close

తాజా స‌మాచారం

‘ఏకసభ్య కమిషన్‌’ ద్వారా గ్రూపు-2(1999) కేసుల విచారణ

* ఏపీపీఎస్‌సీ అధ్యక్షుడు ఉదయ్‌భాస్కర్‌
ఈనాడు, అమరావతి: గ్రూపు-2(1999) నియామకాల వివాదానికి సంబంధించిన కేసులన్నింటినీ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్‌ విచారిస్తుందని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్‌సీ) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు. 19 ఏళ్ల కిందట జారీచేసిన ఈ నోటిఫికేషన్‌ను అనుసరించి నియామకాలు చేపట్టడంలో పెద్దఎత్తున గందరగోళం నెలకొంది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న దానికి భిన్నంగా రకరకాల జీఓలను అనుసరించి నియామకాలు చేపట్టినందున వివాదం మొదలైంది. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తాజాగా విశ్రాంత న్యాయమూర్తి టక్కర్‌ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటుచేసి, 3 నెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ కమిషన్‌ కార్యకలాపాలు హైదరాబాద్‌/విజయవాడ నుంచి జరుగుతాయా? లేదా అన్నది తెలియాల్సి ఉందని ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు. తాము ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి సమాచారాన్ని కమిషన్‌కు నివేదిస్తామని జులై 25న‌ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో 1999 నోటిఫికేషన్‌కు సంబంధించి జరిగిన నియామకాలు, ఇతర పరిమాణాలపై ఈ కమిషన్‌ విచారిస్తుందని పేర్కొన్నారు. కమిషన్‌ నిర్వహణ ఖర్చులకు రూ.10లక్షల వంతున డిపాజిట్‌ చేయాలని రెండు రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించిందని తెలిపారు.


Posted on 26-07-2018