close

తాజా స‌మాచారం

ఉద్యోగ ప్రకటనల జారీకి సై

* ఖాళీలపై వివరాల సేకరణ
* శాఖల వారీగా ఏపీపీఎస్సీ సంప్రదింపులు
* నెలాఖరుకల్లా క్యాలెండర్‌ విడుదలకు యత్నాలు
* వయో పరిమితిపై నిరుద్యోగుల్లో గుబులు
ఈనాడు - అమరావతి: ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రకటనల జారీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) సన్నాహాలు ప్రారంభించింది. సెప్టెంబ‌రు 19న భర్తీ ప్రక్రియకు ఆమోదం తెలుపుతూ ఆర్థికశాఖ ఉత్తర్వులిచ్చింది. తదనుగుణంగా సంబంధిత శాఖలు సామాజిక వర్గాల వారీగా ఖాళీల వివరాలను కమిషన్‌ కార్యాలయానికి పంపాలి. అనంతరమే కమిషన్‌ ద్వారా ఉద్యోగ ప్రకటనల జారీకి మార్గం సుగమం అవుతుంది. ఇందులో భాగంగానే ఆయా శాఖల ప్రతినిధులు ఎపీపీఏస్సీ కార్యాలయంలో సమావేశానికి హాజరయ్యారు. చేపడుతున్న చర్యల గురించి వివరించారు. కమిషన్‌ అధికారులు కూడా స్పష్టమైన సమాచారాన్ని వేగంగా పంపాలని సూచించారు. ఈ క్రమంలో శాఖల వారీగా వివరాలు నెలాఖరుకల్లా అందుతాయని ఆశిస్తున్నట్లు కమిషన్‌ కార్యదర్శి అనిల్‌కుమార్‌ మౌర్య ‘ఈనాడు’తో పేర్కొన్నారు. వీటికి అనుగుణంగా నోటిఫికేషన్ల జారీ, రాత పరీక్షల నిర్వహణ తేదీలు, ఇతర వివరాలు ‘క్యాలెండర్‌’ రూపంలో ప్రకటిస్తామని చెప్పారు.

ఇదీ తాజా పరిస్థితి
* వాణిజ్య పన్నుల శాఖలో సీటీవో పోస్టులు ఐదు వరకు ఉన్నట్లు ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ సంఖ్య నోటిఫికేషన్‌ జారీ నాటికి 8 వరకు చేరవచ్చునని భావిస్తున్నారు.
* ఆర్టీవో పోస్టుల ఖాళీల వివరాలన్నీ కమిషన్‌కు పంపినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
* వైద్య, ఆరోగ్య శాఖలో ‘లే సెక్రటరీ’ పోస్టులు ఐదు వరకు ఉన్నట్లు తెలియవచ్చింది. గతంలో భర్తీకాకుండా మిగిలిన ఈ పోస్టుల భర్తీకి ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి.
* ఆహార భద్రత అధికారుల (ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్స్‌) పోస్టులు 22 వరకు ఉన్నాయి. గతంలో ఈ పోస్టుల హోదా ఫుడ్‌ ఇన్‌స్పెక్టరుగా ఉండేది.
* అర్హతలు, సిలబస్‌ పరంగా జరుగుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయి. ఆర్థికశాఖ నుంచి స్పష్టత లభిస్తే.. వీటి భర్తీకి నోటిఫికేషన్‌ త్వరలో రావచ్చు.
* అక్టోబరు చివరి నుంచి నోటిఫికేషన్ల జారీని ప్రారంభించి డిసెంబరుకల్లా పూర్తిచేయాలని కమిషన్‌ వర్గాలు ఆలోచిస్తున్నాయి.
* ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన 18,450 ఉద్యోగాల్లో కమిషన్‌ తరపున ఐదువేల వరకు భర్తీ జరిగే అవకాశం ఉంది.
* డీఎస్పీ, ఆర్డీవో, తదితర పోస్టులకు సంబంధించిన ఖాళీలపై స్పష్టత లోపించినట్లు తెలిసింది.

గ్రూపు-1 సిలబస్‌.. త్వరలోనే వెబ్‌సైట్‌లోకి
గ్రూపు-1 సిలబస్‌ ఖరారైంది. సిలబస్‌ ముసాయిదాపై స్వీకరించిన అభ్యంతరాలు, సూచనలను కమిటీకి కమిషన్‌ పంపించింది. అది ఇటీవల స్వల్ప మార్పులతో దాన్ని ఖరారుచేసింది. న్యాయపరమైన, నైతిక విలువల అంశాలను స్వల్పంగా తగ్గించింది. దీనిపై కమిషన్‌ కార్యదర్శి మాట్లాడుతూ ముసాయిదా సిలబస్‌కు, ఖరారుచేసిన దానికి పెద్దగా తేడా లేదని, త్వరలోనే దాన్ని వెబ్‌సైట్‌లో పెడతామని చెప్పారు.

వయో పరిమితి పెరిగేనా?
ఉద్యోగాల భర్తీకి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం వయోపరిమితి పెంపుపై నిర్ణయాన్నింకా తీసుకోకపోవడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి 34 ఏళ్లుండగా దానిని 42 ఏళ్లకు పెంచారు. దీని కాలపరిమితి సెప్టెంబ‌రు 30తో ముగిసింది. కొత్త ఉద్యోగాల భర్తీకి అనుగుణంగా వయోపరిమితిని పెంచాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఓ క్రమంలో భర్తీ జరగనందున వయోపరిమితి పెంపు డిమాండ్‌ తెరపైకొస్తోంది. దీనిపై నిర్ణయం ప్రభుత్వ పరిధిలోనే ఉందని కమిషన్‌ వర్గాలు తెలిపాయి. ఉద్యోగ ప్రకటనల జారీ నాటికి అది కొలిక్కి రావచ్చని భావిస్తున్నారు.

Posted on 09-10-2018