close

తాజా స‌మాచారం

ఏకకాలంలో ఉద్యోగ నియామకాలు

* మిగలునున్న 200 వరకు పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలు?
* భవిష్యత్తులో గ్రూపు-2, 3 ఉద్యోగాలకు ఒకే ఉమ్మడి పరీక్ష

ఈనాడు, అమరావతి: గ్రూపు-2 ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ఎగ్జిక్యూటివ్‌, గ్రూపు-3 ఉద్యోగ నియామకాలు కొద్ది వ్యవధిలోనే జరుగుతున్నందున పోస్టులు మిగిలే పరిస్థితులు నెలకొన్నాయి. గ్రూపు-2 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ జిల్లా కలెక్టర్లకు పంపించింది. నియామక పత్రాల జారీ చివరి దశలో ఉంది. నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు ఎంపికైన వారి జాబితాను ప్రకటించింది. ఈ వివరాలూ త్వరలో జిల్లా కలెక్టర్లకు వెళ్లనున్నాయి. ఇదే సమయంలో గ్రూపు-3 (పంచాయతీ కార్యదర్శి) ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఆధారంగా అభ్యర్థులకు వచ్చిన మార్కుల జాబితాలను ఏపీపీఎస్సీ జిల్లాలకు పంపించింది. అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జిల్లాల వారీగా జరుగుతోంది. ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు ఎంపికైన వారు పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్నాయి. కనీసం రెండు వందల మంది అభ్యర్థులు ఇలా ఉంటారని భావిస్తున్నారు. దీనివల్ల పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాల్లో 200 వరకు మిగిలే అవకాశం ఉంటుందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి మిగిలితే తదుపరి నోటిఫికేషన్‌ ద్వారా భర్తీకి బదిలీ చేస్తారు. ఇదే జరిగితే ఈ పోస్టులను దక్కించుకునేందుకు చేరువలో ఉన్న అభ్యర్థులకు అవకాశం రాకుండాపోతుంది. గ్రూపు-2 నియామకాలు పూర్తిచేసిన అనంతరం పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలను భర్తీచేస్తే ఖాళీలు మిగిలే అవకాశం ఉండదని.. ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఉదయ్‌భాస్కర్‌కు విజ్ఞప్తి చేశారు.
కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలి:
గ్రూపు-2 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు ఎంపికైన వారిలో ఉన్న కొందరు పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు చేరువలో ఉన్నారని పేర్కొంటూ వారి వివరాలను కూడా జిల్లా కలెక్టర్లకు పంపించినట్లు ఏపీపీఎస్సీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు సంబంధించి ఎంపికై పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు చేరువులో ఉన్న వారి వివరాలను కూడా పంపుతున్నామన్నారు. గ్రూపు-2 నియామకాల ప్రక్రియను ముందుగా ముగించి పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాల భర్తీని తరువాత చేపట్టే విషయంలో కలెక్టర్లు నిర్ణయం తీసుకోవల్సి ఉంటుందని ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు.
గ్రూపు-2, 3 ఉద్యోగాల భర్తీకి ఒకే ఉమ్మడి పరీక్ష:
పోస్టులు మిగిలిపోకుండా ఉండాలన్న ఉద్దేశంతో గ్రూపు-2, 3 ఉద్యోగాల భర్తీకి ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరపాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. మరోవైపు...ఇకపై జారీచేయబోయే గ్రూపు-1 రెండు (గ్రూపు-1ఏ, బి)గా ఉండబోతోంది. ఈ రెండింటికీ ప్రిలిమ్స్‌ ఆబ్జెక్టివ్‌ విధానంలో, ప్రధాన పరీక్షలు వ్యాసరూపంలో జరుగుతాయి.

Posted on 17-05-2018