తాజా స‌మాచారం

మైనస్‌ మార్కుల్లేవ్‌

* ఇంజినీరింగ్‌ ఉద్యోగార్థులకు శుభవార్త
* భవిష్యత్తు నోటిఫికేషన్లకు మాత్రం అమలు చేస్తాం
* ఏపీపీఎస్సీ అధ్యక్షుడు ఉదయ్‌భాస్కర్‌ వెల్లడి

ఈనాడు - అమరావతి: అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరింగ్‌, అసిస్టెంట్‌ ఇంజినీరింగ్‌ ఉద్యోగార్థులకు శుభవార్త. ఇప్పటికే జారీ చేసిన ఉద్యోగ ప్రకటనలకు నెగెటివ్‌ మార్కింగ్‌ విధానాన్ని అమలు చేయకూడదని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్ణయించింది. ప్రతి తప్పుడు సమాధానానికి మూడో వంతు మార్కు తగ్గిస్తామని ఏపీపీఎస్సీ తొలుత ప్రకటించింది. ఇప్పటికే జారీ చేసిన ఏఈఈ నోటిఫికేషన్‌ నుంచి దీన్ని అమలు చేస్తామని సెప్టెంబరు 28న ఏపీపీఎస్సీ వెల్లడించింది. దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. ప్రకటనలు వెలువడి, నెగెటివ్‌ విధానం అమలుపై ఉత్తర్వులు రాకుంటే సమస్యలేమైనా వస్తాయా? అన్న దానిపై న్యాయ నిపుణుల సలహాలను ఏపీపీఎస్సీ తీసుకుంది. ఈ అంశంపై అభ్యర్థుల్లో అవగాహన రావాల్సి ఉన్నందున ఇప్పటికే జారీ చేసిన తొమ్మిది నోటిఫికేషన్లకు, కొద్దికాలం కిందట జారీ చేసిన అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరింగ్‌ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌కు నెగెటివ్‌ విధానం అమలు చేయకుండా ఉంటేనే మేలనే ఆలోచనలో ఉన్నట్లు ఏపీపీఎస్సీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు. భవిష్యత్తులో జారీ చేసే ఉద్యోగాల భర్తీ ప్రకటనలకు నెగెటివ్‌ మార్కుల విధానం ఉంటుందని వెల్లడించారు.
నవంబరు తొలివారంలోనే ఏఈఈ స్క్రీనింగ్‌ టెస్టు
అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరింగ్‌ ఉద్యోగాల భర్తీ ప్రకటనను అనుసరించి 71వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. దీనికి స్క్రీనింగ్‌ టెస్టును నవంబరు తొలివారంలోనే నిర్వహించి ప్రధాన పరీక్షను డిసెంబరు నెలాఖరులోగా పెట్టాలన్నది ఏపీపీఎస్సీ ఆలోచన.
* సెప్టెంబరు 30న జారీచేసిన అసిస్టెంట్‌ ఇంజినీరింగ్‌ ఉద్యోగాల భర్తీకి స్క్రీనింగ్‌ టెస్టును డిసెంబరు 18న నిర్వహించాలని ఏపీపీఎస్సీ ప్రాథమికంగా నిర్ణయించింది. సెప్టెంబరు 30న ఏపీపీఎస్సీ వివిధ శాఖల్లో కలిపి 149 అసిస్టెంట్‌ ఇంజినీరింగ్‌ ఉద్యోగాల భర్తీకి ఒకే ప్రకటన ఇచ్చింది. అసిస్టెంట్‌ ఇంజినీర్స్‌ (ఎన్విరాన్‌మెంటల్‌) కింద 50 ఉద్యోగాల భర్తీకి మరో ప్రకటన జారీ చేసింది. ఈ రెండు ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. 25వేల దరఖాస్తులు దాటితే స్క్రీనింగ్‌ టెస్టు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏపీపీఎస్సీకి ఆమోదం తెలిపింది. దీనిని అనుసరించి ఈ ఇంజినీరింగ్‌ ఉద్యోగాలకు స్క్రీనింగ్‌ టెస్టును డిసెంబరు 18న నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి. ఒక నోటిఫికేషన్‌కు ఉదయం, మరో నోటిఫికేషన్‌ ఉద్యోగాల భర్తీకి మధ్యాహ్నం పరీక్ష నిర్వహించనున్నారు.
* ప్రధాన పరీక్షను ఫిబ్రవరి మొదటివారంలో నిర్వహించేఅవకాశాలున్నాయి. బ్యాంకింగ్‌, ఇతర ఉద్యోగ నియామకాల రాత పరీక్షలు జనవరిలో జరుగుతున్నందున ఫిబ్రవరిలోనే ప్రధానపరీక్షలు జరిపేందుకు వీలుందని ఏపీపీఎస్సీ వర్గాలు వెల్లడించాయి.
* సెప్టెంబరు 30న జారీచేసిన డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్స్‌ (ఏపీ ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌), జిల్లా సైనిక సంక్షేమ అధికారి, అసిస్టెంట్‌ హైడ్రోజియాలాజిస్ట్‌ (ఏపీ గ్రౌండ్‌వాటర్‌), అసిస్టెంట్‌ హైడ్రాలజిస్ట్‌ (ఏపీ గ్రౌండ్‌వాటర్‌), టెక్నికల్‌ అసిస్టెంట్‌ (హైడ్రోజియాలజి), టెక్నికల్‌ అసిస్టెంట్‌ (హైడ్రోలజి-ఏపీ గ్రౌండ్‌వాటర్‌), ల్యాబ్‌అసిస్టెంట్‌ (ఏపీ గ్రౌండ్‌వాటర్‌), వెల్ఫేర్‌ ఆర్గనైజర్‌ (సైనిక వెల్ఫేర్‌ సబ్‌సర్వీసెస్‌) ఉద్యోగాల భర్తీ ప్రకటనను అనుసరించి ఒకే పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించే అవకాశాలున్నాయి. వీటిల్లో కొన్నింటి దరఖాస్తుల స్వీకరణ అక్టోబరు 5న నుంచి ప్రారంభం కానుంది. ఈ నోటిఫికేషన్లను అనుసరించి వచ్చే దరఖాస్తులు తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఏపీపీఎస్సీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ రాత పరీక్షలను కూడా అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ఉద్యోగాల ప్రధాన పరీక్షను నిర్వహించే రోజుల్లో, ఆయా కేంద్రాల్లోనే జరిపే అవకాశం ఉంది. ప్రధాన పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నందున సమయం, ఇతర అంశాలు కలిసి వస్తాయని ఏపీపీఎస్సీ వర్గాలు వ్యాఖ్యానించాయి.

Posted on 05-10-2016