తాజా స‌మాచారం

దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగింపు!

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌ అనుసరించి దరఖాస్తుల స్వీకరణ గడువును వారం వరకు పొడిగించినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి శాయి వెల్లడించారు. అర్హతల విషయంలో స్పష్టత వచ్చినందున అభ్యర్థుల సౌకర్యార్థం గడువును పెంచినట్లు చెప్పారు. పొలిటికల్‌ సైన్స్‌లో పీజీ చేసిన వారు పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధ్యాపక ఉద్యోగానికి, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సు చేసిన వారు పొలిటికల్‌ సైన్స్‌ అధ్యాపక ఉద్యోగానికి అర్హులని పేర్కొంటూ కళాశాల విద్యాశాఖ నుంచి సమాచారం వచ్చిందని తెలిపారు. ఎంసీఏ చేసిన వారు కంప్యూటర్‌ సైన్స్‌ ఉద్యోగానికి అర్హత కల్పించే విషయమై ఎలాంటి సమాచారం అందలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో క్లినికల్‌ సైకాలజిస్ట్‌ ఉద్యోగ భర్తీ ప్రకటనను మరోసారి జారీచేస్తామని వెల్లడించారు. ఈ ఉద్యోగం భర్తీకి తగినట్లు సర్వీసు నిబంధనలను వైద్య విద్యాశాఖ రూపొందించలేదని పేర్కొన్నారు. అక్కడి నుంచి వివరాలు అందిన వెంటనే తిరిగి ప్రకటన జారీచేస్తామని, చెల్లించిన రుసుమును వెనక్కు పంపిస్తామని తెలిపారు. ఏపీపీఎస్సీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఉదయ్‌భాస్కర్‌ నేతృత్వంలో కమిషన్‌ సభ్యులు కేరళ పర్యటనకు వెళ్లారు. అక్కడి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యలాపాలు, నిర్వహణ తీరును అధ్యయనం చేస్తున్నారు.
https://www.psc.ap.gov.in/

Posted on 09-02-2017