తాజా స‌మాచారం

1999 గ్రూపు-2 నోటిఫికేషన్ పరిధిలో నియామకాలు చేయొద్దు

* ఏపీ సర్కారుకు ట్రైబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు
* తదుపరి విచారణ 20కి వాయిదా

ఈనాడు, హైదరాబాద్: 1999 నాటి గ్రూపు-2 పోస్టుల నోటిఫికేషన్ ప్రకారం జనవరి 20 వరకు ఎలాంటి నియామకాలు చేపట్టరాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ రాష్ట్ర పరిపాలనా ట్రైబ్యునల్ బుధవారం (జనవరి 11న) మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. 2011లో గుర్తించిన ఖాళీల్లో తిరిగి ఎంచుకునే(రీ ఆప్షన్) అవకాశాన్ని ఇవ్వకపోవడాన్ని సవాలుచేస్తూ ప్రకాశం జిల్లా పొదిలిలో డీసీటీవోగా పనిచేస్తున్న వై.హరికృష్ణ పిటిషన్ దాఖలు చేశారు. ట్రైబ్యునల్ జ్యుడిషియల్ సభ్యులు ఎన్.జానకిరామారావు దీనిపై విచారణ చేపట్టారు. హరికృష్ణ తరఫున న్యాయవాది పి.నరసింహ వాదనలు వినిపిస్తూ 1999 నోటిఫికేషన్ ప్రకారం పిటిషనర్ ఏసీటీవోగా ఎంపికయ్యారని చెప్పారు. అయితే 2010 వరకు ఉన్న ఖాళీలను గుర్తించాలని హైకోర్టు, ట్రైబ్యునల్‌లు ఆదేశాలు ఇచ్చాయన్నారు. దీని ప్రకారం 2011లో గుర్తించిన 111 ఖాళీల భర్తీ వ్యవహారంలో పిటిషనర్‌కు పోస్టును తిరిగి ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వలేదన్నారు. వాటిలో 79 డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు పిటిషనర్ సొంత జోన్‌లో ఉన్నాయన్నారు. రీఆప్షన్ కోరినా ఇవ్వకుండా ఏపీపీఎస్సీ డిసెంబరు 24న ఎంపిక జాబితాను ప్రకటించిందన్నారు. ఈ నియామకాల ద్వారా పిటిషనర్‌కు అన్యాయం జరుగుతుందన్నారు. వ్యవహారంపై కౌంటరు దాఖలు చేయడానికి ఏపీపీఎస్సీ తరఫు న్యాయవాది గడువు కోరటంతో కేసు విచారణను జనవరి 20కి వాయిదా వేశారు.

Posted on 18-01-2017