తాజా స‌మాచారం

2003 గ్రూప్‌-1 అభ్యర్థులకు ఉద్యోగాలు

హైదరాబాద్‌: పదమూడేళ్ల నిరీక్షణ, న్యాయపోరాటం ఫలితంగా 2003 గ్రూప్‌-1 అభ్యర్థులకు ఉద్యోగాలు రానున్నాయి. 2003లో భర్తీ కాని 68 పోస్టులను రూల్‌-7 ప్రకారం మెరిట్‌ అభ్యర్థులతోనే భర్తీ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలివ్వడంతో.. ఇందుకు అనుగుణంగా ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో 56 ఎంపీడీవో పోస్టులు కాగా మిగిలినవి ఇతరత్రా ఉన్నాయి. ఉద్యోగం వచ్చినా చేరకపోవడంతో పాటు ఇతరత్రా కారణాలతో ఇవి భర్తీ కాలేదు. వీటిని రూల్‌-7 ప్రకారం అప్పటి మెరిట్‌ జాబితాలోని అభ్యర్థులతో భర్తీ చేయాలని నిరుద్యోగ అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 2008లో విడుదల చేసిన ప్రకటనలో వీటి గురించి ప్రస్తావించని ఏపీపీఎస్సీ.. 2011నాటి గ్రూప్‌-1 నోటిఫికేషన్‌లో వీటిలో కొన్నింటిని కలిపింది. సుదీర్ఘ కాలం తర్వాత నిరుద్యోగులకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీన్ని అమలు చేయాలని ఏపీపీఎస్‌సీ చైర్మన్ ఉదయభాస్కర్‌ ఆధ్వర్యంలో జూన్ 30న జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన ప్రకటక కావడంతో ఈ పోస్టులను రెండు రాష్ట్రాల అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు.

Posted on 01-07-2016