close

తాజా స‌మాచారం

ప్రశాంతంగా ఏపీ గ్రూపు-1 ప్రిలిమ్స్‌

* 73.76% మంది హాజరు
* తెలుగు అనువాదంలో తప్పులు
* తికమకకు గురైన అభ్యర్థులు
* ప్రశ్నల సరళిపై మిశ్రమ స్పందన

ఈనాడు, అమరావతి - డిజిటల్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా మే 26న‌ జరిగిన గ్రూపు-1 పరీక్ష (స్క్రీనింగ్‌ టెస్ట్‌) ప్రశాంతంగా జరిగింది. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్న వారిలో 73.76శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రశ్నల్లో దొర్లిన అనువాద దోషాలు అభ్యర్థులను తిప్పలుపెట్టాయి. గ్రాంథిక భాష వినియోగంతో అవస్థలు పడ్డారు. ప్రశ్నపత్రంపై తీరుపై అభ్యర్థుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. పలువురు ఫరవాలేదని చెప్పగా...మరికొందరు కఠినంగా ఉన్నట్లు వెల్లడించారు. మొత్తం మీద చాలా ప్రశ్నలు విశ్లేషణాత్మకంగా ఉన్నట్లు ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ఈ పరీక్షకు ప్రత్యేకంగా సన్నద్ధమైన వారు కూడా తికమకకు గురయ్యేలా ప్రశ్నలు ఉన్నట్లు ఓ అభ్యర్థి పేర్కొన్నారు. కొన్ని ప్రశ్నలు యూపీఎస్సీ స్థాయిలో ఉన్నట్లు చెప్పారు.ఉదయం నిర్వహించిన పేపర్‌-1లో రాజనీతిశాస్త్రం, ఆర్థికశాస్త్రం ప్రశ్నలు తికమక పెట్టేలా ఉన్నట్లు విజయనగరం, విజయవాడకు చెందిన హైమా, దివ్య చెప్పారు. ఆర్థికశాస్త్రం, భూగోళశాస్త్ర ప్రశ్నల్లో రాష్ట్రానికి చెందినవి చాలా తక్కువగా ఉన్నట్లు హైదరాబాద్‌కు చెందిన రవికుమార్‌ చెప్పారు. ఎక్కువగా ప్రపంచ, దేశ స్థాయిలో ప్రశ్నలు ఇచ్చినట్లు విజయవాడ నగరానికి చెందిన సాయికృష్ణతేజ పేర్కొన్నారు.
అనంతపురం జిల్లాలో హాజరు ఎక్కువ
రాష్ట్ర వ్యాప్తంగా 1,14,473 మంది అభ్యర్థులు గ్రూపు-1కు దరఖాస్తు చేశారు. వీరిలో 80,250 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడు చేసుకున్నారు. వీరిలో 73.76శాతం మంది మాత్రమే హాజరుకావడం గమనార్హం. గరిష్ఠంగా అనంతపురం జిల్లాలో 78.77శాతం, కడప-78.42శాతం, నెల్లూరు జిల్లాలో 77.73శాతం వంతున హాజరు నమోదైంది. కనిష్ఠంగా కృష్ణా జిల్లాలో 69.69శాతం, విశాఖపట్టణం-71.11, తూర్పుగోదావరి-71.65శాతం వంతున హాజరు నమోదైనట్లు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తెలిపింది. ప్రశ్నల్లో పోలవరం, రాష్ట్ర విభజన, వర్తమాన అంశాలను ఇచ్చారు. అభ్యర్థుల నాయకత్వ లక్షణాలు పరీక్షించే ప్రశ్నలు అడిగారు. గ్రూప్‌-1 ప్రశ్నపత్రం తీరుపై విజయవాడలోని 2 కేంద్రాల్లో ‘ఈనాడు డిజిటల్‌’ ప్రతినిధి పలువురి నుంచి అభిప్రాయాలు సేకరించారు. అవి..
ఆంగ్ల ప్రశ్నల తెలుగు అనువాదంలో దొర్లిన తప్పులు!
