తాజా స‌మాచారం

ఆగస్టులో గ్రూప్‌-1 మెయిన్స్‌ రీఎగ్జామ్‌

హైదరాబాద్‌: 2011 నాటి గ్రూప్‌-1 సర్వీసుల ప్రకటనకు సంబంధించి ఆగస్టు నెలాఖరులో మళ్లీ మెయిన్స్‌ నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) సిద్ధమవుతోంది. నాటి ప్రిలిమ్స్ పరీక్షలో సవరించిన ‘కీ’ ప్రకారం అర్హత సాధించిన అభ్యర్థులందరికీ మళ్లీ మెయిన్స్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సుమారు 9 వేల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాసే అవకాశం ఉంది. అప్పట్లో మెయిన్స్‌ రాసిన అభ్యర్థులందరికీ మూడు నెలల్లోగా మళ్లీ మెయిన్స్‌ నిర్వహించాలని సుప్రీంకోర్టు జూన్‌ 29న తుది తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా 2012లో నిర్వహించిన మెయిన్స్‌కు నిర్దేశించిన సిలబస్‌కు అనుగుణంగానే రీఎగ్జామ్‌ జరగనుంది. ఆగస్టు నెలాఖరులో మెయిన్స్‌ నిర్వహించి వీలైనంత తొందరగా ఇంటర్వ్యూల ప్రక్రియ ముగించాలని కమిషన్‌ యోచిస్తోంది. అక్టోబరులో తుది ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది.

Posted on 17-07-2016