తాజా స‌మాచారం

ఆరు గ్రూపు-1 ఉద్యోగాలకు అభ్యర్థులే లేరు!

* మిగతా 145 పోస్టుల భర్తీకి ఫిబ్రవరి13- మార్చి15 మధ్య మౌఖిక పరీక్షలు
* ఇంటర్వ్యూ బోర్డులో ఆరోపణలున్న వ్యక్తి!

ఈనాడు, అమరావతి: రాష్ట్రస్థాయిలో అత్యున్నతంగా పరిగణించే గ్రూపు-1 పోస్టులు ఆరింటికి అభ్యర్థులు కరవయ్యారు. రాష్ట్రవిభజన అనంతరం 2011 నోటిఫికేషన్‌ను అనుసరించి 151 గ్రూప్‌-1 ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) భర్తీచేయాల్సి ఉంది. వీటిలో ఎస్‌.టి. మహిళలు, బధిరులు, వినికిడిలోపం ఉన్నవారి విభాగాల్లో రెండేసి పోస్టులకు అభ్యర్థులే అందుబాటులో లేరు. ఫలితంగా మిగిలిన 145 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ మౌఖిక పరీక్షల్ని ఒకే బోర్డు ద్వారా ఫిబ్రవరి 13 నుంచి మార్చి 15 వరకు నిర్వహించబోతోంది. ఒక్కో పోస్టుకు ఇద్దరేసి వంతున మొత్తం 290మంది అభ్యర్థులను ఎంపిక చేసింది.
తారుమారైన జాతకాలు...
2011 గ్రూపు-1 నోటిఫికేషన్‌ అనుసరించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అభ్యర్థులకు మౌఖిక పరీక్షలూ జరిగాయి. ఎంపిక జాబితా వెల్లడి సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో తదుపరి చర్యలకు అడ్డుకట్ట పడింది. ఈ క్రమంలో మౌఖిక పరీక్షల్లో రాణించి, ఎంపికవుతామని ఆశించిన అభ్యర్థులకు ఆవేదనే మిగిలింది. ప్రిలిమ్స్‌ పరీక్షాపత్రంలో ఇచ్చిన ప్రశ్నల్లో దొర్లిన తప్పులు తొలగించి జవాబుపత్రాల్ని మరోసారి మూల్యాంకనం చేశారు. దీంతో గతంలో ప్రధాన పరీక్షలకు హాజరైనవారు కొందరు.. మళ్లీ దాన్ని రాసేందుకు ఎంపిక కాలేదు. అలాగే ప్రధాన పరీక్షల్లో రాణించి, మౌఖిక పరీక్షలకు హాజరైన వారిలో కొందరి పేర్లు ఈసారి కనిపించలేదని తెలిసింది.
అవినీతి ఆరోపణలున్నా..?
ప్రస్తుతం ఏపీపీఎస్సీలో ఛైర్మన్‌ కాక, సీతారామరాజుతో పాటు జి.రంగజనార్దన, విజయకుమార్‌, జి.సుజాత, పద్మరాజు, సేవారూప సభ్యులుగా ఉన్నారు. గతంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి మౌఖిక పరీక్షల నిర్వహణలో సీతారామరాజుపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. పోలీసు కేసులో అరెస్టయిన ఈయనపై చర్యలు తీసుకోవాలని అప్పటి ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే.. కమిషన్‌ సభ్యులను తొలగించాలంటే వారి అవినీతి ఆరోపణలపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ద్వారా విచారణ జరిపించి తదుపరి చర్యలు తీసుకోవలసి ఉంది. సీతారామరాజు విషయం దిల్లీ వరకూ వెళ్లినా తదుపరి చర్యలపై పురోగతి లేదని ఏపీపీఎస్సీ వర్గాల ద్వారా తెలియవచ్చింది. త్వరలో జరగబోయే మౌఖిక పరీక్షలు నిర్వహించే బోర్డులో ఈయనను కూడా సభ్యుడిగా కొనసాగించటంపై కమిషన్‌ ఎలాంటి చర్య చేపడుతుందో చూడాలి.

Posted on 18-01-2017