‘‘తెలుగు మాధ్యమ విభాగం కింద ప్రశ్నల్లో ఆంగ్ల పదానికి సరైన తెలుగు పదాన్ని ఇవ్వాల్సి ఉండగా ఆంగ్ల మాధ్యమంలో ఇచ్చిన పదాలనే నేరుగా తెలుగులోకి తర్జూమా చేసి ఇచ్చారు. ఇది తెలుగు మాధ్యమ అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేసింది. ఆంగ్ల మాధ్యమంలో ప్రశ్నల నిడివి ఎక్కువగా ఉండటంతో పలువురు ఆంగ్ల మాధ్యమ అభ్యర్థులు సమయం ఆదా కోసం తెలుగు ప్రశ్నలను చూడగా స్పష్టత లేక ఇబ్బందులు పడ్డారు. పేపర్‌ కోడ్‌ ‘సీ’ కి సంబంధించి 58వ ప్రశ్నలో అప్షన్‌-బిలో ఆంగ్లంలో ‘బైకెమేరాల్‌ లెజిస్లేచర్‌’ ను తెలుగులో ‘రెండు కెమేరాల చట్టం’గా ఇచ్చారు. అదేవిధంగా 92వ ప్రశ్నలో ‘డాన్యూబ్‌’ అనే పదాన్ని ఉపయోగించాల్సి ఉండగా ఆంగ్లంలో మాదిరే ‘దనుబె’ అని ఇచ్చారు’’అని విజయవాడకు చెందిన రజని చెప్పారు.
* ఆంగ్లంలో సెంటెన్స్‌ (శిక్ష) పదానికి తెలుగులో ‘వాక్యం’గా అనువాదం చేసి, ప్రొఫెసర్లు అభ్యర్థులను ఔరా అనిపించారు. పేపరు-1లో 33వ ప్రశ్నకు సంబంధించి ఆంగ్లంలో ఇచ్చిన ప్రశ్నలోని జవాబులు, తెలుగు ప్రశ్నలోని జవాబులకు పొంతన లేకపోవడం అభ్యర్థులను కంగారుపెట్టించింది. అలాగే...శిక్షను అమలు చేయడంపై నిలుపుదలకు స్టే ఇచ్చినట్లు ఆంగ్లంలో పేర్కొన్నారు. తెలుగులో ఇందుకు భిన్నంగా శిక్ష అమలుకు అనుగుణంగా ఇవ్వడం గమనార్హం.
* 99వ ప్రశ్నలో ఆంగ్లంలో జనన, మరణాలకు సంబంధించి ప్రశ్న ఇవ్వగా తెలుగులో ఒక దేశ ముడిద పుట్టిన రేటు, ముడి గిట్టుక రేటూ అంటూ ప్రశ్న సాగింది. ఇదే తరహాలో మరికొన్ని ప్రశ్నల్లో అనువాద దోషాలు ఉన్నట్లు పలువురు అభ్యర్థులు చెప్పారు. దీనివల్ల సమయం వృథా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పరీక్షలో ఇచ్చిన కొన్ని ప్రశ్నలు
* విభజన తరువాత నీతిఆయోగ్‌ సలహాల మేరకు ‘పోలవరం’ ప్రాజెక్టు నిర్మించాల్సింది ఎవరు?
* 2014లో విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి
* ఆంధ్రప్రదేశ్‌లో మునిసిపల్‌ కార్పొరేషన్లు ఎన్ని?
* విజయవాడలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి చీఫ్‌ జస్టిస్‌గా బాద్యతలు చేపట్టింది ఎవరు?
* చిత్తూరు జిల్లా పోలీసులు తయారుచేసిన ప్రాణ రక్ష వెబ్‌ అప్లికేషన్‌ ఎవర్ని కాపాడేందుకు తయారైంది?
* పట్టణ, పల్లె స్థానిక ప్రాంతాల కంప్యూటరైజ్డ్‌ అనుసంధానానికి ప్రారంభించిన ప్రాజెక్టు ఏదీ?
* ఆంధ్రప్రదేశ్‌లో ఏ జిల్లా ఆహార ఉత్పత్తులకు అత్యధిక స్థలం కలది?
* ఇటీవల ప్రకటించిన సౌత్‌ కోస్టల్‌ రైల్వేజోన్‌లో ఉన్న జోన్లు ఏమిటి?
కఠినంగా, విశ్లేషణాత్మకంగా ఉంది - జేవీఎస్‌ రావు, శిక్షణ నిపుణులు, విజయనగరం
ప్రశ్నల సరళి కఠినంగా, విశ్లేషణాత్మకంగా ఉంది. రాజనీతిశాస్త్రంలో అధికంగా ఈ ధోరణి ఉండగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, చరిత్ర, ఆర్థిక వ్యవస్థ, వర్తమాన అంశాలలో కొంతమేర కనిపించింది. సబ్జెక్ట్‌పై పూర్తిగా అవగాహన ఉన్నవారే జవాబులు గుర్తించగలరు. ఇది గ్రామీణ విద్యార్థులకు ఇబ్బందికరమే. రెండో పేపర్‌లో మెంటల్‌ ఎబిలిటీ ప్రశ్నల శైలి సివిల్స్‌ తరహాలో ఉంది. గణిత పాఠ్యేతర, గ్రామీణ ప్రాంత విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది.

Posted on 27.05.2019