తాజా స‌మాచారం

పూర్వ అభ్యర్థులదే పైచేయి!

* గ్రూపు-1 ‘మౌఖిక’ జాబితాలో 133 మంది వారే
* ఎన్నేళ్లయినా ప్రతిభలో మార్పు ఉండదు: ఉదయ్‌భాస్కర్‌

ఈనాడు, అమరావతి: ఏపీ గ్రూపు-1 (2011) ఉద్యోగాల మౌఖిక పరీక్షలకు ఎంపికైన వారిలో 133 మంది పూర్వ అభ్యర్థులే ఉండడం చర్చనీయాంశమైంది. వీరు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మరికొందరికి అవకాశమే లేకుండా పోయింది. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌, ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గతేడాది వేర్వేరుగా ప్రధాన పరీక్షలు నిర్వహించాయి. మౌఖిక పరీక్షలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ జనవరి నెలలో ప్రకటించింది. ఇందులో 2013 నాటి మౌఖిక పరీక్షలకు ఎంపికైన వారి జాబితాలో ఉన్నవారు 133 (606మందికి) మంది ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర విభజన దృష్ట్యా 173 పోస్టులు ఏపీపీఎస్సీ పరిధిలోకి వచ్చాయి. అయితే.. 2003 గ్రూప్‌ కేసులో కొన్ని పోస్టులు తగ్గడంతో 151 మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. అందులోనూ ఆరు పోస్టులకు అర్హులు లేకపోవడంతో 145 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఒక్కోపోస్టుకు ఇద్దరుచొప్పున మొత్తం 290 మంది అభ్యర్థులను మౌఖికపరీక్షలకు ఏపీపీఎస్సీ ఎంపిక చేసింది. వీరికి ఫిబ్రవరి 13 నుంచి మార్చి 15 వరకు ఒకే బోర్డు ద్వారా మౌఖిక పరీక్షలు జరగనున్నాయి.
నాలుగేళ్ల తర్వాత కూడా అదే ప్రతిభ!: 2012లో సెప్టెంబరు 18 నుంచి 28వరకు ప్రధాన పరీక్షలు జరిగాయి. మళ్లీ ఈ తరహా పరీక్షలే కిందటేడాది సెప్టెంబరు 14 నుంచి 29 వరకు ఏపీలో జరిగాయి. అయినప్పటికీ 133 మంది అభ్యర్థుల సామర్థ్యాలు అదేలా కొనసాగడం గమనార్హం. ప్రస్తుత ఏపీపీఎస్సీ గత సెప్టెంబరులో ప్రధాన పరీక్షలు నిర్వహించినప్పుడు పేపరు-5లో 42మార్కుల (150 మార్కులకుగాను) ప్రశ్నలను పూర్తి పరిశీలన అనంతరం తొలగించింది. అయినప్పటికీ అభ్యర్థుల ప్రతిభ అలాగే వెల్లడయింది. కొందరు మాత్రం వెనకబడ్డారు. 133 మంది తిరిగి మౌఖిక పరీక్షకు ఎంపిక కావడంపై ఏపీపీఎస్సీ అధ్యక్షుడు ఆచార్య ఉదయ్‌భాస్కర్‌ స్పందిస్తూ.. ‘ప్రతిభావంతులు ఎప్పుడు పరీక్ష పెట్టినా రాణిస్తారు. కొద్ది మంది మాత్రమే వెనక్కు వెళతారు. ఇలా జరగడానికి వివిధ కారణాలుంటాయి. 2012 నాటి ప్రధాన పరీక్షల్లో, 2016నాటి పరీక్షల్లోనూ అభ్యర్థులు విజయాన్ని సాధించారంటే అంతా సవ్యంగానే జరిగిందని అర్థమవుతోంది’ అని వ్యాఖ్యానించారు. మౌఖిక పరీక్షల నిర్వహణ తీరుపై అవగాహన ఉన్న వీరు మరోసారి హాజరుకాబోతుండడం ద్వారా ప్రతిభపరంగా ముందంజలో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Posted on 06-02-2017