తాజా స‌మాచారం

ఓటీపీఆర్‌ నమోదు తప్పనిసరి

* ఓటీపీఆర్‌ ద్వారా 7 లక్షల మంది వివరాల నమోదు
* ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్‌టీ శాయి
ఈనాడు - అమరావతి : ఉద్యోగ ప్రకటనల జారీతో సంబంధం లేకుండానే ఓటీపీఆర్‌ (వన్‌టైమ్‌ ప్రొఫైల్‌ రిజిస్ట్రేషన్‌) ద్వారా పేర్లను నమోదు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అభ్యర్థులకు సూచించింది. ఓటీపీఆర్‌ నమోదు తర్వాత అభ్యర్థులు తమకు అర్హతలున్న ప్రకటనలు వెలువడినప్పుడు చివరి తేదీలోగా దరఖాస్తు చేసుకోడానికి వీలుంటుందని వెల్లడించింది. దరఖాస్తు సమయంలో ఓటీపీఆర్‌ గుర్తింపు సంఖ్య నమోదు తప్పనిసరని తెలిపింది. ఓటీపీఆర్‌లో వివరాలను నమోదు చేసుకున్నాక ఎప్పుడైనా మార్పుచేర్పులు చేసుకోవచ్చని చెప్పింది. ఇప్పటివరకు ఏడు లక్షల మంది ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌ ద్వారా ఓటీపీఆర్‌ వివరాలు నమోదు చేసుకున్నారు. గ్రూపు-2 ప్రకటన ఇప్పటికే వెలువడింది. త్వరలో గ్రూపు-3, ఇతర ప్రకటనలు రానున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల వివిధ సందేహాలపై ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్‌టీ శాయి వివరణ ఇచ్చారు.
* ఏపీపీఎస్సీ ప్రకటనలు విడుదల చేశాక మార్పుచేర్పులు కుదరవు. ఆయా శాఖల నుంచి వచ్చిన వివరాలను అనుసరించే అర్హతలు, ఇతర షరతులు ఖరారవుతాయి. పరీక్ష నిర్వహణపైనే ఏపీపీఎస్సీ ద్వారా అవసరమైన మార్పుచేర్పులు ఉంటాయి.
* ఏ ప్రైవేట్‌ సంస్థతోనూ ఏపీపీఎస్సీకి సంబంధం లేదు. గుర్తింపు జారీ సమస్యే లేదు. ఏపీపీఎస్సీ లోగోను ఎవరైనా వాడితే శిక్షార్హం. పాఠ్యప్రణాళికను ఖరారు చేయడమే ఏపీపీఎస్సీ బాధ్యత. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రచురణలు, ఎన్సీఈఆర్టీ, సీబీఎస్‌ఈ, తెలుగు అకాడమీ ప్రచురణలు, ప్రభుత్వ వెబ్‌సైట్లలోని వివరాలే ప్రామాణికం.
* ప్రభుత్వం, ఆయా శాఖల నిబంధనలను అనుసరించి అర్హతలను ప్రకటిస్తారు. తత్సమాన డిగ్రీ ఉన్నప్పుడు రుజువు చేసే ధ్రువపత్రాలను అభ్యర్థులే చూపించాల్సి ఉంటుంది. మాకు నేరుగా లేఖ రాస్తే దీనిపై యూజీసీ, ఏఐసీటీఈ, సంబంధిత సంస్థలను సంప్రదించి పరీక్షకు అనుమతిపై నిర్ణయం తీసుకుంటాం. ఎంపికయ్యాక కూడా శాఖాధిపతి అర్హత పత్రాల్ని పరిశీలిస్తారు. (ఈ మధ్య వెలువడిన ఒక ప్రకటనలో బీసీఏను అర్హతగా గుర్తించారు. కొందరు నేరుగా ఎంసీఏ చేశారు. దీనిపై ఓ అభ్యర్థి సందేహంపై ఏపీపీఎస్సీ స్పందించింది.)
* ఏపీపీఎస్సీ ప్రకటన వెలువడే నాటికి విద్యార్హత ఉండాలని స్పష్టంగా చెబుతున్నాం. అర్హత లేనివారు పరీక్ష రాసి ఎంపికైతే అసత్య సమాచారం ఇచ్చినందుకు చట్టపరంగా శిక్షార్హులవుతారు. పరీక్షలకు అనర్హత వేటూ పడుతుంది. వారు మరో అర్హుడికి అన్యాయం చేసినట్లవుతుంది.
* భారత రాజ్యాంగంలోని 371డి అధికరణం కింద స్థానికతను గుర్తించారు. 20.10.75న వెలువడిన ఉత్తర్వు 64లో ప్రభుత్వ ఆదేశాలున్నాయి. స్థానికత నిర్ణయాన్ని రెవెన్యూ శాఖ వారు చేస్తారు.
* ప్రత్యక్ష భర్తీలో స్థానిక అభ్యర్థికి రాష్ట్ర కేడర్‌లో 60% రిజర్వేషన్‌ ఉంటుంది. నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగాలకు 70%, గ్రూపు-4 కింద 80% రిజర్వేషన్‌ ఉంటుంది. ఈ పోస్టుల కేటగిరి కూడా రాష్ట్రపతి ఆదేశం 1975లో పొందుపరిచారు. స్థానికులకు కేటాయించని పోస్టులకు అందరూ అర్హులే. ఈ పోస్టులను ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తారు.
* క్రీమిలేయర్‌ విషయంలో కేవలం తల్లిదండ్రుల ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. పూర్తి వివరాలు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ 2006లో, 2013లో జారీచేసిన ఉత్తర్వులు 3, 26లలో ఉన్నాయి. క్రీమిలేయర్‌ విషయంలో ఏపీపీఎస్సీ ధ్రువీకరణలు చేయదు. అర్హుడు నాన్‌క్రీమిలేయర్‌ ధ్రువపత్రాన్ని సంబంధిత రెవెన్యూ అధికారి నుంచి పొందాలి. ప్రకటన విడుదల చేసిన నాటికి పత్రాన్ని పరిశీలనకు సిద్ధంగా ఉంచాలి.

Posted on 08-12-2016