close

తాజా స‌మాచారం

గ్రూపు-1 ఒక్క పోస్టుకు 1197 మంది!

* 78 పోస్టులకు 93,386 దరఖాస్తులు
* గ్రూపు-2లో 982 పోస్టులకు 6.57 లక్షల మంది పోటీ

ఈనాడు, అమరావతి: ఏపీపీఎస్సీ నిర్వహించే ఉద్యోగ నియామక రాత పరీక్షల్లో 982 పోస్టులున్న గ్రూపు-2కు గరిష్ఠంగా 6,57,010 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో పోస్టుకు 669 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కనిష్ఠంగా క్లినికల్‌ సైకాలజిస్ట్‌ ఉద్యోగాలకు 71 దరఖాస్తులు వచ్చాయి. ఫిబ్రవరి 26న గ్రూపు-2 ప్రిలిమ్స్‌ జరగనుంది. ఈ పోస్టులకు గరిష్ఠంగా విశాఖలో 74,536, కనిష్ఠంగా విజయనగరం జిల్లాలో 26,879 మంది పరీక్ష రాయనున్నారు. పరీక్షకు హైదరాబాద్‌ కేంద్రంగా 54,063 మంది హాజరుకానున్నారు. 20 ఉద్యోగ ప్రకటనల జారీని అనుసరించి దరఖాస్తులను పరిశీలిస్తే.. గ్రూపు-1లో 78 పోస్టులకు గాను 93,386 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో పోస్టుకు 1197 మంది పోటీ పడుతున్నారు. 1055 పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు 5,65,798 మంది దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు 536 మంది పరీక్షకు నిలవనున్నారు. ఈ ప్రకటనను అనుసరించి గ్రూపు-1కు పలువురికి మినహాయింపులతో ఇచ్చిన దరఖాస్తుల స్వీకరణ గడువు ఫిబ్రవరి 5తో ముగియనుందని ఏపీపీఎస్సీ కార్యదర్శి శాయి వెల్లడించారు. డిగ్రీ కళాశాలల అధ్యాపకుల పోస్టుల కోసం 16,899 దరఖాస్తులు వచ్చాయి. ఈ పోస్టులు, అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ అధికారి ఉద్యోగాల దరఖాస్తుల స్వీకరణ గడువు ఫిబ్రవరి 7న ముగియనుంది. వసతి గృహ సంక్షేమాధికారి ఉద్యోగాల కోసం 57,811, అసిస్టెంట్‌ బీసీ వెల్ఫేర్‌-38,841, అసిస్టెంట్‌ ఆర్కిటెక్చరల్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌ అండ్‌ సర్వేయర్స్‌- 22,963, ఇతర పోస్టులకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఏపీపీఎస్సీ జారీచేసిన 19/2016 నుంచి 24/2016 ఉద్యోగ ప్రకటనను అనుసరించి కేంద్రాల ఎంపికకు మళ్లీ అవకాశాన్ని కల్పిస్తున్నామని ఏపీపీఎస్సీ కార్యదర్శి శాయి వెల్లడించారు. లోగడ విజయవాడ, గుంటూరులో మాత్రమే రాత పరీక్షల కేంద్రాలను కేటాయించారు. ప్రస్తుతం హైదరాబాద్‌తో సహా మిగిలిన చోట్ల కూడా కేంద్రాలను ఎంపిక చేసుకునే అవకాశాన్నిస్తున్నారు. ఈ వెసులుబాటును అభ్యర్థులు ఫిబ్రవరి 5 నుంచి పదో తేదీలోగా వెబ్‌సైట్‌లో వినియోగించుకోవాలని సూచించారు.

Posted on 05-02-2017