తాజా స‌మాచారం

17 ఏళ్ల తర్వాత మారిన జాతకాలు

* సుప్రీం ఆదేశాలతో గ్రూపు-2 కొత్త నియామకాల జాబితా వెల్లడి
* కార్యాచరణ రాష్ట్ర ప్రభుత్వాలకు కత్తిమీద సామే!
ఈనాడు - అమరావతి: దాదాపు 17 ఏళ్ల తరువాత 1999 గ్రూపు-2 ఎంపిక జాబితాలో మార్పుచేర్పులు చోటు చేసుకున్నాయి. స్థానిక, స్థానికేతర వివాదం, ఉద్యోగ ప్రకటన జారీ అనంతరం పోస్టులు ప్రకటించడంతో అప్పట్లో గందరగోళం నెలకొంది. సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి నియామకాల్లో కొంత మేర మార్పులు జరిగాయి. కొత్త నియామకాల జాబితా ఫలితంగా కొందరు ఉద్యోగుల జాతకాలు మారనున్నాయి. ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల్లో ఎంపికైన వారు 1075, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల్లో ఎంపికైన వారు 296 మంది ఉన్నారు. ఉద్యోగ ప్రకటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జారీ అయినందున ఎంపిక జాబితా ప్రకారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోనూ మార్పులు చేపట్టనున్నారు. తాజా జాబితాను అనుసరించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయని ఏపీపీఎస్సీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు. తాజా పరిణామాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాచరణ రూపొందించడం కత్తిమీద సాములా మారనుంది. గ్రూపు-2 కింద ప్రకటించిన పోస్టుల్లో డిప్యూటీ తహసిల్దార్‌, సబ్‌రిజిస్ట్రార్‌, అసిస్టెంట్‌ కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్‌, ఇతర ముఖ్యమైన పోస్టులున్నాయి. తాజా జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఏడు రోజుల్లోగా తెలియజేయాలని ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్‌టీ శాయి వెల్లడించారు.

Posted on 24-12-2016