తాజా స‌మాచారం

ఏప్రిల్‌లో 'ఏపీపీఎస్సీ' ఖాళీల భర్తీ వార్షిక పట్టిక!

* ప్రకటనలు, పరీక్ష, ఫలితాల తేదీలన్నీ ఒకేసారి వెల్లడి
* ప్రకటన ఇచ్చాక ఆరేడు నెలల్లో ప్రక్రియ పూర్తి
* 'ఈనాడు'తో ఏపీపీఎస్‌సీ కార్యదర్శి శేషతల్పశాయి

ఈనాడు, అమరావతి: 'ఉద్యోగాల భర్తీ వార్షిక పట్టిక' విధానాన్ని ఏప్రిల్‌ నుంచే అమలుచేస్తామని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్‌సీ) కార్యదర్శి వెంకట శేషతల్పశాయి తెలిపారు. జనవరి 17న విజయవాడలో ‘ఈనాడు’ ప్రతినిధితో ఆయన సంభాషించారు. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్‌సీ) తరహాలో ప్రతి ఏడాది ఏప్రిల్‌లోనే ఆ ఆర్థిక సంవత్సరంలో భర్తీ చేయబోయే ఉద్యోగ ప్రకటనల వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.
వివరాలు శేషతల్పశాయి మాటల్లో...
* ఫిబ్రవరి ఆఖరులోగా ఆయా శాఖల నుంచి ఖాళీల పూర్తి వివరాలు మాకు అందుతాయి. ఇప్పుడిప్పుడే వివరాలు వస్తున్నాయి. ఏప్రిల్‌లో ‘ఉద్యోగాల భర్తీ వార్షిక పట్టిక’ను విడుదల చేస్తాం. ఖాళీల వివరాలు, ప్రకటనల జారీ, పరీక్షల తేదీలను అందులో తాత్కాలికంగా ప్రకటిస్తాం. ఈ విధానంతో నిరుద్యోగులకు పడిగాపులు తగ్గుతాయి. ప్రణాళికాబద్ధంగా సన్నద్ధమయ్యేందుకు వీలుంటుంది.
* ఉద్యోగ హోదాను బట్టి ప్రకటనల జారీలో ప్రాధాన్యాలను గుర్తిస్తాం. దీనివల్ల తొలుత చిన్న ఉద్యోగాల్లో చేరి, పెద్ద ఉద్యోగాలు వచ్చినప్పుడు వాటిని వదిలివెళ్లడం లాంటివి ఉండవు.
* ప్రస్తుత విధానంలో సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్‌, సహాయ గణాంక అధికారి, ఇతర ఉద్యోగాలకు వేర్వేరు సబ్జెక్టుల్లో పట్టభద్రులైనవారు అర్హులుగా ఉంటున్నారు. ఒకే రకమైన పోస్టుకు సంబంధిత సబ్జెక్టుల్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నాం. దీనివల్ల ఎక్కువ సమయం పట్టడం, ఇతర సమస్యలు ఉన్నాయి. అలా కాకుండా ప్రకటించిన ఉద్యోగానికి సరిపడ సామర్థ్యాలు అభ్యర్థుల్లో ఉన్నాయో, లేదో తెలుసుకునేందుకు వివిధ సబ్జెక్టుల్లో డిగ్రీ పూర్తిచేసిన వారికి ఒకే సిలబస్‌లో పరీక్షలు నిర్వహించాలని ఏపీపీఎస్‌సీ యోచిస్తోంది.
* 4,275 ఖాళీల భర్తీకి నిరుడు ఆగస్టు నుంచి డిసెంబరు వరకు 36 ప్రకటనలు ఇచ్చాం. ప్రభుత్వం జూన్‌లో జారీచేసిన జీవోను అనుసరించి 4,009 ఖాళీల భర్తీకే ప్రకటనలు ఇవ్వాల్సి ఉంది. అప్పటికే వివిధ శాఖలకు చెందిన ఖాళీల (క్యారీఫార్వర్డ్‌) వివరాలు మా వద్ద ఉన్నాయి. అక్టోబరు వరకు ప్రతి నెల ఒకట్రెండు రకాల పోస్టులకు రాతపరీక్షలు నిర్వహించనున్నాం.
* ప్రకటన ఇచ్చాక.. ప్రాథమిక పరీక్షలు, ప్రధాన పరీక్షలు లేని పోస్టుల భర్తీకి మూడు, నాలుగు నెలలు, అవి ఉంటే ఆరేడు నెలలు పడుతుంది. మౌఖిక పరీక్షలుంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.
* గత అనుభవాల దృష్ట్యా ప్రశ్నపత్రాల్లో తప్పులు దొర్లకుండా గట్టిగా ప్రయత్నిస్తున్నాం.
* ఉప సర్వేయర్ల ఖాళీల భర్తీలో పాలిటెక్నిక్‌ డిప్లొమా, ఇంజినీరింగ్‌ వారికి అవకాశాన్ని కల్పించాలని, డిగ్రీ కళాశాలల అధ్యాపకుల పోస్టుల భర్తీ(కంప్యూటర్స్‌ సంబంధిత పోస్టుల్లో) ఎంసీఏ వారికి అవకాశాన్ని కల్పించాలని అభ్యర్థనలు వచ్చాయి. అర్హతలను సంబంధిత శాఖలే నిర్ణయిస్తాయి. వారికి అవకాశాన్ని కల్పించాలని అవి సూచిస్తే నిబంధనలు సవరిస్తాం.

Posted on 18-01-2017