తాజా స‌మాచారం

2003 గ్రూపు-1లో మరో 67 మంది ఎంపిక

* సుప్రీంకోర్టు ఆదేశాలు అనుసరించి జాబితాను వెల్లడించిన ఏపీపీఎస్సీ
ఈనాడు, హైదరాబాద్: గ్రూపు-1 (2003) నోటిఫికేషన్ ద్వారా అదనంగా ఎంపికైన 67 మంది అభ్యర్థుల జాబితాను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) ప్రకటించింది. సుప్రీంకోర్టు ఆదేశాల్ని అనుసరించి ఈ మేరకు చర్యలు చేపట్టింది. మల్టీజోన్-2, 3, జోన్-2, 6లలో రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేసిన ఉద్యోగాల్లో అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, కో-ఆపరేటివ్ సొసైటీ డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ అకౌంట ఆఫీసర్/అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, జిల్లా ఉపాధి అధికారి, మున్సిపల్ కమిషనర్, ఎండీవో పోస్టులు ఉన్నట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఉదయ్‌భాస్కర్ తెలిపారు. ఏపీపీఎస్సీ నియమావళి రూల్-7 అనుసరించి తొలివిడత జాబితాలో అభ్యర్థుల ఎంపిక జరిగిన అనంతరం ఖాళీగా ఉన్న ఈ ఉద్యోగాలను ప్రాధాన్య క్రమంలో ఉన్న అభ్యర్థులతో భర్తీ చేయకపోవడంపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో వారికి అనుకూలంగా తీర్పు వెలువడింది. దీనిని అనుసరించే తాజా ఎంపిక జాబితాను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ నెల 30వ తేదీలోగా అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరేందుకు అంగీకారం తెలుపుతూ ఏపీపీఎస్సీ సూచించిన వివరాలను ఈ-మెయిల్ ద్వారా పంపాలని ఏపీపీఎస్సీ ఛైర్మన్ సూచించారు.
సెప్టెంబరు 6 నుంచి 17 వరకు 2011 గ్రూపు-1 ప్రధాన పరీక్షలు
సుప్రీంకోర్టు ఆదేశాల్ని అనుసరించి గ్రూపు-1 (2011) ప్రధాన పరీక్షలను సెప్టెంబరు 6, 8, 10, 13, 15, 17 తేదీల్లో నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. ప్రిలిమ్స్ ప్రశ్నపత్రంలో దొర్లిన తప్పులపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు మళ్లీ ప్రధాన పరీక్షల్ని నిర్వహించాలని ఏపీపీఎస్సీని ఆదేశించింది.

Posted on 20-07-2016