తాజా స‌మాచారం

నాలుగు అంశాల్లో నవ్య పంథా

* పరీక్షల నిర్వహణలో ఏపీపీఎస్పీ నూతన ప్రయోగం
* అక్రమాలకు అడ్డుకట్ట
* అభ్యర్థులకు మేలు

ఈనాడు- హైదరాబాద్: పోటీ పరీక్షల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన అధ్యయానికి శ్రీకారం చుట్టింది. బుధవారం(సెప్టెంబరు 14) జరిగిన గ్రూపు-1 (2011) ప్రధాన పరీక్షల్లో సరికొత్త విధానాలను అమలు చేసింది. నాలుగు అంశాల్లో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి.
1. అక్కడికక్కడే ప్రశ్నపత్రాలు: ఇప్పటి వరకు ఎంపిక చేసిన సంస్థ ద్వారా రహస్యంగా ప్రశ్నపత్రాల్ని ముద్రింపచేసి, బండిళ్ల రూపంలో కేంద్రాలకు తరలించేవారు. ఇది వ్యయప్రయాసలతో కూడుకున్నది. ప్రశ్నపత్రాల లీకేజీ సమస్య ఉండేది. దీనికి స్వస్తి పలికి ప్రశ్నపత్రాన్ని ఆన్‌లైన్ ద్వారా పరీక్ష కేంద్రాలకు పంపించారు. అక్కడే ప్రింట్లు తీసి అభ్యర్థులకు ఇచ్చారు. ఉదయం పది గంటలకు పరీక్ష ప్రారంభం కాగా, 7.30 నుంచి 8.00 గంటల మధ్య పరీక్ష కేంద్రం నిర్వాహకులకు ఆన్‌లైన్ ద్వారా ప్రశ్నపత్రం అందింది. అక్కడే ప్రత్యేకంగా ఓ గదిలో హైస్పీడు జెరాక్స్, ఇతర ఆధునిక సామగ్రిని అందుబాటులో ఉంచి ప్రింట్లు తీశారు. అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రశ్నపత్రాల్ని కట్టల్లో భద్రపరిచారు. వాటిని పరీక్ష నిర్వహించే గదులకు పంపించారు.
2. అభ్యర్థుల వేలి ముద్రల సేకరణ: అభ్యర్థులు ఉదయం 8.30 గంటల సమయంలోనే పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం ఆరంభించారు. బయోమెట్రిక్ విధానంలో వారి వేలి ముద్రలు సేకరించారు. ప్రతి 40 మంది అభ్యర్థులకు ఒక్కో బయోమెట్రిక్ పరికరాన్ని ఏర్పాటు చేశారు. కొద్దిమంది మాత్రం 9.30 గంటల సమయంలో చేరుకుని ఇబ్బందులు పడ్డారు.
3.సీసీ కెమేరాల ఏర్పాటు: ప్రశ్నపత్రాల ప్రింట్లు తీసుకోవడం, వాటిని కట్టలుగా కట్టడం, అభ్యర్థులు పరీక్ష రాసే దృశ్యాల మొత్తాన్ని సీసీ కెమేరాల ద్వారా చిత్రీకరించి నిక్షిప్తం చేశారు.
4. ప్రశ్నపత్రంలో అత్యంత తాజా అంశాలు: ప్రశ్నపత్రంలో.. ప్రధానంగా వ్యాసం (జనరల్ ఎస్సే)లో వర్తమాన అంశాల్లో భాగంగా ఇంతవరకు రెండు, మూడు నెలల కిందటి పరిణామాలపై ప్రశ్నలు ఇచ్చేవారు. ఆన్‌లైన్ ప్రశ్నపత్రం కారణంగా ఇతర అంశాలతో పాటు; వారం, పదిరోజుల కిందటి పరిణామాలపైనా ప్రశ్నలు వచ్చాయి. ఉదాహరణకు..
* భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. కానీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు? ప్రత్యేక ప్యాకేజీతో పోల్చితో ప్రత్యేక హోదా వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయా? తెలపండి?
*'నదుల అనుసంధానం, ఆంధ్రప్రదేశ్ రైతుల వేతలు తీర్చగల ఏకైక సాధనం ప్రకటన దృష్టిలో ఉంచుకుని నదుల అనుసంధానం ఏ విధంగా నీటి కొరతను తీర్చగలదో తెలపాలి.
* పట్టిసీమ పథకం, దాని ప్రయోజనాల్ని వివరించాలి.
* ఢిల్లీ జేఎన్‌యూ ఉదంతం నేపథ్యంలో దేశదోహ్ర చట్టాలకు ప్రజాస్వామ్యంలో స్థానంలేదన్న అంశంపై చర్చించాలి.
* కాశ్మీర్ లోయలోని హింస, భారత ప్రభుత్వ ఉమ్మడి తీవ్రవాద వ్యతిరేక వ్యూహ ప్రయత్నాల పురోగతి వివరించాలి.
ఈ విధానం యూపీపీఎస్సీ తరహాలో ఉందని, నిత్యం పత్రికలు చదివేవారు బాగా రాయగలరని అభ్యర్థులు పేర్కొన్నారు.
ఇకపై అన్ని పరీక్షలకు ఇదే విధానం: ఉదయ్‌భాస్కర్, అధ్యక్షుడు, ఏపీపీఎస్సీ
భవిష్యత్తులో నిర్వహించే పరీక్షలకు ఆన్‌లైన్ ద్వారానే ప్రశ్నపత్రాలను కేంద్రాలకు పంపిస్తాం. ఈ విధానంలో వర్తమాన, తాజా అంశాలపై ప్రశ్నలు ఇచ్చేందుకు అవకాశం ఉంది. ఒకటి కంటే ఎక్కువగానే ప్రశ్నపత్రాల సెట్లను అందుబాటులో ఉంచుకొని ఎంపిక చేసిన దానిని ఏపీపీఎస్సీ కార్యాలయం ద్వారా నిర్దేశించిన సమయంలోనే పరీక్ష కేంద్రాలకు పంపిస్తాం. ఒకరి బదులు మరొకరు పరీక్ష రాయకుండా ఉండేందుకు బయోమెట్రిక్ విధానాన్నీ అమలు చేశాం.

Posted on 15-09-2016