తాజా స‌మాచారం

వయోపరిమితిపై ఎదురు చూపులు

* గ్రూప్‌ ఉద్యోగాల విలీన వాయిదాపైనా తేలని నిర్ణయం
ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగ నియామకాలకు వయోపరిమితి పెంపుపై రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ప్రకటన కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. పోలీసు కొలువులకు వయో పరిమితిని ప్రస్తుతం ఉన్న దానికంటే రెండేళ్లు పెంచే విషయమై సమాలోచనలు జరుగుతున్నాయి. ఇతర ఉద్యోగాల వయోపరిమితి పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరేమిటో స్పష్టం కాకపోవడంపట్ల నిరుద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత జనరల్‌ కేటగిరిలో ఉద్యోగాల వయోపరిమితిని 34 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకు పొడిగించింది. 2014 సెప్టెంబరు 3వ వారంలో జారీచేసిన ఈ ఉత్తర్వుల్లో 2016 సెప్టెంబరు 30వ తేదీ వరకు పొడిగింపు నిర్ణయం వర్తిస్తుందని పేర్కొన్నారు. అయితే.. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏపీపీఎస్సీ నుంచి ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు వెలువడనేలేదు. దీనివల్ల నిరుద్యోగుల్లో కొందరు ప్రతిరోజూ ప్రభుత్వ ఉద్యోగాలకూ దూరమవుతూనే ఉన్నారు. ఏపీపీఎస్సీ నుంచి చివరిగా 2011-2012 మధ్య ప్రకటనలు వెలువడ్డాయి. ఆ తర్వాత నుంచి ప్రకటనల జారీ జాడే లేదు. ఈ తరుణంలో ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీకి సిద్ధం అవుతున్నందున నిరుద్యోగుల్లో వయోపరిమితి పెంపుపై ఆశలు చిగురించాయి. కొందరు ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపుతున్నారు. ఏపీపీఎస్సీ కార్యాలయానికీ ఈ అభ్యర్థనలు అందుతున్నాయి. వయోపరిమితి పెంపు నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది. సాధారణ పరిపాలన శాఖ నుంచి ఈ ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఇవి వస్తేనే ఏపీపీఎస్సీ జారీచేయబోయే నోటిఫికేషన్లలో కొత్త వయోపరిమితిని పేర్కొనేందుకు అవకాశం ఉంది. వయోపరిమితి పెంపుపై అధికారిక నిర్ణయం వెలువడితే నిరుద్యోగులు అర్హతలు అనుసరించి సరిపోయే ఉద్యోగాల రాత పరీక్షలకు సన్నద్ధమయ్యే అవకాశం ఉంది. ఏపీపీఎస్సీ నుంచి వరుస క్రమంలో ఉద్యోగ ప్రకటనలు వెలువడితే వయోపరిమితి పరంగా ఉద్యోగాలకు దూరమయ్యే వారం కాదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పోలీసు శాఖలో కూడా సకాలంలో ఉద్యోగాల భర్తీ జరగడంలేదు. తీవ్ర జాప్యం అనంతరం ఆరువేల ఉద్యోగాల భర్తీకి ఇటీవలే నిర్ణయం జరిగింది. దీంతో నిరుద్యోగులకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో వయోపరిమితిని రెండేళ్లపాటు పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు డీజీపీ రాముడు ప్రకటించారు.
ఏపీపీఎస్సీ లేఖపై నిర్ణయమేది?
గ్రూపు-1లో గ్రూపు-2 ఉద్యోగాల్ని విలీనం చేయవద్దని నిరుద్యోగులు ఆందోళనలకు దిగుతున్నారు. దీనివల్ల నాలుగైదేళ్ల నుంచి సన్నద్ధమవుతున్న తమకు నష్టం జరుగుతుందని పేర్కొంటోన్న వీరి ఆందోళనల్ని పరిగణనలోనికి తీసుకున్న ఏపీపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. త్వరలో జరగబోయే నోటిఫికేషన్‌ వరకు గ్రూపు-2 ఉద్యోగాల్ని గ్రూపు-1లోకి విలీనం చేయొద్దని కోరింది. దీనిపై ఆర్థిక, సాధారణ పరిపాలన శాఖలు సానుకూలంగానే స్పందించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ముఖ్యమంత్రితో చర్చించిన అనంతరం అధికారిక నిర్ణయం వెలువడుతుందని కొద్దిరోజుల నుంచి ఆశిస్తుండగా ఇంతవరకు ఆ వూసే లేదు. విదేశీ పర్యటన ముగించుకుని ఇటీవలే వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ శనివారం నుంచి రష్యా, ఇతర దేశాల పర్యటన ప్రారంభించారు. దీంతో వయోపరిమితి పెంపు నిర్ణయం, తాత్కాలికంగా ఉద్యోగాల విలీన రద్దు నిర్ణయం విషయంలో స్పష్టత వచ్చేందుకు మరికొంత సమయంపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Posted on 10-07-2016