తాజా స‌మాచారం

తప్పులతడకగా 1999 గ్రూపు-2 జాబితా

* ఉపసంహరించుకున్న ఏపీపీఎస్సీ
ఈనాడు, హైదరాబాద్‌: సుప్రీంకోర్టు ఆదేశాలతో 1999 నోటిఫికేషన్‌ ప్రకారం గ్రూపు-2 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కొత్తగా ప్రకటించిన అభ్యర్థుల జాబితా తప్పుల తడకగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీపీఎస్సీ జారీచేసిన 1999 గ్రూపు-2 నోటిఫికేషన్‌ వివాదస్పదమైంది. స్థానిక, స్థానికేతర విధానం అమలు, ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కింద ఖాళీగా ఉన్న పోస్టుల్ని ప్రకటించడం, అభ్యర్థుల ప్రతిభకు తగినట్లు ఉద్యోగాల్ని ఇవ్వడంలో ఏపీపీఎస్సీ అనుసరించి వైఖరిపై అభ్యర్థులు న్యాయపోరాటం చేశారు. నోటిఫికేషన్‌ జారీచేసిన అనంతరం పోస్టుల సంఖ్యను కూడా పెంచారు. ఈ క్రమంలో కొందరు ఉద్యోగాల్లో చేరారు. అభ్యర్థుల పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రతిభ అనుసరించి పోస్టుల్ని కేటాయించాల్సిందేనని కిందటేడాదినే స్పష్టం చేసింది. ఈ తీర్పును అనుసరించి మళ్లీ కొత్త జాబితాను ప్రకటించాల్సి ఉండగా జాప్యం అనివార్యమైంది. రాష్ట్ర విభజన జరగడం, అధికారులు మారిపోవడం వంటి కారణాలతో చర్యలు మందకొడిగా సాగాయి. ఈ నేపథ్యంలో పలువురు అభ్యర్థులు కోర్టు ధిక్కరణ కింద సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఏపీపీఎస్సీ అప్రమత్తమై హడావుడిగా కొత్త జాబితాను గురువారం వెబ్‌సైట్‌లో ప్రకటించింది. 1200 ఎగ్జిక్యూటివ్, 200 నాన్‌ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలకు సంబంధించి ప్రకటించిన ఈ జాబితాలో ఒక వ్యక్తికి రెండు పోస్టులు వచ్చాయి. ఇలా ఐదుగురికి ఇచ్చినట్లు తెలిసింది. ప్రతిభ ప్రకారం ముందు వరుసలో ఉన్న కొందరి పేర్లు జాబితాలో కనిపించలేదు. పదేళ్ల నుంచి సర్వీసుల్లో ఉన్న వారి పేర్లు కూడా కనిపించకపోవడం గమనార్హం. ఇలాంటి మరికొన్ని తప్పులు వెలుగులోనికి వచ్చాయి. దీంతో ఆందోళన చెందిన అభ్యర్థులు తప్పులతడకగా మారిన జాబితా గురించి ఏపీపీఎస్సీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై పరిశీలన ఏపీపీఎస్సీ జాబితాలో తప్పులు ఉన్నట్లు గుర్తించి వెబ్‌సైట్‌ నుంచి తొలగించేసింది. రెండు, మూడు రోజుల్లో కొత్త జాబితాను ప్రకటిస్తామని వెల్లడించింది.

Posted on 30-07-2016