close

తాజా స‌మాచారం

ఉద్యోగాలున్నా ప్రకటనలేవీ?

* సీఎంవో పరిశీలనలోనే దస్త్రం
* అక్కరకు రాకుండా పోతున్న 42 ఏళ్ల వయోపరిమితి పెంపు
* ఆందోళనలో నిరుద్యోగులు

ఈనాడు - అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో వేలాది ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. వాటిని భర్తీచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ..నిర్ణయం తీసుకోవడంలో నాన్చుడి వైఖరి అవలంభిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) దినేష్‌కుమార్‌ ఖాళీల వివరాలను సిద్ధం చేయాలని స్వయంగా ఆదేశాలు జారీచేసి పక్షాలు గడిచిపోతున్నా పురోగతి మాత్రం కనిపించడంలేదు. 2016 డిసెంబరులో జారీచేసిన 30కుపైగా ఉద్యోగ ప్రకటనలు అనుసరించి నియామకాలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ దాదాపుగా పూర్తిచేసింది. ఈలోగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు 42 ఏళ్లకు వయోపరిమితిని గత ఏడాది డిసెంబరులో పెంచినా నియామకాల జాడ మాత్రం కనిపించడమేలేదు. ఉద్యోగ ప్రకటనలు వెలువడడంలో జాప్యం జరిగికొద్దీ వయోపరిమితిపరంగా అనేకమంది అనర్హులైపోతున్నారు. ఈ పరిణామాలు నిరుద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం గ్రూపు-1-125, గ్రూపు-2-775, గ్రూపు-3-190, గ్రూపు-4- 500, పోలీసు శాఖలో 10,000, వైద్య ఆరోగ్య శాఖలో 6,300, ఇతర శాఖల్లో 5,000 వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలియవచ్చింది. ఈ పోస్టులు ఇంకా పెరగొచ్చు. తగ్గొచ్చు. ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి భర్తీచేయాల్సిన సంఖ్య ఖరారు అవుతుంది. ఇందుకు సంబంధించిన దస్త్రం ముఖ్యమంత్రి కార్యాలయ(సీఎంవో) పరిశీలనలోనే గత కొద్దిరోజుల నుంచి ఉన్నట్లు తెలియవచ్చింది. వీటిపై అధికారంగా నిర్ణయం తీసుకునేందుకు ఇంకొంత కాలం వేచిచూద్దామన్న ధోరణిలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసిందని ఉద్యోగ సంఘ నేత ఒకరు పేర్కొన్నారు.
ఎప్పటికప్పుడు భర్తీ చేస్తుంటే...!
ఆయా శాఖల అవసరాల ప్రతిపాదికగా ప్రత్యక్షంగా... పదోన్నతుల ద్వారా భర్తీచేయాల్సిన పోస్టుల భర్తీపై విధివిధానాలు స్పష్టంగా ఉన్నాయి. యూపీఎస్సీ, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ మాదిరిగా ప్రతి ఏడాది ఉద్యోగ ప్రకటనలు జారీచేస్తూ వస్తే నిరుద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఉద్యోగాల భర్తీకి ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగాల భర్తీ ప్రకటనల జారీ గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోందని సంబంధిత వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఉద్యోగ ఖాళీల భర్తీకి ఏకకాలంలో ప్రకటనలు జారీచేస్తున్నందువల్ల కూడా ఒకే అభ్యర్థి రెండు, మూడు ఉద్యోగాలకు ఎంపిక అవుతున్నారు. దీనివల్ల ఒక ఉద్యోగంలో చేరి మిగిలిన వాటిని వదలేస్తున్నాడు. దీనివల్ల వాటిని మరోకరితో భర్తీ చేయలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రస్తుతం గ్రూపు-2, గ్రూపు-3 పోస్టుల విషయంలో ఇదే జరుగుతోంది. ఏపీపీఎస్సీ ‘వార్షిక క్యాలెండర్‌’ ద్వారా భర్తీ చేసేందుకు కిందటేడు తాత్కాలికంగా తేదీలను సైతం ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు.
మరోవంక..ఉపాధ్యాయ నియామకాలను కూడా చేపట్టాలని విద్యాశాఖ యోచిస్తోంది. దీనివల్ల స్వల వ్యవధిలోనే అన్ని రకాల ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రకటనలు వెలువడితే అభ్యర్థులు హైరానా పడతారని, నియామకాలను చేపట్టేందుకు అధికారులకు ఇబ్బందులు ఎదురవుతాయని సంబంధిత వర్గాలు సూచిస్తున్నాయి. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటనలు రానందున నిరుద్యోగులు సన్నద్ధత విషయంలో అంచనాకు రాలేకపోతున్నారు.
* పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 272 అధ్యాపక పోస్టులు, 45 వరకు వ్యాయామ అధ్యాపకులు, వ్యవసాయ శాఖలో 115 అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టులు, అసిస్టెంట్‌ సెరికల్చర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు 29, టెక్నికల్‌ ఆఫీసర్‌ 71, టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు 300, పశు సంవర్థక శాఖలో 205 వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్లు, 420 సహాయకుల పోస్టులు, డైరెక్టరేట్‌ ఆఫ్‌ టౌన్‌ ప్లానింగ్‌లో 321 టౌన్‌ ప్లానింగ్‌ అండ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌, గ్రామీణ నీటి పారుదల శాఖ ఇంజినీరింగ్‌ విభాగంలో 221 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరింగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెవెన్యూ (ఎండోమెంట్స్‌) శాఖలో ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-3 పోస్టులు 149 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెవెన్యూ శాఖకు చెందిన ఆర్డీఓ, డిప్యూటీ తహశీల్దార్‌ పోస్టుల ఖాళీలపై ఇంకా సమాచారం అందలేదు.


Posted on 11-06-2018