తాజా స‌మాచారం

జాతకాలు తారుమారు!

* 11 ఏళ్ల తర్వాత ఉద్యోగాల్లో మార్పు
* 1999 ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌పై వివాదాలు
* కమిషన్ చరిత్రలోనే అసాధారణం

ఈనాడు-హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన 1999 గ్రూపు-2 నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన వారి పరిస్థితి డోలాయమానంలో పడింది. సుదీర్ఘ విరామ అనంతరం కొందరు అభ్యర్థుల ఉద్యోగాలు మారనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు వంద మంది ఉద్యోగాలకు దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.
కథ...ఎలా అడ్డం తిరిగిందంటే!
ఈ నోటిఫికేషన్ అనుసరించి 2000 ఆగస్టులో రాత పరీక్ష నిర్వహించారు. ఖాళీలు ఎక్కువగానే ఉన్నప్పటికీ 104 ఎగ్జిక్యూటివ్, 141 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను మాత్రమే అప్పట్లో ఏపీపీఎస్సీ భర్తీ చేసింది. ఇదే సమస్యలకు బీజం వేసింది. దీనిపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో నోటిఫికేషన్ జారీనాటికి అందుబాటులో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయాలని తీర్పు వచ్చింది. దీని ప్రకారం చర్యలు తీసుకోవడంలో ఏపీపీఎస్సీ చేసిన తప్పులు సమస్యను మరింత జటిలం చేశాయని అభ్యర్థులు పేర్కొంటున్నారు. కొత్తగా వచ్చిన 972 ఎగ్జిక్యూటివ్ పోస్టుల ఖాళీలను 2002లో వచ్చిన జీఓ 124 ప్రకారం (104 ఖాళీలను రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం భర్తీ చేసినట్లు కాకుండా) భర్తీ చేశారు. దీంతో కొత్త సమస్య తెరపైకొచ్చింది. మరోవైపు ఎంపికైన 972 మంది ఉద్యోగాల్లో చేరారు. ఎంపిక ప్రక్రియ మధ్యలో కొత్త విధానంపై అభ్యంతరం చెబుతూ మరి కొందరు 2006లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మిగిలిన ఖాళీలను పాత విధానంలో అంటే రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం పిటిషనర్లతో భర్తీ చేయాలని 2015లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీని ప్రకారం చర్యలు తీసుకుంటే సుమారు 300 మందికి మళ్లీ ఇంటర్వూలను నిర్వహించాల్సిన పరిస్థితులున్నాయని ఏపీపీఎస్సీ అధ్యక్షుడు ఉదయ్‌భాస్కర్ తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగాల్ని కోల్పోయే సుమారు వంద మందిలో ఏపీ పరిధిలోకి వచ్చే వారికి సూపర్‌న్యూమరరీ ద్వారా పోస్టుల్ని కేటాయించే విషయమై ఏపీపీఎస్సీ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఉదయ్‌భాస్కర్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లారు. దీని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు.
జాతకాల తారుమారు
తాజా పరిణామాలు 1999 నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన వారిని కలవరపరుస్తున్నాయి. వీరంతా శాఖాపరమైన పరీక్షలు ఉత్తీర్ణులై, సర్వీసు క్రమబద్ధీకరణ పొంది పదోన్నతులు కూడా సాధించారు. పలువురు గ్రూపు-1 స్థాయి ఉద్యోగాలకు చేరువలో ఉన్నారు. వీరిలో అత్యధికులు 45 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్కులే. మరో శాఖలోకి వెళ్లే అవకాశాలు ఉండటం వీరిని ఆందోళనకు గురిచేస్తోంది. అందుబాటులో ఉన్న ఖాళీను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పిటిషనర్లతో భర్తీ చేస్తే సమస్య చాలా వరకు పరిష్కారమవుతుందని కొందరు అభ్యర్థులు సూచిస్తున్నారు.
అభ్యర్థులు ఆశిస్తున్న దానికి భిన్నంగా..!
ఏపీపీఎస్సీ వద్ద నాన్ జాయినింగ్ పోస్టులు 30, కొత్తగా వచ్చిన 111 ఎగ్జిక్యూటివ్ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. వీటిని సుప్రీంకోర్టును ఆశ్రయించిన వారితోనే భర్తీ చేస్తారని అభ్యర్థులు భావించారు. ఇదే తరుణంలో సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎంపికైన 1312 మంది అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ ఇటీవల వెబ్‌సైట్‌లో పెట్టింది. ఇందులో తప్పులున్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేయడంతో ఏపీపీఎస్సీ జాబితాను ఉపసంహరించుకుంది. ప్రస్తుతం జాబితాలోని తప్పులను సరిదిద్దడం, నిశిత పరిశీలన ప్రక్రియ చివరి దశకు వచ్చింది.
మళ్లీ న్యాయపోరాటం
ఉద్యోగాలను కోల్పోయే వారు మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో జూనియర్ కళాశాలల అధ్యాపకుల రాత పరీక్ష 'కీలో తప్పులు దొర్లడంపై న్యాయపోరాటం కొనసాగుతుండగానే ఎంపికైన వారు ఆర్థికశాస్త్ర బోధకులుగా ఉద్యోగాల్లో చేరారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు వీరిని విధుల నుంచి ఎందుకు తప్పించకూడదని అధికారులు నోటీసులు ఇవ్వగా వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించి 'స్టే తెచ్చుకున్నారు. 1999 నోటిఫికేషన్ అర్హుల విషయంలోనూ ఇవే పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Posted on 04-09-2016