close

తాజా స‌మాచారం

తెలుగులో ప్రశ్నలు ఇవ్వాలంటూ ఏపీపీఎస్సీకి అభ్యర్థుల మొర

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ముందస్తు సమాచారం లేకుండా ఏపీపీఎస్సీ వ్యవహరిస్తున్న తీరుపట్ల నిరుద్యోగ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 17న ఏఈఈ నియామక రాత పరీక్షను ఆంగ్లంలో ఏపీపీఎస్సీ నిర్వహించింది. జనరల్‌ స్టడీస్‌ పరీక్ష కేవలం ఆంగ్లంలోనే ఉంటుందని ప్రకటనలో స్పష్టంగా పేర్కొనకుండా హాల్‌ టికెట్లలో మాత్రం వెల్లడించినట్లు అభ్యర్థులు తెలిపారు. తెలుగులో పరీక్ష రాసేందుకు సన్నద్ధమైన తాము దీనివల్ల నష్టపోయామని పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శికి, సచివాలయంలో పలువురు అధికారులకు ఫిబ్ర‌వ‌రి 19న‌ విజ్ఞాపన పత్రాలు అందచేశారు. డిగ్రీని ఆంగ్లంలో పూర్తిచేసిన వారికి ఆంగ్లంలోనే పరీక్షలు పెడతామని చెప్పడం ఆవేదన కలిగిస్తోందన్నారు. ప్రశ్నలు తెలుగులో, ఆంగ్లంలో ఉంటే పరీక్షలు రాసేందుకు సులువుగా ఉంటుందని వీరు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో జరిగే రాత పరీక్షల్లోనైనా తెలుగులోనూ ప్రశ్నలు ఇవ్వాలని కోరుతున్నారు.

Posted on 20.02.2019