్యోగ ప్రకటనలకు వచ్చిన దరఖాస్తులు
24 ఫారెస్ట్‌ రేంజి ఆఫీసర్‌ ఉద్యోగాలు - 16,130
309 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పోస్టులు - 47,001
23 అసిస్టెంట్‌ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ - 5,411
39 హార్టికల్చర్‌ పోస్టులు - 1,307
1,051 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ఇంకా జరుగుతోంది. జనవరి 4 వరకు 56,621 దరఖాస్తులు వచ్చాయి.
నెలాఖరులోగా రానున్న ఉద్యోగ ప్రకటనలు
జిల్లా ప్రజా సంబంధాల అధికారి పోస్టులు - 04
సెరికల్చర్‌ ఆఫీసర్‌ - 13
ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్స్‌ గ్రేడ్‌-3 - 60
అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్స్‌ - 78
అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఏపీ ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటిస్టికల్‌) - 06
తెలుగు రిపోర్టర్‌ (లెజిస్లేచర్‌) - 05
ఇంగ్లీష్‌ రిపోర్టర్‌ (లెజిస్లేచర్‌) - 10
ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ - 10
ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ - 330
అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ - 100
అసిస్టెంట్‌ ఇంజినీర్‌ - 190
లెజిస్లేటివ్‌ ఆఫీసర్‌ - 03
రీసెర్చి ఆఫీసర్‌ - 02
జూనియర్‌ అసిస్టెంట్‌-కంప్యూటర్‌ అసిస్టెంట్‌ - 670

Posted on 05.01.2019