close

తాజా స‌మాచారం

గ్రూప్‌ 1లో తెలుగు అర్హత తప్పనిసరి..!

* ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ ఉదయ్‌భాస్కర్‌ వెల్లడి
విశాఖపట్నం, ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్‌ 1, 2, 3తో పాటు అన్ని విభాగాల్లో పోస్టుల భర్తీకి ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్‌ ఉదయ్‌భాస్కర్‌ వెల్లడించారు. ఖాళీలకు సంబంధించిన స్పష్టమైన సమాచారం, ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే నియామక ప్రకటనలు విడుదల చేస్తామని చెప్పారు. జూన్ 25న శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయ వ్యవస్థాపక దినోత్సవానికి హాజరైన ఆయన ఈ వివరాలను వెల్లడించారు. అంతకుముందు విశాఖలోనూ ఈ అంశంపై మాట్లాడారు. విద్యార్థులకు తెలుగు భాషపై పట్టు ఉండడం లేదని.. ఈ పరిస్థితిలో గ్రూప్‌ 1లో ఆంగ్లంతో పాటు, తెలుగు భాషలోనూ అర్హత తప్పనిసరి చేస్తున్నామని చెప్పారు. గ్రూప్‌ 2లో గెజిటెడ్‌ ఉద్యోగాలను గ్రూప్‌ 1లో చేర్చేందుకు జీవో ఉన్నా ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వివరించారు. గ్రూప్‌-2 సిలబస్‌ మార్పులపై నిపుణుల కమిటీని వేశామని, నివేదిక రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని ఉదయ్‌భాస్కర్‌ చెప్పారు. సహాయ సెక్షన్‌ అధికారి పోస్టుల భర్తీకి విద్యార్హతలపై (డిగ్రీలో స్టాటిస్టిక్స్‌ ఉండాలా? లేదా? అనే అంశంపై) ప్రభుత్వానికి లేఖ రాశామని, స్పష్టత రాగానే 95 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని వివరించారు.


Posted on 26-06-2018