తాజా స‌మాచారం

ప్రభుత్వ ప్రచురణల నుంచే గ్రూపు-2 ప్రశ్నలు

* ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్‌టీ శాయి వెల్లడి
ఈనాడు, అమరావతి: తెలుగు అకాడమీ, విశ్వవిద్యాలయాలు, ఎన్‌సీఈఆర్టీ, ఇతర ప్రభుత్వ ప్రచురణ పుస్తకాల్లోని ప్రశ్నలే గ్రూపు-2లో వస్తాయని ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్‌టీ శాయి వెల్లడించారు. హైదరాబాద్‌లో మంగళవారం (నవంబర్ 22) సాయంత్రం 'ఈటీవీ ఫోన్-ఇన్' కార్యక్రమంలో పలువురు అభ్యర్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. సన్నద్ధ సమయంలో వార్తాపత్రికలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఇతర పుస్తకాల్ని చదవడమన్నది అభ్యర్థులు ఇష్టమని పేర్కొన్నారు.
* ఏపీపీఎస్సీకి.. శిక్షణ సంస్థలతో ఎటువంటి సంబంధంలేదని, అనధికార వ్యక్తులు, సంస్థలు చెప్పే మాటల్ని విని మోసపోవద్దని పేర్కొన్నారు.
* ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో పేర్కొన్న ఓటీపీఆర్ ఐడీ సాయంతోనే గ్రూపు-2 దరఖాస్తు చేయాలని పేర్కొన్నారు. ఓటీపీఆర్ ఐడీ మర్చిపోతే తిరిగి పొందే అవకాశాన్ని వెబ్‌సైట్‌లో కల్పించినట్లు చెప్పారు.
* గ్రూపు-2 ప్రకటన (నోటిఫికేషన్) జారీ నాటికి నిర్దేశించిన విద్యార్హతలు తప్పకుండా అభ్యర్థులు కలిగి ఉండాలని పేర్కొన్నారు. ధ్రువపత్రాలు (సర్టిఫికెట్లు) లేకపోయినా సంబంధిత డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలన్నారు.
* ఆయా డిగ్రీలను ప్రైవేట్‌గా చదివితే ప్రైవేట్.. రెగ్యులర్‌గా చదివితే రెగ్యులర్ అని దరఖాస్తులో పేర్కొనాలని సూచించారు.
* దరఖాస్తుల్లో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు బుధవారం (నవంబర్ 23) నుంచి డిసెంబరు 10 వరకు అవకాశం ఇస్తున్నామని చెప్పారు.
* ప్రస్తుతం జారీచేసిన గ్రూపు-2 నోటిఫికేషన్‌కు రుణాత్మక విధానాన్ని (మైనస్) అమలు చేయడంలేదన్నారు.
* గుర్తించిన ఉద్యోగాలకు మాత్రమే నియామకాలకు ముందు ఆటోమేషన్ పరీక్షను నిర్వహిస్తామన్నారు.

Posted on 23-11-2016