తాజా స‌మాచారం

ఏపీలో ఆన్‌లైన్‌లో గ్రూప్-2 మెయిన్స్

* ప్రభుత్వం ఉత్తర్వుల జారీ
ఈనాడు, హైదరాబాద్: గ్రూప్-2 ప్రధాన పరీక్షల్ని ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఆమోదం తెలిపింది. ఇకపై జరిగే గ్రూపు-2 పరీక్షల్ని ప్రిలిమ్స్, మెయిన్స్ తరహాలో జరపాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. తదుపరి చర్యల్లో భాగంగా మెయిన్స్ పరీక్షల్ని ఆన్‌లైన్‌లో జరిపేందుకు అనుమతివ్వాలని కమిషన్ కోరగా బుధవారం(ఆగస్టు 3) సాధారణ పరిపాలనశాఖ ఆమేరకు సానుకూలంగా ఉత్తర్వుల్ని జారీచేసింది. ప్రిలిమ్స్ పరీక్షను 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, ఆర్థికం, సైన్స్, టెక్నాలజీ, ఆర్ట్స్, స్పోర్ట్స్, సాంస్కృతిక, గవర్నెన్స్ రంగం, భారత రాజ్యాంగంలోని వివిధాంశాలు, దేశ ఆర్థికరంగంపై ప్రశ్నలుంటాయి. ప్రధాన పరీక్షలో 3 పేపర్లు ఉంటాయి. పేపరు-1 150 మార్కులకు జనరల్ స్టడీస్‌లో ఉంటుంది. రెండో పేపరును 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో రాష్ట్ర సాంఘిక చరిత్ర, సాంస్కృతిక పరిణామాలు, భారత రాజ్యాంగం సమగ్ర స్వరూపంపై ప్రశ్నలుంటాయని అధికారులు జీవోలో వెల్లడించారు. పేపరు-3 కింద 100 మార్కులకు ఇచ్చే ప్రశ్నపత్రంలో భారతదేశ ప్రణాళిక, ఆర్థిక వ్యవస్థలతోపాటు గ్రామీణ సమాజంలో ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లపై రాష్ట్రాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రశ్నల్ని ఇవ్వనున్నారు. పూర్తి సిలబస్ సమాచారాన్ని ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచింది.

Posted on 02-08-2016