తాజా స‌మాచారం

ఏపీపీఎస్సీ ప్రధాన పరీక్షకు వడపోతే!

* అభ్యర్థులను పరిమితం చేయడంపై దృష్టి
* సమర్థ నిర్వహణకు అవకాశం
* ఏఈఈ పోస్టులకు ప్రిలిమ్స్‌పై సమాలోచనలు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కొత్త ఆలోచన చేస్తోంది. 25వేల దరఖాస్తులు దాటితే ప్రిలిమ్స్‌ నిర్వహణకు సిద్ధమైన ఏపీపీఎస్సీ ప్రధాన పరీక్ష రాసే వారి సంఖ్యను పరిమితం చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ప్రిలిమ్స్‌ నుంచి ప్రధాన పరీక్ష రాసేందుకు ఒక్కో పోస్టుకు 50 మందిని ఎంపిక చేస్తోంది. రోస్టరు పాయింట్లతో సంబంధం లేకుండా ఈ 50 మంది ఎంపికవుతున్నారు. ఇకపై ఈ సంఖ్యను యూపీఎస్సీ తరహాలో పరిమితం చేయనుంది. ప్రకటించిన పోస్టుల్లో సామాజికవర్గాల వారీగా మాత్రమే కేటాయించిన పోస్టుల సంఖ్యను అనుసరించి 1:12 లేదా 1:15 మంది చొప్పున ప్రధాన పరీక్షకు ఎంపిక చేయాలన్న అంశంపై సమాలోచనలు చేస్తోంది.
ఉదాహరణకు ప్రకటించిన పోస్టుల్లో పదింటిని ఒక సామాజిక వర్గానికి కేటాయిస్తే ఒక్కొక్క దానికి 12 మంది చొప్పున 120 మందిని మాత్రమే ప్రధాన పరీక్షకు అనుమతిస్తుంది. దీని వల్ల ప్రధాన పరీక్షలను సమర్థంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని ఏపీపీఎస్సీ భావిస్తోంది. ఇప్పటివరకు గ్రూపు-1కు మాత్రమే ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ జరుగుతున్నాయి. ప్రిలిమ్స్‌ నుంచి ప్రధాన పరీక్షకు పోస్టుల సంఖ్యను అనుసరించి 50 మంది చొప్పున ఎంపికవుతున్నారు. దీని వల్ల అభ్యర్థులు పెరిగి ప్రధాన పరీక్షల నిర్వహణ ఏపీపీఎస్సీకి కష్టమవుతోంది. అత్యంత కీలకమైన ప్రధాన పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరింగ్‌ పోస్టుల కోసం 71వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. దీనికి ప్రిలిమ్స్‌ను నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ సమాలోచనలు చేస్తోంది. ఇటీవల నిర్వహించిన యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ను 5.5 లక్షల మంది రాస్తే మెయిన్స్‌కు కేవలం 15వేల మంది మాత్రమే ఎంపికయ్యారు.
అభ్యర్థులకు నష్టమే.. ప్రిలిమ్స్‌ అనంతరం ప్రధాన పరీక్ష రాసే వారి సంఖ్యను పరిమితం చేస్తే అభ్యర్థులకు నష్టమే వాటిల్లుతుంది. ప్రిలిమ్స్‌ ద్వారా సామాజిక వర్గంతో సంబంధం లేకుండా ఒక్కో పోస్టుకు ఇప్పటివరకు 50 మంది చొప్పున ఎంపిక చేస్తున్నందున అభ్యర్థులకు వెసులుబాటు దొరుకుతోంది. ప్రిలిమ్స్‌ పోటీని తట్టుకుంటేనే ప్రధాన పరీక్షకు ఎంపికవుతారు. సామాజిక వర్గాలను అనుసరించి దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉండి ప్రిలిమ్స్‌లో మార్కులు తక్కువ వస్తే ప్రధాన పరీక్ష రాసే అవకాశాలు తగ్గుతాయి. ప్రిలిమ్స్‌ నుంచి ప్రత్యేకంగా సన్నద్ధమైతేనే అభ్యర్థులు కృతకృత్యులవుతారు.
ఏపీపీఎస్సీకి సులువు.. ప్రధాన పరీక్షకు అభ్యర్థులను పరిమితం చేయడం వల్ల ఏపీపీఎస్సీ భారం తగ్గుతుంది. ప్రస్తుతం గ్రూపు-1 (2011) ప్రశ్నపత్రాలను ప్రధాన పరీక్షల కేంద్రాలకు ఆన్‌లైన్‌ ద్వారా పంపుతున్నారు. ఆయా కేంద్రాల్లో అక్కడికక్కడే ముద్రించి అభ్యర్థులకు పంపిణీ చేస్తున్నారు. సీసీ కెమెరాలను వినియోగిస్తున్నారు. విద్యార్థుల నుంచి బయోమెట్రిక్‌ ద్వారా వేలిముద్రలను సేకరిస్తున్నారు. అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉండి కేంద్రాలు ఎక్కువగా ఉన్నట్లయితే పెద్దఎత్తున ఏర్పాట్లు చేయాల్సి వస్తోంది. ఈ భారాన్ని తగ్గించుకోవాలంటే ప్రధాన పరీక్షకు అభ్యర్థుల సంఖ్యను పరిమితం చేయడమే మేలని ఏపీపీఎస్సీ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలో నిర్వహించే కమిషన్‌ సమావేశంలో ప్రధాన పరీక్షకు అభ్యర్థులను పరిమితం చేసే విషయమై ఓ నిర్ణయానికి వస్తామని ఏపీపీఎస్సీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు.

Posted on 25-09-2016