close

తాజా స‌మాచారం

నెలాఖరకు ఉద్యోగ ప్రకటనలు జారీ

* ఏపీపీఎస్సీ అధ్యక్షుడు ఉదయ్‌భాస్కర్‌ వెల్లడి
ఈనాడు, అమరావతి: ఈ నెలాఖరు(డిసెంబ‌ర్‌) నాటికి ఉద్యోగాల ప్రకటనల జారీ ప్రక్రియను పూర్తిచేస్తామని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించింది. గ్రూపు-1, గ్రూపు-2 ఉద్యోగ నియామకాల ప్రకటనల జారీకి అవసరమైన వివరాలు శాఖల నుంచి అందినట్లు కమిషన్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు. గ్రూపు-2 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను గ్రూపు-1 1బి కింద గుర్తించాలా? వద్దా? అన్న దానిపై ప్రభుత్వం నుంచి అధికారికంగా సమాచారం అందలేదని పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్‌ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారని ప్రస్తావించగా అధికారిక నిర్ణయాలు ప్రభుత్వపరంగా జరిగి తమకు సమాచారం అందాల్సి ఉందని తెలిపారు. గ్రూపు-3 (పంచాయతీ కార్యదర్శులు) ఉద్యోగ ఖాళీల వివరాలు పూర్తిస్థాయిలో ఇంకా అందలేదని చెప్పారు. దీనిపై ఆ శాఖ అధికారులతో సంప్రదిస్తున్నామని తెలిపారు. అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్, అధ్యాపకుల పోస్టుల ఖాళీలు, ఇతర వివరాలు దాదాపుగా వచ్చాయన్నారు. డిసెంబర్‌ 20వ తేదీన జరిగే కమిషన్‌ సమావేశంలో ప్రకటనల జారీ గురించి చర్చిస్తామని తెలిపారు. ఈ నెలాఖరు నాటికి కమిషన్‌ పరంగా జరగాల్సిన ఉద్యోగ ప్రకటనల జారీ పూర్తవుతుందని వెల్లడించారు.

Posted on 12.12.2018