తాజా స‌మాచారం

ఏపీపీఎస్సీ నుంచి 18 ఉద్యోగ ప్రకటనలు

* యూపీఎస్సీ తరహాలో క్యాలండర్ విధానం
* ఆరు నెలల్లో నియామకాలు
* ఏపీపీఎస్సీ అధ్యక్షుడు ఉదయ్‌భాస్కర్ వెల్లడి
ఈనాడు, హైద‌రాబాద్‌: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిరుద్యోగుల‌కు కొత్త సంవ‌త్సరంలో తీపి క‌బురు అందించింది. గ్రూప్ 2 ప్రకటన తర్వాత కమిషన్ మూడు విడతలుగా గ్రూప్ 1, గ్రూప్ 3 తో పాటు 18 కొత్త ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది. వివిధ ప్రభుత్వ శాఖల్లోని టెక్నికల్ అసిస్టెంట్, సర్వేయర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ తదితర ఉద్యోగాలకు డిసెంబరు 24న ఆరు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది. ఈ పోస్టులకు జనవరి 23 వరకు దరఖాస్తుల స్వీకరణ జరగనుంది. అలాగే డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, క్లినికల్ సైకాలజిస్ట్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ తదితర పోస్టులకు డిసెంబరు 28న అయిదు ప్రకటనలు జారీ చేసింది. వీటి ద్వారా 611 ఉద్యోగాల భర్తీ జరగనుంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 18 రకాల సబ్జెక్టుల్లో కలిపి 504 పోస్టుల్ని భర్తీ చేస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా జనవరి 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిసెంబరు 31న కమిషన్ మరో ఏడు నోటిఫికేషన్లు జారీ చేసింది. వీటిలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్; అసిస్టెంట్ బీసీ, సోషల్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్లు, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి. గ్రేడ్‌-2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్లు మొత్తం పోస్టులు వంద ఉన్నాయి. వీటిలో 51 మ‌హిళ‌ల‌కు 49 పురుషుల‌కు కేటాయించారు. వీటికి జూన్ 11న స్క్రీనింగ్ టెస్టు, సెప్టెంబ‌రు 21న మెయిన్స్ నిర్వహిస్తారు. ఈ పోస్టుల‌కు డిగ్రీతోపాటు బీఎడ్ పూర్తిచేసిన‌వాళ్లే అర్హులు. అసిస్టెంట్ బీసీ, సోష‌ల్‌, ట్రైబ‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్లు 29 పోస్టులు ఉన్నాయి. వీటికి జూన్ 18న స్క్రీనింగ్ టెస్టు, సెప్టెంబ‌రు 21, 22 తేదీల్లో మెయిన్స్ నిర్వహిస్తారు.
కొత్త సంవత్సరం నుంచి క్యాలెండర్ ఇయర్: కొత్త సంవత్సరం నుంచి 'క్యాలెండర్ ఇయర్' విధానంలో ఉద్యోగ భర్తీ ప్రకటనల్ని జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఖాళీల వివరాల్ని ఏటా ఫిబ్రవరి చివరి నాటికి పంపించాలని శాఖల అధిపతులకు లేఖల్ని రాసినట్లు వెల్లడించింది. వాటి ఆధారంగా ఏప్రిల్ నుంచి ఉద్యోగ ప్రకటనల్ని జారీచేస్తామని ఏపీపీఎస్సీ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఉదయ్‌భాస్కర్ వెల్లడించారు. యూపీఎస్సీ తరహాలో 'క్యాలెండర్ ఇయర్' వల్ల అభ్యర్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. డిసెంబరు 31 హైదరాబాద్‌లో కార్యదర్శి శాయితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటివరకు 2,958 ఉద్యోగాల భర్తీకి 22 ప్రకటనల్ని జారీచేసినట్లు తెలిపారు. వీటికి అదనంగా తొమ్మిది ఉద్యోగ ప్రకటనల జారీ ద్వారా 1,317 పోస్టుల్ని భర్తీ చేయనున్నట్లు చెప్పారు. 4,009 ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీచేసేందుకు 2016 జూన్ 17వ తేదీన ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. వీటితోపాటు బ్యాక్‌లాగ్ పోస్టుల్ని కలిపి మొత్తం 4,275 ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు వెల్లడించారు. వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన ఆయుష్, ఏపీ వైద్య విధాన పరిషత్‌కు చెందిన ఉద్యోగాల భర్తీ ప్రకటనల్ని ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు.
ఇప్పటివరకు జారీ చేసిన ప్రకటనల ప్రధాన పరీక్షలకు 1:50 నిష్పత్తిలోనే అభ్యర్థులకు అవకాశాన్ని కల్పిస్తారని తెలిపారు. గ్రూప్-1 మినహా మిగతా ఉద్యోగ ప్రకటనలు జారీ చేసిన ఆరు నెలల్లో నియామక ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నాటికి విజయవాడ, గుంటూరులో కార్యాలయం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణలో కలుగుతున్న ఇబ్బందులను తొలగించేందుకు 'సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్' సహకారం తీసుకుంటామని పేర్కొన్నారు.
ప్ర‌క‌ట‌న‌లు
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ (గ్రేడ్‌ 2)
రాయాల్టీ ఇన్‌స్పెక్టర్ ఇన్ ఏపీ మైనింగ్ స‌ర్వీస్‌
అసిస్టెంట్ బీసీ/ సోషల్/ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్
అగ్రికల్చర్ ఆఫీసర్
టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్
అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్‌ సర్వీస్
అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫిష‌రీస్

క్లినికల్ సైకాలజిస్ట్ (నెల్లూరు మెడికల్ కాలేజీ)
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు (కళాశాల విద్య)
అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్లు (ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీస్)
అసిస్టెంట్ డైరెక్టర్ (ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీస్)
అసిస్టెంట్ కెమిస్ట్ (భూగర్బ నీటి శాఖ)

అసిస్టెంట్ ఆర్కిటెక్చర‌ల్ డ్రాఫ్ట్స్‌మ‌న్/ స‌ర్వేయ‌ర్/ డిప్యూటీ స‌ర్వేయ‌ర్‌
టెక్నికల్ అసిస్టెంట్స్ (గనుల శాఖ)
టెక్నికల్ అసిస్టెంట్స్ (భూగర్భ నీటి పారుదలశాఖ)
సివిల్ అసిస్టెంట్ సర్జన్ (ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్)
ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (మత్స్యశాఖ)
ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ (ఫ్యాక్టరీస్ సర్వీసెస్)
Website

Posted on 01-01-2017