తాజా స‌మాచారం

గ్రూపు-1 అభ్యర్థులకు మరో తలనొప్పి

* గతంలో మౌఖిక పరీక్షలకు హాజరైనా ఇప్పుడు అనర్హత
* 2011 నోటిఫికేషన్‌ వ్యవహారం

ఈనాడు, హైదరాబాద్‌: 2011 నోటిఫికేషన్‌ గ్రూపు-1 అభ్యర్థులకు మరో తలనొప్పి ఎదురయింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వీరు వచ్చే సెప్టెంబరు నెలలో మళ్లీ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అయితే గతంలో ప్రిలిమ్స్‌లో అర్హత సాధించి, ప్రధాన పరీక్షలో ఎంపికయి మౌఖిక పరీక్షకు హాజరైన కొందరు వచ్చే నెలలో జరగనున్న పరీక్షకు అర్హత సాధించలేకపోయారు. గత ప్రిలిమ్స్‌లో 150 మార్కుల ప్రశ్నలకు జవాబులు రాయడమే ఇందుకు కారణం. ఈ పరీక్ష ప్రశ్నపత్రంలో తప్పులు దొర్లినందున 144 మార్కులకు మాత్రమే జవాబుపత్రాల్ని మూల్యాంకనం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో కటాఫ్‌ మార్కు మారి 802 మంది అభ్యర్థులు అర్హత కోల్పోయారు. మౌఖిక పరీక్షలకు హాజరైనా తాజా జాబితాలో పేర్లు లేని వివరాలు, అందుకు దారితీసిన కారణాల్ని తెలియచేయాలని అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారుల్ని కోరుతున్నారు.
312 పోస్టుల జనరల్‌, రెండు పోస్టుల లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌తో కలిసి 314 పోస్టులకు మెయిన్స్‌ అభ్యర్థుల్ని ఎంపిక చేసే విధానాన్ని ఏపీపీఎస్సీ వెల్లడించింది. గతంలో జనరల్‌ పోస్టుల కటాఫ్‌ 91 మార్కులు కాగా ప్రస్తుతం 89గా నమోదైంది. పరిమిత పోస్టుల కటాఫ్‌ 72 మార్కులుగా ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆరు ప్రశ్నల్ని తొలగించి 144 ప్రశ్నల ఆధారంగా మూల్యాంకనం చేశారు. వీరిలో కొత్తగా అర్హత సాధించిన వారు 196 మంది ఉన్నారు. గతంలో అర్హత సాధించిన వారిలో 802 మంది ప్రస్తుతం అనర్హులయ్యారు. మొత్తమ్మీద 8,760 మందికి ప్రధాన పరీక్షల్ని నిర్వహించబోతున్నారు.
రాష్ట్ర విభజన అనంతరం 314 పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌కు 172 జనరల్‌, ఒక లిమిటెడ్‌ పోస్టు కలిపి 173 వచ్చాయి. 2003 గ్రూపు-1 చేరని అభ్యర్థుల (నాన్‌ జాయినింగ్‌) కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల్ని అనుసరించి 36 మందికి పోస్టులను కూడా ఇందులో కలపాల్సి ఉంది. వీటిని 2011 గ్రూపు-1 పోస్టుల నుంచే భర్తీచేయనున్నారు. అప్పట్లో ఇంకా ఎవరైనా చేరకుండా ఉంటే ఆ పోస్టుల్ని కూడా ఇందులోనే కలపనున్నారు.
మారిన పరీక్షల తేదీలు
గ్రూపు-1 (2011) ప్రధాన పరీక్షల తేదీలు మారాయి. కేంద్రానికి చెందిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ప్రకటించిన వివిధ రాత పరీక్షల తేదీల్ని అనుసరించి ఈ మార్పు చేసినట్లు ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి.
సెప్టెంబరు 13: జనరల్‌ ఇంగ్లిష్‌
14: పేపరు-1 సాధారణ వ్యాసం
17: పేపరు-2 చరిత్ర, భారత రాజ్యాంగం
19: పేపరు-3 భారత, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థలు
21: పేపరు-4 సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
23: పేపరు-5 డేటా అప్లికేషన్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌
http://psc.ap.gov.in/

Posted on 07-08-2016