తాజా స‌మాచారం

మారనున్న 2011 గ్రూప్‌ 1 అభ్యర్థుల తలరాత

* ఆవేదన వ్యక్తం చేస్తున్న ఇంటర్వ్యూలు పూర్తి చేసినవారు
* తీర్పు ప్రతి కోసం టీఎస్‌పీఎస్సీ, ఏపీపీఎస్సీ ఎదురుచూపులు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రూపు-1 (2011) అభ్యర్థుల తలరాత మారబోతుంది. 2012 సెప్టెంబరులో మెయిన్స్‌ రాసి ఇంటర్వ్యూలకు హాజరై ఎంపికపై ఆశలు పెట్టుకున్న అభ్యర్థులు మళ్లీ రెండు తెలుగురాష్ట్రాల్లో విడివిడిగా జరిగే మెయిన్స్‌ పరీక్షలు రాసేందుకు సిద్ధం కావాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ప్రశ్నపత్రాల రూపకల్పనలో జాగ్రత్తల్ని తీసుకోకుంటే ఉత్పన్నమయ్యే దుష్పరిణామాలకు హెచ్చరికగా మారింది 2011 గ్రూపు-1 నోటిఫికేషన్‌. మెయిన్స్‌ పరీక్షను రెండు రాష్ట్రాల్లో విడివిడిగా పాత సిలబస్‌ను అనుసరించి నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాల్ని జారీచేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీపీఏస్సీ 2011లో 312 గ్రూపు-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను జారీచేసింది. ప్రిలిమ్స్‌లో వచ్చిన వివాదాస్పద ప్రశ్నల నేపథ్యంలో ఉత్పన్నమైన న్యాయపరమైన ఇబ్బందులతో గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షను 2011 నోటిఫికేషన్‌లో పేర్కొన్న సిలబస్‌ ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు విడివిడిగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పరీక్షలు నిర్వహించాలని తాజాగా ఆదేశాలిచ్చింది. ఈ ప్రక్రియను మూడునెలల్లో పూర్తి చేయాలంది. తాజా పరిణామంపై ఏపీపీఎస్సీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఉదయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ....సుప్రీంకోర్టు తీర్పు ప్రతి కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. దానికి అనుగుణంగా చర్యల్ని తీసుకుంటామని పేర్కొన్నారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌తో సంప్రదిస్తామని వెల్లడించారు. ఏపీకి వచ్చే 170 పోస్టుల భర్తీకి గాను మెయిన్స్‌ నిర్వహణ కోసం ఒక్కో పోస్టుకు 50 మంది వంతున ఎంపిక చేయాల్సి ఉంటుందన్నారు.
అధికారులు గట్టిగా లేకే... మళ్లీ మెయిన్స్‌, ఇంటర్వ్యూల నిర్వహణను అభ్యర్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. కొంతమందికి ఈ పరిణామం ఉపశమనం కలిగిస్తున్నా.. ఇంటర్వ్యూలకు హాజరైన వారు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘2011 ప్రకటనను అనుసరించి ప్రైవేట్‌ ఉద్యోగాల్ని వదలుకుని సన్నద్ధమయ్యాం. ఆరు వివాదాస్పద ప్రశ్నల్ని తొలగిస్తే అదనంగా 209 మంది మెయిన్స్‌కు అర్హత సాధించేవారు. ఎంపికైన వారికి ఇంటర్వ్యూల్ని నిర్వహిస్తామని అప్పటి ఏపీపీఎస్సీ అధికారులు గట్టిగా సుప్రీంకోర్టుకు తెలిపినట్లయితే దాదాపుగా న్యాయం జరిగేది. ఈ పరిస్థితులు తలెత్తేవి కావు’’ అని ప్రవీణ్‌కుమార్‌ అనే అభ్యర్థి ఆవేదనగా పేర్కొన్నారు.
మూడు నెలల్లో పరీక్షల్ని నిర్వహించాలంటే...!: సుప్రీంకోర్టు ఆదేశాల్ని అనుసరించి మూడు నెలల్లో పరీక్షల్ని నిర్వహించి, ఇంటర్వ్యూల్ని పూర్తి చేసి, ఎంపిక జాబితా ప్రకటించాలంటే చర్యల్ని వేగంగా తీసుకోవల్సిన అవసరం ఉంది. ప్రశ్నపత్రాల రూపకల్పన, ఇతర అంశాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇంటర్వ్యూలకు అనేక ముందస్తు జాగ్రతల్ని తీసుకోవల్సి ఉంది. ఇంటర్వ్యూల్ని ప్రతిరోజూ పరిమిత సంఖ్యలోనే అభ్యర్థులకు నిర్వహిస్తారు. దీనిపై తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ చక్రపాణి మాట్లాడుతూ ‘‘సుప్రీంకోర్టు తీర్పు ప్రతి అందిన వెంటనే పరిశీలించి ప్రభుత్వ ఆదేశాల్ని అనుసరించి తగిన చర్యల్ని తీసుకుంటామని’’ వెల్లడించారు.

Posted on 01-07-2016