తాజా స‌మాచారం

ఉద్యోగాలన్నీ కమిషన్‌ ద్వారానే

* కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నుంచి ఏడాదికి 40వేల కొలువుల భర్తీ
* భవిష్యత్తు నియామకాలకు ముందే ఎంపిక జాబితా
* స్ఫూర్తిగా ఉన్న వాటిపై పరిశీలిస్తామన్న ఏపీపీఎస్సీ అధ్యక్షుడు ఉదయ్‌భాస్కర్‌
ఈనాడు - అమరావతి: ఉద్యోగాల భర్తీ విధానంలో కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. కేరళ రాష్ట్రంలో చిరుద్యోగి నుంచి గ్రూపు-1 అధికారి నియామకాల వరకు కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారానే జరుగుతున్నాయి. ఈ కమిషన్‌ ద్వారా ఏడాదికి 40వేల ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. కమిషన్‌లో 21 మంది సభ్యులు ఉండగా వీరిలో ఒక్కొక్కరు కనీసం 4 నుంచి 5 వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మౌఖిక పరీక్షల బోర్డుల్లో పాల్గొంటున్నారు. అంతేకాకుండా.. భవిష్యత్తులో ఖాళీ అయ్యే స్థానాలకూ రాత, మౌఖిక పరీక్షల ద్వారా ఒకేసారి ఎంపిక జాబితాలను తయారుచేస్తున్నారు. యూనిఫాం ఉద్యోగాలకు సంబంధించిన జాబితాకు ఏడాదిపాటు కాలపరిమితి విధించారు. నాన్‌-యూనిఫాం ఉద్యోగాలకు మాత్రం మూడేళ్ల వరకు కాలపరిమితి ఉంటుంది. ఈ కాలపరిమితిలో ఆయా శాఖల నుంచి వచ్చే ఉద్యోగ ఖాళీల భర్తీకి అనుగుణంగా ఎంపిక జాబితాలోని అభ్యర్థులకు వరుసక్రమంలో ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనివల్ల ఒకే ఉద్యోగానికి వెన్వంటనే రాత, మౌఖిక పరీక్షలు జరపాల్సిన అవసరం లేకపోవడంతోపాటు వ్యయం, మానవ వనరులు, సమయం వృథా కావడంలేదు.
ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఉదయ్‌భాస్కర్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యులు కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నియామకాల తీరుపై అధ్యయనం చేశారు. ఏపీపీఎస్సీలో ఛైర్మన్‌తో కలిసి ఏడుగురు సభ్యులు ఉండగా... కేరళలో 21 మంది ఉన్నారు. ఈ కార్యాలయానికి అనుబంధంగా ప్రతి జిల్లాలో కేంద్రాలు పని చేస్తున్నాయి. అలాగే...రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యక్ష, పరోక్షంగా వేతనాలు అందుకునే ప్రతి శాఖ, కార్పొరేషన్‌లోని అన్ని స్థాయిల్లోని ఉద్యోగాలు కమిషన్‌ ద్వారానే భర్తీ జరుగుతోంది. అధికారుల పదోన్నతులూ కమిషన్‌ ద్వారానే జరుగుతున్నాయి. రాష్ట్రంలో విద్యా, పోలీసు, విద్యుత్తు, ఇతర శాఖల ద్వారా నియామకాలు ఏపీపీఎస్సీతో సంబంధం లేకుండా జరుగుతున్నాయి. కమిషన్‌ కార్యాలయ పరిధిలో 1600 మంది ఉద్యోగాలు పని చేస్తుండగా..ఏపీపీఎస్సీలో 150 నుంచి 200 మందిలోపు ఉద్యోగులు పనిచేస్తున్నారు. పరీక్షల నిర్వహణకు కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రత్యేకంగా కొన్నిచోట్ల కేంద్రాల్ని ఏర్పాటుచేసుకుంది. ఆన్‌లైన్‌లో పరీక్షలు ఈ కేంద్రాల్లోనే జరుగుతున్నాయి. కమిషన్‌ అవసరాలకు 600 నుంచి వెయ్యి కోట్ల రూపాయల వరకు కేటాయిస్తోంది. ఏపీ ప్రభుత్వం రూ.40 కోట్ల వరకు కేటాయిస్తోంది.
కేరళ పర్యటనపై ఏపీపీఎస్సీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఉదయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ ‘కేరళ కమిషన్‌ పనితీరును రాష్ట్ర కమిషన్‌తో పోల్చడం సాధ్యంకాదు. ఆన్‌లైన్‌ ద్వారా పరీక్షల నిర్వహణలో ఏపీ కమిషన్‌ కాస్త ముందంజలో ఉంది. కేరళ కమిషన్‌ కార్యాకలాపాల్లో స్ఫూర్తిదాయకంగా ఉన్న వాటిని మన అవసరాలకు తగినట్లు మార్చుకోవచ్చు. త్వరలో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్ల స్థాయిలో ప్రత్యేక సదస్సు జరగబోతుంది. దీనిద్వారా తెలుసుకునే విషయాలతోపాటు కేరళ పర్యటనపై ప్రభుత్వానికి నివేదించి తగిన చర్యల్ని తీసుకుంటామని’ చెప్పారు.

Posted on 11-02-2017