close

తాజా స‌మాచారం

ఉద్యోగాల భర్తీ ప్రకటనలపై కదలిక

* నెలలోగా ఖాళీలను ఏపీపీఎస్సీకి పంపాలని సీఎస్‌ ఆదేశం
ఈనాడు అమరావతి: ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల జారీపై ఓ అడుగు ముందుకుపడింది. ఖాళీల వివరాలను త్వరితగతిన అందిస్తే జారీకి చర్యలు తీసుకుంటామని సచివాలయంలో ఏప్రిల్ 26న‌ జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఉదయ్‌భాస్కర్‌, కార్యదర్శి వైవీఎస్టీ శాయి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌కు స్పష్టం చేశారు. స్పందించిన ఆయన ఖాళీల వివరాలను నెలలోగా ఏపీపీఎస్సీకి పంపించాలని సాధారణ, ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు.
ఇప్పటిదాకా ఏం జరిగిందంటే...:
ఆయా శాఖల నుంచి అందిన సమాచారం ప్రకారం ఆగస్టు 2017 నాటికి ప్రత్యక్ష నియామకాల కింద 6,250, కార్పొరేషన్ల పరిధిలో 2,717, పోలీసు ఎగ్జిక్యూటివ్‌ కేడరులో 9,844, వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 6,250, ఇతర చోట్ల కలిపి 27వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. వీటిల్లో ఎన్నింటినీ భర్తీచేయాలన్న దానిపైనే తర్జనభర్జనలు సాగుతున్నాయి. మరోవైపు.. గతేడాది డిసెంబరు 4వ తేదీ 34 సంవత్సరాల గరిష్ఠ వయోపరిమితిని 42 సంవత్సరాలకు పెంచుతూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇవి వెలువడి ఐదు నెలలు దాటినా... ఉద్యోగ ప్రకటనలు రానందున కొందరు దరఖాస్తు చేసేందుకు కూడా వయోపరిమితిపరంగా నష్టపోతున్నారు.
స్వేచ్ఛ కల్పించాలి!
ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా కమిషన్‌ స్వతంత్రంగా తీసుకునే నిర్ణయాలు అమలయ్యేందుకు వీలు కల్పించాలని ఏపీపీఎస్సీ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. యూపీఎస్సీ, ఇతర కమిషన్లు తీసుకునే నిర్ణయాలు వెనువెంటనే అమల్లోకి వస్తున్నాయి. ఏపీపీఎస్సీ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేస్తేనే అవి కార్యరూపం దాలుస్తున్నాయి. అలాకాకుండా..కమిషన్‌ తీసుకునే నిర్ణయాలు ప్రభుత్వ ఉత్తర్వులతో సంబంధంలేకుండా అమలయ్యేలా స్వేచ్ఛ (అటానమస్‌)ను కల్పించాలని కోరగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సానుకూలంగా స్పందించారని కమిషన్‌ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు. శాఖాపరమైన పదోన్నతుల విషయంలో కూడా కమిషన్‌కు అధికారాలిస్తూ చర్యలు తీసుకోవాలని కూడా ఏపీపీఎస్సీ అధికారులు కోరారు.

Posted on 27-04-2018